“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, ఏప్రిల్ 2015, సోమవారం

Kazi Nazrul Islam జాతకం పరిశీలన-2

ఒక మనిషి జీవితంలోని దశా వివరాలను పరిశీలించడం ద్వారా గ్రహస్వభావాలనూ అవి మానవజీవితాన్ని ఎలా ప్రభావితం గావిస్తాయన్న విషయాలనూ మనం తెలుసుకోవచ్చు.నజరుల్ జీవితంలో దశలు ఎలా పనిచేశాయో గమనిద్దాం.

ఈయన విశాఖా నక్షత్రం -2 పాదంలో జన్మించాడు.విశాఖ రెండోపాదం అంటే అది వృషభ నవాంశ అవుతుంది.కనుక శుక్ర లక్షణాలైన కళలు సాహిత్యం నటన పాటలు రాగాలు ఇత్యాది ఈయన జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.అలాగే జరగడాన్ని మనం గమనించవచ్చు.నక్షత్రపాదాల ప్రభావం మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తుందో అనడానికి ఇదే ఒక ప్రబలమైన ఉదాహరణ.

జననసమయంలో గురుమహర్దశ సగం అయిపోయి ఉన్నది.ఈయన గురు/శుక్ర/శుక్ర దశ జరుగుతున్న సమయంలో భూమిమీదకు వచ్చాడు.అందుకే జీవితమంతా ఆధ్యాత్మిక,సాహిత్య,కళారంగాలలో తపించాడు.జనన సమయం లో జరుగుతున్న దశలు ఈవిధంగా మనిషి జీవితాన్ని మొత్తాన్నీ శాసిస్తాయి.

ఈయన జాతకంలో గురుదశ(1907) వరకూ,శనిదశ(1926)వరకూ జరిగాయి.ఈ రెండు దశలు ఆయన జీవితానికి ఒక దిశను సమకూర్చాయి. శనిచంద్రుల కలయికవల్ల ఈ సమయంలో ఆయనకు విశాలమైన ఉదారమైన ఆధ్యాత్మిక భావాల పునాదులు పడ్డాయి.మనిషి జీవితంలోని కష్టాలను కూడా ఆయన అప్పుడే చవిచూచాడు.ఇది శనీశ్వరుని కారకత్వ ప్రభావమే. జీవితంలో కష్టాలను చూడని మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడం అసాధ్యం.

1917 లో చదువు మానేసి బ్రిటిష్ సైన్యంలో చేరాడు.ఆ సమయంలో శని/శుక్ర దశ జరిగింది.చంద్ర లగ్నాత్ శనిశుక్రులిద్దరూ ఈయనకు మంచివారే.కనుక కాళిదాసు సూత్రం ప్రకారం చదువును మధ్యలో మాన్పించి సైన్యంలో చేర్పించారు.లగ్నాత్ బుధుడు పాపి.పైగా చతుర్దంలో వక్ర గురువున్నాడు.కనుక చదువు చెడిపోయింది.సైన్యంలో ఉంటూ విప్లవ కవిత్వం వ్రాస్తూ ఉంటె ఏ ప్రభుత్వం ఊరుకుంటుంది?అందుకని 1920 లో సైన్యాన్ని విడచిపెట్టి కలకత్తాకు చేరాడు.వక్రగ్రహ దశ జరిగే సమయంలో జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయన్న సూత్రం ఇక్కడ అక్షరాలా పనిచెయ్యడం గమనించవచ్చు.

18-6-1921 న ఈయన జీవితంలో ఒక ముఖ్య సంఘటన నరిగింది. ఈయనకు నర్గీస్ అనే యువతితో నిశ్చితార్ధం అయింది.కానీ ఆ రోజున పెళ్ళిపెద్దలు ఒక షరతు విధించారు.వివాహం తర్వాత తను దౌలత్ పూర్లో శాశ్వతంగా ఉండిపోవాలి.ఆ షరతు నజరుల్ కు ఇష్టం లేదు.అందుకని ఆ వివాహాన్ని తిరస్కరించి బయటకు వచ్చేశాడు.ఆ రోజున ఆయన జీవితంలో శని/రాహు/గురు దశ జరుగుతున్నది.శని రాహువులు శపిత యోగం.రాహు గురువులు చండాలయోగం.కనుకే పీటలమీద పెళ్లి ఆగిపోయింది.ఆ విధంగా ఆ పెళ్లి బ్రేక్ అయిపోయింది.

ఆ తర్వాత కొద్ది కాలానికే 1922 లో ఆయన వ్రాసిన 'బిద్రోహీ' అనే కవిత ఆయనకు చిరకాలం నిలిచి ఉండే పేరును తెచ్చి పెట్టింది.ఆ సమయంలో ఏ దశ జరిగిందో గమనిస్తే విచిత్రం కలుగుతుంది.అది శని/రాహు/శనిదశ. అలాంటి శపితదశలో అలాంటి విప్లవ తిరుగుబాటు కవిత్వమే మనిషి వ్రాయగలడు.పేరును తెచ్చేదీ అదే.అలాగే ఖచ్చితంగా జరిగింది.అయితే ఈయన వ్రాసిన కవితలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం చేత నిషేధించబడ్డాయి.రాజద్రోహ నేరం క్రింద ఈయన జైల్లో కూడా పెట్టబడ్డాడు.ఇది కూడా శని/రాహువుల (శపితయోగ)ప్రభావమే.

