“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, మార్చి 2016, మంగళవారం

ఆడదాన్ని నమ్మబోకు నరుడా....(గోసాయి తత్త్వాలు)

గోసాయి పదాలు,బైరాగి చిటికెలు అనే మాటలు ఈ తరానికి తెలియవు.కానీ నా చిన్నప్పుడు ఈ పదాలు తరచుగా వినేవాళ్ళం.పల్లెటూళ్ళలో అడుక్కుంటూ తిరిగే బైరాగుల నోళ్ళలో ఇవి వినబడుతూ ఉండేవి.

నేను హైస్కూలు చదివే రోజుల్లో ఒక బైరాగి ఈ గోసాయి తత్త్వాన్ని పాడుతూ తంబురా మీటుతూ అడుక్కోవడానికి వచ్చేవాడు. అతన్ని వెంటబడి బ్రతిమాలి ఈ తత్త్వాన్ని నా తెలుగు నోట్సులో వ్రాసుకున్నాను.ఆ నోట్సు పోయినా, ఎప్పటికప్పుడు ఎత్తి వ్రాసుకుంటూ ఇన్నేళ్ళ తర్వాత కూడా భద్రంగా దీనిని బ్రతికిస్తూ ఇప్పటిదాకా తెచ్చాను.

పాత కాగితాల త్రవ్వకాలలో బయటపడిన వాటిలో ఇదీ ఒకటి.

చదవండి.
--------------------------
రాగం :-- కదనకుతూహల రాగం
తాళం :-- ఆదితాళం
--------------------------
ఆడదాన్ని నమ్మబోకు నరుడా
అగచాట్లను పొందబోకు నరుడా

అడుసు తొక్కి కడుగనేల గురుడా
అలుపు దెచ్చు పరుగులేల గురుడా               ||ఆడదాన్ని||

నంగనాచి నాటకాలు నరుడా
నమ్మినావ నరకమేర నరుడా                        ||ఆడదాన్ని||

సంసారపు సుద్దులేల గురుడా
సన్యాసం సుఖమిచ్చును గురుడా              ||ఆడదాన్ని||

నమ్మితేను నాంచారిని నరుడా
నెత్తికెక్కి నాట్యమాడు నరుడా                    ||ఆడదాన్ని||

వయ్యారని వెంటబోకు గురుడా
సయ్యాటలు చావుదెచ్చు గురుడా            ||ఆడదాన్ని||

ముండమోపి మోహమేల నరుడా
బండదాని భ్రమల బడకు నరుడా           ||ఆడదాన్ని||

వగలు జూచి వీగిపోకు గురుడా
పగలు రేయి పాడుజేయు గురుడా            ||ఆడదాన్ని||

రంగు జూచి మోసపోకు నరుడా
రక్తమాంస పంజరమ్ము నరుడా                ||ఆడదాన్ని||

ఒంపుసొంపు లంటినంత గురుడా
వైతరణిని దాటలేవు గురుడా                   ||ఆడదాన్ని||

మెరమెచ్చుల బడినావా నరుడా
మరమనిషై పోతావుర నరుడా                 ||ఆడదాన్ని||

కొంగుబట్టి తిరుగబోకు గురుడా
కొండముచ్చు బ్రతుకౌరా గురుడా           ||ఆడదాన్ని||

పడతి మేను పట్టిజూడ నరుడా
చీమునెత్తురుల చెరువే నరుడా              ||ఆడదాన్ని||

శుక్లశోణితాల జూచి గురుడా
శోషదెచ్చు కొబోకుర గురుడా                 ||ఆడదాన్ని||

సిగ్గుబోవు సరసమేల నరుడా
ఒగ్గు వగల జిక్కబోకు నరుడా                ||ఆడదాన్ని||

ఆడదంటె నరకమేర గురుడా
అందులోన సుఖము లేదు గురుడా       ||ఆడదాన్ని||

కోరచూపు కాటుకన్న నరుడా
కోడెత్రాచు కాటుమేలు నరుడా               ||ఆడదాన్ని||

ఆడదాని మాటలెపుడు గురుడా
అబద్దాల మూటలేర గురుడా                 ||ఆడదాన్ని||

ఆడదాన్ని దరిజేర్చకు నరుడా
ఆమడ దూరానబెట్టు నరుడా                ||ఆడదాన్ని||

గొగ్గెర వేషాల నమ్మి గురుడా
గోచిపాత జారనీకు గురుడా                   ||ఆడదాన్ని||

ఓయంటూ సరసమాడ నరుడా
ఓజస్సే క్షీణించును నరుడా                ||ఆడదాన్ని||

పడతి చెంత జేరినావ గురుడా
పనికిరాక పోతావుర గురుడా                 ||ఆడదాన్ని||

ఇచ్చకాల బడినావా నరుడా
ఇహపరముల చెడిపోదువు నరుడా         ||ఆడదాన్ని||

వనితల దూరాననుంచి గురుడా
విష్ణువునే ధ్యానించర గురుడా               ||ఆడదాన్ని||

బైరాగుల మాటలన్ని నరుడా
బంగారపు మూటలేర నరుడా               ||ఆడదాన్ని||

గురుబోధను చక్కగాను నరుడా
గుండెలోన నిలుపుకోర నరుడా            ||ఆడదాన్ని||

ఆడదాన్ని నమ్మబోకు నరుడా
అగచాట్లను పొందబోకు నరుడా