“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, సెప్టెంబర్ 2017, సోమవారం

సమాజ సేవ

'డబ్బుతో ఆనందం రాదు. ప్రేమతో రాదు. విలాసాలతో రాదు. విహార యాత్రలతో రాదు. సేవ చెయ్యడంతోనే ఆనందం వస్తుంది. అందుకని ఇతరులకు సేవ చెయ్యి.' అని మదర్ తెరెసా అందని మొన్న నాతో ఎవరో అన్నారు. నాకు నవ్వొచ్చింది. 'మాయమాటలూ, అబద్దాలూ చెప్పి మతాలు మారిస్తే వొస్తుందా?' అనిపించింది.

'సేవ చెయ్యాలా? ఎవరికీ? ఎందుకూ? ఎలా?' అన్నాను.

అన్ని నీతులలాగే ఈ మాటలు కూడా పైపైన వినడానికి చాలా బాగున్నట్లు అనిపిస్తాయి. కానీ వీటిలో నిజం లేదు. ఒకప్పుడు, అంటే, వందా రెండు వందల ఏళ్ళ క్రితం ఈ మాటల్లో నిజం ఉందేమో? ఎందుకంటే అప్పటి మనుషులలో నిజాయితీ ఎక్కువ పాపభీతి ఎక్కువ. మంచితనం ఎక్కువ. అప్పటి సమాజంలో దరిద్రమూ ఎక్కువే, బాధలూ ఎక్కువే.కనుక అప్పట్లో 'సేవ' అనే పదానికి ఒక అర్ధమూ పరమార్ధమూ ఉండేవి. కానీ ఇప్పుడు కాదు.

అప్పట్లో తినడానికి తిండి ఉండేది కాదు. రోగాలొస్తే మందులకు డబ్బులుండేవి కావు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యేవి కావు. ఉద్యోగాలు దొరికేవి కావు. బ్రతకడానికి ఇప్పుడున్నన్ని అవకాశాలూ అప్పుడు లేవు. అవీ అప్పటి సమస్యలు. మరి ఇప్పుడో?

సెల్ ఫోన్ చార్జర్ మర్చిపోయా. చార్జ్ అయిపోతోంది. అవతల బాయ్ ఫ్రెండ్ / గరల్ ఫ్రెండ్ తో చాటింగ్ లో ఉన్నా. ఎలా? అనేది ఇప్పటి అతి పెద్ద సమస్య. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలను తిరస్కరిస్తున్నారు. ప్రతి బిరియానీ హోటలూ కళకళ లాడుతోంది. ప్రతి బారూ వెలిగిపోతోంది. ప్రతి షాపింగ్ మాలూ జనంతో క్రిక్కిరిసి ఉంటోంది. అవసరం ఉన్నదానికంటే ఎక్కువ మందులే ప్రతివారూ వాడి పారేస్తున్నారు. రోడ్డు పక్కన బజ్జీలు వేసుకునే వాడు కూడా నెలకు లక్ష సంపాదిస్తున్నాడు.

ఇప్పుడు మనుషులలో నిజాయితీ లేదు, స్వచ్చత లేదు, పాపభీతి లేదు, విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు, ఏ మంచి లక్షణమూ లేదు. ఇప్పుడున్నది ఒకటే - అవసరం. ఇంకా చెప్పాలంటే అవసరం కూడా కాదు, దురాశ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది చేదునిజం.

వాడుకున్నంత కాలం ఎదుటి మనిషిని వాడుకోవడం ఆ తర్వాత ఎంగిలి విస్తరాకులా విసరి అవతల పారెయ్యడం. ఇదే ప్రస్తుతం ఏ రంగంలోనైనా జరుగుతున్న అసలైన కధ. ఈ క్రమంలో ప్రేమా, దోమా, నమ్మకమూ, బొమ్మకమూ, విశ్వాసమూ, బొశ్వాసమూ ఈ పదాలన్నీ అర్ధాలను కోల్పోయాయి.

