“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, ఆగస్టు 2018, బుధవారం

బ్లాగుభేతాళ కధలు - 1 (స్వామి సంపూర్ణానంద కాపి)

మిత్రుడు సూర్యకు ఈ మధ్య స్వామీజీల పిచ్చి బాగా పట్టుకుంది. ఎవరైనా ఒక మంచి పవరున్న స్వామీజీ దొరక్కపోతాడా అని అదేపనిగా లీవు పెట్టుకుని మరీ వెతుకుతున్నాడు.

'ఎందుకు నీకీ వెదుకులాట? నేనున్నాను కదా? నీ డౌట్లేంటో చెప్పు నేను క్లారిఫై చేస్తాను.' అంటే వినడు.

"వాళ్ళు చెప్పే చిట్కాలు నువ్వు చెప్పవు కదా? ఏది జరిగినా నీ మంచికే అనుకోమంటావు. అదేంటంటే జిల్లెళ్ళమూడి అమ్మగారు, రమణమహర్షి, రామకృష్ణులు అదే చెప్పారంటావు. నాకేమో నా పనులు ఫాస్ట్ గా కావాలి. అలా జరగాలంటే, మంత్రాలు, తంత్రాలు అప్పనంగా చెప్పే గురువులు దొరకాలి. నువ్వు చెప్పేదేమో నాకు సరిపోవడం లేదు. ఎలా మరి? అందుకే వెదుకుతున్నాను" - అంటాడు.

'సరే నీ ఇష్టం. వెతుక్కో.' అని తనకు చెబుతూ ఉంటాను.

ఈ మధ్యనే తన దగ్గర నుంచి ఫోనొచ్చింది.

"స్వామి సంపూర్ణానంద కాపి గురించి విన్నావా?" అడిగాడు.

'అదేం పేరు? ఆ పేరుతో ఉన్న ఒకాయన గురించి తెలుసు గాని. చివర్లో కాపి ఏంటి?" అడిగాను అనుమానంగా.

"కాపి అంటే కామపిశాచి అని అర్ధం." అన్నాడు గొంతు తగ్గించి రహస్యంగా.

నేనాశ్చర్యపోయాను.

"అవునా? ఆయనకు ఆ టైటిల్ ఉందా? ఆయనే పెట్టుకున్నాడా? లేక శిష్యులు పెట్టారా/" అడిగాను.

"ఎవరూ పెట్టలేదు. నేనే పెట్టాను." అన్నాడు.

"అదేంటి? నువ్వు అలాంటి పేరు పెట్టడమేంటి? ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది కదా సొసైటీలో?" అన్నాను.

"ఉంది. కానీ అసలు విషయాలు ఎవరికీ తెలీవు. కొంతమంది దగ్గర వాళ్ళకే ఈ సంగతులు తెలుస్తాయి." అన్నాడు.

"నువ్వాయనకు అంత దగ్గరివాడివి ఎప్పుడయ్యావు? ఎలా అయ్యావు? ఆ కధను కాస్త వివరించుము?" అడిగాను.

"నువ్వు ఆఫీసు పనుల్లోనూ, పుస్తకాలు వ్రాయడంలోనూ, పాటలు పాడటంలోనూ, నీ శిష్యులతోనూ, ఇంకా లక్ష పనులలో బిజీ కదా. నీకు కొంచం రిలాక్స్ గా ఉండటం కోసం ఈ మధ్యనే జరిగిన ఒక యదార్ధగాథ చెప్తా విను." అంటూ చెప్పడం మొదలు పెట్టాడు సూర్య.

"ఈ స్వామీజీకి మా కజిన్ బాలాజీ చాలా క్లోజ్.  మొదట్లో ఆయన పెడుతున్న వీడియోలు చూచీ, ఆయన ఉపన్యాసాలు వినీ ఆయనంటే ఎంతో గొప్ప క్రేజ్ పెంచుకున్నాడు. కొన్నేళ్లుగా ఆయన దగ్గరకు వెళుతూ వస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో ఆయనకు బాగా దగ్గరయ్యాడు. ఆయన ఆశ్రమంలో కూడా VIP అయిపోయాడు.

