“My Yogic realization is higher than the sky, yet my insight into Karma is finer than the grains" -- Guru Padma Sambhava

28, మార్చి 2016, సోమవారం

స్త్రీ హృదయం

నేను కాలేజీలో చదివే రోజుల్లో నా స్నేహితుడొకడు ఒకమ్మాయిని ప్రేమించాడు.చదువుకునే వయసులో ప్రేమా గీమా ఎందుకురా అని మేమంతా ఎంతో చెప్పాం.కానీ వాడు వినలేదు.ఆ అమ్మాయీ అతన్ని ప్రేమించింది.ఇద్దరూ పెళ్లి చేసుకుందామని కలలు కన్నారు.కలిసి తిరిగారు.ఆ అమ్మాయి దేవత అంటూ మాతో ఎంతో పొంగిపోతూ చెప్పేవాడు.సరే అంతా బానే ఉంది కదా కధ సుఖాంతం అవుతుంది అని అందరం అనుకునేవాళ్ళం.

అలా కొన్నాళ్ళు గడిచాక ఆ అమ్మాయి సడన్ గా ఇతనితో మాట్లాడటం మానేసింది. కారణం తెలీదు.చదువైపోగానే ఇంకొకడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.మావాడు పిచ్చివాడిలాగా అయిపోయాడు.వాడిని మామూలు మనిషిని చెయ్యడానికి మా మిత్రబృందానికి తలప్రాణం తోకకొచ్చింది.కాలక్రమేణా వాడూ రియాలిటీలో కొచ్చి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇప్పుడు వాడూ బాగానే సెటిల్ అయ్యాడు.అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాడు కూడా.

అసలు విషయం ఏమంటే - చదువు పూర్తయ్యాక మిత్రులందరూ ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు.వీడికి ఉద్యోగం లేదు.ఎలా సెటిల్ అవుతాడో తెలియదు.అందుకని పెళ్లి దగ్గరకొచ్చేసరికి వీడిని నమ్మలేక,ప్రేమా దోమా అంతా మర్చిపోయి,చక్కగా ఒక బ్యాంకు ఉద్యోగిని చేసుకుని ఆ అమ్మాయి చక్కగా సెటిల్ అయిపొయింది.ఆ తర్వాత వీడికీ మంచి ఉద్యోగమే వచ్చింది.కాకపోతే,డబ్బు దగ్గరకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆ ప్రేమ అంతా ఏమైపోయిందా అనే విషయం మాకిప్పటికీ అర్ధం కాదు.వీడికి ఉద్యోగం వచ్చేదాకా ఒకటి రెండు ఏళ్ళు ఆ అమ్మాయి ఆగలేక పోయింది.

వీడు మాత్రం ఆ నమ్మకద్రోహం తట్టుకోలేక సూయిసైడ్ అటెంప్ట్ కూడా చేసి చావుతప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డాడు.అప్పట్లో,అర్ధరాత్రిపూట అప్పటికప్పుడు వాడిని  ఆస్పత్రిలో చేర్చడమూ,తాగిన పురుగు మందు కక్కించడమూ ఆ డాక్టర్ల చుట్టూ తిరగడమూ మాకందరికీ అదొక మరపురాని ఘట్టం.

ఆడవాళ్ళది చాలా సున్నిత హృదయమనీ,ప్రేమను వాళ్ళు మర్చిపోలేరనీ అందరూ అంటారు గాని అది అబద్దం అని నేను నమ్ముతాను.నిజానికి ప్రేమను మర్చిపోలేక బాధపడేదీ, పిచ్చివాడిలా తిరిగేదీ మగవాడే.ఆడది చాలా తేలికగా ఇవన్నీ మర్చిపోగలదు.చాలా ప్రాక్టికల్ గా ఆలోచించగలదు.తనను అమితంగా ప్రేమించినవాడిని కూడా తన స్వార్ధంకోసం అతి తేలికగా డిస్కార్డ్ చెయ్యగలదు. నిజమైన సెంటిమెంటల్ ఫూల్ ఎవరంటే మగవాడే.

దేవదాసు సినిమా వచ్చింది గాని 'దేవదాసి' అనే సినిమా రాలేదుగా?

ఇదీ, ఆ తర్వాత ఇంకా ఒకటి రెండు ఇలాంటి సంఘటనలూ చూచాక స్త్రీలంటే నాకున్న అంతకు మునుపటి ఉన్నతమైన అభిప్రాయం చాలా మారిపోయింది.స్త్రీలందరూ దేవతలని చాలాకాలం అనుకుంటూ ఉండేవాడిని.కానీ ఆ తర్వాత అది నిజం కాదని అర్ధమైంది.స్త్రీల మొదటి ప్రయారిటీ ప్రేమ కాదనీ సెక్యూరిటీ మాత్రమేననీ అనిపించింది.అప్పటినించీ స్త్రీలను నేనంత త్వరగా నమ్మను.ఆ తర్వాత నుంచీ నాకెదురైన స్త్రీలను ఈ కోణంలో చాలా పరిశీలించాను.సోషల్ సెక్యూరిటీ - ప్రేమ ఈ రెంటిలో పోటీ వస్తే ప్రేమను కోరుకునే స్త్రీ నాకింతవరకూ తారసపడలేదు.బహుశా నా ఆలోచన తప్పు కావచ్చు.కానీ నాకు అలాంటి ఆదర్శప్రాయులైన స్త్రీలు మాత్రం ఇప్పటిదాకా కనిపించలేదు.


స్త్రీలు చాలా తేలికగా నమ్మకద్రోహం చెయ్యగలరు.కానీ ఎల్లప్పుడూ మగవాడినే దుర్మార్గుడని నిందిస్తారు.

అప్పట్లో ఈ తతంగం అంతా చూచి వ్రాసుకున్న కవిత ఒకటి పాత కాయితాల త్రవ్వకాలలో బయట పడింది.

చదవండి.
---------------------------------------
స్త్రీ హృదయం స్వార్ధమయం
నాటకాల రంగస్థలం
ప్రేమకచట లేదు స్థానం
ప్రేమించినవాడికి - మహాప్రస్థానం

నాటకాల నిలయమైన
వనిత నెపుడు నమ్మరాదు
పెదవులపై ప్రియలాస్యం
మనసులోన మహావిషం

ఆడదాన్ని నమ్మినోడు
అస్సలెపుడు బాగుపడడు
మనసు లేని స్త్రీకంటే
గుండె లేని బండ మేలు

ప్రేమన్నది స్త్రీకెపుడూ
ఒక సరదా ఆట
అప్పుడపుడు వాడుకునే
పనికిరాని పైట

స్త్రీ హృదయం ప్రేమమయం
అన్న కవులు పిచ్చివాళ్ళు
అది మొత్తం స్వార్ధమయం
అక్కడుంది మురుగునీళ్ళు

స్వార్ధం తన పరమార్ధం
సర్వం రెండో పురుషార్ధం
మాటలు చేతలు అన్నీ
ఆ క్షణపు అవసరార్ధం

శాంతిని కోరే మనిషి
స్త్రీ స్నేహం చెయ్యరాదు
ఆడదాని సహవాసం
అనర్ధాల ఆవాసం

బండరాయి నర్చిస్తే
నీకు బ్రతుకు నిస్తుంది
ఆడదాన్ని ప్రేమిస్తే
నిన్నంతం చేస్తుంది

మంటల్లో దూకబోయే మిడత
మగవాడే
ఎంతగా ప్రేమించినా వాడు
పగవాడే