“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, మార్చి 2016, శనివారం

లోకోద్ధరణ

మతం పేరుతో లోకంలో సాగుతున్న వ్యవహారాలలో ఎక్కువభాగం అవినీతే ఉంటుంది.

మతమే కాదు రాజకీయాలు తీసుకున్నా,వ్యాపారాలు తీసుకున్నా, ఉద్యోగాలు తీసుకున్నా - ఇంకేం తీసుకున్నా కూడా వాటిల్లో అవినీతే ఎక్కువభాగం ఉంటుంది.ఎందుకంటే - ఇవ్వన్నీ చేస్తున్న మనిషిలోనే ప్రాధమికంగా అవినీతి ఉన్నది.కనుక అదే షేడ్ అతను చేసే అన్నింటిలోనూ పాకిపోతూ ఉంటుంది.

అవినీతి అనే పదంతో 'లంచం' తీసుకోవడం అనే ఒక్క అర్ధాన్ని మాత్రమే నేను సూచించడం లేదు.అది ఆ పదానికి గల అత్యంత ప్రాధమికమైన మోటు అర్ధం మాత్రమే. నీతికి ఇంకొక పర్యాయపదం ధర్మం.ధర్మానికి విరుద్ధంగా చేసే ప్రతి పనీ అవినీతే అని నేనంటాను.అందుకే మనం గనుక గమనిస్తే ప్రపంచంలో మొత్తం వ్యాపించి ఉన్న ఏకైక విషయం అవినీతి మాత్రమే అని నా భావన.మనిషి జీవితం మొత్తం అవినీతి మయమే.అధర్మమే.

మనిషి సూర్యునితో పాటు లేవాలి.లేవడం లేదు.ఇది అధర్మమే.సూర్యునితో పాటు నిద్రపోవాలి.పోవడం లేదు.ఇదీ అధర్మమే.ప్రకృతితో సహజీవనం సమజీవనం చెయ్యాలి.చెయ్యడం లేదు.ఇదీ అధర్మమే.తనకు అవసరమైన దానికంటే ఎక్కువ కూడబెట్టకూడదు.కానీ అందరూ అదే చేస్తున్నారు.ఇదీ అధర్మమే.నిత్యజీవితంలో అడుగడుగునా ధర్మాన్ని పాటించాలి.పాటించడం లేదు.ఇదీ అధర్మమే.

మనం గనుక గమనిస్తే - మనిషి జీవితం మొత్తం - అది వ్యక్తిగత జీవితం గావచ్చు, సామాజిక జీవితం గావచ్చు, ఆధ్యాత్మిక జీవితం గావచ్చు - అంతా అక్రమమే, అధర్మమే,అవినీతే.

బయటకు చెప్పేది వేరు, లోపల ఉండేది వేరు ఎప్పుడైతే అవుతుంతో అప్పుడే మనిషి జీవితంలోకి అధర్మపు ఛాయ ప్రవేశిస్తుంది.ప్రకృతితో ఎప్పుడైతే నీకు సమతుల్యత తప్పిందో అప్పుడే నీలో అవినీతి ప్రవేశిస్తుంది.ఈ కోణంలో చూచినప్పుడు ప్రపంచంలో నీతిపరుడనేవాడే ఎక్కడా కనిపించడు.ఎక్కడో కారణజన్ములు ఒకరో ఇద్దరో ఉంటారు. అంతే.

'ప్రపంచంలో నీతిపరుడనే వాడే ఎక్కడా లేడు' - అంటుంది బైబుల్. విచిత్రమేమంటే ఈ మాటను కూడా మన అవినీతిని పెంచి పబ్బం గడుపుకోవడానికే మనం వాడుకుంటాం.దేవుడిని కూడా తన అవసరాలకు చక్కగా వాడుకోగలదు సైతాన్.

ఘనత వహించిన ఒక ప్రవక్త గారి భక్తులు మొన్నటిదాకా ఇలా చెప్పేవారు.

