“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

10, డిసెంబర్ 2014, బుధవారం

నీ ఇమేజ్ సంగతి ఆలోచించావా?

మొన్న నాలుగో తేదీన ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ఘంటసాల జయంతి సందర్భంగా మ్యూజికల్ నైట్ జరిగింది.అదేమంత ఊహించినంత గొప్పగా సాగలేదు.నాకే నచ్చలేదంటే ఇంక అనుభవజ్ఞులైన ఆడియన్స్ కి నచ్చకపోవడం వింతేముంది?

మంచిపాటలు పాడగల సింగర్స్ ఉన్నప్పటికీ వారికి సరియైన పాటలు ఇవ్వకపోవడం,అసలు ప్రోగ్రాం కంటే కొసరు 'సన్మాన కార్యక్రమం' ఎక్కువ సమయాన్ని ఆక్రమించడం,ఘంటసాల మాస్టారి పాటలకంటే ఒక స్పాన్సర్ తను స్వంతంగా వ్రాసుకున్న ప్రైవేట్ పాటలు పాడి విసిగించడం ప్రేక్షకులలో నిరాశను మిగిల్చింది.ఘంటసాల మాస్టారి అభిమానులు ఎందఱో ఆ కార్యక్రమాన్ని చూద్దామని వచ్చారు.కానీ నిర్వహణాలోపం వల్ల కార్యక్రమం ఫెయిలైంది.

ఆయన పాడుతుంటే జనం 'ఒద్దు ఒద్దు ఆపు దిగిపో దిగిపో' అని ఒకటే గోల.కానీ ఆయనెవరో స్తితప్రజ్ఞుడిలా ఉన్నాడు.తను వ్రాసుకున్న సొంత పాటలన్నీ తాపీ ధర్మారావులా నిదానంగా పాడి చివరిలో 'మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి' అంటూ ఏమీ జరగనట్లుగా స్టేజీ దిగిపోయాడు.ఒక రాగంలేదు, తాళంలేదు,గాత్రధర్మం లేదు. స్టేజీకింది ప్రేక్షకులూ స్టేజీ మీద మేమూ కూడా వినలేక చచ్చాం.

మధ్యలో నేను ఏదో పనుండి బైటకు వచ్చాను.అప్పుడు కొందరు ప్రేక్షకులు నన్ను గుర్తుపట్టి వారి నిరాశను వ్యక్తం చేశారు."సార్.ఇది ఘంటసాల గారి ప్రోగ్రామా?ఆ ప్రైవేట్ పాటలాయన ప్రోగ్రామా?ఆయన ఇంకాసేపు పాడినట్లైతే స్టేజీమీద చెప్పులు పడి ఉండేవి సార్" అని ఒకతను నాతో అన్నాడు.

నేను సరిగ్గా ఆయన వెనుకే కూచుని ఉన్నాను.ఒకవేళ అదే జరిగి ఉంటే, ఉన్నట్టుండి ఒక పల్టీ కొట్టి,చెప్పుల నుంచి తప్పుకుని స్టేజీ కిందకు దూకే అవకాశం మిస్సయింది కదా? మన మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడే అవకాశం పోయిందే? అని బాధపడ్డాను.

'బాబూ.నేను కార్యక్రమ ఆర్గనైజర్ ను కాను.నేనూ ఒక గాయకుడిని మాత్రమే.ప్రోగ్రాం సరిగ్గా జరగకపోవడంలో నా బాధ్యత ఏమీలేదు.' అంటూ నా నిస్సహాయతను వ్యక్తం చేశాను.ఒక చిన్న ప్రోగ్రాములో కూడా ఎన్ని రాజకీయాలు జరుగుతాయో ప్రత్యక్షంగా చూచిన నాకు ఒక్కసారిగా ఇలాంటి ప్రోగ్రాములంటే విరక్తి వచ్చేసింది.

అక్కడున్న ప్రతి ఒక్కరూ వారివారి రాజకీయాలు నడిపారు.గాయకులకు ఎలాట్ చేసిన పాటలు చివరి నిముషంలో మారిపోయాయి.ఆర్కెష్ట్రా వారు బిట్ వర్క్ సరిగ్గా ఇవ్వలేదు.ఘంటసాల మాస్టారి మాటలకంటే జానకి,సుశీల గార్ల సోలో పాటలు ఎక్కువగా పడ్డాయి.నిర్వాహకులలోనూ ఆర్కేష్ట్రా లోనూ ఒక్కరిలో కూడా చిత్తశుద్ధి గానీ ఓపన్ మైండు గాని లేనేలేదు.ఒక టౌన్ లెవల్ ప్రోగ్రాం లోనే ఇన్ని రాజకీయాలుంటే ఇంక కోట్ల రూపాయలతో నడిచే సినిమా ఫీల్డ్ లో ఇంకెన్ని ఉంటాయో అనిపించింది.

