“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, ఆగస్టు 2018, సోమవారం

సాధనా సమ్మేళనం - ఆగస్ట్ - 2018 విశేషాలు

తిధుల ప్రకారం ఆగస్ట్ నాలుగు (ఆషాఢ బహుళ సప్తమి) నా పుట్టినరోజు అయింది. అందుకని నాలుగు అయిదు తేదీలలో సాధనా సమ్మేళనం పెట్టుకున్నాం. మామూలుగా అయితే శ్రీశైలంలోనో, లేదా ఇంకెక్కడో జరిగేది. కానీ ఈసారి మన సభ్యుల సూచన మేరకు గుంటూరులోనే ఈ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విజయనగరం, కరీంనగర్, కదిరి, మలేషియా మొదలైన చోట్ల నుండి వచ్చిన దాదాపు నలభై మంది పంచవటి సభ్యులతో ఈ రెండురోజుల కార్యక్రమం చాలా బాగా జరిగింది.

మొదటి రోజు ఉదయం ఎనిమిదికి మొదలైన ఈ కార్యక్రమం రాత్రి ఎనిమిది వరకూ యోగాభ్యాసం, ధ్యానం, ఉపన్యాసాలు, సభ్యుల సంభాషణలు, ఆస్ట్రో వర్క్ షాప్, సందేహాలు - సమాధానాలు మొదలైన అనేక interactive కార్యక్రమాలతో నిరాటంకంగా జరిగింది.

రెండవరోజున అందరం కలసి జిల్లెళ్ళమూడి యాత్ర చేసి రావడం, అక్కడ అమ్మ, హైమక్కయ్యల దర్శనం, అమ్మచేతి గోరుముద్దలు తింటున్నామన్న భావనతో అక్కడ భోజనం చెయ్యడం, వసుంధరక్కయ్య, అప్పారావన్నయ్యలతో సమావేశమై వారి ఆశీస్సులు తీసుకోవడం, ఆ తర్వాత పెరేచెర్లలోని పంచవటి సభ్యుడు రామ్మూర్తిగారి ఇంట్లో సమావేశం అయ్యి మాట్లాడుకోవడం, ఆ తర్వాత వెన్యూకి వచ్చి డిన్నర్ చెయ్యడంతో ముగిసింది.

ఈ రెండురోజులూ, సభ్యులకు కలిగిన కలుగుతున్న అనేక సందేహాలకు జవాబులు చెప్పి వాటిని తీర్చడం, ఆధ్యాత్మిక మార్గదర్శనం చెయ్యడం జరిగింది.

కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టాలను ఫేస్ బుక్ ద్వారా అమెరికా సభ్యులకోసం లైవ్ ప్రసారం చెయ్యడం జరిగింది. రాత్రంతా మేలుకుని ఉండి దీనిని వీక్షించిన అమెరికా శిష్యులకు నా కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఇప్పటివరకూ లేని ఎన్నో insights తప్పకుండా కలిగి ఉంటాయని నా నమ్మకం.

"ఈ అనుభవాలను, ఆలోచనలను పోగొట్టుకోకండి. ప్రతిరోజూ వాటిని నెమరు వేసుకోండి. అవి చూపిస్తున్న దారిలో నడచి మీ జీవితాలను ఉజ్జ్వలంగా దిద్దుకోండి. అసలైన ఆధ్యాత్మిక మార్గంలో నడవండి. ప్రపంచం అంతా వెదికినా ఈ మార్గం మీకు దొరకదు. ఎంతోమంది దీనికోసం అలమటిస్తున్నారు. కానీ వారికి దొరకడం లేదు. మీకు దొరికింది. దీని విలువ గ్రహించండి. దీనినుంచి జారిపోయి దురదృష్టవంతులుగా మారకండి. దీనిని సక్రమంగా ఉపయోగించుకోండి" - అని పంచవటి సభ్యులందరినీ కోరుతున్నాను. 

రాబోయే సాధనా సమ్మేళనం డిసెంబర్ - 2018 లో వరంగల్ 'కాకతీయ గ్రాండ్' హోటల్లో జరుగుతుంది. మీకు ప్రస్తుతం నేర్పినవన్నీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తూ రాబోయే సాధనా సమ్మేళనానికి ఈరోజు నుంచే సాధనాపరంగా తయారుగా ఉండమని సభ్యులను కోరుతున్నాను. 

ఈ సమ్మేళనానికి ఎంతో దూరం నుండి ఎంతో కష్టపడి వచ్చిన సభ్యులకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడిన సాధనామార్గంలో ఎదగడానికి, అసలైన ఆధ్యాత్మికమార్గంలో నడవడానికి తయారై, దీక్షాస్వీకారం గావించిన నూతన శిష్యులకు ఆశీస్సులు  తెలియ జేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.