“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, ఏప్రిల్ 2015, శనివారం

Telugu Melodies-Satya-వేదనైన మధురమౌనుగా...




వేదనైన మధురమౌనుగా....నువ్వు పంచుతుంటే...

'బేదోనా మొధుర్ హొయే జాయ్' బెంగాలీ పాటకు నేను వ్రాసుకున్న తెలుగుపాట ఇది.

ఈ పాటను వింటే--బెంగాలీ పాటతో సమానంగా వచ్చిందని,ఒక రకంగా చెప్పాలంటే ఇంకా బాగా వచ్చిందనీ మీరంటారు.యధాతధంగా బెంగాలీ పాటను అనువాదం చెయ్యలేదు.భావాన్ని మాత్రం తీసుకుని,సాహిత్యంలో నాకు తోచిన మార్పులు చేశాను.

ఘజల్ వ్రాయాలంటే కొన్ని సూత్రాలున్నాయి.వాటిని పాటించాలి.వాటిలో అంత్యప్రాస అనేది ఒకటి.

అందుకనే -పంచుతుంటే-పలుకుతుంటే-తలచుకుంటే-తాకుతుంటే అనే అంత్యప్రాసలను ప్రయోగించాను.

నా పాటలలో ఒక విచిత్రాన్ని మీరు గమనించవచ్చు.బయటకు కనిపించే అర్ధం ఏదైనా,వీటిలో అంతర్లీనంగా ఆధ్యాత్మిక సౌరభం పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది.ఈ పాట కూడా అంతే.

'వేకువతో వెలుగులెగయగా...అంధకారమింక తొలగదా'-అనే పాదంలో జ్ఞానతేజస్సు ఆవిర్భవించినప్పుడు  అజ్ఞానపు చీకటి అంతం అవుతుందని సూచనగా అన్నాను.

'స్వర్గమెల్ల దిగిరాదా...నువ్వు తలచుకుంటే'- అనే పాదంలో సంకల్పశక్తి బలీయంగా ఉన్నప్పుడు దివ్యచైతన్యమనే స్వర్గం తప్పక నీకోసం దిగి వస్తుందన్న భావాన్ని పొందుపరిచాను.

'ఏ క్షణమున నీవు నాకు సొంతమైతివో ఆ క్షణమే నా సర్వము నీదైనదీ' - అన్న పాదంలో, అహంనాశమే అసలైన కీలకమన్న విషయాన్ని సూచనగా చెప్పాను.

'బాధల సరిహద్దు కావల ...సంతోషపు సుమములేగా'-అన్న పాదంలో, మానవదౌర్బల్యాలను దాటగలిగితే,ఆ హద్దు అవతల అంతా సంతోషపు పూలతోటలే అన్న భావాన్ని వెలిబుచ్చాను.

'దు:ఖమె ఆనందమౌను...నువ్వు తాకుతుంటే'-అనే పాదంలో,దైవస్పర్శ మనల్ని తాకుతున్నపుడు మనం దుఖం అనుకునేది కూడా ఆనందంగా మారిపోతుందన్న రహస్యాన్ని వెల్లడించాను.

మళ్ళీ మళ్ళీ వినండి.

విని- సంగీత సాహిత్య మాధుర్యంలో ఓలలాడండి.

Song:--Vedanaina Madhuramounugaa...
Music:--Jagjit Singh Ghazal track
Lyrics:--Satya Narayana Sarma
Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------
వేదనైన మధురమౌనుగా....నువ్వు పంచుతుంటే...
వేదనైన మధురమౌనుగా....నువ్వు పంచుతుంటే...
మాటలన్ని పాటలౌను...నువ్వు పలుకుతుంటే-2
వేదనైన మధురమౌనుగా....నువ్వు పంచుతుంటే...

వేకువతో వెలుగులెగయగా...అంధకారమింక తొలగదా-2
స్వర్గమెల్ల దిగిరాదా...నువ్వు తలచుకుంటే-2
వేదనైన మధురమౌనుగా....నువ్వు పంచుతుంటే...
మాటలన్ని పాటలౌనుగా...నువ్వు పలుకుతుంటే...

[ఏ క్షణమున నీవు నాకు సొంతమైతివో
ఆ క్షణమే నా సర్వము నీదైనదీ]-2

బాధల సరిహద్దు కావల ...సంతోషపు సుమములేగా-2
దు:ఖమె ఆనందమౌను...నువ్వు తాకుతుంటే-2
వేదనైన మధురమౌనుగా....నువ్వు పంచుతుంటే-2
మాటలన్ని పాటలౌను...నువ్వు పలుకుతుంటే-2

వేదనైన మధురమౌనుగా....నువ్వు పంచుతుంటే-2