“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, ఆగస్టు 2018, బుధవారం

బ్లాగు భేతాళ కధలు - 4 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

'ఒకరోజున ఏదో దుర్ముహూర్తంలో ఏమీ తోచక యూట్యూబ్ లొ వెదుకుతూ ఉంటే ఈ స్వామీజీ గురించి సమాచారం కనిపించింది.' అన్నాడు సూర్య.

'అలాగా' అన్నాను.

ఏమీ తోచక ఇంటర్ నెట్లో లేజీగా వెదకడమే చాలాసార్లు మనిషిని చెడగొడుతూ ఉంటుంది. నా బ్లాగు కూడా ఇలాగే చాలామందికి కనిపిస్తూ ఉంటుంది.

'చుండూరి సోమేశ్వర్ అని ఒకాయనున్నాడు. ఆయన ఈ స్వామీజీకి వీరభక్తుడు. ఆయనొక వీడియో చేసి నెట్లో పెట్టాడు. అందులో ఈయన్ని "నడిచే శంకరాచార్య - పాకే ప్రత్యంగిరానంద" అంటూ తెగ పొగిడాడు.' అన్నాడు.

'అదేంటి? పాకే ప్రత్యంగిరానందా? అలా పెట్టాడేంటి?' అడిగాను నవ్వుతూ.

'బహుశా ప్రాసకోసం అలా పెట్టి ఉంటాడు. పైగా స్వామీజీ చేతిలో ఒక కర్రతో మెల్లిగా పాకుతున్నట్లే నడుస్తాడు' అన్నాడు సూర్య.

'సో ! ఆ వీడియో చూచి నువ్వు ఫ్లాట్ అయిపోయావన్నమాట' అన్నాను.

'ఊ! అదే మరి నా ఖర్మ! అదీగాక మా కజిన్ బాలాజీ కూడా ఈయన గురించి గొప్పగా చెప్పాడు' అన్నాడు.

'మీ కజిన్ కి ఎంతమంది స్వామీజీలతో సంబంధాలున్నాయి?' అడిగాను నవ్వుతూ.

'వాడికి చాలామంది తెలుసు.' అన్నాడు.

'సరే. ఏం చెప్పాడెంటి బాలాజీ ఈయనగురించి?' అడిగాను.

'ఈయన మహా మాంత్రికుడట. చేతబడులు వదిలిస్తాడట. దయ్యాల్ని పారద్రోలతాడట. వశీకరణం కూడా వచ్చట. పూర్వజన్మలు తెలుసట. ఇంకా ఇలాంటివే ఏవేవో చెప్పాడు' - అన్నాడు.

'అవన్నీ నువ్వు నమ్మావా?' అడిగాను.

'నమ్మలేదు. కానీ పుస్తకంలో స్వామీజీ వ్రాసుకున్నాడు. 400 ఏళ్ళ తర్వాత తను హైదరాబాద్ లో పుడతానని అప్పట్లోనే బుద్దాశ్రమంలో చెట్టుమీద ఒక కోతి మిగతా కోతులతో చెప్పిందట' అన్నాడు.

'ఈ సోది సర్లేగాని, స్వామీజీ అన్నావ్ కదా? మరి ఈ మంత్రగాడి వేషాలేంటి? సంప్రదాయ స్వామీజీలకు ఉండాల్సిన లక్షణాలు ఇవికావు కదా?' అడిగాను.

'వాళ్ళు పనికిరాని వాళ్ళనీ, తాను నిజమైన శక్తి ఉన్నవాడిననీ, స్వామీజీ అయినప్పుడు ఇతరుల బాధలు తీర్చాలనీ ఈయన అంటాడు. ఈయన చాలా మహిమలు కూడా చేశాడని ఆ బుక్కులో వ్రాశారు.' అన్నాడు.

'ఏం చేశాదేంటి మహిమలు?' అడిగాను.

'ఈయనొకసారి లేటుగా ఎయిర్ పోర్టుకు వచ్చాడట. ఈయన ఎక్కాల్సిన విమానం టేకాఫ్ అయి వెళ్ళిపోయి అప్పటికే అరగంట అయిందట. విమానం వెళ్ళిపోయిందని వాళ్ళు చెబితే ఈయన నవ్వి ప్రత్యంగిరా మంత్రాన్ని జపిస్తూ లాంజ్ లొ కూచున్నాడట. ఈలోపల, ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం, పైలట్ పట్టు తప్పి, ఎవరో నడుపుతున్నట్లు వెనక్కి తిరిగి, రూటు మార్చుకుని, ఇదే ఎయిర్ పోర్ట్ కి వచ్చి దిగిందట. స్వామీజీ చిద్విలాసంగా నవ్వుతూ విమానం ఎక్కాక మళ్ళీ టేకాఫ్ అయిందట. ఇదంతా బుక్కులో వ్రాశారు.' అన్నాడు.

