“మతం గుంపు; ఆధ్యాత్మికత వ్యక్తిగతం. కులం గుంపు; గుణం వ్యక్తిగతం"

30, మార్చి 2016, బుధవారం

హృదయపు గడియ

పడమటింట పగటిరేడు
నిదురరాని నిశాదేవి
తెరచుకున్న మది తలుపులు
ముసురుకున్న నీ తలపులు

మొద్దునిద్రలో తాను
నిదురరాని నీ మేను
జాగారపు జాబిల్లి
జిగిబాసిన సిరిమల్లి

నిను మరచిన తన స్వార్ధం
నువు మరచిన పరమార్ధం
హృదయం లేని ఆమె
ఉదయం రాని రేయి

ధనం తనకు సర్వస్వం
ప్రేమ నీకు ప్రియనేస్తం
స్వార్ధపు వలలో తాను
ముగిసిన కలలో నీవు

అహం హద్దులో ఆమె
ఇహం వద్దనే నీవు
నొప్పించడం తనకిష్టం
ఒప్పించడం నీ కష్టం

భానుని కోరే కలువ
ఎరుగదు వెన్నెల విలువ
సత్యం మరచిన చెలియ
బిగిసిన హృదయపు గడియ....