“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, ఆగస్టు 2018, సోమవారం

బ్లాగు భేతాళ కధలు - 2 (వాళ్ళిద్దరి అభిరుచులూ ఒకటే)

మొన్నొకరోజున సీరియస్ గా యోగాభ్యాసం చేస్తూ ఉండగా ఫోన్ మ్రోగింది.

శీర్షాసనంలోనే ఉండి ఫోన్ తీసుకుని 'హలో' అన్నా.

'నేను సూర్యని' అన్నాడు.

'ఊ! చెప్పు. ఏంటి కొత్త కధ?' అన్నాను.

'ఏంటి వాయిస్ ఎక్కడో బావిలోనించి వస్తున్నట్టుంది?' అన్నాడు.

'అవును. బావిలో శీర్షాసనం వేస్తున్నా. అందుకే అలా ఉంది వాయిస్' అన్నాను.

'నీకు జోకులు మరీ ఎక్కువయ్యాయి. సర్లేగాని, నాకొక ధర్మసందేహం వచ్చింది. నువ్వు ఆన్సర్ చెయ్యాలి' అన్నాడు.

'ఆన్సర్ చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలౌతుంది అని శాపం పెడతావా ఏంటి?' అన్నా.

'అంత శక్తి నాకు లేదులేగాని, ఇద్దరి అభిరుచులూ చక్కగా కలిశాయని అబ్బాయీ అమ్మాయీ మురిసిపోతూ పెళ్లి చేసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి?' అడిగాడు.

'అదంతా ట్రాష్. అలాంటివి ఏవీ ఉండవు.' అన్నాను.

'హుమ్,,,' అని మూలిగాడు సూర్య.

'ఏంటి అంతలా మూలిగావ్? ఏమైంది?' అడిగాను శీర్షాసనం నుంచి దిగుతూ.

'ఏమీ కాలేదు. బానే ఉన్నాను. నువ్వు చెప్పిన ఆన్సర్ కి నీరసం వచ్చింది.' అన్నాడు.

'ఎందుకంత నీరసం? ఇంతకీ నువ్వడిగిన ప్రశ్న నీ కపోల కల్పితమా?  లేక వేరేవాళ్ళ కపాల లిఖితమా?' అడిగాను.

'రెండోదే. చెప్తా విను. మా అమ్మాయి అమెరికాలో ఉందని నీకు తెలుసు కదా ! దానికి ఇద్దరు అమెరికా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకబ్బాయి ఒకమ్మాయి. వాళ్ళిద్దరి అభిరుచులూ ఒకటే. ఇద్దరి అభిమాన హీరోలూ ఒకరే. ఇద్దరూ  ఇష్టపడే కార్ల బ్రాండూ, హోటలూ, తిండీ,  డ్రస్సులూ, చివరకు పిక్నిక్ స్పాట్లూ, టీవీ చానల్సూ అన్నీ ఒక్కటే. అంతలా వాళ్ళ అభిరుచులు కలసి పోయాయి. అందుకని ఒకరినొకరు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.' అన్నాడు సూర్య.

విపరీతమైన నవ్వొచ్చింది నాకు.'  'హహ్హహ్హ...' అంటూ పెద్దగా నవ్వేశాను. 

'ఎందుకలా విలన్లా నవ్వుతున్నావ్? నవ్వకు. అసలే యోగా చేస్తున్నావ్. కొరబోతుంది.' అన్నాడు సూర్య.

'ఏం పోదులే గాని. తర్వాతేమైఁదో  నేను చెప్తా విను. నాలుగేళ్ళు తిరిగీ తిరక్కుండానే వాళ్ళు డైవోర్స్ తీసుకున్నారు.' అన్నా చక్రాసనం వెయ్యడానికి రెడీ అవుతూ.

కెవ్వ్ మని కేక వినిపించింది అటువైపు నుంచి.

నాకు భయం వేసింది.

'ఏమైంది సూర్యా ! ఎందుకలా అరిచావ్ ?' అడిగాను కంగారుగా.

'ఏం కాలేదు. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావ్? నీకేవో శక్తులున్నాయని నాకు మొదట్నించీ అనుమానం. అదిప్పుడు నిజమౌతోంది. నువ్వన్నట్టుగానే వాళ్ళు సరిగ్గా నాలుగేళ్ళకి విడిపోయారు.' అన్నాడు.