ఈ లోపల ఆశ్రమంలో జరుగుతున్న ఇన్సైడ్ సంగతులు ఈయనకు చూచాయగా తెలుస్తూ ఉండేవి. అవి నిజమా కాదా అనే సందిగ్ధావస్థలో ఉండగా సత్యవతి దాన్ని చిటికెలో తేల్చేసింది." అన్నాడు.

"మధ్యలో ఈ కేరెక్టర్ ఎవరు?" అడిగాను.

"ఆ అమ్మాయిది పెద్దాపురం. పెద్దాపురం పాప (పేపా) అనేది ఆమె ముద్దుపేరు." అన్నాడు.

"అదికూడా నువ్వే పెట్టావా ఆమెకు?" అడిగాను నవ్వుతూ.

"లేదు. ఆమెతో నాకంత చనువు లేదు. మా బాలాజీ గాడికి ఆ అమ్మాయి మంచి ఫ్రెండ్ అనడం కంటే అంతకంటే ఎక్కువ అనవచ్చు. ఏదో బలహీనక్షణంలో వాడే ఆ పేరు పెట్టాడు ఆ అమ్మాయికి. ఇంతకంటే నేను చెప్పలేను" అన్నాడు.

"సరే అర్ధమైందిలే. ప్రొసీడ్ విత్ ద స్టోరీ" అన్నా.

ఒకరోజు మాటల మధ్యలో ఆ అమ్మాయి పందెం కాసిందట. "మీ స్వామీజీ అంత గొప్ప పత్తిత్తు ఏమీ కాదు." అంటూ.

"తప్పు. అలా మాట్లాడకు. కళ్ళు పోతాయి" అన్నాడు బాలాజీ.

"కళ్ళూ పోవు ఒళ్ళూ పోదు గాని, నే చెప్పేది నిజం" అంది పేపా.

"ఎలా చెప్పగలవ్" అడిగాడు బాలాజీ.

"అదే మీకూ మాకూ తేడా. మీరు కనిపెట్టలేనిది మేము క్షణంలో పట్టేస్తాం. అతని చూపులూ ఆ వాలకాన్ని బట్టి మాకు చిటికెలో అర్ధమైపోతుంది అతనెలాంటి వాడో" అంది పేపా.

"ఊరకే మాట్లాడటం కాదు. ప్రూవ్ చేస్తావా?" అడిగాడు బాలాజీ.

"చాలెంజ్. నన్నొక్కసారి ఆశ్రమానికి తీసుకెళ్ళు. ఆ తర్వాత నువ్వు క్యూలో ఉంటావు. నేను సరాసరి VVIP గా నీ ముందే డైరెక్ట్ గా స్వామీజీ దర్శనానికి వెళ్ళడం నువ్వే చూస్తావు." అంది పేపా.

మనవాడు అయిష్టంగానే ఈ ప్లాన్ కి ఒప్పుకున్నాడు.

అనుకున్నట్లుగానే, ఒకరోజున ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమంలో అడుగుపెట్టాక ఒకరికొకరు తెలియనట్లు నటిస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి, స్వామీజీ సెక్రటరీని పరిచయం చేసుకుని పావుగంటలో స్వామీజీ ఇంటర్వ్యూ సంపాదించింది. ఒక అరగంట స్వామీజీ గదిలో ఉండి, విజయగర్వంతో నవ్వుకుంటూ బయటకొచ్చింది. ఈలోపల వీడు బయట లాంజ్ లో కూచుని వెయిట్ చేస్తున్నాడు.

ఇద్దరూ వెనక్కు బయల్దేరారు.

మౌనంగా కార్ డ్రైవ్ చేస్తున్న బాలాజీ, సస్పెన్స్ భరించలేక - " ఏమైంది?" అన్నాడు.

"నేను చెప్పాక ఫెయిల్ అవడం ఉండదు బాలూ. నీ అనుమానం కరెక్టే. వాడొక పెద్ద కాపీగాడు. ఆడదానికి పడనివాడు ఈ లోకంలో ఎవడూ ఉండడు." అంది పేపా.

"ఎలా చెప్పగలుగుతున్నావ్? లోపల ఏమైందో చెప్పు?" అడిగాడు బాలాజీ.