'పాతకాలంలో రాక్షసులు విడిగా ఉండేవారు.అందుకే భగవంతుడు అవతారాలెత్తి వారిని చంపవలసి వచ్చింది.ఇప్పుడలా కాదు.రాక్షసులు మనిషి లోపలే ఉంటున్నారు.అందుకని మా గురువుగారు మంచి బోధల ద్వారా వారిని మారుస్తున్నారు.ఎందుకంటే ప్రతిమనిషిలోనూ ఒక రాక్షసుడు ఉన్నాడు.అలా చంపాలంటే ఎంతమందిని చంపుతాం? కనుక అది సాధ్యం కాదు.అందుకే మా గురువుగారు ఈ అవతారంలో ఇలా చేస్తున్నారు.'

ఆ గురువుగారు నిజంగా గొప్పవాడే అని ప్రపంచం మొత్తం ఒక యాభై ఏళ్ళు నమ్మింది.తర్వాత కొన్నేళ్ళకు ఆయన చనిపోయే సమయంలో ఆ గురువుగారే పెద్ద ఫ్రాడ్ అని అందరికీ తెలిసిపోయింది.ఆయన్ను అడ్డు పెట్టుకుని లక్షలకోట్ల రూపాయల మాఫియా వ్యాపారం ఒక అర్ధ దశాబ్దం పాటు నడిచిందని నిదానంగా ప్రపంచానికి అర్ధమైంది.

సైతానే తన వ్యాపారానికి సాధనంగా దైవాన్ని ఎప్పుడూ వాడుకుంటాడు. దైవమేమో కళ్ళుమూసుకుని హాయిగా యోగనిద్రలో ఉంటాడు.ఎక్కడైనా జరిగేది ఇదే.ఒకవేళ ఆయన కళ్ళు తెరిచి చూస్తుంటే ఆయన కళ్ళకు మనమే గంతలు కడతాం.వెంకటేశ్వరస్వామి విగ్రహానికి కళ్ళకు అడ్డంగా పెద్దపెద్ద నామాలు పెట్టినట్లు.

నేనొక సారి తిరుపతికి వెళ్ళినపుడు ఒకాయన ఇలా అన్నాడు.

'ఈరోజు గురువారం.స్వామికి నామాలు చిన్నవి పెడతారు.అందుకని ఆయన కళ్ళు బాగా కనిపిస్తాయి.ఈరోజు ఆయన మనందరినీ కళ్ళు విప్పార్చి మరీ చూస్తూ ఉంటాడు.అందుకని ఈ ఒక్క రోజు మాత్రం మేమంతా నీతిగా ఉంటాం.షాపుల్లో కూడా ఈరోజున రేట్లు కరెక్టుగా చెబుతారు.కరెక్టుగా తీసుకుంటారు.ఈరోజున ఏ చిన్న తప్పు చేసినా స్వామి వెంటనే శిక్షిస్తాడు.అదే ఈ క్షేత్ర మహాత్యం.'

దానికి నేనిలా అన్నాను.

'నీ మహత్యం ఏడిసినట్లుంది.దేవుడికి మీరు కళ్ళు కప్పగలరా?మీరు పెట్టే బోడి నామంతో ఆయన కళ్ళు మూసుకుపోతాయా? ఈ విగ్రహం కళ్ళు మీరు కప్పగలరేమో? ప్రపంచమంతా ఆణువణువూ నిండి ఉన్న దైవం కళ్ళు ఎలా కప్పుతారు?మీరు కళ్ళు తెరిపిస్తే తెరిచి మీరు ఒద్దంటే మూసుకోడానికి ఆయన మీ బంటా? ఒకవైపు ఆయన్ను- 'అనిమేష:' (కన్నార్పని వాడవు) అని విష్ణు సహస్రనామాలలో స్తుతిస్తున్నారు.మళ్ళీ ఆయన కళ్ళకు మీరే నామాలు పెడుతున్నారు.ఏమిటీ గోల? పైగా ఇదొక మహత్యంగా ప్రచారమా?మీ గోల చూస్తుంటే నాకు నవ్వొస్తున్నది.మీది అసలైన భక్తి కాదు.ఇలాంటి భక్తిని నేను వ్యాపార భక్తి అనికూడా పిలవను.వ్యభిచార భక్తి అని పిలుస్తాను.దేవుడికి మీరు నామాలు పెట్టడం కాదు.మీ కళ్ళు కనబడకుండా చేస్తూ మాయ మీకు పెట్టిన నామాలను ముందు చూచుకోండి.' అని చెప్పాను.

