“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, సెప్టెంబర్ 2017, మంగళవారం

ఛిన్నమస్తా సాధన - 9 (యోగతంత్ర రహస్యాలు)

బెంగాల్లో ప్రచారంలో ఉన్నట్టి శాక్త మహాభాగవతంలో ఛిన్నమస్తా దేవి తూర్పు దిక్కుకు అధిదేవత అని ఉన్నది. తన చుట్టూ దశ దిశలలో సతీదేవి ప్రత్యక్షమైనప్పుడు, ఈ పదిమంది శక్తులు ఎవరని సతీదేవిని శివుడు ప్రశ్నిస్తాడు. దానికి ఆమె జవాబు చెబుతూ  తూర్పుదిక్కున ఉన్న భయంకర శక్తి ఛిన్నమస్త అంటూ మిగతా దిక్కులలో ఎవరెవరున్నారో చెబుతుంది. మనకు ప్రస్తుతం అవి అవసరం లేదుగాని తూర్పు దిక్కుకు ఛిన్నమస్త అధిపతి యని తెలుస్తున్నది.

తూర్పుదిక్కున ఉన్న దేవతకు 'ఉష' అని వేదాలలో  పేరున్నది.ఈమె సూర్యుని కంటే ముందు ఉదయించే వెలుగు. ఈ వెలుగుతోనే లోకం మేలుకోవడం మొదలౌతుంది. కానీ సాయంత్రానికి సూర్యునితో బాటే ఈమె అస్తమిస్తుంది. సూర్యునితో కలసి నడుస్తుంది గనుక ఈమెకు సూర్యదేవుని భార్య అని ఇంకొక పేరున్నది. ఈ రకంగా ఈమె ప్రతిరోజూ ఉదయిస్తూ (జన్మిస్తూ), అస్తమిస్తూ (మరణిస్తూ) ఉంటుంది. కనుక పుట్టుక చావులనేవి ఈమెకు ఒక ఆట వంటివి. ఎందుకంటే ఈమె ప్రతిరోజూ ఈ స్థితులలో నడుస్తూ ఉంటుంది.


అలాగే ఛిన్నమస్తా దేవత కూడా జీవనానికీ మరణానికీ అధిదేవతగా తంత్రాలలో ఆరాధింపబడుతూ ఉన్నది. ఈమె అనుక్షణం మరణిస్తూ ఉంటుంది కానీ అనుక్షణం జీవించే ఉంటుంది. అలాగే ఈమెను ఆరాధించే యోగులు తాంత్రికులు కూడా ప్రతిరోజూ మరణిస్తూ మళ్ళీ జీవిస్తూ ఉంటారు. ఇది తమాషాకు చెప్పడం లేదు. ఇది వాస్తవం. సమాధిస్థితిని అందుకోవడం అంటే మరణించడమే. అది ఒకరకమైన చావే. దానిలోనుంచి బయటకు రావడం అంటే మళ్ళీ జీవించడమే. కనుక సమాధి స్థితిని అందుకున్న ఉపాసకులు చచ్చి బ్రతికిన వారే. రోజూ చస్తూ బ్రతికేది వీరే. బ్రతికి ఉండగానే చావడమే సమాధి. ఇదే జీవన్ముక్తి అంటే అసలైన అర్ధం.

ఈ కోణంలో చూస్తే ఈ దేవతకూ వేదాలలో చెప్పబడిన 'ఉషా' అనే దేవతకూ పోలికలున్నాయి.

ఇకపోతే,గుహ్యాతిగుహ్య తంత్రం లోనూ,తోడల తంత్రంలోనూ, ఈమె విష్ణువు యొక్క దశావతారాలలోని నరసింహావతారంతో పోల్చబడింది. విష్ణు అవతారాలలో నరసింహావతారం చాలా ప్రాచీనమైనది. శాక్తతంత్రాలు రాకమునుపే నరసింహావతారం గురించి గాధలు మన దేశంలో ఉన్నాయి. అవతారాలలో చాలా శక్తివంతమైనదీ, అతి తక్కువ కాలం భూమ్మీద ఉన్నదీ నరసింహావతారమే. కనుక ఛిన్నమస్తాదేవికీ, నరసింహస్వామికీ ఉన్నట్టి ఈ పోలిక కూడా సమంజసమే అని తోస్తుంది.

