“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, డిసెంబర్ 2014, మంగళవారం

Telugu Melodies-PB Srinivas-నీలి మేఘమాలవో...


'చౌద్ వి కా చాంద్" అనే సినిమా 1960 లో వచ్చింది.ప్రముఖనటుడు దర్శకుడు నిర్మాత గురుదత్ దీనిని తీశాడు.అందులో మహమ్మద్ రఫీ పాడిన 'చౌద్ వి కా చాంద్ హో యా ఆఫ్తాబ్ హో' అనే మధురగీతం అప్పట్లో యావద్దేశాన్నీ ఉర్రూతలూగించింది.ఇప్పటికీ అది అత్యంత మధురమైన గీతాలలో ఒకటిగా నిలిచిపోయింది.దీనికి సంగీతం సమకూర్చింది "రవి" అనే సంగీత దర్శకుడు.

మన తెలుగులో 1962 లో "మదన కామరాజు కథ" అనే ఒక సినిమా వచ్చింది. అందులో హరనాద్ తన ప్రేయసి శిల్పాన్ని చెక్కుతూ ఉంటాడు.ఆ శిల్పాన్ని పట్టుకొని ఈ పాట పాడతాడు.ఈ గీతాన్ని పీ బీ శ్రీనివాస్ ఆలపించారు.రాజన్ నాగేంద్ర దీనికి సంగీతం అందించినా హిందీ రాగాన్ని యధాతధంగా దించారు గనుక ఈ పాటవరకు సంగీత దర్శకుడు రవి అనే చెప్పుకోవాలి.

హిందీ పాట చిత్రీకరణా దానిలో గురుదత్ వహీదాలు చూపించిన భావ వ్యక్తీకరణా అద్భుతాలు.ఆ పాట సెట్టింగూ దానిని చిత్రీకరించిన విధానమూ కూడా అద్భుతాలే.వీటి ముందు తెలుగు పాటా,హరనాద్ నటనా పేలవంగా తేలిపోయాయి.

గానం విషయానికొస్తే,మహమ్మద్ రఫీ,పీబీ శ్రీనివాస్ ఇద్దరూ అఖండులే గనుక వారి వారి పాటలకు వారు పరిపూర్ణ న్యాయం చేశారు.

అయితే,భాష ఏదైనప్పటికీ, ప్రతిపాటలోనూ కవి చాలా గట్టిగా ఫీలై వ్రాసిన కొన్ని మాటలుంటాయి.హిందీ సాహిత్యం గురించి చెప్పనక్కర్లేదు. తెలుగుపాటలో కూడా అలాంటి పదాలున్నాయి.మూడో చరణంలో 'రావో యుగాల ప్రేయసి నన్నాదరించవో' అనే వాక్యం అలా ఫీలై వ్రాసినదని నా ఊహ.

'ఎన్నో యుగాలనుంచి నీకోసం వేచి చూస్తున్నాను ఇకనైనా వచ్చి నన్ను ఆదరించు'- అనిన అద్భుతమైన భావన కవిమనస్సులో నుంచి ఇక్కడ జాలువారింది.

ఈ ట్రాక్ హిందీ పాటది.హిందీ ట్రాక్ మీద తెలుగు పాటను పాడాను గనుక తెలుగుపాటకూ,నా ఈ పాటకూ హమ్మింగ్ లోనూ,పాట ముగింపులోనూ తేడాలుంటాయి.

గీతం:- నీలిమేఘ మాలవో
సినిమా:-మదన కామరాజు కధ
రచన:-జీ కృష్ణమూర్తి
సంగీతం:-రాజన్ నాగేంద్ర,
హిందీ సంగీతం-రవి.
గానం:-పీ బీ శ్రీనివాస్
కరావోకే గానం:-సత్యనారాయణ శర్మ

Enjoy
-------------------------------------------------------------------

నీలిమేఘ మాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచి పోదువో
నీలిమేఘ మాలవో

నీ మోములోన జాబిలీ దోబూచు లాడెనే
నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే
నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో
నీలిమేఘ మాలవో

నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే
నీ వలపు తనివి తీరని మధురానురాగమే
నిలచే వదేల నా పిలుపూ ఆలకించవో
నీలిమేఘ మాలవో

రాదేల జాలి ఓ చెలి ఈ మౌనమేలనే
రాగాల తేలిపోదమె జాగేల చాలునే
రావో యుగాల ప్రేయసి నన్నాదరించవో
నీలిమేఘమాలవో...