“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, అక్టోబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 47 ( ప్రశ్నలు - జవాబులు )

మన 'ప్రశ్నలు - జవాబులు' శీర్షికను మూలబెట్టి చాలారోజులైంది. మళ్ళీ ఒకసారి మన మెయిల్స్ లోనుంచి కొన్ని తీసుకుని పారాయణం చేసుకుందాం.

ఒక ICU బాధితుడు

ప్రశ్న : అయిదేళ్ల క్రితం మా నాన్నగారికి AIDS తో సీరియస్ అయ్యి ICU లో ఉండగా మీకు ఫోన్ చేశాను. మీరు ప్రశ్న చూచి కొన్ని రెమెడీలు చెప్పారు. కానీ వాటిని చెయ్యడానికి నాకు కుదరలేదు. కారణం? మా అన్నయ్య వద్దన్నాడు. అందుకే మీ మాట వినలేకపోయాను. మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు మా బాబాయి మళ్ళీ అదే ICU లో ఉన్నాడు. మీ పాత నంబర్ కు ఫోన్ చేస్తే కలవడం లేదు. అందుకే email ఇస్తున్నాను. మా బాబాయికి డ్రింక్ అలవాటుంది. ఎక్కువై లివర్ చెడిపోయి ప్రస్తుతం ICU లో ఉన్నాడు. ఏం చెయ్యమంటారు?

నా రిప్లై : చాలా సంతోషం నాయన ! మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు ICU లో ఉన్నపుడే నేను గుర్తొస్తానన్నమాట. మరి మీ అన్నయ్య ఇప్పుడెక్కడున్నాడు? మళ్ళీ నేను చెప్పడం, మళ్ళీ ఆయన వద్దనడం ఇదంతా ఎందుకు గాని, ఒక మాంచి రెమెడీ చెబుతా విను. మీ బాబాయి దిండు కింద సీసా ఉంటుంది. సైలెంట్ గా ICU లోనుంచి దానిని బయటకు తెచ్చి, నువ్వు కొట్టేసి, బయట బెంచీమీద హాయిగా రిలాక్స్ అవ్వు. ఏ సమస్యకైనా సరే, దీనిని మించిన రెమెడీ లేదు. మధ్యలో మీ అన్నయ్య అడ్డొస్తే అతనికి కూడా పట్టించు. అతన్ని పక్క బెంచీమీద పడుకోమను. ఏదైనా న్యూస్ ఉంటే, ఆస్పత్రివాళ్ళే మీ ఇద్దరినీ లేపుతారు. నా పాత ఫోన్ నంబర్ మారిపోయింది.  చెయ్యకు. కలవదు. ఉంటా మరి !

ఒక సంతాన బాధితురాలు

ప్రశ్న : మా అబ్బాయి చిన్నప్పటినుండీ అదోరకంగా ఉండేవాడు. ఆరేళ్ళ క్రితం మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే, తేడాగా ఉన్నాడని, కొన్ని రెమెడీలు చెప్పారు. కానీ వాటిని చెయ్యలేదు. మా ఆయన అయ్యప్పభక్తుడు. గురుస్వామి కూడా. సాయిబాబా ఆయన కలలో కనిపించి, మీ రెమెడీలు వద్దని, కొన్ని వేరే రెమెడీలు చెప్పాడు. వాటిని చేశాము. రెమెడీలు వికటించాయేమో? తెలీదు. మావాడు LGBTQ గా మారిపోయాడు. పెళ్లొద్దంటున్నాడు. చేసుకుంటే గింటే, వాడి స్నేహితుడిని చేసుకుంటానని అంటున్నాడు. ఇద్దరూ చిన్నప్పటినుంచీ ఒకే స్కూలు, ఒకే కాలేజి. చిన్నప్పటినుండీ లవ్వట. మాది 'జన్మజన్మల బంధం' అంటున్నాడు. ప్రస్తుతం మంచి కంపెనీలో ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. మేము గనక ఒప్పుకోకపోతే సూయిసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఏం చెయ్యమంటారు?