వైష్ణవంలో యోగసాధనకు నరసింహస్వామి అధిదేవత. యోగనరసింహుడు అనే అవతారం ఉన్నదని మనకు తెలుసు. నవనారసింహులలో యోగనరసింహుడు ఒకరు. తిరుమలలో కూడా ఈయన దేవాలయాన్ని ప్రధాన దేవాలయానికి ఎడమ వైపున మనం చూడవచ్చు. అలాగే తంత్రమార్గంలో యోగసాధనకు ఛిన్నమస్తాదేవి అధిదేవత. ఇదొక్కటే గాక వీరిద్దరికీ ఇంకా చాలా పోలికలున్నాయి.

నరసింహస్వామి - సంధ్యాదేవతకు ఒక ప్రతిరూపం. ఎలాగంటే - ఆయనలో పశుత్వమూ దైవత్వమూ కలసి ఉన్నాయి. ఆయన ఉద్భవించింది కూడా పగలూ,రాత్రీ కాని సంధ్యా సమయంలోనే. అలాగే హిరణ్యకశిపుడిని సంహరించింది కూడా ఇంటా బయటా కాని గడప మీదే. కనుక ఆయన కూడా ఇటు జీవితానికీ అటు మరణానికీ, ఇటు లౌకికానికీ అటు ఆధ్యాత్మికానికీ మధ్యన ఉన్న సరిహద్దులో వెలిగే దేవతగా మనం స్వీకరించవచ్చు. ఛిన్నమస్తా రూపం కూడా అదే. కనుక నరసింహ స్వామికీ ఈమెకూ దగ్గర పోలికలున్నట్లు మనకు తెలుస్తున్నది.

వీరిద్దరి జననతిధులు కూడా వైశాఖ శుక్ల చతుర్దశులే కావడం గమనార్హం.

'ముహూర్త చింతామణి' ననుసరించి ఈ తిధికి 'పరమశివుడు (రుద్రుడు)' అధిదేవత. ఉగ్రకర్మలైన - యుద్ధం, హింసతో శత్రువులను జయించడం, ఆయుధాలు తయారీ, విషప్రయోగం, గెరిల్లా యుద్ధం మొదలైనవి ఈ సమయంలో జయాన్నిస్తాయి. అదే విధంగా మోక్షసాధనలైన ధ్యానం,యోగం మొదలైనవి కూడా ఈ సమయంలో త్వరితంగా ఫలిస్తాయి.


వరాహ మిహిరాచార్యుని 'బృహత్సంహిత', ముహూర్త గ్రంధమైన 'పూర్వకాలామృతా'లను బట్టి ఈ తిధికి 'కాళికాదేవి' అధినాయిక. ఈమెకూడా ఉగ్రస్వరూపిణిగా ఉంటుంది. సాధకునిలోని తక్కువ బుద్దులూ, బద్ధకం, సోమరితనం, నాటకాలు ఆడే స్వభావం, రుజువర్తన లేకపోవడం మొదలైన చెడులక్షణాలంటే ఈమెకు మహా ఉగ్రమైన కోపం ఉంటుంది. ఉపాసకునిలోని ఇలాంటి నడవడికలను ఆమె ఒకే ఒక్క ఖడ్గప్రహారంతో సంహరించి పారేస్తుంది. కాళికాదేవికి ఆలస్యం చెయ్యడం తెలియదు. జాగు అనేది ఆమెకు ఇష్టం ఉండదు. ఒకే ఒక్క క్షణంలో రాక్షస సంహారం జరగాల్సిందే. అది ఆమె తత్త్వం.

జ్యోతిశ్శాస్తాన్ని బట్టి చతుర్దశి తిధి అనేది 'రిక్త' తిధులలోకి వస్తుంది. వీటికి శనీశ్వరుడు అధిదేవత. శనీశ్వరుడు కూడా కాళికాదేవికీ శివునకూ ప్రతిరూపమే. ఈయన కూడా కాళికాదేవిలాగే నల్లగా ఉంటాడు. ఈయనకు 'యముడు' అని పేరున్నది. అంటే సంహారతత్త్వం ఈయన అధీనంలో ఉంటుంది. రుద్రతత్వం కూడా అదే కదా !!

