“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, అక్టోబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 46 ( గాయత్రీ సాధన )

గాయత్రీమంత్రం అందరికీ తెలుసు. అది వేదమంత్రాలలోకెల్లా అత్యున్నతమైన మంత్రం. గాయత్రికి వేదమాతయని పేరు. తాంత్రిక గాయత్రి, రహస్య గాయత్రి, ఇంకా ప్రతిదేవతకూ ఒక గాయత్రీమంత్రం ఉన్నప్పటికీ, లేదా తర్వాతివాళ్ళు తయారు చేసినప్పటికీ, వేదమాతయైన గాయత్రి ఈ అన్నింటికంటే ఉత్తమమైనది. ఈ గాయత్రిని జపించేవారు ఇండియాలో కోట్లాదిమంది ఉన్నారు.

కానీ, ప్రతిరోజూ సంధ్యావందనం చేస్తూ, గాయత్రిని మొక్కుబడిగా జపిస్తున్న కోట్లాదిమందిలో కూడా ఎవరికీ తెలియని రహస్యసాధన ఒకటుంది, అదే గాయత్రీసాధన. దీనిలో వేద, యోగ, తంత్రమార్గముల సమన్వయపూర్వకమైన సాధనావిధానం ఉంటుంది. ఇది పుస్తకాలలో ఎక్కడా దొరకదు. గురుశిష్యపరంపరలో అనూచానంగా వస్తూ ఉంటుంది. అన్ని రహస్యసాధనలలాగే, బయట ఎవ్వరూ దీనిని గురించి మాట్లాడరు. 'గాయత్రి మా సొత్తు' అని చెప్పుకునే గాయత్రీ పరివార్ వారికి కూడా ఈ సాధన తెలియదు.

ఈ గాయత్రీసాధన చేసేవాడికి, ఇతర ఏ పూజలుగాని, దీక్షలు గాని, సాధనలు గాని, వ్రతాలు గాని, మొక్కులు గాని, తీర్ధయాత్రలు గాని, గుళ్ళూ గోపురాలూ తిరగడం గాని ఏవీ అవసరం ఉండదు. ఇల్లు కదలకుండా ఇదొక్కటే అత్యున్నతమైన సిద్ధిని కలిగిస్తుంది. అలాంటి మహోన్నతమైన సాధన ఇది.

అయితే, దీనిని గురూపదేశ పూర్వకంగానే స్వీకరించాలి. ఎందుకంటే, గురువుయొక్క సాధనాశక్తి అనేది దీక్షాసమయంలో శిష్యునికి ఇవ్వబడుతుంది. ఈ ప్రాసెస్ చాలా సూక్ష్మంగా ఉంటుంది. కాలక్రమేణా ఈ సత్యం, దీక్షను స్వీకరించిన శిష్యునికి తెలియవస్తుంది. కొంతమందికి వెంటనే అనుభవంలోకి వస్తుంది, కొంతమందికి కాలక్రమంలో తెలుస్తుంది. అదంతా వారి వారి సంస్కారములకు అనుగుణంగా జరుగుతుంది.

అటువంటి గాయత్రీదీక్షను, మొన్న అమెరికాలో ఒక శిష్యునికి ఇచ్చాను.

ఇన్నేళ్ళుగా నాతో పరిచయం ఉన్నవారిలో ఎవ్వరికీ ఈ దీక్షను ఇవ్వలేదు. కారణం? వారికి ఇవ్వమని నాకు  ఆదేశం రాకపోవడమే. ఈ అబ్బాయికి ఇవ్వమని ఆదేశం వచ్చింది. అతనడగలేదు, కానీ ఇవ్వమని నాకు ఆదేశం వచ్చింది. మొన్న ఒక వీకెండ్ లో  నేనున్న చోటకు అతనిని పిలిచి మరీ ఈ దీక్షనిచ్చాను.

నా దగ్గరకు వచ్చిన వందలాదిమందిలో ఇతడే ప్రప్రధమంగా ఈ దీక్షను స్వీకరించినవాడు.

ఆధ్యాత్మికమార్గంలో ఎవరి అర్హతను బట్టి వారికి లభిస్తుందని, దీనికి చోటుతో, సమయంతో సంబంధం ఉండదని, నేను ఎప్పుడూ చెప్పేమాట ఈ విధంగా మళ్ళీ ఋజువైంది.