'ఈ చెత్తంతా నువ్వు నిజంగా నమ్ముతున్నావా?' అడిగాను సీరియస్ గా.

'లేదనుకో. కానీ ఆ బుక్కంతా ఇలాగే ఉంది. కాసేపు రిలాక్సేషన్ కోసం సరదాగా చదువుతూ నవ్వుకుంటున్నా అంతే! ఇంకా ఉంది విను. విమానం వెళ్ళిపోయిందని చెప్పి స్వామీజీని లోపలకు రానివ్వని ఎయిర్ పోర్ట్ స్టాఫ్ రక్తం కక్కుకుని ఈ శిష్యుల కళ్ళముందే చనిపోయిందట.' అన్నాడు.

'అదేంటి? ఆమె తప్పేముంది అందులో? ఫ్లైట్ టైముకి నువ్వు రావాలి. అంతేగాని అది వెళ్ళిపోయిన గంటకు లార్డులాగా వచ్చి తను చేసిన తప్పుకి అక్కడ స్టాఫ్ కి శాపాలు పెడతానంటే అదేమి దివ్యత్వం నా బొందలా ఉంది. ఇలాంటి చెత్త వ్రాసినవాడిని అనుకోవాలి ముందు' అన్నాను.

'ఈయన స్పీచులూ ఈయన భక్తుల వ్రాతలూ అన్నీ ఇలాగే చవకబారు మహిమలతో కూడుకుని ఉంటాయి.' అన్నాడు సూర్య.

'బాబోయ్! నేనిక భరించలేనుగాని ఆపు. ఈ కట్టుకథలు ఎలా నమ్ముతున్నారో జనం?' అడిగాను విసుగ్గా.

'నమ్మడమేంటి? మనం ఇలా మాట్లాడుతున్నామని తెలిస్తే మనల్ని రాళ్ళతో కొట్టి చంపుతారు. అంత వీరభక్తులున్నారు ఈయనకు. అంతేకాదు. ఇంకా ఉన్నాయి విను. వాజపేయిగారికి ఒక సమయంలో దయ్యం పడితే ఈయన హోమం చేసి వదిలించాదట. ఆ బుక్కులో వ్రాసుంది.' అన్నాడు సూర్య.

'వాయ్యా !' అని అరుస్తూ జుట్టు పీక్కోవాలని బలంగా అనిపించింది. ఆ చాన్స్ మనకు లేదుగనుక చేతిలో ఉన్న పేపర్ని పరపరా చించి పారేసి కసితీర్చుకున్నా.

'ఇవన్నీ చదివి కూడా మళ్ళీ ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లావు చూడు! అక్కడ నీకు హాట్సాఫ్ ' అన్నా.

'ఏం చెయ్యను? ఫిట్టింగ్ పెట్టాడు కదా?' అన్నాడు నీరసంగా.

'ఏం పెట్టాడు?' అడిగాను.

'మొదటిసారి మా అబ్బాయిని తీసుకుని ఆయన బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళినపుడే ఒక మాటన్నాడు.'మీ ఇంట్లో దోషం ఉంది. అందుకే మీకు చిన్నవయసులోనే షుగర్ వచ్చింది' అన్నాడు.

'అదేంటి నీకు షుగర్ ఉన్నట్టు ఆయనకెవరు చెప్పారు?' అడిగాను.

'నేనే చెప్పాను. ఏదో మాటల సందర్భంలో చెబితే ఇక దాన్ని పట్టుకుని "మీ ఇంట్లో దోషం ఉంది నేను చూడాలి" అని బ్లాక్ మెయిల్ మొదలెట్టాడు.' అన్నాడు సూర్య.

'ఏంటి కొంపదీసి మీ ఇంటికి తీసికెళ్లావా?' అడిగాను.

'అవును. అదీ అయింది ఒకరోజున.' అన్నాడు సూర్య.

'ఏమన్నాడు మీ ఇల్లు చూచాక?' అడిగాను.

'నువ్వు చెబితే ఆశ్చర్యపోతావని ఇందాక అన్నాను కదా? ఆ ఘట్టం ఇప్పుడొచ్చింది. కాస్త గట్టిగా దేన్నైనా పట్టుకుని విను పడిపోకుండా' అన్నాడు.