తిధులు - నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ - అనే పేర్లతో అయిదు విభాగాలుగా పాడ్యమి నుంచి వరుసగా ఉంటాయి. వీటి లక్షణాలను క్లుప్తంగా ఇక్కడ ఇస్తున్నాను.

నంద తిధులు - పాడ్యమి, షష్టి, ఏకాదశి (1,6,11)
భద్ర తిధులు - విదియ,సప్తమి,ద్వాదశి (2,7,12)
జయ తిధులు - తదియ,అష్టమి,త్రయోదశి (3,8,13)
రిక్త తిధులు -చవితి,నవమి,చతుర్దశి (4,9,14)
పూర్ణ తిధులు -  పంచమి, దశమి, పూర్ణిమ/అమావాస్య (5,10,15)

నందతిధులు ఆనందాన్నీ, భద్రతిధులు రక్షణనూ, జయ తిధులు విజయాన్నీ, రిక్తతిధులు క్రూరత్వాన్నీ, ఆధ్యాత్మిక సాధననూ, పూర్ణతిథులు పూర్ణత్వాన్నీ ఇస్తాయి.

కాళికాదేవి, రుద్రుని స్త్రీరూపం అని మనం భావించవచ్చు. ఇద్దరూ 'ఉగ్రత్వానికీ, నాశనానికీ' అధిదేవతలే. అంటే, లౌకికవాంఛలు పూర్తిగా నశించి దైవత్వంలోకి మేల్కొనడమనే ప్రక్రియకు వీరిద్దరూ అధిదేవతలుగా ఉంటారు. హిరణ్యకశిపుడు కూడా మితిమీరిన ఆశకూ, దౌర్జన్యానికీ ప్రతిరూపమే కదా. అతని ఆగడాలు మితిమీరినందువల్లనే నరసింహస్వామి ఆయన్ను సంహరించాడు. శైవంలో రుద్రుని సంహారశక్తినే వైష్ణవంలో నరసింహస్వామిగా ఆరాధిస్తారు. వీరిద్దరిలో ఆకారం వేరైనా లోపలున్న తత్త్వం ఒక్కటే.

నరసింహస్వామి, కుమారస్వామి, ఆంజనేయస్వామి, పరశురాముడు - వీరందరూ వేర్వేరుగా మనుషులు అనుకున్నప్పటికీ,  ఈ నలుగురిలో పనిచేసే శక్తి ఒక్కటే అని వాసిష్ఠ గణపతిముని భావించారు. ఈ భావన వినడానికి విచిత్రంగా ఉండవచ్చు. మామూలుగా మనుషులు భావించే భావనలకూ, తాంత్రికులూ, సిద్ధులకు తెలిసిన మార్మిక భావనలకూ ఇంత భేదం ఉంటుంది మరి !!

ఇందుకనే - శుక్లచతుర్దశి అనేది ఛిన్నమస్తాదేవికీ, నరసింహస్వామికీ కూడా జననతిధి ఆయింది. పశుత్వం మీద దైవత్వపు గెలుపుకీ, చీకటి మీద వెలుగు యొక్క విజయానికీ వీరిద్దరూ సంకేతాలు.

ఇప్పుడు ఛిన్నమస్తాదేవికి చెందిన యోగపరమైన అర్ధాలను తెలుసుకుందాం.

బౌద్ధ తంత్రాలలో లాలన, రసన, అవధూతి అనబడే నాడులను హిందూ యోగతంత్రాలలో ఇడా, పింగళా, సుషుమ్నా అనే పేర్లతో పిలిచారని ఇంతకు ముందు చెప్పాను. బౌద్ధ తంత్రాలలో వజ్రయోగినీ దేవతను సర్వబుద్ధ డాకిని అనీ, ఆమెకు అటూ ఇటూ ఉన్న దేవతలను వజ్ర వైరోచని, వజ్రవర్ణిని అనీ పిలిచారు. 'ఛిన్నమస్తాకల్పం' వంటి హిందూ తంత్రాలలో అయితే వీరిని డాకిని, వర్ణిని, సర్వబుద్ధి అనే పేర్లతో పిలిచారు.

