“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, మార్చి 2016, బుధవారం

మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్

"గోసాయి తత్త్వాలు" పోస్ట్ వ్రాశాక ఇంకా ఎవరూ తిడుతూ మెయిల్స్ ఇవ్వడం లేదేమిటా అని తెగ ఆశ్చర్యపోతూ విపరీతంగా బాధపడుతూ ఉండగా నేనున్నానంటూ ఫోన్ మ్రోగింది.

'హలో శర్మగారేనా?' అంటూ ఒక స్త్రీ స్వరం వినవచ్చింది.

'అవును' అన్నాను.

'మీరు లేటెస్ట్ గా వ్రాసిన రెండు పోస్టులు నాకు ఏమాత్రం నచ్చలేదు' అంది ఆ స్వరం సీరియస్ గా.

'అమ్మయ్య ! వచ్చిందిరా బాబూ' అనుకుంటూ - 'మీరెవరో చెప్పకుండా ఇలా డైరెక్ట్ గా విషయంలోకి రావడం నాకూ ఏమాత్రం నచ్చలేదు' అన్నాను నేనూ అంతే సీరియస్ గా.

'నాపేరు డాక్టర్ ఫలానా.' అంటూ ఒక పేరును చెప్పింది ఆమె.

'ఓహో మీరు మెడికల్ డాక్టరా ఎకాడమిక్ డాక్టరా' - అడిగాను.

'అయామె సైకియాట్రిస్ట్' అందా స్వరం దర్పంగా.

విషయం అర్ధమైంది.

ఆమె నిజంగా అదో కాదో గాని, నావి పిచ్చి వ్రాతలని ఆమె అనబోతున్నదని సిక్స్త్ సెన్స్ చెప్పేసింది.

'అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్' అన్న కుంగ్ ఫూ సూత్రాన్ని అప్లై చేస్తూ -'మీ సమస్యకి మీ దగ్గరే మందులుంటాయిగా నాకెందుకు ఫోన్ చేశారు?' అడిగాను.

'అదేంటి? అందామె.

'పిచ్చి డాక్టర్లకు నేను మందివ్వను.అయినా హోమియోపతి చాలా స్లోగా పనిచేస్తుంది.ఈలోపల మీకు చాలా ముదిరి పోతుంది.వేరేచోట ట్రై చెయ్యండి.' అన్నాను నవ్వాపుకుంటూ.

'అందుకోసం కాదు.నేను ఫోన్ చేసినది మీతో కాసేపు మాట్లాడటానికి మాత్రమే. అసలు మీరేం అంటున్నారో నాకేమీ అర్ధం కావడం లేదు.' అందామె.

'ఇన్నేళ్ళుగా నేనేమిటో నాకే అర్ధం కాలేదు.ఇంక మీకేం అర్ధమౌతాను లెండి?' అన్నాను.

'అదే నేనూ చెప్పబోతున్నాను.మీరేదో పెద్ద మల్టీ స్కిల్డ్ అనుకుంటున్నారేమో?నిజానికి మీరు M.P.D తో బాధ పడుతున్నారు.అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్దర్.అలాంటివాళ్ళే ఇలాంటి వ్రాతలు వ్రాస్తారు. మీకు సైకియాట్రీ ట్రీట్మెంట్ అవసరం.' అంది లేడీ డాక్టర్ స్వరం.

'ఆ రోగం వస్తే ఏమౌతుంది డాక్టర్" అడిగాను భయంగా గొంతు పెట్టి.

'ఏమీ కాదు.ఒకే మనిషిలో పదిమంది మనుషులుంటారు.ఒక్కొక్కరితో ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా బిహేవ్ చేస్తారు.అదొక రోగం' అందామె.

'మీ కుటుంబ సభ్యులలో అందరితో మీరు ఒకేలా ఉంటున్నారా లేక ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఉంటున్నారా మేడం?' అడిగాను.

'అందరితో ఒకేలా ఎలా ఉంటాం? అయినా, అదీ ఇదీ ఒకటే ఎలా అవుతుంది?అది సహజం.ఇది రోగం.' అందామె.

'అంటే - మీకైతే సహజమూనూ ఇతరులకైతే రోగమా మేడం?' అడిగాను వినయంగా.

'చెప్పటం నా ధర్మం.మీకు మాత్రం అర్జంటుగా ట్రీట్మెంట్ అవసరం' అందామె మళ్ళీ మొదటికొస్తూ.

'ఇక లాభం లేదు.డాక్టర్ కి పిచ్చి బాగా ముదిరినట్లుంది.' అనుకుంటూ - 'మీరిచ్చే కరెంటు షాకులు ఏ రేంజిలో ఉంటాయి డాక్టర్ గారు?' నేనూ సబ్జెక్టులోకి దిగాను.

'తమాషాగా తీసుకోకండి.నిజంగానే మీకు సమస్య ఉన్నది. ముందు లో-డోస్ మందులతో మొదలు పెడతాము.అవి పనిచెయ్యకపోతే ఆ తర్వాత కరెంటు షాకులు ఇస్తాము' అంది డాక్టరు.

