Love the country you live in OR Live in the country you love

31, మార్చి 2016, గురువారం

సత్యం - అసత్యం

ఈ మాయాలోకంలో
సత్యాసత్యాల మధ్యగీత
చాలా పలుచన

స్వార్ధంకోసం నీతిని
నిస్సిగ్గుగా వదిలేసే వారికి
సత్యం చాలా చులకన

సత్యమూ అసత్యమే
నమ్మబడదు గనుక
అసత్యమూ సత్యమే
ఉంది గనుక

అసత్యం అందలాలెక్కిస్తే
అంతా సౌఖ్యమే
శాంతి మాత్రం శూన్యం

సత్యం నీలో నిండితే
అంతా ఆనందమే
ఎలా మిగుల్తుంది దైన్యం?

అసత్యం అనుక్షణం మోసగిస్తుంది
కానీ దానిని వదలవు
సత్యం అనుక్షణం హెచ్చరిస్తుంది
కానీ దానిమాట వినవు

సత్యమే అనుకుంటూ
అసత్యాన్ని ఆరాధించడం
అసత్యం అనుకుంటూ
సత్యాన్ని తిరస్కరించడం

ఈ రెండే మానవజాతికి శాపాలు
ఈ రెండే మనుషులు చేసే పాపాలు

ఈ మెలిక అర్ధమైతే
నీ జీవితం ధన్యమే
ఈ తడిక తొలగిపోతే
అన్యం శూన్యమే....