'పోతే పోయార్లే ! కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే మంచిది. ఎవరి బ్రతుకు వాళ్ళు హాయిగా బ్రతకొచ్చు. ఈ మాత్రం చెప్పడానికి శక్తులు అక్కర్లేదు. సైకాలజీ తెలిస్తే చాలు. సర్లేగాని, వేరే టాపిక్ ఏమీ లేదా మనం మాట్లాడుకోడానికి?' అడిగాను చక్రాసనంలో నడుమును బాగా వంచుతూ.

'ముందు నా సందేహానికి సమాధానం చెప్తే ఇంకో టాపిక్ లోకి వెళతా' అన్నాడు.

తను  ఏం అడగబోతున్నాడో అర్ధమైనా తెలీనట్టు ' ఏంటి నీ సందేహం?' అన్నాను.

'అదే ! అంత ఇష్టపడి, ఒకరి అభిరుచులు ఒకరికి బాగా కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు నాలుగేళ్ళలో ఎందుకు విడిపోయారు? దీనికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ యోగా షెడ్యూల్ చెడిపోతుంది.' అన్నాడు సూర్య నవ్వుతూ.

'చాలా సింపుల్ సూర్యా ! నీ ప్రశ్నలోనే జవాబుంది. అంతగా ఒకరి  అభిరుచులను ఒకరు ఇష్టపడి చేసుకున్నారు గనుకనే విడిపోయారు' అన్నాను.

'అదేంటి? నీ జవాబు ఏదో కన్ఫ్యూజింగ్ గా ఉంది. కొంచం వివరించుము' అన్నాడు సూర్య.

'ఇందులో కన్ఫ్యూజింగ్ ఏమీ లేదు. సరిగ్గా  అర్ధం చేసుకుంటే చాలా సింపుల్. వాళ్ళు ఇష్టపడినది అభిరుచులని. అంతేగాని ఒకరినొకరు ఇష్టపడలేదు. కనుకనే విడిపోయారు. అభిరుచులు ఈరోజున్నట్లు రేపుండవు. మారుతూ  ఉంటాయి. కానీ మనుషులు ఒక్కలాగే ఉంటారు. వ్యక్తిని ఇష్టపడాలి గానీ రంగును, అందాన్ని, ఆస్తిని, హాబీలను, అభిరుచులను కాదు. ఇవన్నీ కొన్నాళ్ళకు మారిపోతాయి. కానీ మౌలికంగా ఆ మనిషి మారడు. ఆ మౌలికత్వాన్ని, అంటే, essential person ను ఇష్టపడితే ఈ బాధ ఉండదు. అప్పుడు జీవితాంతం కలిసే ఉంటారు.

ఇంకో సంగతి చెబుతా విను. పెళ్లి కాకముందు ఒకరినొకరు ఎంత అర్ధం చేసుకున్నాం అనుకున్నా అది భ్రమ మాత్రమే. ఎందుకంటే, బయటకు కనిపించే మనిషి వేరు. లోపల ఉండే మనిషి వేరు. బయటకు కనిపించే హాబీలు అభిరుచులలో ఆ లోపల మనిషి కనిపించడు. పెళ్ళయ్యాక రోజులు గడిచే కొద్దీ ఆ నిజస్వరూపాలు కనిపించడం మొదలౌతాయి. క్రమేణా ఒకరంటే  ఒకరికి మునుపటి ఆసక్తీ ఆకర్షణా పోయి విసుగూ విరక్తీ వచ్చేస్తాయి. ఈ క్రమంలో పిల్లలు ఎలాగూ పుట్టేస్తారు కదా. పిల్లలకోసమో, పరువు కోసమో ఇష్టం లేకున్నా కలిసి ఉంటారు. కానీ తమకు నచ్చిన ఇంకొకరిని వెదుకుతూనే ఉంటారు. ఇప్పుడైతే extra marital affairs ఇండియాలో కూడా ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తున్నాయి. దానికి soul mate అని కొత్త నామకరణం చేశారు. అదొక గోల !