మనుషులు వారి వారి కోరికలు తీరాలనే ఎప్పుడూ కోరుకుంటారు గాని ధర్మంతో ట్యూన్ అవుదామనీ, అలాంటి బ్రతుకు బ్రతుకుదామనీ ఎప్పుడూ అనుకోరు.కానీ నీతులు మాత్రం బాగా చెబుతారు.ఎక్కడ చూచినా మనకు ఇదే వరస కనిపిస్తుంది.

దేవుడిని మన వ్యాపారం కోసం వాడుకోవడమూ,ఇంకా చెప్పాలంటే దేవుడితో కూడా వ్యాపారం చెయ్యడమే ఈ లోకపు అసలైన నీతి.

వాటికన్ లో ధనాత్మక అవినీతి.ఇస్లాంలో హింసాత్మక అవినీతి.హిందూ ఆలయాలలో పక్షపాత అవినీతి.బౌద్ధంలో ఆయన ఏదైతే ఒద్దన్నాడో అదే చేసే అవినీతి.వెరసి ఎక్కడ చూచినా ఒక్కటే కనిపిస్తున్నది.అవినీతి,అధర్మం, అక్రమం  మాత్రమే.

అందుకే నన్ను అనుసరించే వారికి - ఏ గుడికీ పోవద్దనే నేను చెబుతాను. ప్రస్తుతం బ్రతికి ఉన్న ఏ సోకాల్డ్ మహనీయుడినీ నమ్మద్దనే నేను చెబుతాను.ఏ మతాన్నీ గుడ్డిగా అనుసరించ వద్దనే చెబుతాను.

ఏ మహనీయుడినైనా ఏ అవతారాన్నైనా మనుషులు తమ వ్యాపార వస్తువుగా ఒక బిజినెస్ ప్రొమోషన్ ప్రాడక్ట్ గా మాత్రమే వాడుకుంటారు. అంతేగాని వారు చెప్పినవి ఎవరూ ఆచరించరు.ఎవరూ మంచి వినరు. మారరు.తమకు తోచినది చేస్తూ ఇదే కరెక్ట్ అంటారు. దానికి సాయం చెయ్యమని దేవుడిని ప్రార్ధిస్తారు.అలా తమ అధర్మపు కోరికలకు సాయం చేసినవాడినే దేవుడంటారు.సాయం చెయ్యకపోతే - నువ్వు దేవుడివే కాదు - పొమ్మంటారు.అంతేగాని తమ పద్ధతులు మాత్రం మార్చుకోరు.

ఇది నగ్నసత్యం.

అందుకనే - లోకోద్ధరణ అనేది ఒక హాస్యాస్పదమైన మాటగా నేను భావిస్తాను.ఈలోకంలో మనం ఎవరికీ మంచి మార్గాన్ని మనంతట మనంగా చూపనక్కరలేదు.మనంతట మనం ఎవరినీ ఉద్ధరించనక్కర లేదు.ఎవరికి అర్హత ఉన్నదో వారే మన దగ్గరకు వస్తారు. మనతో ఎవరికి కర్మబంధం ఉన్నదో వారు మనదగ్గరకు తప్పకుండా వస్తారు.లేనివారు దూరంగా ఉండిపోతారు.

