Love the country you live in OR Live in the country you love

30, జులై 2018, సోమవారం

మీ వ్రాతలు వాళ్ళవిగా చెప్పుకుంటున్నారు

నా పోస్టులను ఇష్టపడే ఒకరినుంచి నిన్నొక మెసేజ్ వచ్చింది.

'ఫలానా "టెలిగ్రాం గ్రూపు" లో చేరండి. ఇందులో మంత్ర, తంత్ర, జ్యోతిష, ఆధ్యాత్మిక, భారతీయ సంస్కృతి వగైరా విషయాల మీద చర్చలుంటాయి. మీకు స్వాగతం' అని అందులో ఉంది.

నేను మర్యాదగా, "నాకు చేరాలని లేదు. సారీ !" అని జవాబిచ్చాను.

'ఈ గ్రూపులో ఒకాయన మీ వ్రాతలను తనవిగా పోస్టు చేసుకుంటున్నాడు. గ్రూపులో అతనికి చాలా appreciation వస్తోంది.' అని రిప్లై వచ్చింది.

నాకు జాలేసింది.

'అది అతని ఖర్మ. చేసుకోనివ్వండి. నేను పాడిన పాటల్ని కూడా తనవిగా చెప్పుకోమనండి ఇంకా బాగుంటుంది. ఇంతకీ అతని పేరేంటి?' అడిగాను.

'గ్రూపులో ఉన్నవాళ్ళ పేర్లు మాకు కనిపించవు. అతని పేరు LK అని మాత్రం వస్తుంది' అని మెసేజ్ వచ్చింది.

'ఈ విషయాలు సాధన చేసి అనుభవంలో తెలుసుకోవలసినవిగాని చర్చలలో పొద్దు పుచ్చేవి కావు. కాబట్టి మీ గ్రూపులో చేరే ఉద్దేశ్యం నాకు లేదు. సారీ. నన్ను ఆహ్వానించినందుకు థాంక్స్' అని మెసేజ్ ఇచ్చాను.

సో కాల్డ్ సూడో ఆధ్యాత్మిక లోకంలో ఒక విచిత్రం ఉంది. 'నాకింత తెలుసు' అని ప్రదర్శించుకుని ఎదుటివారి నుంచి "ఆహా ఓహో" అని పొగడ్తలు వస్తే ఉబ్బిపోతూ అదే ఏదో పెద్ద ఘనతగా చాలామంది భావించుకుంటూ ఉంటారు. ఇలాంటివారిని చూస్తె నాకు నవ్వూ జాలీ రెండూ వస్తూ ఉంటాయి.

ఆధ్యాత్మికత అనేది విజ్ఞాన ప్రదర్శనలో లేదు. అది సాధనలోనూ అనుభవంలోనూ ఉంటుంది. అందులోనూ, ఈ విధంగా ఇతరులనుంచి వచ్చే మెప్పులు, పొగడ్తలు, లోలోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో నిండిపోయి ఉన్నవారికి పనిచేస్తాయి గాని ఇంకెందుకూ కొరగావు.

చర్చలతో ఆధ్యాత్మికత రాదు. అది సాధనతో వస్తుంది. వేరేవాళ్ళ బ్యాంక్ ఎకౌంట్ ను తనదిగా చెప్పుకున్నంత మాత్రాన ఆ ఎకౌంట్లో ఉన్న డబ్బు తనదెలా అవుతుంది?

ఇలాంటి వారిని చూచి జాలిపడటం తప్ప ఇంకేం చెయ్యగలం?