“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, ఏప్రిల్ 2015, సోమవారం

Telugu Melodies-నయనాల కొలనులు నీకై....



కిశోర్ కుమార్ బెంగాలీలో పాడిన 'నోయోనో షరోశీ కేనో' పాటకు నేను తెలుగులో వ్రాసుకుని పాడిన పాట ఇది.యధాతధంగా అదే భావాన్ని తీసుకోలేదు.బెంగాలీ పాట ఒక విషాదగీతం.ఆ విషాదగీతాన్ని మార్చి ఒక విరహగీతంగా మలచి వ్రాశాను.

ఒక మనిషిపైన అమితమైన ప్రేమను మనం పెంచుకున్నపుడు,ఆ వ్యక్తి మనకు దగ్గర కాకపోతే (అది ఏ కారణంచేత అయినా కావచ్చు),ఎంత నరకంగా ఉంటుందో చాలామందికి తెలిసిన విషయమే.

ఆ ఫీలింగ్ నే ఈపాటలో నింపడం జరిగింది.మనకు కావ్యాలలో అష్టనాయికలున్నారు.వారిలో అభిసారిక పరిస్థితి ఇదే.తన ప్రియునిపై విరహంతో వేగిపోతూ ఆమె పడే బాధకే ఈ గీతంలో ప్రాణం పొయ్యడం జరిగింది.

తెలుగులో మంచి సాహిత్యంతో కూడిన పాటలు, మంచిరాగాలు లేవన్న లోటు ఈ పాటలతో తీరుతుంది.

ఈపాట వింటుంటే కొన్ని పాతపాటల రాగాలు మీకు స్ఫురించవచ్చు. ఉదాహరణకు-వాణీజయరాం పాడిన 'విధిచేయు వింతలన్నీ మతిలేని చేష్టలేననీ' అనేపాటా,ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన 'మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక' అనేపాటా ఇదే రాగచ్చాయలలో ఉంటాయి.

ఇక్కడొక విషయం చెప్పదలుచుకున్నాను.

కలకాలం నిలచే ఏ పాటకైనా బేస్ అనేది ఒక క్లాసికల్ రాగమే అయి ఉంటుంది.ఒక క్లాసికల్ రాగాన్ని ఆధారంగా తీసుకుని కట్టిన బాణీయే కలకాలం జనుల గుండెల్లో నిలిచిపోతుంది.లేకుంటే దానిపని తాటాకు మంట అవుతుంది.

ఒక కవికి కూడా సినిమాపాట వ్రాసేటప్పుడు స్వతంత్రం ఉండదు. సినిమావారు డబ్బులిచ్చి వ్రాయించుకుంటారు గనుక,మాస్ కోసం వ్రాయిస్తారు గనుకా,వారు చెప్పిన నానాచెత్తనూ కవి వ్రాయవలసి వస్తుంది. అక్కడ తన ఆత్మను చంపుకుని డబ్బుకోసం వ్రాస్తాడు.కనుక తను అనుకున్నట్లు వ్రాయలేడు.

కానీ తన స్వంతగీతాలు తన ఇష్టం వచ్చినట్లు స్వేచ్చగా వ్రాసుకోవచ్చు. గాయకుడైనా అంతే.గాయకుడు వృత్తిపరంగా నానా చెత్తపాటలూ పాడవలసి వస్తుంది.కానీ అతనికి లోలోపల ఇష్టమైన సాహిత్యమూ సంగీతమూ వేరే ఉంటాయి.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి మోస్ట్ పాపులర్ గాయకుడు కూడా తనకు స్వేచ్చనిస్తే చక్కని ఘజల్స్ రాగాలనే తన పాటలకు సమకూరుస్తాడు గాని పిచ్చిపిచ్చి రాగాలు పెట్టడు.'తూర్పు వెళ్ళే రైలు' మొదలైన కొన్ని చిత్రాలకి ఆయన కూర్చిన సంగీతమే దీనికి తార్కాణం.

Song:--Nayanala Kolanulu neekai
Lyrics:--Satya Narayana Sarma
Music:--Kishore Kumar
Singer:--Satya Narayana Sarma

Enjoy
----------------------------------
నయనాల కొలనులు నీకై పొంగుటేలనో
ప్రియురాలి కన్నుల కాటుక కరుగుటేలనో
నయనాల కొలనులు నీకై...

కమలాల కన్నులలోనా - కదలాడు నీడలలోనా
ప్రణయాల పానుపు పైనా - విరహాల వేదనలేనా
పరువాల వేళల విషాద - గానమేలనో
మరువాల మత్తుల మాటున - మౌనమేలనో
నయనాల కొలనులు నీకై...

నీవింత వేచేవని - తనకైన తెలియునుగాని
నీ దరికి రాజాలని - గతిలోన గడచెను బ్రతుకు
నిశిరాత్రి జామున నీలో...
నిశిరాత్రి జామున నీలో - కన్నీటి రాగములేలా
సడిలేని చీకటి ఎదలో - సుడితిరుగు వేదనలేలా
బరువైన మనసున నీపై - వలపు నిండగా
క్షణమొక్క యుగముగ నడచే - శాపమాయెగా

నయనాల కొలనులు నీకై పొంగుటేలనో
ప్రియురాలి కన్నుల కాటుక కరుగుటేలనో
నయనాల కొలనులు నీకై...