అసలు ప్రపంచాన్ని మొత్తాన్నీ ఉద్దరించాలన్న యుటోపియన్ భావమే ఒక పెద్ద భ్రమ. ఈ ప్రపంచం మొత్తం ఏకమొత్తంగా అత్యున్నతమైన విలువలతో కూడిన స్వర్గంగా మారడం ఎన్నటికీ జరిగేపని కాదు.అది సృష్టిధర్మానికే విరుద్ధం.ఈ పనిచెయ్యాలని భావించిన ఎందరెందరో గతంలో ఘోరంగా ఓడిపోయారు.అలా ఓడిపోయిన వారిలో మహాప్రవక్తలూ అవతార పురుషులే ఉన్నారు.

మరెలా?

అక్కడక్కడా అతి కొద్దిమంది మాత్రమే - ఈ లోకపు మాయకూ, ఈ మతాల రొచ్చుకూ అతీతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు.వారిలో మళ్ళీ కొందరే సక్సెస్ ను అందుకోగలుగుతారు.మిగతా ప్రపంచం అంతా చీకట్లో అఘోరిస్తూ అదే వెలుతురు అని భ్రమిస్తూ బ్రతకక తప్పడు.ఇది కూడా సృష్టి ధర్మమే.

1980 లో కాలేజీలో చదివే రోజుల్లో నాకొక స్నేహితుడు ఉండేవాడు.అతను నాతో ఇలాంటి విషయాలు చర్చిస్తూ ఉండేవాడు. తనకు సందేహాలుంటే నన్ను అడుగుతూ ఉండేవాడు.

దీనికి ముందు - అతని పూర్వరంగం గురించి కొంత చెప్పాలి.

హాస్టల్లో మా రూమ్మేట్స్ కు రకరకాల హాబీలుండేవి.ఒకరూములో కొంతమంది పేకాట ఆడేవాళ్ళు.ఇంకొంతమంది స్టూడెంట్స్ యూనియన్ కార్యక్రమాలలో బిజీగా ఉండేవాళ్ళు.ఇంకొంతమంది కులగ్రూపు రాజకీయాలలో తిరుగుతూ ఉండేవాళ్ళు.ఇంకొంతమంది బీరు తెచ్చుకుని త్రాగేవాళ్ళు.ఇంకొంతమంది అమ్మాయిల పిచ్చిలో పడి తిరుగుతూ ఉండేవాళ్ళు.నాకు ఈ పనులంటే మహా అసహ్యంగా ఉండేది.

మా హాస్టల్ పక్కనే ఒకవైపు స్మశానం ఉండేది.ఇంకో పక్కన ఒక తోట ఉండేది.నేను ఒక్కడినే ఆ తోటకు పోయి ఒక మారుమూల కూచుని ధ్యానం చేసేవాడిని.అది నా హాబీ.

నేను ఎక్కడకు పోతున్నానో అని మా రూము లోని వాళ్లకు అనుమానంగా ఉండేది.నేనొక్కడినే ఆ తోటలోకి పోవడం వాళ్ళు చూచేవాళ్ళు.వాళ్ళకు బురిడీ కొట్టి ఒక్కడినే అక్కడ కూచుని బీరు లాంటిది ఏదైనా తాగుతున్నానో లేక ఎవరైనా అమ్మాయిని కలుసుకోడానికి అక్కడకు పోతున్నానో అని వారు అనుకునేవారు.

ఒకరోజు ఈ స్నేహితుడు నాకు తెలీకుండా నన్ను వెంబడించి ఆ తోటలోకి వచ్చాడట.నేను ధ్యానంలో కూచోడం గమనించాడు.ఒక గంట సేపు వెయిట్ చేసి నేను లేవకపోయేసరికి విసుగుపుట్టి వెనక్కు వెళ్ళిపోయాడు. ఆ విషయం నాకు రెండు మూడు రోజుల తర్వాత చెప్పాడు.

అప్పటినుంచీ నన్ను రకరకాల సందేహాలు అడిగేవాడు.

'మీ బ్రాహ్మణులు ఇలాంటివన్నీ మానుంచి దాచారు.మాకు ఇవన్నీ తెలియక చెడు అలవాట్లకు లోనౌతున్నాము. మాకు కూడా చెబితే మేమూ మీలాగే మంచిగా ఉండేవాళ్ళం కదా?' అని ఒకరోజున నన్ను అడిగాడు.

