“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

26, ఏప్రిల్ 2015, ఆదివారం

నేపాల్ భూకంపం-రోహిణీ శకట ప్రభావమే

శనీశ్వరుడు రోహిణీ నక్షత్రదృష్టికి దగ్గరౌతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా విలయాలు జరగడం మొదలౌతున్నది.నిన్న నేపాల్లో జరిగిన భూకంపం దీని ప్రభావమే. రోహిణీ శకటభేదనం అనే శీర్షికలో స్టాటిస్టికల్ ఆధారాలతో సహా వివరంగా వ్రాసిన పోస్ట్ లలో ఇలాంటి ప్రకృతి విలయాలు జరుగుతాయని ముందే హెచ్చరించడం జరిగింది.

ఇప్పుడొచ్చిన ఈ భూకంపానికి కారణం మొన్న వచ్చిన సంపూర్ణ చంద్రగ్రహణం కూడా.ఆ చంద్రగ్రహణం భూతత్వరాశియైన కన్యలో సంభవించిందని ఇక్కడ గుర్తుంచుకోవాలి.అంతేగాక చంద్రగ్రహణం వచ్చిన రోజుకూడా శనివారమే. ఈ భూకంపం వచ్చింది కూడా శనివారమే.

ఏ ఏ దేశాలలో అయితే ఈ గ్రహణాలు పూర్తిగా కనిపిస్తాయో ఆయా చోట్ల భూ అయస్కాంత క్షేత్రాలలో మార్పులు రావడమూ తద్వారా ప్రకృతి భీభత్సాలు జరగడమూ మామూలే. గ్రహణాలకూ, గ్రహచారాలకూ, భూమిపైన విలయాలకూ గల ఈ సూక్ష్మ సంబంధాలను ప్రాచీనకాలంలోనే గుర్తించడం జరిగింది.

ఈ గ్రహణం మన దేశంలోని ఈశాన్యరాష్ట్రాలలో సంపూర్ణంగా కనిపించింది. ఇప్పుడు భూకంపం వచ్చిన ప్రాంతాలు కూడా కలకత్తా నుంచి నేపాల్ వరకూ ఉన్నాయి.ఈ విషయం గమనార్హం.

మొన్న శుక్రవారం నాడు సూర్యశనులు ఖచ్చితమైన షష్టాష్టక దృష్టిలోకి వచ్చి ఉన్నారు. మర్నాడే ఈ విలయం జరిగింది.

రోహిణీ శకటభేదనం జరిగే ప్రతిసారీ భారీ జననష్టం జరగడం తప్పనిసరి. ప్రస్తుత భూకంపం కూడా ముందుముందు రాబోతున్న ఇంకా భారీ విలయాలకు సూచిక మాత్రమే.

శనిగ్రహ సప్తమదృష్టి ఎంత భయంకరమైనదో వివరిస్తూ నేటికి సరిగ్గా ఆర్నెల్ల ముందు సెప్టెంబర్ -2014 లో వ్రాసిన పోస్ట్ ను ఇక్కడ చదవండి.భారత్, నేపాల్ లలో భూకంపం ఎందుకొచ్చింది అన్న విషయం క్లియర్ గా అర్ధమౌతుంది.