“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, అక్టోబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 33 (స్వాధ్యాయం)

చిన్నప్పటినుంచీ నాకు స్నేహితులంటూ చాలా తక్కువ. కారణం? ప్రతి వయసులోనూ, ఆ వయసు పిల్లలు నాకు చాలా చీప్ గా అనిపించేవారు. నా భావజాలం వారికి చాలా ఎత్తులో ఉండేది. అందుకే నేను ప్రతి స్టేజీలోనూ ఏకాకిగానే ఉంటూ వచ్చాను. నేటికి కూడా, నాకు సరిపోయే స్థాయిలో ఉన్న స్నేహితులు ఒకరో ఇద్దరో తప్ప, లేరు.

ఇదే కారణం చేత నాకొచ్చే వందలాది మెయిల్స్ లో ఒకటో రెండో మాత్రమే నేను జవాబిస్తూ ఉంటాను. మిగతావన్నీ నాకు చాలా చీప్ గా అనిపిస్తూ ఉండటమే దానికి గల కారణం. అసలు చాలా మెయిల్స్ ని తెరిచి చూడను కూడా ! ఎంతసేపూ రోగాలు, సమస్యలు, డబ్బు, ఆస్తులు, అహాలు - ఈ చెత్త తప్ప ఉన్నతమైన విషయాలను మాట్లాడే మనిషే ఈ లోకంలో దొరకడం లేదు.

మనకు నచ్చిన మనుషులు దొరకనప్పుడు, ఉత్తమగ్రంధాలను మించిన స్నేహితులు ఎవరూ ఉండరు. ఆయా గ్రంధాలలో ఆయా రచయితలు మన కన్నుల ముందు ప్రత్యక్షమౌతారు. మనతో వారి భావాలను వెళ్లబోసుకుంటారు. మన ప్రక్కన కూచుని మనతో మాట్లాడతారు. అందుకే ఉత్తమగ్రంధాలను మించిన స్నేహితులు ఎవరూ ఉండరని నేనంటాను.

స్వామి అతులానంద గారని పాతతరం స్వామీజీ ఒకాయన రామకృష్ణమఠంలో ఉండేవారు. ఈయన డచ్ వాడు. ఈయన పేరు కార్నిలియా జొహాన్నెస్ హెబ్లామ్. యూరోప్ లో పుట్టిన ఈయన అమెరికాకు మకాం మార్చాడు. వివేకానందస్వామిని ఈయన అమెరికాలో కలిశాడు. తరువాత సాధువుగా మారి స్వామి అతులానంద అయ్యాడు. సాక్షాత్తు శారదామాత దగ్గర ఈయన మంత్రదీక్షను గ్రహించాడు. శ్రీ రామకృష్ణుల పదహారుమంది డైరెక్ట్ శిష్యులు ఈయనకు పరిచయం ఉండేది. ఈయన విదేశీయుడని కేదార్ నాధ్ ఆలయంలోకి రానివ్వకపోతే, బదరీనారాయణ ఆలయంలో శ్రీరామకృష్ణులవారే ప్రత్యక్షమై ఈయనను ఆలయంలోకి తీసుకెళ్లి అన్నీ చూపించారు.

ఈయనొక అద్భుతమైన మాటను అనేవాడు.

In life, what I love the most are just two things, a book and a nook. అంటే, మంచి పుస్తకం, ఏకాంతం ఉంటే మనిషి జీవితానికి చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అని అర్ధం.

ఈయన గురించిన కొన్ని వివరాలకు ఇక్కడ చూడండి.

అందుకని స్వాధ్యాయానికి ఆధ్యాత్మిక జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అయితే, ఊరకే చదవడం కాకుండా, సాధన కూడా చెయ్యాలి. లేదంటే ఉత్త పాండిత్యం మాత్రమే మిగులుతుంది. అది వాంఛనీయం కాదు.

మొన్న గాంజెస్ లో ఉన్న నాలుగు రోజులలో దాదాపు ముప్పై పుస్తకాలను చదివేశాను.  కారణం? ఇండియాలో నాకు దొరకని కొన్ని ప్రాచీనగ్రంధాలు అమెరికా మారుమూల గాంజెస్ వివేకానంద రిట్రీట్ హోమ్ లైబ్రరీలో దొరికాయి. అందులో ముఖ్యమైనది ఆర్ధర్ ఎవలాన్ (సర్ జాన్ వుడ్రోఫ్) వ్రాసిన Principles of Tantra అనే వెయ్యిపేజీల పుస్తకం. ఇది 'తంత్రతత్వము' అనే బెంగాలీ మాతృకకు 1914 లో ఆయన చేసిన అనువాదం. విందుభోజనం ఎదురైనట్లు అనిపించింది నాకు. ఒక్కపూటలో ఆ పుస్తకం నమిలెయ్యబడింది.