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఇదే మాటను తరచుగా అనేవారు. ఆమెదంతా వాస్తవిక భావనలే గాని ఊహలు కావు. 'ప్రపంచంలో ఉన్నది అవసరం ఒక్కటేరా' అని ఆమె ఎన్నోసార్లు అన్నారు. ఇది అక్షర సత్యం.

అవసరం లేకపోతే ఈ లోకంలో ఎవరూ ఎవరినీ కనీసం పలకరించను కూడా పలకరించరు. ఏదో ఒక పని ఉంటేనే ఎవరైనా ఇంకొకరితో స్నేహంగానీ ప్రేమగానీ ఇంకేదైనా గానీ నటిస్తారు. ఆ అవసరం తీరాక 'నువ్వెవరు?' అన్నట్లు ముఖం పెడతారు. ఇది అనుభవం.

'అవసరం' - అనే బంధం లేకపోతే భార్యాభార్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు,ఇరుగూ పొరుగూ కావచ్చు - ఎవరూ కనీసం మాట్లాడుకోను కూడా మాట్లాడుకోరు. ఇలాంటి పరిస్థితులలో 'సేవ' అనే పదానికి అర్ధం ఎక్కడుంది? సేవ ఎవరికీ? ఎందుకూ?

విచిత్రమేమంటే - ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుది. సామాన్యంగా మనం ఏమనుకుంటామంటే, ఆధ్యాత్మికం అంటే ఏదో ఉన్నతంగా, మానవ నీచత్వాలకు అతీతంగా ఉంటుందని, అక్కడంతా చాలా స్వచ్చంగా ఉంటుందని భావిస్తాం. కానీ అది నిజం కాదు. ఇక్కడున్నంత మురికి అక్కడా ఉంటుంది. ఇక్కడున్నన్ని నాటకాలు అక్కడా ఉంటాయి. కాకపోతే దానికి 'దైవత్వం' అని ఒక ముసుగు వేస్తారు అంతే.

'నువ్వే నా గురువ్వి. నువ్వు దైవంతో సమానం. నీ మాట నాకు వేదవాక్కు. నా తల్లీతండ్రీ అన్నీ నీవే. నువ్వేం చెబితే అదే సత్యం. నీ పాదపద్మాలే నాకు శరణ్యం' ఇలాంటి మాయమాటలు ఎవరైనా చెబుతున్నారూ అంటే అతి త్వరలోనే ఆ వ్యక్తి ఆ గురువుకు ఘోరమైన వెన్నుపోటు పొడవబోతున్నాడని అర్ధం. అంతేకాదు - అతని లోపల్లోపల ఆ గురువంటే అమితమైన ద్వేషమూ, అసూయా, కోపమూ నిండి ఉన్నాయన్నది యోగిక్ సైకాలజీ చెప్పే పచ్చి నిజం.

నిజమైన ప్రేమా విశ్వాసమూ నమ్మకమూ ఉన్నవాళ్ళు మాటల్లో చెప్పరు. చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు ఆ విధంగా ఉంటారు. అంతే. మాటల్లో అతిగా చెబుతున్నారంటే, అదంతా పెద్ద మాయ అని అర్ధం.

ఒకడు తన భార్యతోనో ప్రియురాలితోనో I love you, I love you అని రోజుకు వందసార్లు అంటుంటే అర్ధమేమిటంటే - నిజానికి ఆ ప్రేమ అక్కడ ఏమాత్రమూ లేదని. తనలో ఆ ప్రేమ ఉందో లేదో తెలియని సందిగ్దతలో తన self assurance కోసం, తనకు తాను బూటకపు నమ్మింపు కోసం ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది పచ్చి నిజం.

అలాగే - ఇతరులకు 'సేవ' చెయ్యడంలోనే ఆనందం ఉంది అని చెప్పేవాళ్ళూ ఇంతే. వాళ్లకు లోపల్లోపల ఘోరమైన self guilt ఉంటుంది. ఆ guilt ను కప్పి పుచ్చుకోవడం కోసం 'సేవ' అనే నాటకం ఆడుతూ ఉంటారు. మదర్ తెరెసా అభిమానికి కూడా ఇదే మాట చెప్పాను.