'కులాల సంగతి పక్కన ఉంచు.ఇది నీ ఆలోచనా? లేక ఎవరైనా నీకు చెప్పిన విషయమా?' అడిగాను.

'రెండూ' అన్నాడు.

చిన్నప్పటినుంచీ నేర్పబడ్డ ద్వేషభావాలు ఇవి.ఇది వారి తప్పు కాదు. చిన్నపిల్లలకు అలాంటి ద్వేషభావాలు నేర్పిన పెద్దవారిదే అసలైన తప్పు. పదేళ్ళ వరకూ ఏ పిల్లకూ పిల్లాడికీ కులమంటే ఏమిటో తెలియదు. అటువంటి అమాయక మనస్సులకు కులవిషం ఎక్కించి నాశనం చేస్తున్న పెద్దవాళ్ళదే అసలైన తప్పు.

'సరే.నీకు నేర్పిస్తాను.రేపటినుంచీ నాతో వచ్చి నువ్వుకూడా ధ్యానం చెయ్యి.' చెప్పాను.

'అదంతా నాకొద్దు.ప్రతిరోజూ నేను పేకాటలో గెలవాలి.అలా చేసే మాయమంత్రాలు నీదగ్గర ఏవైనా ఉంటే నాకు నేర్పించు.' అన్నాడు.

'అలాంటి మాయమంత్రాలు నాకు తెలియవు.నాకు ఒక్క మంత్రమే తెలుసు. దాన్ని నేర్చుకుంటే నీకసలు పేకాట ఆడాలనే అనిపించదు.మరి దాన్ని నేర్చుకుంటావా?' అడిగాను.

'అది నాకెందుకు? ఆడాలి గెలవాలి.అంతేగాని మానుకుంటే ఏమొస్తుంది? అయినా నువ్వు చెప్పవని నాకు తెలుసులే' అన్నాడు ఎగతాళిగా.

అన్నాడేగాని లోలోపల ఏమనుకున్నాడో ఏమో మర్నాడు అతను కూడా నాతోబాటు తోటకు వచ్చాడు.

'ఏం చెయ్యాలో చెప్పు' అన్నాడు.

'ఏం చెయ్యవద్దు.ఊరకే నా పక్కనే నాతోపాటు కూచో.నావైపు చూస్తూ ఉండు. నేను గంటకు లేచినా రెండు గంటలకు లేచినా మూడు గంటలకు లేచినా - నువ్వు చూపు తిప్పకూడదు.కనీసం నీ తలను పక్కకు జరపకూడదు.ఏం జరిగినా సరే,నేను లేచేవరకూ నువ్వు లేవకూడదు.కదలకూడదు.ఇది నీకు పరీక్ష.సరేనా?' - అని చెప్పాను.

'సరే అదెంతపని? నేను పేకాటలో కూచుంటే ఒక్కోసారి రాత్రీ పగలూ కూడా ఆడతాను.ఇదొక లెక్కా?'- అన్నాడు.

కానీ పావుగంట కూడా కూచోలేక అక్కడనుంచి లేచి రూమ్ కి వెళ్ళిపోయాడు.నేను కళ్ళు తెరిచే సరికి అతను లేడు.నవ్వుకుంటూ నేను రూమ్ కు తిరిగి వచ్చాను.రూమ్ లో కూడా లేడు.పేకాట రూమ్ కి వెళ్లి ఉంటాడని ఊహించాను.అదే నిజమైంది.

మర్నాడు - 'ఏంటి అలా పారిపోయావ్" అనడిగాను.

'అంతంత సేపు ఏమీ చెయ్యకుండా ఎలా కూచుంటావ్? ఎలా తోస్తుంది నీకు? పది నిముషాలకే నేను తట్టుకోలేక అక్కణ్ణించి పారిపోయి వచ్చేసాను.కానీ ఉపయోగం లేదు.' అన్నాడు.

'ఏమైంది?' అడిగాను నవ్వుతూ.