'అవీ పనిచెయ్యకపోతే అప్పుడేం చేస్తారు?' అడిగాను.

నిశ్శబ్దం.

'మీరు చెప్పినది నేను విన్నాను కదా.ఇప్పుడు నేను చెప్పేది మీరూ వినాలి.' అన్నాను.

'చెప్పండి' అంది స్వరం.

'మీరు కూడా N.P.D అనే రోగంతో బాధ పడుతున్నారు.అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్దర్ అన్నమాట.ఈ రోగం ఉన్నవాళ్ళు అన్నీ తమకే తెలుసనీ,ఎదుటివాళ్ళందరూ వెర్రి వెంగళప్పలనీ అనుకుంటూ ఉంటారు. మీరు ఆ కేసు లాగున్నారు.అసలు నిజంగా మీరు సైకియాట్రిస్టేనా?' అడిగాను.

'పరవాలేదు.మీకూ కొంత సబ్జెక్టు తెల్సన్నమాట.' అంది స్వరం.

'ఏదో M.P.D ని కదా.అందులో మీకన్నా జూనియర్ నే అనుకోండి.మీలా మెడిసిన్ చదివి పిచ్చిడాక్టర్ని కాకపోయినా ఏదో కాస్త జెనరల్ నాలెడ్జి ఏడిసింది లెండి.' అన్నాను.

మళ్ళీ నిశ్శబ్దం.

'డాక్టర్ గారు.ఒకమాట.నేనుకూడా మీలాగే కరెంటు షాకులు పెడతాను. అయితే నా పద్ధతి వేరు.నేను మీలా లోనుంచి హైకి వోల్టేజి పెంచుతూ పోను. ఒకేసారి రైల్వేతీగల మీదకు మిమ్మల్ని విసిరేస్తాను.వాటిల్లో 24 KV మాత్రమే కరెంటు ఉంటుంది.దెబ్బతో అటో ఇటో తేలిపోతుంది. అస్సలు టైంవేస్ట్ అవదు.మీలాంటి పిచ్చి డాక్టర్లకు నేనిచ్చే ట్రీట్మెంట్ అలా ఉంటుంది.' అన్నాను.

'సీరియస్ గా చెబుతున్నాను.మీరు వ్రాసినవి నాకు నచ్చలేదు' అన్నదామె మళ్ళీ.

"పొద్దున్నే ఇదెక్కడి పిచ్చిగోలరా బాబూ?' అనుకుంటూ - 'సహజమేనండి. అందరికీ అన్నీ ఎలా నచ్చుతాయి?నచ్చవు.అలా నచ్చాలని రూలు కూడా ఎక్కడా లేదు. I can understand you perfectly well.' అన్నాను.

'ఆ పోస్టులు తీసెయ్యండి.' అన్నది స్వరం.

'మీకు నచ్చనంత మాత్రాన వాటిని తీసెయ్యాలా?అంటే ఒక మనిషి మీకు నచ్చకపోతే వాళ్ళు ఈ లోకంలోనే లేకుండా పోవాలా? మీ సొంతూరు కడపా?' అడిగాను.

మళ్ళీ నిశ్శబ్దం.

'మాకు ద్రోహం చేసిన ఆడాళ్ళు లేకుండా పోవాలని మేమేమీ కోరుకోవడం లేదు.వాళ్ళ బ్రతుకు వాళ్ళది మా బ్రతుకు మాది.అలా చెయ్యడం వాళ్ళ ఖర్మ కావచ్చు.అయినా సరే,వాళ్ళుకూడా బాగుండాలనే మేం కోరుకుంటున్నాం. మీరేమో మీకు నచ్చలేదు గనుక నా పోస్టులే తీసెయ్యమని అంటున్నారు. మానసిక రోగం మీకా నాకా? కాస్త ఆలోచించండి.' డైరెక్ట్ గా అడిగాను.

'అయినా సరే వాటిని తీసెయ్యండి' అంది ఆ స్వరం మళ్ళీ.

'అదేంటి? అవి చాలా బాగున్నాయనీ, నిజాలను నిర్భయంగా వ్రాశాననీ, వాళ్లకు కూడా గతంలో అలాంటి అనుభవాలు అయ్యాయనీ నన్ను తెగ మెచ్చుకుంటూ చాలామంది జెంట్స్ నాకు మెయిల్స్ ఇచ్చారు. కావాలంటే ఆ మెయిల్స్ మీకు పంపనా? చూస్తారా?' అడిగాను.

'ఆడవాళ్ళందరూ అలా ఉండరు.మీరు జెనరలైజ్ చేస్తూ వ్రాయడం బాగాలేదు.' అన్నది స్వరం మళ్ళీ.