నా రిప్లై : అమ్మా ముందుగా నీకో దణ్ణం. నీకు రెమెడీలు చెప్పబోయేముందు నాకున్న కొన్ని సందేహాలు తీర్చు తల్లీ. మీ ఆయన అయ్యప్పభక్తుడు కదా, ఆయనకు అయ్యప్ప కలలోకి రావాలి గాని, సాయిబాబా రావడమేంటి? మీ ఆయనే ఏదో తేడాగా ఉన్నాడు. మరి మీ అబ్బాయి అలా ఉండటంలో వింత లేదని నాకనిపిస్తోంది. విధి బలీయం తల్లీ. నువ్వూ నేనూ ఏం చెయ్యగలం చెప్పు. నా మాట విను. ముందుగా మీ అబ్బాయిని చేసుకోవడం ఆ అబ్బాయికి ఇష్టమో కాదో విచారించండి. ఆ తరువాత, మంచి ముహూర్తం చూసి ఆ ఫ్రెండ్స్ ఇద్దరికీ పెళ్లి చేసెయ్యండి. పీటలమీద మీ దంపతులే కూర్చోండి. కొడుకైనా, కూతురైనా ఒకటేలే అనుకుని, కన్యాదానం చెయ్యండి. ప్రస్తుతకాలంలో, ఇంతకంటే మంచి రెమెడీ నేను చెప్పలేను. పోతే, ఆ సాయిబాబాను ఒక్కసారి నా కలలోకి రమ్మని మీ ఆయనచేత రికమెండేషన్ చేయించు తల్లీ. ఎప్పటినుంచో తీరని కోరికగా ఉంది. ఉంటా మరి.

ఒక ఆశపోతు సందేహం

ప్రశ్న: ఏమండి? మీరు పెద్ద జ్యోతిష్కులని మీ పుస్తకాలను చదివితే అర్ధమైంది. మీకేగాక మీ శిష్యులకు కూడా న్యూమరాలజీ వచ్చని విన్నాను. మరి ఏదైనా లాటరీ టికెట్ నంబర్ మాకు చెప్పచ్చు కదా. మీరు ప్రస్తుతం US లో ఉన్నారు కదా. అక్కడ Power Ball అనే బంపర్ లాటరీ ఉంటుంది. మీరు కూడా దానిని ట్రై చెయ్యవచ్చు కదా కనీసం?

నా రిప్లై : ఇలాంటి ఆలోచన ఇంతవరకూ నాకు రాకపోవడానికి నాకే సిగ్గుగా ఉంది నాయన ! తప్పకుండా ఇవాళే ఆ లాటరీ టికెట్ కొంటాను. అంతేకాదు, రేపే లాస్ వెగాస్ వెళ్లి అక్కడే ఒక వారంపాటు తిష్ట వేసి, అన్నీ చూసేసి, అడ్రస్ లేకుండా అయిపోతాను. అయినా నీ పిచ్చిగాని, అలాంటి లాటరీల వెంట పడేవాడినైతే, నలభై ఏళ్ళు రైల్వేలో గాడిదచాకిరీ ఎందుకు చేస్తానురా పిచ్చినాగన్న? ఏదేమైనా, మంచి సలహా ఇచ్చావ్. చాలా థాంక్స్ నాయన ! పోతే నాదొక రిక్వెస్ట్. నా శిష్యులలో ఇటువంటి న్యూమరాలజీ ఎక్స్ పర్ట్ లెవరో కొంచం నాకు పేర్లు చెప్పు. వెంటనే వారిని నా గ్రూప్ లోనుంచి తొలగించి చేతులు కడుక్కోవాలి. బై.

ఒక ఆధ్యాత్మికుడి అనుమానం

ప్రశ్న : గురువుగారు. నేను లాగు వేసుకోవడమైనా మరచిపోతానేమో గాని, మీ బ్లాగు చదవకుండా మాత్రం ఒక్కరోజు కూడా ఉండలేను.  చాలా మంచి విషయాలు రాస్తున్నారు.  అయితే నాదొక్క సందేహం. మీకు కర్ణపిశాచి తరచుగా కన్పిస్తూనే ఉంటుందని మాకు తెలుసు.  అయితే, ఈ మధ్యన బాబాజీ కూడా కనిపించాడని రాశారు. ఇదెలా సాధ్యం? అదేమో పిశాచం, ఈయనేమో బాబాజీ. ఇద్దరూ మీకెలా కనిపిస్తారు? పైగా అమెరికా వచ్చి ఎలా కనిపిస్తారు? ఇదేదో అనుమానంగా ఉంది. ఈ సందేహాన్ని తీర్చండి.