25-4-1924 న ఈయన ప్రమీలాదేవి అనబడే బ్రహ్మసమాజ సభ్యురాలిని ప్రేమవివాహం చేసుకున్నాడు.ఆ సమయంలో తనకు శని/గురు/శనిదశ జరిగింది.శని పంచమంలో ఉండటమూ,చంద్రలగ్నాత్ మళ్ళీ పంచమాదిపతి కావడమూ,గురుచంద్రులయోగం చతుర్దంలో ఉండటమూ చూస్తే ప్రేమవివాహం కనిపిస్తూనే ఉన్నది.అదే ఆ సమయంలో జరిగింది.

పంచమంలో ఉన్న అష్టమాదిపతి శనివల్ల ఏమి జరుగుతుంది? సంతానానికి గండాలుంటాయి.వారు అల్పాయుష్కులౌతారు.అదే జరిగింది.ఈయన మొదటి కుమారుడు కృష్ణమొహమ్మద్ చిన్నప్పుడే చనిపోయాడు.రెండవ కుమారుడు బుల్బుల్ కూడా అమ్మవారు పోసి చిన్నప్పుడే చనిపోయాడు. తర్వాత సంతానం సవ్యసాచి,అనిరుద్ద్ ఇద్దరూ బ్రతికారు.వీరిలో అనిరుద్ద్ మంచి గిటారిస్ట్ గా ఎదిగాడు.కానీ ఈయన కంటే రెండేళ్ళు ముందే ఈయన కళ్ళముందే చనిపోయాడు.పంచమంలోని వక్రశని వల్ల జరిగే విలయం ఇలా ఉంటుంది మరి.

1936 లో 'విద్యాపతి' అనే సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేశాడు.ఆ సమయంలో బుధ/రాహుదశ నడిచింది.తమ సహజ కారకత్వాలను బట్టి యధావిధిగా రాహు బుధులు ఈయనను సినిమా రంగంలోకి తీసుకెళ్ళారు. బుధుడు శుక్రునితో కలసి దశమంలో ఉండటం చూడవచ్చు.

1939 ప్రాంతాలలో బుధ/గురుదశలో కలకత్తా రేడియోలో పనిచేశాడు.ఆ సమయంలో అనేక సాంప్రదాయ రాగాలపైన పరిశోధన చేశాడు.గురువు యొక్క సాంప్రదాయ కారకత్వమూ ఆయనపైన గల శుక్రబుధుల దృష్టీ ఇలా పనిచేశాయి.

1939 లో బుధ/గురు/కేతుదశలో భార్యకు పక్షవాతం వచ్చింది.సప్తమం నుంచి బుధుడు,కేతువులిద్దరూ రోగాన్ని సూచిస్తారు.గురువు మంచివాడు కాదు.కనుక భార్యకు బుధకారకత్వాలలో ఒకటైన పక్షవాతం వచ్చింది.

1941 లో ఈయనే సీరియస్ రోగం బారినపడ్డాడు.మెదడు నరాలకూ, జ్ఞాపకశక్తికీ కూడా బుదుడే కారకుడు.ఆ సమయంలో బుధ/శని/శుక్రదశ జరిగింది.కర్కాటక లగ్నానికి ఈ ముగ్గురూ పాపులే.శని దీర్ఘరోగానికి సూచకుడు.శుక్రుడు బాధకుడు.బుధుడు పాపి.కనుక జీవితాంతం బాధించిన రోగం ఈ సమయంలోనే ఆయన్ను ఎటాక్ చేసింది.

30-6-1962 న శుక్ర/గురు/చంద్ర దశలో ఈయన భార్య మరణించింది. దారాకారకుడైన గురుని వక్రస్థానం కన్యనుంచి గమనిస్తే,శుక్రుడు అష్టమంలో ఉంటూ మరణాన్ని సూచిస్తున్నాడు.గురు చంద్రులిద్దరూ ద్వితీయ మారక స్థానంలో ఉన్నారు.ఇంకేం కావాలి?

1974 లో రవి/బుధదశలో చిన్నకుమారుడు అనిరుద్ద్ మరణించాడు. పంచమం నుంచి చూస్తే రవి సప్తమ మారకస్తానంలోనూ బుధుడు రోగస్థానంలో మారకుడైన శుక్రునితో కలసి ఉండటం చూడవచ్చు.

29-8-1976 న చంద్ర/చంద్ర/గురుదశలో నజరుల్ మరణించాడు.ఆ సమయంలో గజకేసరీయోగ దశ జరిగింది.కనుక ఆయన కర్మ మొత్తం ప్రక్షాళన చేసుకుని ఉత్తమమైన మరణాన్ని పొందాడని మనం చెప్పవచ్చు. ఆయన ఆత్మ ఉత్తమలోకాలకు చేరుకుని ఉంటుంది. మరుజన్మలో ఈ లౌకిక బాదరబందీలేని ఒక ఉత్తముడైన యోగిగా ఆయన జన్మించాడని మనం ఊహించవచ్చు.ఫోటోలోని ఆయన కళ్ళను గమనిస్తే అవి యోగినేత్రాలన్న విషయం మనం స్పష్టంగా చూడవచ్చు.

అదే నిజం కూడా.

(సమాప్తం)