“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, జులై 2018, మంగళవారం

వాగుడమ్మ - వంటమ్మ

ఆధ్యాత్మిక జీవితంలో పుస్తకాలు చదవడానికీ, దానినుండి సంపాదించే మోతబరువు జ్ఞానానికీ ఏమీ విలువ ఉండదు. అనుభవమే అక్కడ ప్రధానం. కానీ సోకాల్డ్ ఆధ్యాత్మికులు చాలామంది ఊరకే పుస్తకాలు చదివి, బుద్ధితో అర్ధం చేసుకుని, తమకు అర్ధమైనదానిని ఇతరులకు చెబుతూ, అదే పెద్ద ఘనకార్యం అని పొంగిపోతూ ఉంటారు. టీవీ ఉపన్యాసకులూ, ధర్మప్రచారకులూ చాలామంది ఇలాంటి వారే. ఇంటర్ నెట్లో అయితే ఇంక చెప్పనక్కరలేదు. దాదాపు అందరూ అలాంటివారే.

కొన్నేళ్ళ ముందు నాతో ఒకమ్మాయి మాట్లాడుతూ ఉండేది. ఆమె నా బ్లాగు ఫాలోయర్. నా బ్లాగుకు బాగా అడిక్ట్ అయిపోయి, రోజుకు మూడు నాలుగు సార్లు ఓపన్ చేసి చదువుతూ ఉండేది. నేను ఒకటి రెండురోజుల పాటు ఏమీ వ్రాయకపోతే నాకు ఫోన్ చేసి 'ఏంటండి? ఏమీ వ్రాయలేదు?' అని అడుగుతూ ఉండేది. ఆ గొంతును బట్టి ఆమె ఎందుకు అలా అడుగుతోందో నాకు తేలికగా అర్ధమైపోతూ ఉండేది. కానీ తనను ఏమీ నిరుత్సాహపరిచేవాడిని కాను. 'రేపు వ్రాస్తాను, చదవండి' అని చెబుతూ ఉండేవాడిని.

తానెప్పుడూ మిగతా విషయాల గురించి అడగదు. శుద్ధ ఆధ్యాత్మిక పోస్టులే అడుగుతుంది. వాటినే చదువుతుంది. మిగతా పోస్టులు చదవదు. వాటిని గురించి మాట్లాడదు. ఆమె బంధువులలో స్నేహితులలో అందరూ ఆమెను ఎంతో గొప్ప ఆధ్యాత్మికవేత్త అని అనుకుంటూ ఉండేవారు. ఆ ఇమేజిని తనుకూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేది.

కొన్నేళ్ళు అలా గడిచాక, ఒకరోజున ఫోన్లో నాతో మాట్లాడుతూ అసలు విషయాన్ని ఆమె చెప్పేసింది.

'మీరు ఆధ్యాత్మిక పోస్టులు చాలా బాగా వ్రాస్తారు.'

'అదిసరే. వాటిని చదివి మీరేం చేస్తున్నారు?' అనడిగాను.

'మా క్యాస్ట్ లో ఆధ్యాత్మిక విషయాలు తెలిసినవాళ్ళు తక్కువ. ఎంతసేపూ వ్యాపారాలు, డబ్బు సంపాదనా తప్ప ఇంకోటి తెలీదు వీళ్ళకు. నేను మీ పోస్టులు చదివి తెలుసుకున్న వాటిని మా వాళ్లకు చెబుతూ ఉంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు' అంది.

'ఓహో అలాగా ! అవి నా పోస్టులని మీరు చెబుతారా? లేక మీ సొంత నాలెడ్జిగా చెబుతారా?' అడిగాను.

'మీ పేరు ఇంతవరకూ వాళ్ళకు చెప్పే అవకాశం రాలేదు. మీ బ్లాగులో తెలుసుకున్న విషయాలను మాటల సందర్భంలో నా మాటలుగా వాళ్లకు చెబుతూ ఉంటాను.' అన్నది.

'అదా సంగతి? అందుకా, మాటమాటకీ ఇంకా క్రొత్తవి వ్రాయలేదేంటి? ఎప్పుడు వ్రాస్తారు? అని అడుగుతూ ఉంటారు' అన్నాను.

'అవును' అన్నది.

'ఈ పనివల్ల మీ అహంకారం పెరగడం తప్ప ఉపయోగం ఏముంది?' అడిగాను.

'అదేంటి?' అంది.

'అవును. ఎవరో వ్రాసినవాటిని మీ నాలెడ్జిగా నలుగురిలో ప్రదర్శించుకుంటూ పొంగిపోతూ ఉంటే జరిగేది అహంకారం పెరగడమే కదా? అది ఆధ్యాత్మికానికి వ్యతిరేకం అవుతుంది. మరి మీవాళ్ళతో మీ ఆధ్యాత్మిక సంభాషణకు అర్ధం ఏముంది? మీరు చెయ్యాల్సింది నా బ్లాగు చదివి వేరేవాళ్ళకి చెప్పడం కాదు. ఆ చదివినదానిలో ఒక్కటైనా ముందుగా ఆచరించి అనుభవంలో దానిని మీ సొంతం చేసుకోవాలి. అప్పుడే దానికి సార్ధకత. లేకుంటే మీది గాడిదబరువే. ఆధ్యాత్మిక గ్రంధాలు మోసే గాడిదకూ మీకూ తేడా ఏముంది? మీరు వాగుడమ్మేగాని వంటమ్మ కాదు.' అన్నాను.

నేనలా అన్నానని నా మీద కోపం తెచ్చుకుని అలిగి అప్పటినుంచీ నాతో మాట్లాడటం మానేసింది. నాకు నవ్వొచ్చింది. ఒకరు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నాకేమీ నష్టం లేదు. ఉన్న సత్యాన్ని సత్యంగా స్వీకరించలేనివారు నాతో ఉంటే ఎంత? లేకుంటే ఎంత? మనిషి చెరువుమీద అలిగితే ఎవరికీ నష్టం?

ఒకామె వంటలు ఎలా చెయ్యాలని ఎన్నో ఉపన్యాసాలిస్తూ ఉండేది. వినేవారు ఆమె ఉపన్యాసాలు విని డంగై పోతూ ఉండేవారు. వాళ్ళు ఇంకా కొంతమందికి ఆ వంటలను గురించి చెబుతూ ఉండేవారు. కానీ ఆ వంటలను ఆమె చేసిందీ లేదు. తిన్నదీ లేదు. విజ్ఞానప్రదర్శన మాత్రం బాగా సాగుతూ ఉండేది.

ఇంకొకామె ఉండేది. ఆమెకు ఇన్ని వంటలూ తెలీవు. ఉపన్యాసాలూ రావు. ఆమె వంటల పుస్తకాలు చదివి అందరిలో విజ్ఞానప్రదర్శన చేసిందీ లేదు. మౌనంగా తనకొచ్చిన ఒక్క వంటకాన్నీ వేళకు చేసుకుని హాయిగా తిని పడుకునేది. ఆనందంగా జీవితాన్ని గడిపేది. మొదటామె వాగుడమ్మ. రెండవామె వంటమ్మ. వాగుడమ్మకు వాగుడే మిగుల్తుంది. వంటమ్మకు ఆకలి తీరుతుంది.

నాకు కావలసింది వంటమ్మలే గాని వాగుడమ్మలు కాదు. సత్యానికి కావలసింది సత్యాన్ని అనుసరించేవారేగాని తనది కానిదాన్ని తనదిగా చెప్పుకుంటూ పోజు కొట్టే విజ్ఞానప్రదర్శకులు కారు. అలాంటివారు ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నటికీ ఎదగలేరు.