"కొన్ని కొన్ని చెప్పలేం బాలూ. ఇంతవరకూ మాత్రమె చెప్తా. నెక్స్ట్ టైం మనిద్దరం మళ్ళీ ఆశ్రమానికి వద్దాం. ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ వస్తుందో నువ్వే చూడు" అంది నవ్వుతూ పేపా.

అనుకున్నట్టు గానే మళ్ళీ ఒక నెల తర్వాత ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. కారులో పోతూ ఉన్నప్పుడే, ఈ నెలలో స్వామీజీ తనకు చేసిన కాల్స్ ఎన్నున్నాయో, మెసేజీలు ఎన్నున్నాయో బాలాజీకి చూపించింది పేపా.

అవి చూచి బాలాజీకి మతి పోయింది.

ఇంతలో ఆశ్రమం రానే వచ్చేసింది. కారు పార్క్ చేసి దిగారు ఇద్దరూ.

వీళ్ళను చూస్తూనే స్వామీజీ పీయే పరిగెత్తుకుంటూ వచ్చాడు. తనకోసమేనేమో అనుకున్నాడు బాలాజీ. ఎందుకంటే, స్వామీజీ వస్తున్నాడని తెలిస్తే, తనే ఎయిర్ పోర్ట్ కు కారేసుకుని వెళ్లి మరీ ఆయన్ను ఎన్నోసార్లు రిసీవ్ చేసుకునేవాడు. అది పీయే కు కూడా తెలుసు.

బాలాజీని ముక్తసరిగా పలకరించిన పీయే, పేపా వైపు తిరిగి, " మేడం, రండి, మీకోసం స్వామీజీ వెయిట్ చేస్తున్నారు." అన్నాడు నవ్వుతూ.

బాలాజీకి మతిపోయింది. గుడ్లప్పగించి చూస్తున్నాడు.

"మీరలా కూచోండి బాలూగారు. మేడం బయటకొచ్చాక మీతో మాట్లాడతారు స్వామీజీ" అని చెప్పి అతన్ని హాల్లో కూచోబెట్టి, సత్యవతిని డైరెక్ట్ గా స్వామీజీ గదిలోకి తీసుకెళ్ళాడు పీయే. అప్పటికే క్యూలో ఉన్న దాదాపు ఏభైమంది గుడ్లప్పగించి వీళ్ళవంక పిచ్చివెధవల లాగా చూస్తున్నారు. పీయే అదేమీ పట్టించుకోకుండా తలుపు తీసి పట్టుకున్నాడు సత్యవతి లోపలకి వెళ్ళడానికి వీలుగా.

'వీడి దుంప తెగ. ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన చెవులు వాడిగా ఉన్నాయే? ఇదేనేమో కలియుగ మహిమ?" అని తిట్టుకుంటూ బాలాజీ హాల్లో కూచుని వెయిట్ చేస్తున్నాడు.

చూస్తుండగానే గంట, రెండు గంటలు, మూడు గంటలు గడిచాయి. లంచ్ టైం అవుతోంది. ఇక ఇలా కాదని, లేచి, ఆశ్రమం క్యాంటీన్లో లైట్ గా స్నాక్స్ తీసుకుని మళ్ళీ వచ్చి సోఫాలో కూలబడుతూ ఉండగా బయటకొచ్చింది పేపా.

"ఈ రోజుకు దర్శనాలు కేన్సిల్. స్వామీజీ అలసిపోయారు. అందరూ సాయంత్రం ఆరుగంటలకు ప్రేయర్ హాల్లో స్వామీజీని దర్శించుకోవచ్చు." అని ఎనౌన్స్ చేశాడు పీయే.

క్యూలో ఉన్నవాళ్ళందరూ విసుగ్గా ముఖాలు పెట్టుకుని డిస్పర్స్ అయిపోయారు.

వెనక్కు వస్తూ ఉండగా "నువ్వు చెప్పినట్టే జరిగింది. అయిదేళ్ళనుంచీ నుంచీ కుక్కలాగా వీడిదగ్గరకు వస్తున్నాను. నాచేత ఎన్నెన్ని పనులు చేయించుకున్నాడో లెక్కేలేదు. చివరకు నెలక్రితం వచ్చిన నువ్వు ముఖ్యమైపోయావు వీడికి. నాకేమో కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు." అన్నాడు ఏడుపు ముఖంతో.