అమెరికాలో ఇలాంటి హిపోక్రసీ లేదు కదా !  వాళ్లకు నచ్చకపోతే విడిపోతారు. అంతే ! నువ్వు చెబుతున్నవాళ్ళు అదే చేశారు. నా దృష్టిలో అలా విడిపోవడం మంచిదే ! ఒకరికొకరు నచ్చనప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకే కప్పు క్రింద బ్రతకడం కంటే, విడివిడిగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడమే మంచిది.

నేను చెప్పిన essential person  ను ప్రేమించే కిటుకు తెలిస్తే ఏ బాధా లేదు. ప్రతివారిలోనూ కొన్ని లోపాలుంటాయి. మనకు నచ్చని కొన్ని కోణాలు తప్పకుండా   ఉంటాయి. వాటిని అర్ధం చేసుకుని సర్దుకుపోవడమే జీవితం. మరీ ఇక తట్టుకోలేనంత విభేదాలున్నపుడు విడిపోక తప్పదనుకో! కానీ హాబీలు కలవలేదనో, ఒకరికి కాఫీ ఇష్టమైతే ఇంకొకరికి టీ ఇష్టమనో, ఒకరికి వంకాయ ఇష్టమైతే ఇంకొకరికి బెండకాయ ఇష్టమనో, ఇలాంటి సిల్లీ విషయాలకు విడిపోవడం అమెరికాలో సహజమే కదా ! మనకు అలా ఉండదు.   మనకు సర్దుకుపోవడం ఎక్కువ. అమెరికాలో రిజిడిటీ ఎక్కువ. అందుకనే వాళ్ళు విడిపోయారు.

వాళ్ళ అభిరుచులను ఇష్టపడటం కాకుండా ఒకరినొకరు ఇష్టపడి ఉంటే వాళ్ళు కలిసే ఉండేవారు. ఎందుకంటే 'అభిరుచి' అంటేనే expectation కదా! అంటే, "నేననుకున్నట్టు ఎదుటి మనిషి ఉండాలి" అనుకోవడమే కదా హాబీలు అభిరుచులు కలవడం అంటే. అన్ని expectation లూ జీవితాంతం మారకుండా అలాగే ఎక్కడా ఉండవు. అవి మారినప్పుడు, ఆ ఎదుటివ్యక్తి కూడా మనకనుగుణంగా మారాలని ఆశించడమే అసలైన తప్పు.  అలా జరగనప్పుడు ఒకరంటే ఒకరికి    విసుగు పుట్టడం సహజమే. వీళ్ళ కేస్ లో అదే జరిగింది. అమెరికన్స్ గనుక విడిపోయారు. అంతే ! వెరీ సింపుల్ !" అన్నాను.

'అయితే, హాబీలు నచ్చడం ముఖ్యం కాదు. ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, సర్దుకోవడం ముఖ్యం అంటావ్" అన్నాడు.

'అంతే ! రుచులూ అభిరుచులూ కలిస్తే సరిపోదు. మనసులు కలవాలి. అదే ముఖ్యం.' అన్నాను శవాసనంలోకి మారుతూ.

'అంత మానసిక పరిణతి ఇప్పటి కుర్రకారుకు ఎలా వస్తుంది? రాదుకదా?' అన్నాడు.

'రాదు కాబట్టే, నూటికి ఏభై పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి ప్రస్తుతం' అన్నాను.

"మరి దీనికేంటి పరిష్కారం?' అన్నాడు.

'వెరీ సింపుల్! రోజూ నాలా యోగా చెయ్యడమే' అన్నాను నవ్వుతూ.

'మళ్ళీ మొదలుపెట్టావా నీ జోకులు?' అన్నాడు సీరియస్ గా.

'పోనీ ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది.  వాళ్ళిద్దర్నీ నా శిష్యులుగా మారమని చెప్పు. అప్పుడు కరెక్ట్ గా ఎలా బ్రతకాలో వాళ్లకు ట్రెయినింగ్ ఇస్తాను. నీకీ మధ్యవర్తిత్వం బాధా తప్పుతుంది.' అన్నాను.

'రెండూ జరిగే పనులు కావులే గాని. నువ్వు  యోగా చేసుకో. నాకు వేరే పనుంది.' అన్నాడు.

'నాకూ పనుంది. నువ్వు ఫోన్ పెట్టేయ్' అంటూ నేను ప్రాణాయామం మొదలుపెట్టాను.

సూర్య ఫోన్ కట్ చేశాడు.