“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, ఆగస్టు 2018, బుధవారం

'సెల్ ఫోన్ పోయింది' - ప్రశ్నశాస్త్రం

మీ జీవితంలో అతి ముఖ్యమైన వస్తువేది అని ఇప్పుడెవర్నైనా అడిగితే అందరూ - 'మొబైల్ ఫోన్' అంటూ ఒకేమాట చెబుతున్నారు. చాలామంది ఆడాళ్ళు కూడా, మెళ్ళో ఉన్న మంగళసూత్రం ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా బాధపడటం లేదుగాని సెల్ ఫోన్ మర్చిపోతే మాత్రం తెగ గాభరా పడిపోతున్నారు. చార్జర్ మర్చిపోతే ఇంకా హైరాన పడిపోతున్నారు. అంతగా ఈ రెండూ మన జీవితాలలో ముఖ్యమైన భాగాలై పోయాయి.

13-8-2018 న మధ్యాన్నం 11-45 కి ఒకరు ఈ ప్రశ్న అడిగారు.

'కొన్ని రోజులక్రితం మా సెల్ ఫోన్ పోయింది. మాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది. వారిలో ఎవరో చెప్పగలరా?'

'చెబితే ఏం చేస్తారు?' అడిగాను.

'ప్రస్తుతం ఏమీ చెయ్యలేము. ఊరకే తెలుసుకుందామని.'

'ఊరకే తెలుసుకుని చేసేదేమీ లేదు. కనుక ఈ ప్రశ్న చూడను.' అన్నాను.

'ప్లీజ్ ప్లీజ్. కొద్దిగా చూడండి. అది దొరికినా దొరక్కపోయినా కనీసం మా మానసిక ఆందోళన అయినా తీరుతుంది.' అంటూ ఆ వ్యక్తి చాలా బ్రతిమిలాడిన మీదట తప్పక, ప్రశ్న చార్ట్ చూడటం జరిగింది.

ఆరోజు సోమవారం. శుక్రహోరలో ప్రశ్న అడుగబడింది. మొన్న కాలేజీలో కూడా ఇదే హోరలో ప్రశ్న వచ్చింది. కానీ ఆ రోజు వారం వేరు. వారం మారినా అదే హోరలో ప్రశ్న రావడానికి శుక్రుని బలమైన నీచస్థితి కారణం. దశ గమనించాను. శుక్ర-శని-శుక్రదశ జరుగుతున్నది.

'మీకు అనుమానం ఉన్న ఒక మనిషి బ్రాహ్మణకులానికి చెందినవాడు' అన్నాను చార్ట్ చూస్తూనే.

'ఎలా చెప్పారు' అడిగాడా వ్యక్తి కుతూహలంగా.

'ఎలా చెప్తే మీకెందుకు? అవునా కాదా?' అడిగాను.

'అవును' అన్నాడు.

'అతనే మీ ఇంటికొచ్చి సెల్ ఫోన్ దొంగిలించాడని మీ అనుమానం. ఇది మీ ఇంట్లోనే జరిగింది. బయట కాదు.' అన్నాను.

'నిజమే' అన్నాడు.

'మీరు అనుమాన పడుతున్న రెండోవ్యక్తి మీ పనిమనిషి. నిజమా కాదా?' అన్నాను.

అడిగిన వ్యక్తి నోరెళ్ళబెట్టాడు.

'నిజమే' అన్నాడు.

'తీసింది పనిమనిషే. మొదటివ్యక్తి కాదు.' అన్నాను.

'ఎలా చెప్పగలిగారు?' అడిగాడు.

'ఈ శాస్త్రానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఇందులో ప్రవేశం లేకపోతే అవి మీకు అర్ధం కావు' అన్నాను.

'అర్ధం చేసుకోడానికి ట్రై చేస్తాను. చెప్పండి.' అన్నాడు.

'షష్టాధిపతి గురువు బ్రాహ్మణుడు. అతను లగ్నంలోకొచ్చి ఉన్నాడు. అంటే దొంగ మీ ఇంటికి వచ్చి దొంగతనం చెయ్యాలి. అదే జరిగిందని మీరు అనుమానిస్తున్నారని ఇది చెబుతోంది. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే ఆరూఢలగ్నం సింహం అయింది. అక్కడనుంచి షష్టాధిపతి శనీశ్వరుడు అయ్యాడు. ఆయన పనివాళ్ళను సూచిస్తాడు. ఆయన వక్రించి మీ చతుర్ధంలోకి వస్తాడు. అంటే ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తాడు. గురువుకు తులకంటే, శనికి వృశ్చికం చాలా ఇబ్బందికర ప్రదేశం. పైగా. సెల్ ఫోన్ అనేది కమ్యూనికేషన్ ను సూచిస్తుంది. అంటే తృతీయంతో సంబంధం ఉండాలి. తులాలగ్నం నుంచి గురువు తృతీయానికి అధిపతే. కానీ, సింహం నుంచి అయితే, తృతీయాదిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో నీచలో ఉంటూ, విలువైన వస్తువులను అందులోనూ కమ్యూనికేషన్ కు పనికొచ్చే విలువైన వస్తువులు పోవడాన్ని సూచిస్తున్నాడు. ఆ శుక్రుని మీద దొంగ అయిన శనీశ్వరుని దశమ దృష్టి కూడా ఉన్నది. అంటే, మీ పనిమనిషి కన్ను ఈ సెల్ ఫోన్ మీద ఉన్నదని అర్ధం. పైగా, మనస్సుకు దాని దుర్బుద్ధికీ సూచకుడైన చంద్రుడు కూడా ఆరూఢలగ్నంలోనే ఉన్నాడు. కనుక సింహలగ్నం నుంచి సరిపోయినట్లు తులాలగ్నం సరిపోవడం లేదు. పైగా, దశాధిపతులు కూడా శనిశుక్రులే అయ్యారు. కనుక సింహలగ్నమే ఎనాలిసిస్ కు కరెక్ట్. కాబట్టి, లగ్నంలో ఉన్న గురువును బట్టి, మీ అనుమానం మొదటి వ్యక్తిమీద బలంగా ఉన్నప్పటికీ, తీసినది మాత్రం రెండో వ్యక్తే.' అన్నాను.

'ఆ ఇద్దరూ ప్రస్తుతం ఎక్కడున్నారో చెప్పగలరా?' అడిగాడు.

'ఆ బ్రాహ్మిన్ వ్యక్తి ప్రస్తుతం మీ ఇంటి దగ్గర లేడు. వెళ్ళిపోయాడు.' అన్నాను మేషంలో శనికి నీచస్థానంలో ఉన్న గురువును నవాంశలో గమనిస్తూ.

'నిజమే. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు' అన్నాడు.

'మీ పనిమనిషి కూడా ఇప్పుడు మీ ఇంట్లో పని మానేసింది.' అన్నాను వక్రత్వంలో ఉన్న శనీశ్వరుడిని గమనిస్తూ.

'నిజమే. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మానేసింది.' అన్నాడు.

'మరి ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నారు?' అడిగాను.

'ఏమీ చెయ్యను. కొత్త ఫోన్ వెంటనే కొనుక్కున్నాను. ఏది లేకపోయినా బ్రతగ్గలం గాని ఫోన్ లేకపోతే బ్రతకలేం కదా !' అన్నాడు.

'మంచి జీవితసత్యాన్ని గ్రహించారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి' అన్నాడు.

'సరే. థాంక్సండి.' అంటూ అతను వెళ్ళిపోయాడు.