'సరే చెప్పు.' అన్నాను నవ్వుకుంటూ.

'మా ఇంట్లోకి అడుగు పెడుతూనే సడన్ గా కాలు వెనక్కు తీసుకుని స్టన్ అయినట్లు బయటే ఉండిపోయాడు కాసేపు. అక్కడే మాకు భయం వేసింది' అన్నాడు సూర్య.

'ఇది చాలా పాత టెక్నిక్. 'చంద్రముఖి' సినిమాలో రామచంద్ర సిద్ధాంతి ఇదే చేశాడు. చూడలేదా నువ్వు?' అడిగాను.

'నువ్వు జోకులాపు. మా గడపలో ఆయనిచ్చిన ఎక్స్ ప్రెషన్ కి మాకందరికీ చెమటలు పట్టాయి' అన్నాడు.

ఆ సీన్ ఊహించుకుంటే భలే నవ్వొచ్చింది.

'సరే ఏమైందో చెప్పు?' అన్నాను ఆత్రుతగా.

'కాసేపటికి లోపలకొచ్చి కూచున్నాడు. అప్పుడు చల్లగా ఈ విషయం చెప్పాడు. ఎప్పుడో చనిపోయిన మా ముత్తాత దయ్యమై మా ఇంట్లోనే ఉన్నాడుట. మా ఇంటి అటకలో ఆయన కూచుని ఉన్నాడని, తను లోపలకొస్తుంటే వద్దని ఉగ్రంగా అరిచాడని చెప్పాడు స్వామీజీ' అన్నాడు.

పడీ పడీ నవ్వాను.

'నీకు బాధేసి ఉండాలే చాలా దారుణంగా?' అడిగాను సింపతీ వాయిస్ పెట్టి.

'అవును. నేనూ మా ఆవిడా హాయిగా ఏసీ బెడ్రూములో డబల్ బెడ్ మీద నిద్రపోతుంటే మా ముత్తాత అలా అటకమీద కూచుని ఉంటే బాధగా ఉండక ఇంకేముంటుంది? ' అన్నాడు సూర్య ఏడుపు గొంతుతో.

'దీనికి ఇంత బాధపడాల్సినది ఏముంది? వెరీ సింపుల్' అన్నాను.

'ఎలా?' అడిగాడు.

'ఏముంది? మీ ముత్తాతని బెడ్రూంలో పడుకోబెట్టి నువ్వూ మీ ఆవిడా అటకెక్కి కూచుంటే సరి ! ప్రాబ్లం సాల్వ్' అన్నాను నవ్వుతూ.

'నేనింత బాధగా చెబుతుంటే నీకు జోకులుగా ఉందా?' అన్నాడు సూర్య కోపంగా.

'సర్లే సర్లే కోప్పడకు. ఆ తర్వాత స్వామీజీ ఏమన్నాడు?' అడిగాను.

'మీ ఇంటి నడిబొడ్డులో హోమం చెయ్యాలి. నేనే చేస్తాను. అప్పుడు అటకమీదున్న మీ ముత్తాతకు మోక్షం వచ్చేస్తుంది. అన్నాడు స్వామీజీ' చెప్పాడు సూర్య.

'పోన్లే పాపం! హోమం ఫ్రీనేగా?' అడిగాను.

'అబ్బా ! మసాలా దోశేం కాదూ? అయిదు లక్షలౌతుందని చెప్పాడు?'

'అవునా? మరి చేయించావా ఏంటి కొంపదీసి?' అడిగాను.

'అదే ఆలోచిస్తున్నాను. మా ఆవిడేమో వద్దంటోంది. నాకేమో పోనీలే చేయిద్దాం అనిపిస్తోంది.' అన్నాడు.

'అదేంటి? ఆమె అలా అంటోందా?' అడిగాను.

'అవును. మా ఆవిడకు మా వైపు వాళ్ళంటే అస్సలు పడదు. ఎప్పుడో చచ్చినవాళ్ళ గురించి ఇంత బాధేంటి? ఏమీ వద్దు. అంటోంది తను.' అన్నాడు.

'నీకంటే మీ మిసెస్సే ప్రాక్టికల్ గా ఉంది సూర్యా' అన్నాను.

'నిన్నటిదాకా నేనూ ప్రాక్టికలే. స్వామీజీ కొట్టిన ఈ సెంటిమెంట్ దెబ్బతో కూలబడ్డాను. ఇప్పుడెం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఆ అటక వైపు చూసినప్పుడల్లా భయం వేస్తోంది.' అన్నాడు సూర్య నీరసంగా.

(ఇంకా ఉంది)