"నే ముందే చెప్పలా? మా అంచనా ఎప్పుడూ తప్పు కాదని?" అంది పేపా నవ్వుతూ.

"అప్పట్నించీ బాలాజీ ఆశ్రమానికి వెళ్ళడం మానేశాడు" అని చెప్పి కధ  ముగించాడు సూర్య.

"కానీ పేపా మాత్రం రెగ్యులర్ గా వెళుతూనే ఉంది" అన్నా నేను నవ్వుతూ.

"కరెక్ట్. ఎలా కనిపెట్టావ్?" అడిగాడు సూర్య నవ్వుతూ.

"సింపుల్ కామన్ సెన్స్. సెలబ్రిటీ అయిన స్వామీజీని పట్టాక ఒక మామూలు గవర్నమెంట్ ఆఫీసర్ అయిన బాలాజీ ఎలా నచ్చుతాడు పేపాకి? సింపుల్ లాజిక్" అన్నా నేనూ నవ్వుతూ.

"కధ ఇంకా ఉంది. విను. ఇంతకు ముందులా వీళ్ళు తన దగ్గరకు రావడం లేదని కనిపెట్టిన స్వామీజీ ఒకరోజున కారేసుకుని పొద్దున్నే వీళ్ళింటికి వచ్చేశాడు. ఇంతకు ముందైతే, స్వామీజీ వస్తే, వీళ్ళు హైరానా పడిపోయి గందరగోళం అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఎగ్జైట్ కాకుండా తాపీగా ఆహ్వానించారు. స్వామీజీ ఆ తేడాను కనిపెట్టాడు.

"ఏం బాలాజీ ! మునుపటిలా ఆశ్రమానికి రావడం లేదు? మా స్టాఫ్ వల్ల ఏమైనా అపచారం జరిగిందా?" అడిగాడు నవ్వుతూ.

"వాళ్ళవల్ల ఏ అపచారమూ జరగలేదు. నీవల్లే జరిగింది. నీవల్ల నా గర్ల్ ఫ్రెండ్ నాకు దూరమైంది." అని మనసులో అనుకున్న బాలాజీ బైటికి మాత్రం నవ్వుతూ - ' అబ్బే ! అదేం లేదు స్వామీజీ! ఆఫీసులో పని ఎక్కువగా ఉండి రాలేకపోతున్నా అంతే !" అన్నాడు.

అది అబద్దమని తేలికగా గ్రహించాడు స్వామీజీ. అతను కూడా తక్కువ వాడేమీ కాదు. ఆవులిస్తే పేగులు లెక్కిస్తాడు.

"సర్లే బాలాజీ ! ఈరోజు మీ ఇంట్లో భోజనానికి వచ్చాం" అన్నాడు సోఫాలో కూలబడుతూ.

ఇక తప్పదు కదా ! అందుకని రాధ లేచి వంటింట్లోకి వెళ్ళింది. రాధంటే బాలాజీ భార్యన్న మాట. తను వంట చేసేలోపు స్వామీజీ, ఆయన వెంట వచ్చిన బృందం, బాలాజీతో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ కూచున్నారు హాల్లో.

ఇంతకు ముందైతే, ముందు స్వామీజీకి భోజనం పెట్టి, దగ్గరుండి భయభక్తులతో వడ్డించి, ఆ తర్వాత ఈ దంపతులు తినేవాళ్ళు. ఇప్పుడు ఆయనతో బాటే కుర్చీలు లాక్కుని కూచుని వడ్డించుకుంటూ తింటున్నారు. మధ్యమధ్యలో "స్వామీజీ ! పప్పు బాగుంది. కొంచం ఆ గిన్నె ఇటు పాస్ చెయ్యండి' అని ఆయన్నే అడుగుతున్నారు. మధ్యమధ్యలో కాళ్ళు డైనింగ్ టేబుల్ కిందనుంచి ఆయన కాళ్ళకు తగిలినా "సారీ" చెప్పడం లేదు.

ఇదంతా స్వామీజీ గమనిస్తూనే ఉన్నాడు. ఈ తేడాకు కారణం ఏంటో ఆయనకు అర్ధం కావడం లేదు. పేపా, బాలాజీకి ఫ్రెండ్ అన్న సంగతి స్వామీజీకి తెలీదు. కానీ అవసరం తనది కాబట్టి దాన్నంతా మౌనంగా భరించాడు.

