“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మార్చి 2016, గురువారం

గతజన్మల జాడను నేను...

ఎచటకు పోతున్నావ్ మిత్రమా
ఈ చీకట్లో?
ఎందుకు నిలబడ్డావ్ మిత్రమా
ఈ వాకిట్లో?

సుఖావహ జీవితం
నీకు విసుగ్గా ఉంది కదూ?
భోగమయ ప్రపంచం
నీకు ఎడారిలా ఉంది కదూ?

మనుషుల కపటం నీలో
అసహ్యాన్ని నింపుతోంది కదూ?
మోసపు లోకం నీలో
ఆవేశాన్ని రేపుతోంది కదూ?

తెలియని అసంతృప్తి తప్ప
నీ గమ్యం నీకే తెలియదు
అర్ధంకాని తపన తప్ప
నీ దారే నీకు తెలియదు

నాతో రా
నీకు దారి చూపిస్తా
నా చేయి అందుకో
నిన్ను గమ్యం చేరుస్తా

భయంగా చూడకు నావైపు
నేనెవరనేగా నీ సందేహం?
నువ్విన్నాళ్ళూ వెదుకుతున్నది నా కోసమే
నువ్విన్నాళ్ళూ వేచింది నా కోసమే
ఇప్పుడు స్వయంగా నేనే వచ్చా
తీర్చడానికి నీ దాహం

నువ్వు ఎప్పటినుంచో వెదికే
నీ నేస్తాన్ని నేను
నీకోసం చిరకాలంగా చాచిన
స్నేహహస్తాన్ని నేను

ఇదే దారిలో
నీ ముందు నడచినవాణ్ణి
ఇదే లోకంలో
నీలాగే నలిగినవాణ్ణి
నువ్వు వెదికే
గమ్యం చేరినవాణ్ణి
అయినా సరే
మీకోసం వచ్చినవాణ్ణి

నన్నుగాక ఇంకెవరిని నమ్మగలవు?
ఈ మాయాలోకంలో
నన్ను గాక ఇంకెవరిని అడుగగలవు?
ఆ అవతల ఏముందో?

ఇంతా చేస్తే
నా లాభం ఏంటనేగా నీ సందేహం?
ఇదంతా చూస్తే
నాకేమొస్తుందనేగా నీ అనుమానం?

మీ లాభనష్టాల కోణంలో నన్ను చూడకు
అవి నన్ను తాకలేవు
నీ ఇష్టాఇష్టాల త్రాసులో నన్ను ఉంచకు
అది నన్ను తూచలేదు

నేను నాలో కలసినట్లు
నిన్ను నాలో కలుపుకుంటా
నువ్వు సిద్ధమేనా?

నేను నేనుగా మిగిలినట్లు
నిన్ను నాలా మలుచుకుంటా
నీకిష్టమేనా?

సరిగా చూడు నాలో ఏముందో?

నేను
నువ్వనుకునే నేనును కాను
నేను
నీకు తెలిసిన నేనును కాను

నువ్వు  నన్ను గుర్తిస్తే
నీ గమ్యం నీ ఎదుటే ఉంది
నువ్వు నాతో నడిస్తే
నీ మార్గం నీలోనే ఉంది

నీ గమ్యపు నీడను నేను
నీ మార్గపు తోడును నేను
గతజన్మల జాడను నేను
నీ స్నేహం వీడను నేను

నువ్వు వెదికేది
ఎవరికోసమో తెలుసా?
నా కోసమే
సరిగా చూడు
నువ్వే నేను.....