'నిన్న పేకాటలో అంతా లాసే.అన్ని గేములూ ఓడిపోయాను' చెప్పాడు బాధగా.

'ఏం జరిగినా లేవను అని చెప్పావు.మాట తప్పావు.నీకెందుకు నేను సమాధానం చెప్పాలి?' - ఎదురు ప్రశ్నించాను.

అతన్ని ఇంకొక మాట కూడా అడిగాను.

'మారడం అనేది ఎంత కష్టమో అర్ధమైందా? లోకానికి మంచిని చెప్పడం మాట అలా ఉంచు.ముందు మీ ఇంటినుంచి మొదలు పెడదాం.మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు?'

'మాది పెద్ద కుటుంబం.పదిమందిమి ఉంటాము.' అన్నాడు.

'సరే.మీ ఇంట్లో అందరినీ ముందు ధార్మికంగా మార్చు.ఆ తర్వాత లోకం సంగతి ఆలోచిద్దాం.దానికంటే ముందు నువ్వు మారే ప్రయత్నం చెయ్యి.మీ అమ్మానాన్నా వ్యవసాయం చేసి పల్లెటూరి నుంచి డబ్బులు పంపిస్తూ నిన్ను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు.నువ్వు పేకాట ఆడుతున్నావు.ఇది ధర్మమేనా అసలు?ఆలోచించి నిజాయితీగా చెప్పు.తొందరేం లేదు.' అన్నాను.

'తప్పే.దీనికి పెద్ద ఆలోచనేందుకు? కానీ, మారడం కుదరని పని.' అన్నాడు.

'ఎందుకలా తేల్చేశావ్?" అడిగాను.

వాళ్ళ కుటుంబంలోని ఒక్కొక్కరి గురించి అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు. అంతా చెప్పాక - 'మేమంతా ఇంతే.మావాళ్ళెవరూ మారే మనుషులు కారు. మనం వీరికి చెప్పనవసరం లేదు. వాళ్ళకన్నీ తెలుసు.రివర్స్ లో మనకే వాళ్ళు చెబుతారు.' అన్నాడు.

'నువ్వు చేస్తున్నదే వాళ్ళూ చేస్తున్నారు.నువ్వే మారలేనప్పుడు మీ వాళ్ళనెలా మారుస్తావ్?నీ కుటుంబంలో వాళ్ళనే నువ్వు మంచిగా మార్చలేనప్పుడు ఇంక లోకాన్ని మార్చాలని ఎందుకు అనుకుంటున్నావ్? చెప్పరు చెప్పరు అని బ్రాహ్మణులను అనవసరంగా ఎందుకు ఆడిపోసుకుంటావ్? చెప్పినా వినేవారు ఏరి? నీ కేసులో నువ్వే చూచావు కదా? ఆ కోణంలో ఆలోచించి నిజాయితీగా చెప్పు.' అడిగాను.

అప్పటినుంచీ - 'మనం ప్రపంచాన్ని మార్చవచ్చు కదా.మంచి చెప్పి అందరినీ ఉద్ధరించవచ్చు కదా'- అని నన్ను అడగటం మానేశాడు.

అసలు విషయం ఏమంటే - మనం ఎవరికీ చెప్పనక్కరలేదు.అందరికీ అన్నీ తెలుసు.కానీ ఆచరణలోకి రావు. ఆచరణలోకి అధర్మం అవినీతి మాత్రమే వస్తాయి.అలా రాకుండా వాటిని ఆపాలంటే లోతైన ఆలోచన అవసరం అంతర్గత సంఘర్షణ అవసరం.అది ఎవరికీ నచ్చదు.కనుక ఈజీగా పనైపోయే మార్గమే ప్రతివారికీ కావాలి.కానీ అలాంటి ఈజీ మార్గం ఏదీ ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదు - ఇకముందు ఉండదు కూడా.

ప్రపంచాన్ని మనం మార్చనక్కరలేదు.