తాంత్రిక యోగపరంగా చూస్తే, ఈ ముగ్గురు దేవతలూ ఇడా, పింగళా సుషుమ్నా నాడులకు సూచకులు. ఈ ముగ్గురూ త్రాగుతున్న రక్తం, కుండలినీ శక్తి సహస్రారానికి చేరినప్పుడు సాధకుని దేహంలో కురిసే అమృతవర్షానికి ప్రతిరూపం. ఈ అమృతరసం అనేది శరీరంలోనుంచి బయటకు పోదు. అది ఉపాసకుని శరీరంలోని ఈ మూడునాడులలోనే చక్రాకారంగా ప్రవహిస్తూ ఉంటుంది. దానినే, ఛిన్నమస్తా రక్తాన్ని ఈ ముగ్గురూ కలసి త్రాగుతున్నట్లుగా చిత్రించారు. ఇదొక అంతరికంగా జరిగే ప్రక్రియ మాత్రమేగాని భౌతికంగా జరిగే శిరచ్చేదం కాదు. శిరచ్చేదం అనేది, గొంతులో ఉన్న విశుద్ధచక్రాన్ని కుండలిని భేదించి ఆపైన ఉన్నట్టి ఆజ్ఞా సహస్రార చక్రాలకు చేరడానికి సంకేతమై ఉన్నది. దీనినే గొంతు తెగిపోవడంగా చిత్రంచారు. యోగపరంగా శిరచ్చేదం అంటే ఇదే.

ఈ విధంగా, తంత్రశాస్త్రంలో ఈ ఛిన్నమస్తా సాధన ఒక మహావిద్యగా చూడబడి, మాయామోహాలనుంచీ, పశుప్రవృత్తి నుంచీ మనిషికి విముక్తిని ప్రసాదించి అద్భుతమైన అమృత సిద్ధిని కలిగించే రహస్యసాధనగా ఉంటే, అజ్ఞానులైన లోకులేమో - అయితే ఇదేదో భేతాళ సాధన అనీ - లేకుంటే అతీత శక్తులు సిద్ధులను ఇచ్చే ఏదో సాధన అనీ - రకరకాలుగా అనుకుంటూ భ్రమల్లో ఉంటున్నారు.

లోకం ఇలా అనుకోవడమే నిజమైన తాంత్రికులకు కావలసింది. ఎందుకంటే తాంత్రికలోకంలో అడుగు పెట్టగలిగినవారు అవసరమైతే దేన్నైనా వదలిపెట్టగలిగే ధీరులై ఉండాలి గానీ, కాలక్షేపం కోసం ఆధ్యాత్మిక కబుర్లు చెప్పుకునే మామూలు మనుషులై ఉండకూడదు. ఎందుకంటే - తంత్ర ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఏమాత్రం పనికిరారు. నిజమైన తంత్రసాధన చేయాలంటే మనిషికి గొప్పవైన అర్హతలుండాలి. తంత్రసాధన అనేది ఊరకే మాటలు చెబితే జరిగే పని  కాదు. కనుక కాలక్షేప ఆధ్యాత్మికులు తంత్రలోకానికి దూరంగా ఉండటమే నిజమైన తాన్త్రికుల కోరిక. అందుకోసమే ఆ రహస్యాలను వారు ఇలాంటి భయంకరమైన చిత్రాలతో కూడిన 'సంధ్యా భాష' లోనే ఎప్పటికీ ఉంచుతారు. ఆ సాధనా రహస్యాలను కూడా అర్హులు కానివారికి వారు ఎన్నటికీ వెల్లడి చెయ్యరు.

ఆ రహస్యాలను అర్ధం చేసుకుని ఆచరించి, ఆ దారిలో నడచి, వాటిలో సిద్ధిని పొందే అర్హతలున్నవారు పుట్టేవరకూ ఈ తంత్ర గ్రంధాలు ఓపికగా వేచి చూస్తూనే ఉంటాయి - ఎన్ని వేల ఏళ్ళైనా సరే !!

(సమాప్తం)