భోజనాలయ్యాక అసలు విషయం కదిలించాడు స్వామీజీ.

"ఒక వారంలో మన ఆశ్రమంలో పెద్ద హోమం పెట్టుకున్నాం. మీరంతా వచ్చి తలో చెయ్యీ వెయ్యాలి" అన్నాడు తాపీగా.

"ఎందుకు వెయ్యం? నువ్వైనా మేమైనా చేతులేగా వేసేది?" అనుకున్నాడు బాలాజీ లోలోపల. బయటకు మాత్రం వినయంగా నవ్వుతూ - "తప్పకుండా స్వామీజీ. మా అదృష్టం ! అంతకంటే ఇంకేం కావాలి మా జన్మకి?" అన్నాడు.

"రాధ బాగా వంట చేస్తుంది కదా ! ఆమె చెయ్యి పడితేనే వంటకు రుచి వస్తుంది. అందుకని ఆరోజున ఆశ్రమం కిచెన్ అంతా ఆమె చూసుకోవాలి" అన్నాడు స్వామీజీ.

"ఈ చేతులు వెయ్యడం, చెయ్యి పడటం ఏంటో ఈ గోల? వీడికి మాట్లాడటం కూడా సరిగ్గా రాదు, మా ఖర్మ" అనుకున్నాడు బాలాజీ. పైకిమాత్రం "అలాగే స్వామీజీ" అన్నాడు అతివినయాన్ని నటిస్తూ.

అనుకున్నట్లుగానే, ఆ రోజుకు ఆశ్రమానికి వెళ్ళారు గాని, ఏదో అంటీ ముట్టనట్లుగా అక్కడ ఉండి ఆ కార్యక్రమం కాస్తా అయిందనిపించి వెనక్కు వచ్చేశారు బాలాజీ దంపతులు. అలా, కొన్నాళ్ళకు ఆశ్రమానికి వెళ్ళడం పూర్తిగా తగ్గించేశారు.

ఇదంతా చెప్పిన సూర్య ఇలా అన్నాడు.

"సరేగాని, ఒక విషయం చెప్పు. సమాజం ఇంతలా చెడిపోయిందేమిటి? మరీ స్వామీజీలు కూడా ఇలా తయారౌతున్నారేంటి?" అన్నాడు సూర్య.

"ఏమో నాకేం తెలుసు? నేనింకా స్వామీజీని కాలేదుగా? అయ్యాక చెప్తా. ఇన్నాళ్ళబట్టీ నేను చెబుతుంటే నువ్వు నమ్మడం లేదుకదా? అందుకని నీకు పేపానే కరెక్టు గురువు. పేపాని అడుగు. జ్ఞానోపదేశం చేస్తుంది" అన్నా నేనూ నవ్వుతూ.

"ఆ ! ఆమె మనకెక్కడ దొరుకుతుంది? స్వామీజీతో యూరప్ యాత్రలో ఉందిట ప్రస్తుతం" అన్నాడు సూర్య నీరసంగా.

"ఏంటీ యాత్ర ఉద్దేశ్యం?" అడిగాను.

"ఏమో? ఇండియన్ కల్చర్ మీద స్వామీజీ ఉపన్యాసలిస్తున్నారట యూరప్ లో. ఆయన వెంట ఈ అమ్మాయి కూడా వెళ్ళింది" అన్నాడు సూర్య.

"మొత్తం మీద స్వామీజీ కాపి అంటావ్? మరి ఈయన్ను వదిలేసి మళ్ళీ నీ వేట మొదలుపెట్టావా?" అన్నా నవ్వుతూ.

"తప్పుతుందా మరి? ప్రస్తుతం ఇంకో స్వామీజీ ఆశ్రమానికి రెగ్యులరుగా వెళుతున్నా. త్వరలో ఇంకొన్ని నమ్మలేని నిజాలను నీకు చెబుతా" అన్నాడు సూర్య.

"ఆల్ ద బెస్ట్" అన్నా నవ్వుతూ.

ఆ విధంగా నాకు మౌనభంగం కావడంతో అప్పటిదాకా మాట్లాడుతున్న సూర్య తన ఫోన్ ను కట్ చేశాడు.