రామకృష్ణామఠం వారు చాలా ఉదార స్వభావులు గనుక, వేదాలు, ఉపనిషత్తులు, వారి సాహిత్యం, ఇతర హిందూమత గ్రంధాలతో బాటు, క్రైస్తవం, యూదుమతం, ఇస్లాం, బహాయ్ మతం, జెన్ బౌద్ధం, తాంత్రికబౌద్ధం, జైనం, టావోయిజం,  షింటోయిజం, పాశ్చాత్య తత్త్వశాస్త్రం, అరవింద సాహిత్యం ఇలా ప్రపంచంలోని అన్ని మతాలు, తత్వశాస్త్రాల గ్రంధాలను అక్కడ సేకరించి ఉంచారు. ఇక్కడున్న కొన్ని గ్రంధాలు ఇండియాలో కూడా దొరకవు. ఉదాహరణకు వేదాలనన్నింటినీ ఒక్కచోటకు తెచ్చి ప్రచురించాడొక స్వామీజీ. ఆయన పుట్టుగ్రుడ్డి. అది ఆయన జీవితాశయం. అది చేసి, చనిపోయాడాయన. ఆ గ్రంధాలు ఇక్కడున్నాయి. అలాంటివే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. వాటిలో ఒక ముప్పైగ్రంధాలను ఈ నాలుగురోజులలో చదివాను. లైబ్రరీలో చదవడం సరిపోక, మాకిచ్చిన కాటేజీకి తీసికెళ్ళి అర్ధరాత్రి దాకా చదివేవాడిని.

ఒకరోజున అలా పుస్తకాలను తీసుకెళుతుంటే చూసి, హరిదాస్ 'ఎంతమందికి ఇవి?' అనడిగాడు. 

'నాకే' అని చెప్పాను.

అయోమయంగా చూశాడతను.

మర్నాడు పొద్దున్నే కలిసినప్పుడు, 'రాత్రి మీరు చూసిన పుస్తకాలను తిరిగి లైబ్రరీలో పెట్టేశాను' అని చెప్పాను. 

మళ్ళీ అయోమయంగా చూశాడతను.

సరే ఎవరి నమ్మకాలు వారివి, మనకెందుకు? ఒకళ్ళు నమ్మితే మనకెంత? నమ్మకపోతే మనకెంత?

అంతా బాగానే ఉన్నప్పటికీ, లైబ్రరీలో గాంధీ ఫోటోలు, ముఖ్యంగా ఆయన చనిపోయినప్పటి ఫోటో గోడకు వేలాడదీసి ఉన్నాయి. షాకయ్యాను. పాతతరం స్వామీజీలలో కొందరికి గాంధీ అంటే గౌరవం ఉండేది. దానికి కారణం ఆయన నిజస్వరూపం వారికి తెలియకపోవడమే. ఆయనొక సెయింట్ అని వాళ్ళనుకునేవారు. చివరకు మెహర్ బాబా కూడా ఆయన విషయంలో పొరపాటు పడ్డాడు.  మనకు ఒళ్ళు మండించే వ్యక్తులలో గాంధీ ప్రథమస్థానంలో ఉంటాడు గనుక, ఆ ఫోటోలు చూస్తే నాకు చాలా అసహ్యమేసింది. వాటిని తొలగించడం మంచిదని, ఆ ఫోటోలే ఈ సెంటర్ కు పట్టిన దరిద్రమని చెప్పి విజిటర్స్ బుక్ లో రాద్దామని చూస్తే ఆ బుక్ లేదు. చికాగో మఠానికి ప్రస్తుతం ఇన్ ఛార్జ్ గా స్వామి ఈశాత్మానంద గారున్నారు. ఆ విధంగా ఆయనకు ఈ మెయిల్ ఇవ్వమని పంచవటి USA వారికి చెప్పాను.


గాంజెస్ వివేకానంద రిట్రీట్ సెంటర్. ఎడమచేతి చివరలో డోమ్ లాగా కనిపిస్తున్నదే లైబ్రరీ. అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది.


లైబ్రరీ మెట్లపైన
లైబ్రరీలోనా వెనుకగా లైబ్రరీ చివరలో ఒక గది ఉంది. శ్రీమత్ స్వామి భూతేశానందగారు ఇక్కడకొచ్చినపుడు అక్కడ ఒక కుర్చీలో కూచున్నారు. ఆ కుర్చీని అక్కడే ఉంచి, జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు సెంటర్ వారు. లైబ్రరీలో కూడా చలి వణికిస్తోంది. అందుకే ఈ బందోబస్తు.
నా ప్రక్కనే డిస్టర్బ్ చెయ్యకుండా మౌనంగా ఉంటూ, గంటకొకసారి నాకు టీ ఇవ్వడం శిష్యుల పని.


1893 లో వివేకానందస్వామి వచ్చినపుడు చికాగో ఇలా ఉండేది