“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, డిసెంబర్ 2014, శుక్రవారం

28-12-2014 ఆదివారం - 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకావిష్కరణ

ఆంధ్రదేశానికి,తెలుగు ప్రజలకు,ఒక అద్భుతమైన కానుక.

తెలుగుపద్య సాహిత్య చరిత్రలోనూ,ఆధ్యాత్మిక చరిత్రలోనూ,శుద్ధ శ్రీవిద్యాసాంప్రదాయం లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన.

చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంఘటన.
జగజ్జనని అనుగ్రహంతో ఎట్టకేలకు సాకారం కానున్నది.

రాబోయే ఎంతోకాలంపాటు అటు ఆధ్యాత్మికరంగంలోనూ ఇటు సాహిత్యరంగంలోనూ ధృవతారగా నిలిచి ఉండి,ఎంతమంది చేతనో చదవబడుతూ,ఎంతమంది జీవితాలనో దివ్యత్వంతో వెలిగించబోయే అద్భుతమైన ఆధ్యాత్మికగ్రంధం 'శ్రీవిద్యారహస్యమ్' వెలుగు చూడబోతున్నది.

1200 పైగా తెలుగు పద్యాల ద్వారా,వాటి వివరణద్వారా,శుద్ధ శ్రీవిద్యోపాసన ఎలా ఉంటుందో,ఈ ఉపాసనకు గల తాంత్రిక మూలములు ఏమిటో,దానికి గల వేదప్రామాణికత ఏమిటో,ఈ గ్రంధంలో అత్యంత సరళమైన వ్యావహారిక భాషలో వివరించబడింది.అంతేగాక,నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుంది?దానికి కావలసిన అర్హతలు ఏమిటి? దానిని చేసే విధానాలు ఎలా ఉంటాయి?దాని పరమ గమ్యం ఏమిటి?దానిని ఎలా సాధించాలి?మొదలైన అనేక విషయాలు కూడా సందర్భోచితములుగా వివరించబడ్డాయి.

28-12-2014 ఆదివారంనాడు విజయవాడలో 'శ్రీవిద్యారహస్యమ్' గ్రంధావిష్కరణ జరుగుతుంది.అందరికీ అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఆదివారంనాడు పెట్టుకోవడం జరిగింది.

ఆ తర్వాత, జనవరి 1 నుంచి 10 వరకు విజయవాడ P.W.D గ్రౌండ్స్ లో జరుగబోయే 'పుస్తక మహోత్సవం (Book Exhibition)' లోని 'శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పోరేషన్' వారి స్టాల్లో ఈ పుస్తకం లభ్యమౌతుంది.

దూరప్రాంతాలలో ఉన్నవారికోసం ఈ పుస్తకం ఆన్ లైన్ లో కూడా లభ్యమౌతుంది.'కినిగే' వారితోగానీ,ఇతర ఆన్ లైన్ బుక్ ప్రొవైడర్స్ తో గాని అనుసంధానం అవ్వడం ద్వారా ఈ సౌకర్యం కల్పించబడుతుంది.ఆ పని జరుగుతున్నది.

నా శిష్యులను,అభిమానులను,నా బ్లాగు పాఠకులను,నన్ను కలవాలని అనుకునే అందరినీ ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను.నాతో ముఖాముఖీ మాట్లాడాలనుకునే వారికి,సందేహాలు తీర్చుకోవాలనుకునేవారికి ఇదే నా స్వాగతం.

చాలామంది నన్ను ఎప్పటినుంచో అడుగుతున్నారు.మీ 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకం రిలీజ్ చేసేది ఎప్పుడో చెప్పండి? అని.

అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆలస్యం అవుతూ వస్తున్నది.అందుకే అడిగినవారికందరికీ 'ఒకవారం ముందుగా చెప్తాను' అని చెబుతూ వస్తున్నాను.చెప్పిన విధంగా ఒక వారం ముందుగా బ్లాగుముఖంగా ఈ సభను ఎనౌన్స్ చేస్తున్నాను.

ఆ రోజున-'శ్రీవిద్యోపాసన' గురించి,ఈ పుస్తకం గురించి,నా ఉపన్యాసం ఉంటుంది.అలాగే,ఆధ్యాత్మిక రంగంలో అనుభవజ్ఞులైన మిత్రులు మరికొందరు కూడా మాట్లాడతారు.ఈ సభకు రాలేని వారికోసమై,మరియు విదేశాలలో ఉన్న నా అభిమానుల కోసమై,సభాకార్యక్రమం వీడియో అంతా ఈ బ్లాగ్లో కాలక్రమేణా అప్ లోడ్ చెయ్యబడుతుంది.

తేదీ
28-12-2014 (ఆదివారం)

సమయం
ఉదయం 10.00 గంటలకు.

పుస్తకావిష్కరణ వేదిక
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అసోసియేషన్ హాల్
అంజనం బిల్డింగ్
సివిల్ కోర్టుల ఎదురుగా
గవర్నర్ పేట.
విజయవాడ.

అందరూ ఆహ్వానితులే.