అసలైన నిజం ఏమంటే - లోకం నుంచి గతజన్మలలో మనం ఎంతో దోపిడీ చేసి ఉంటే తప్ప ఈ జన్మలో దానికి 'సేవ' చెయ్యాలని మనకు అనిపించదు. నిజం చెప్పాలంటే - ఒక జన్మలో దోచుకున్నవారే ఈ జన్మలో 'సేవ' చేస్తారు. అలా చేసి ఆ ఋణం తీర్చుకుంటారు. వారికా విషయం తెలీక, మేమేదో గొప్ప సేవ చేస్తున్నాం అన్న భ్రమముసుగులో బ్రతుకుతూ self glorify చేసుకుంటూ ఉంటారు.

ఒకసారి ఒక వివేకానందస్వామి భక్తునితో కూడా ఇదే వాదన జరిగింది.

'స్వామి, సేవకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మీరు ఆయన అభిమానియై ఉండి ఇలా మాట్లాడతారేమిటి? అన్నాడు ఒక మిత్రుడు.

'ఏమన్నావ్? నేను ఆయన అభిమానినా? ఏం వాగుతున్నావ్? నాకెందుకా ఖర్మ?' అన్నాను.

అతను బిత్తరపోయాడు.

'అదేంటి అలా అంటున్నావ్?' అన్నాడు.

'అవును. అభిమాని అనే పదం ఏమిటి? ఆయనేమన్నా సినిమా నటుడా నేనాయన అభిమానిని కావడానికి? ఆయన నా దైవం. అభిమానం అనేది చాలా తక్కువ మాట. మాటలు సరిగ్గా వాడు' అన్నాను.

'ఓకే. ఆయన నీ దైవం అయినప్పుడు మరి ఆయన చెప్పిన సేవ అనే కాన్సెప్ట్ ను నువ్వెలా విమర్శిస్తున్నావ్?' అడిగాడు.

'ఒక సీక్రెట్ చెప్తా విను.' గొంతు తగ్గించి చిన్నగా అన్నా.

'ఏంటి?' అన్నాడు తనూ గుసగుసగా.

'నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఈ రహస్యం చెబుతున్నా. ఎవరికీ చెప్పకు' అన్నా.

'ప్రామిస్. చెప్పను.' అన్నాడు చేతిలో చెయ్యి వేస్తూ.

'వారానికొకసారి వివేకానందస్వామి నాతో టెలీ కాన్ఫరెన్స్ లోకి వస్తూ ఉంటాడు. ఆయనే ఈ మాట చెప్పాడు.' అన్నాను.

అతని మొఖంలో భావం మారిపోయింది. అయోమయంగా చూశాడు.

'నమ్మలేవా? నీ ఖర్మ. అంటే ఫోన్లో కాదు. కలలో వచ్చి నాతో మాట్లాడి పోతూ ఉంటాడు. మొన్నోకసారి తనే ఇలా చెప్పాడు. "నేను బ్రతికి ఉన్నప్పుడు సేవ అనేది చాలా గొప్పది అనుకునేవాడిని. కానీ నా జీవితం చివరి దశలో నాకా నమ్మకం పోయింది. రెండో సారి అమెరికా యూరప్ అంతా తిరిగి వచ్చాక నా భావాలు చాలా మారిపోయాయి. ప్రపంచమంతా కుళ్ళు తప్ప ఇంకేమీ లేదని నేను నిశ్చయానికి వచ్చాను. ఈ కుళ్ళును ఎంత కడిగినా అది తగ్గదు. పోదు. కనుక మనకనవసరం అని నమ్మాను. ఈ విషయాన్నే నా సోదర శిష్యులతో నా చివరి దశలో చెప్పాను కూడా. వాళ్ళూ అదే మాటను నాతో అన్నారు.' అని నాతో పర్శనల్ గా ఆయనే చెప్పాడు అన్నాను కళ్ళు పెద్దవి చేస్తూ.    

'నేన్నమ్మను' అన్నాడు సీరియస్ గా.