మార్పు ఎవరికి కావాలో వారే మన దగ్గరకు వెతుక్కుంటూ వస్తారు.అలా వచ్చిన వాళ్ళ వరకూ దారి చూపించి వాళ్ళను ఉన్నతంగా మారిస్తే చాలు.లోకం మొత్తాన్నీ నువ్వు కడగలేవు.నీ ఇంటిని నీవు కడుక్కుంటే చాలు.

పల్లెటూళ్ళో ఒక మోటు సామెతను చిన్నప్పుడు వినేవాళ్ళం.

'నీది నువ్వు కడుక్కుంటే చాలు.లోకులది కడగక్కర్లేదు' అని.

సృష్టి మొదటినుంచీ కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది.అది ఏకమొత్తంగా ఉన్నతంగా ఎప్పటికీ మారదు.కొద్ది మంది అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే అలా ఎదుగుతారు.ఈ అర్హతకు కులగోత్రాలతో మతాలతో ఏమీ సంబంధం లేదు. సత్యాన్వేషణ ఒక్కటే ఆ అర్హత.

శ్రీ రామకృష్ణులిలా అనేవారు.

'అడవి లోపల ఎక్కడో ఒక పువ్వు వికసిస్తుంది.కానీ తుమ్మెదలు ఎక్కడనుంచో దానిని వెదుక్కుంటూ వస్తాయి.'

ప్రపంచంలో ఉన్న అన్ని తుమ్మెదలూ అక్కడకు రావు.ఆ మకరందం ఏయే తుమ్మెదలకు కావాలో అవి మాత్రమే అలా వస్తాయి.అలా వచ్చిన వాటిలో కూడా అన్నింటికీ ఆ మకరందం అందదు.వాటిల్లో కూడా కొన్నింటికే అది అందుతుంది.ఇదంతా వాటి ఆకలి మీదా - వాటి ప్రయత్నం మీదా ఆధారపడి ఉంటుంది.

సమాజాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన రాజా రామ్మోహన్ రాయ్ లూ, వీరేశలింగాలూ,ఇతర కులసంస్కర్తలూ ఘోరంగా ఓడిపోయారు.తనను తాను సంస్కరించుకుందామని ప్రయత్నించిన నరేంద్రుడు మాత్రం వివేకానందుడయ్యాడు.అదీ తేడా !!

ఈ ప్రపంచంలో మనం పుట్టింది దాన్ని సంస్కరించడానికి కాదు.మనల్ని మనం సంస్కరించుకోడానికి మాత్రమే.ముందు మన సంగతి అయ్యాక లోకం సంగతి చూడవచ్చు.ఇంట్లో గెలవలేని వాడు బయటేం గెలుస్తాడు?ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికేం ఎక్కుతుంది?

లోకోద్ధరణ అనేది ఏకమొత్తంగా ఎప్పటికీ జరగదు.కొద్దిమంది అదృష్టవంతుల విషయంలో మాత్రమే ఈ 'ఉద్ధరణ' అనేది నిజం అవుతుంది.

మిగతా ప్రపంచమంతా అధర్మపు చాయలో అవినీతి ముసుగులో అల్లాడుతూ, అదే అసలైన ధర్మం అనుకుంటూ,ఇతరులను తిట్టుకుంటూ, గ్రంధాలు చదువుకుంటూ,లేదా ప్రవచనాలు వింటూ, లేదా ఏదో ఒక కుహనా గురువునో మతాన్నో అనుసరిస్తూ  - బ్రతుకులు చాలించక తప్పదు.

సంస్కరణ అనేది ఎప్పుడూ వ్యక్తి నుంచే మొదలు కావాలి. సమాజం నుంచి కాదు.సమాజం అనేది ఎక్కడా లేదు,ఉన్నది వ్యక్తులు మాత్రమే.కనుక మార్పు అనేది వ్యక్తి నుంచే రావాలి.అప్పుడు లోకం అదే సంస్కరించ బడుతుంది.

తమను తాము దిద్దుకోలేని వారే చాలాసార్లు లోకాన్ని దిద్దడానికి ప్రయత్నిస్తారని నా అనుభవం చెబుతోంది.