నా రిప్లై: చూడు నాయనా. తొందరేమీ లేదు. ముందు ప్యాంట్ వేసుకుని, ఆ తర్వాత తీరిగ్గా నా బ్లాగు చదువు. ఇక్కడేమీ కొంపలు మునిగిపోవడం లేదు. నీకు చాలా గొప్ప సందేహం వచ్చింది. నేను వ్రాసేవన్నీ అబద్దాలేనని నీకూ అర్ధమైందన్న మాట. చాలా సంతోషం. కర్ణపిశాచి, బాబాజీ ఇద్దరూ ప్రస్తుతం ఇండియా లోనే ఉన్నారు. ఇక్కడకి రావడానికి వాళ్లకు వీసా దొరకడం లేదు. అయితే, అమెరికాలో కూడా పిశాచాలు, బాబాజీలు బోల్డు మందున్నారు. ఇక్కడ ప్రతిదీ ఒక పిశాచమే. ప్రతివాడూ ఒక బాబానే. అది హెడ్డాఫిసు, ఇవి బ్రాంచాఫీసులు.  అంతే తేడా. అందుకని, వాళ్ళు ఫోన్ చేసి చెబితే, వీళ్లొచ్చి నాకు కనిపిస్తారన్నమాట ! అర్థమైందా? ఇక తీరిగ్గా ప్యాంటేసుకో.

ఒక జ్యోతిష విద్యార్థి సందేహం

ప్రశ్న: గురూజీ ! మీ పుస్తకాలు చదివాను. ముఖ్యంగా మెడికల్ ఆస్ట్రాలజీ బాగా నచ్చింది. నాకు జ్యోతిష్యమంటే మహాపిచ్చి. మీ దగ్గర నేర్చుకుందామని అనుకుంటున్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను. అవిగాక, నెట్లో పడి రాత్రీ పగలూ జోతిష్యం గురించి చదువుతూనే ఉంటాను. ఒక్క మూడు నెలలలో నాకు జ్యోతిష్యం నేర్పగలరా? మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను.

నా రిప్లై : ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ నాయన ! నీలాంటి పిచ్చివాడికొసమే ఎదురు చూసిచూసి, నాకు పిచ్చి ముదిరిపోయింది. నీకు మహాపిచ్చని నీ మెయిల్ చదివినప్పుడే అర్థమైంది. అది నాకెక్కిద్దామని నీ ప్రయత్నమా? నాకే చాలా ఉంది. ఇంక నువ్వేం ఎక్కిస్తావు చెప్పు? ఒక నిజం చెప్తాను విను! జ్యోతిష్యం వేస్ట్ నాయన! జరిగేది ఎలాగూ జరుగుతుంది. దానిని నువ్వూ మార్చలేవు. నేనూ మార్చలేను. ఇంకెందుకు దానిని ముందే తెలుసుకుని ముందునుంచే ఏడవడం? అయినా, జ్యోతిష్యం నేర్చుకోడానికి మూణ్ణెళ్ళెందుకు నాయన? మూడురోజులు చాలు. వెంటనే వచ్చెయ్.  నేను ప్రస్తుతం డెట్రాయిట్ అమెరికాలో ఉన్నాను. నువ్వెప్పుడొస్తే అప్పుడే మూడ్రోజుల క్రాష్ కోర్స్ లో నీకు నేర్పిస్తాను. నేను 2000 లో జ్యోతిష్యం MA చేశాను. కానీ నేటికీ కూడా నాకు జ్యోతిష్యం పూర్తిగా అర్ధం కావడం లేదు. అయినా పరవాలేదు. నాకున్న మిడిమిడి జ్ఞానాన్నే నీకూ  నేర్పిస్తాను. కాకపోతే, ఇండియాకు నా రిటన్ విమాన ఖర్చులు నువ్వే పెట్టుకోవాలి. నాతోబాటు నా శిష్యులు ఒక పదిమంది మాత్రమే ఉంటారు. సరేనా. బి క్విక్. నీ రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాను.

ఇలా ఉంటాయి - 'ప్రశ్నలు - జవాబులు'.

ఎక్కువైన సమాచారం, చేతులో ఉన్న పిచ్చిడబ్బు, తీరికలేని జీవితాలు, విలువలు లేని బ్రతుకులు, పెరుగుతున్న అతితెలివి - ఇవీ కారణాలు.

ఏమ్ చేస్తాం? బుద్ధి కర్మానుసారిణి !