'నువ్వు నమ్మితే ఎంత? నమ్మకపోతే ఎంత? అది నా కల. అది మా మధ్యన నడిచిన సంభాషణ. నేన్నమ్ముతాను. అది చాలు నాకు. పైగా చూశావా? నిజం చెబితే నువ్వే నమ్మటం లేదు. ఇంక లోకం ఎలా నమ్ముతుంది? కనుక ఆయన చెప్పింది నిజమే. లోకానికి అబద్దాలే కావాలి గాని నిజాలు కావు. లోకులంతా అబద్దపు బ్రతుకులే బ్రతుకుతున్నారనీ, వాళ్ళను మార్చడం అసాధ్యమనీ ఆయన చెప్పింది నీ కేసులోనే రుజువైంది. కనుక ఆయన చెప్పింది నిజమే.నా కొచ్చే కలలు కూడా నిజమే.' అన్నాను.

'అయితే లోకానికి సేవ చెయ్యడం అక్కరలేదా?" అన్నాడు.

'అస్సలక్కర్లేదు. మనది మనం కడుక్కుంటే చాలు' అన్నా మోటుగా.

'ఏంటో నీ గోల !! ఒకసారేమో సేవే గొప్పదంటావు. ఇంకోసారి సేవ వేస్ట్ అంటావు. అంతా అయోమయంగా ఉంది నీ తీరు.' అన్నాడు.

'నేను ఎప్పుడేది చెబితే అప్పటికదే నిజం. నా మాటలు వినాలంటే అలా ఉంటేనే వీలౌతుంది. నీ మనసును నువ్వు ఫాలో అవుతూ నన్ను కూడా ఫాలో అవ్వాలంటే కుదరని పని. ఎందుకంటే నా మనసును నేనే నమ్మను. కనుక నన్ను నమ్మాలంటే నీ మనసునూ నువ్వు నమ్మకూడదు. అంతేకాదు నేను చెప్పేవి కూడా పర్మనెంట్ గా నమ్మకూడదు. నేనో కొత్తది చెప్పేవరకూ పాతది నమ్మాలి. అదికూడా ఇంకో కొత్తది చెప్పనంతవరకే. ఆ తర్వాత దాన్నీ మర్చిపోవాలి. ఇలా పాతవి వదిలేస్తూ కొత్తవి ఒప్పుకుంటూ మళ్ళీ అవీ వదిలేస్తూ ఏదో తెలియని గమ్యం వైపు నాతో ప్రయాణించాలి. నాతో వ్యవహారం ఇలాగే ఉంటుంది.

నేను నీలా మురికిగుంటను కాను, ఒకటే నమ్మకం పెట్టుకుని పట్టుకుని కూచోడానికి. పారే నదిని. పారే నదిలో పాతనీరు పోతూ ఉంటుంది. కొత్త నీరు వస్తూ ఉంటుంది. అలాగే నా మాటలు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ నువ్వు అర్ధం చేసుకోగలిగితే వాటిల్లో ఒకే రుచి ఉంటుంది. నీటి రుచి లాగే.' అన్నా సీరియస్ గా.

'నాయనా నీకో దణ్ణం. వస్తా.' అని వెళ్ళిపోయాడు వాడు.

'మోసమందు ఆధ్యాత్మిక మోసం వేరయా' - అన్నట్లుగా ఇదంతా  ఉంటుంది.

మొన్నీ మధ్యన ఇలాగే ఏవో మేగజైన్స్ కొని ఒక బుక్ స్టాల్ నుంచి బయటకు వస్తున్నా. సైకాలజీ బాగా తెలిసిన ఒక కుర్ర అయ్యప్ప వేషధారి ఎక్కడనుంచో సరాసరి నా ముందుకొచ్చి నిలబడి తన భుజం మీదున్న నల్ల కండువాను నా ముందు జోలెలాగా పట్టాడు. నా చేతిలో ఉన్న మేగజైన్స్ చూసి, 'అబ్బో చాలా కొన్నాడు. మనక్కూడా బాగా ఇస్తాడు' అనుకోని ఉంటాడు.

నేను సీరియస్ గా ఆ జోలి వైపు చూసి ' ఏంటి?' అన్నా.