'సారీ.మీరు మళ్ళీ చదవండి.నేను జనరలైజ్ చెయ్యలేదు.మా ఫ్రెండ్ ను మోసం చేసిన అమ్మాయి మీద ఆ కవిత వ్రాసుకున్నాను.అది నిజంగా జరిగిన సంఘటన.' అన్నాను.

'మరి గోసాయి తత్త్వాలు పోస్ట్ ఏమిటి?' ప్రశ్నించింది స్వరం.

'అవి అడుక్కుంటూ తిరిగే బైరాగుల అభిప్రాయాలు.వాళ్ళు వైరాగ్యంతో ఉంటారు.ఇంటిపోరు భరించలేక దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. స్త్రీలను ఆమడ దూరంలో ఉంచుతారు. వాళ్ళ సాహిత్యం అలా ఉండక ఇంకెలా ఉంటుంది?' అడిగాను.

'అయితే అవి మీ అభిప్రాయాలు కావని మీరు ఒప్పుకుంటున్నారా?' ప్రశ్నించింది స్వరం.

'ఇప్పుడే చెప్పలేను' అన్నాను నీరసంగా గొంతు మార్చి.

'అదేంటి?' అనుమానంగా ప్రశ్నించింది స్వరం.

'ఇంకా కొంచం ముదిరితేగాని ఏ సంగతీ చెప్పలేను.ఇప్పుడే మా ఇంటి కిచెన్ ప్లగ్గులో వేలు పెట్టబోతున్నాను.ఆ షాకు చాలకపోతే ఆ తర్వాత ఇంకేం చెయ్యాలో మా వీథి చివర్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గరకెళ్ళి నిలబడి తీరికగా ఆలోచిస్తాను.ప్రస్తుతం అంతకంటే ఆలోచించే టైము నా దగ్గర లేదు.' అన్నాను.

'నిజంగా పిచ్చిలాగే ఉందే...' అంటూ పక్కన ఎవరితోనో లోగొంతుకలో అంటోంది ఆమె.

'నిజం పిచ్చి ఒకటీ, అబద్దం పిచ్చి ఒకటీ ఉండదుగాని చెప్పేది వినండి.మీ నంబర్ ఇప్పుడే 'ట్రూకాలర్' లో చెక్ చేశాను.మీ అడ్రస్ హైదరాబాద్ అని వచ్చింది.ఎల్లుండి నేను హైదరాబాద్ వస్తున్నాను.మీ అడ్రస్ వెతుక్కుంటూ నేనే వచ్చి కలుస్తాను.' అన్నాను.

'అయితే మీరు ట్రీట్మెంట్ కి ఇష్టపడినట్లేనా?' అన్నదామె.

'అది మీరు చెప్పాలి.సరేగాని మీ ఇంటి దగ్గ్గర రైల్వే లైన్స్ ఉన్నాయా? ఉంటే మిమ్మల్ని వాటి మీదకి విసరడానికి నా పని తేలికౌతుంది.మీకోసం మీ ఇంటి పక్కగా లైన్స్ వేయించడం ప్రస్తుతానికి నా తరం కాదు.' అన్నాను.

'ఇంతకీ మీరు ఆ పోస్ట్ లు తీస్తారా తియ్యరా" ఈసారి కొంచం కోపం ధ్వనించింది స్వరంలో.

'చూడండి డాక్టర్ గారు.మీలో E.I.S - అంటే 'ఈజీలీ ఇర్రిటబుల్ సిండ్రోం' కూడా ఉన్నట్లు నాకు ఇప్పుడే అనుమానం వస్తున్నది.ఎందుకలా మాటమాటకీ అవి తీసెయ్యండి అవి తీసెయ్యండి అని అరుస్తారు?అలా చెప్పినదే చెబుతూ ఉన్నారంటే - ఇప్పటికే ఉన్న రోగాలకు తోడుగా మీకు O.C.D అంటే - అబ్సెస్సివ్ కంపల్సరీ డిజార్డర్ కూడా ఉన్నట్లు నేనుకోవాల్సి వస్తుంది. దయచేసి మంచి పిచ్చిడాక్టర్ కు త్వరగా చూపించుకోండి.ఇంకా ముదిరితే తగ్గడం చాలా కష్టం' అన్నాను.

'ఇడియట్' అన్నదామె కోపంగా.

'డబల్ ఇడియట్..హహ్హహ్హ...' అన్నా పిచ్చోడిలాగా పెద్దగా నవ్వుతూ.

ఫోన్ కట్ అయిపోయింది.

మనకు పడాల్సిన డోసు పడింది కదా !! ఫుల్ ఎనర్జీ వచ్చేసింది.ఉల్లాసంగా నవ్వుకుంటూ నా పనిమీద నేను బయల్దేరాను.నాలుగు తిట్లు తిని, పది తిట్లు తిట్టకపోతే మనకు తోచదు కదా మరి.

ఈ లక్షణాన్ని ఏమంటారో మానసిక రోగాల డిక్షనరీ తీరిగ్గా వెతకాలి.

ఏం చేస్తాం??? కొన్ని పిచ్చి జీవితాలింతే !!