'డబ్బులు' అన్నాడు నిర్లక్ష్యంగా.

వాడి మెడ మీద ఒక్క రౌండ్ హౌస్ కిక్ ఇద్దామని కాలు దానంతట అదే లేవబోయింది. కానీ రోడ్డుమీద ఒక అయ్యప్ప వేషంలో ఉన్నవాడిని తంతే బాగుండదని చాలా కంట్రోల్ చేసుకున్నా.

'ఎందుకు?' అన్నా.

'సేవ చేసుకోండి. పుణ్యం వస్తుంది' అన్నాడు వాడూ అంతే నిర్లక్ష్యంగా.

'నీ దగ్గర పుణ్యం అంత పుచ్చిపోతే రోడ్డుమీద ఎందుకు అడుక్కుంటున్నావ్?' అడిగా.

వాడు హర్ట్ అయ్యాడు.

'పోనీ ఒక రూపాయన్నా వెయ్యి' అన్నాడు ఏక వచనంలోకి దిగుతూ. ఇంతా చేస్తే వాడికి ఇరవై ఏళ్ళు కూడా ఉండవ్. స్టూడెంట్ లాగా ఉన్నాడు.

'పైసా కూడా ఇవ్వను. దొబ్బెయ్.' అన్నా సీరియస్ గా.

వాడు నావైపు చాలా సీరియస్ గా చూచి వెళ్ళిపోయాడు.

'సేవ' అనే పేరుతో మనిషి వీక్నెస్ ని బ్లాక్ మెయిల్ చెయ్యడం ఈ రోజుల్లో బాగా ఎక్కువైపోయింది. అసలు సేవ అనేది ఎవరికి కావాలి? ఈ రోజుల్లో డబ్బు లేనివాడు ఎవడున్నాడు అసలు?

సేవ అనేది ఎవరికి? ఎందుకు? అవసరం లేదు. లోకంలో జరిగే నాటకాలలో ఇదొక నాటకం అంతే. మనం ఎవరినీ నమ్మవలసిన పని లేదు. ఎవరికీ సేవ చెయ్యవలసిన పని లేదు. మన సేవ మనం చేసుకుంటే చాలు.

ఈ లోకంలో ఏదీ 'అన్యాయం' కాదు. ఇక్కడ ఎవరి ఖర్మ ప్రకారం వారికి జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు నవ్వుతూ అహంకారంతో కళ్ళు పొరలు కమ్మి చేసుకున్నవాడు నేడు ఏడుస్తూ అనుభవిస్తూ ఉంటాడు. అది వాడి ఖర్మ. వాడి ఖర్మలో జోక్యం చేసుకునే పని మనకు లేదు. ఉండకూడదు అంతే.

ఏదో మనసులో పెట్టుకుని 'పిల్లా గడ్డికొస్తావా?' అన్నట్లుగానే, ఏవేవో మనసులో ఉంచుకుని 'మేం సేవ చేస్తున్నాం' అనుకోవడం కూడా ఉంటుంది.

నువ్వే ఒక కోతివి. ఒక కోతి, కోతుల సమూహానికి ఏం సేవ చెయ్యగలదు? దాని చాంచల్యాన్ని వదల్చుకుని ముందు అదొక మనిషిగా మారటమే అది చెయ్యవలసిన అతి ముఖ్యమైన పని.

ఒకడు కోతులకు అన్న సంతర్పణ చేద్దామని మొక్కుకున్నాడట. కోతులకు అన్న సంతర్పణా? అవి సక్రమంగా తింటాయా తిననిస్తాయా? మనుషులే బుద్ధిగా మౌనంగా కూచుని తినడం లేదు. ఇక కోతులు బుద్ధిగా తింటాయా? 

తనను తను ఉన్నతంగా మార్చుకుని ఇవాల్వ్ అయ్యే అసలైన పనిని వాయిదా వెయ్యడానికి ఉన్న అనేకమైన కుంటిసాకులలో 'సేవ' అనేది ఒక కుంటిసాకు. అంతే !!

ఇదే అసలైన ఆధ్యాత్మిక సత్యం.