ఆరోజు స్టేజీమీద 'మల్లియలారా మాలికలారా' సోలో సాంగ్ పాడాను.వ్యాఖ్యాత ఆ పాటను పొరపాటుగా ఇది 'తోడికోడళ్ళు' చిత్రంలో ఆత్రేయగారు వ్రాసిన పాట అని ఎనౌన్స్ చేశాడు.ప్రేక్షకులలో సంగీతం బాగా వచ్చినవారూ బాగా పాడగలిగిన వారూ ఘంటసాల మాస్టారి వీరాభిమానులూ ఉన్నారు.ఎవరో ఒకాయన లేచి 'అయ్యా ఇది "నిర్దోషి" చిత్రంలోని పాట.నారాయణ రెడ్డిగారు వ్రాసిన పాట.సంగీతం ఘంటసాల మాస్టారు.సరిగ్గా ఎనౌన్స్ చెయ్యండి.'అని అరిచాడు.

నేను పాడటానికి రెడీగా మైకు పుచ్చుకుని ఉన్నాను గనుక వెంటనే 'అవును ఇది సి.నారాయణ రెడ్డిగారు వ్రాయగా ఘంటసాల మాస్టారు స్వరపరచిన పాట.నిర్దోషిలోదే. మీరు చెప్పినది కరెక్టే.' అని మైకులో చెప్పి అతన్ని శాంతింప చేశాను.

ఆ విధంగా 'ఘంటసాల నైట్' నిరాశాజనకంగా ముగిసింది.

ఆ మర్నాడు బృందావన్ గార్డెన్స్ లో జరిగిన "సావిత్రి జయంతి" కార్యక్రమంలో భాగంగా ఆమె నటించిన చిత్రాలలోని గీతాలను కొన్ని ఆలపించాము.

'ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది' పాటను నేనూ,హెలెన్ కుమారీ కలసి పాడాము.

మూడు రోజుల తర్వాత ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు.

మామూలు విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఇలా అన్నాడు.

'స్టేజీమీద  పాటల వరకూ బాగానే ఉన్నాయి.బ్లాగులో పాటలు కూడా వింటున్నాను.బాగుంటున్నాయి.కాని ఒక్క విషయం మాత్రం నువ్వు మర్చిపోతున్నావ్.బ్లాగుల్లో ఇప్పటివరకూ ఒక ఆధ్యాత్మిక ఇమేజ్ నీకున్నది. నీ అనాధ్యాత్మిక పోస్ట్ ల వల్ల అది పాడైపోతున్నది.నీ ఇమేజ్ సంగతి ఆలోచించావా?ఉద్యోగపరంగా చూద్దామా అంటే ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారిగా ఉన్నావు.అలాంటి నీవు గుళ్ళలో గోపురాలలో పాటలు పాడటానికి వెళ్ళడం ఏమిటి?

సరే పాడితే పాడావు.బాగా పాడుతున్నావని ముందుముందు వినాయకచవితి పందిళ్ళలో, శ్రీరామనవమి పందిళ్ళలో కూడా రమ్మంటారు.ఆ తర్వాత పెళ్లి ఫంక్షన్స్ లో పాడమంటారు.ఆ తర్వాత రోడ్డుమీద బ్యాండ్ మేళంలో పాడమని పిలుస్తారు.వెళతావా? ఎంత చండాలంగా ఉంటుంది? ఆలోచించు.

బ్లాగుల్లో ఒక్కసారిగా నీ ఆధ్యాత్మిక ధోరణి మార్చేసి సినిమా పాటలు ఇంకా ఏవేవో ఇతర విషయాలూ మొదలుపెట్టావు.నిన్ను గురువుగా భావించే వాళ్ళు కొందరున్నారు.వాళ్ళు ఎంత నొచ్చుకుంటారు?" అంటూ ఈ ధోరణిలో నాకు హితబోధ గావించాడు.

నాకు చచ్చే నవ్వొచ్చింది.

'నీ బాధ నాకర్ధమైందిలే గాని ఒక విషయం చెప్తా శాంతంగా వింటావా?' అడిగాను.

'చెప్పు.తప్పుతుందా?' అన్నాడు.

'ఓషో రజనీష్ అమెరికాలో ఉపన్యాసాలు ఇస్తున్నపుడు అక్కడి క్రిష్టియన్స్ ఒక దుమారం లేవదీశారు."నీ ఉపన్యాసాల వల్ల మా మతం దెబ్బతింటున్నది. నీ బోధలు ఆపు" అంటూ గొడవ చేశారు.

దానికి ఆయన భలే జవాబిచ్చాడు.ఆయనేమన్నాడో తెలుసా?

"నేనిచ్చే రెండు ఉపన్యాసాలతో,రెండువేల ఏండ్ల చరిత్రగలిగిన మీ మతం కూలిపోయే పనైతే అటువంటి మతం ఉంటే ఎంత? ఊడితే ఎంత?" అన్నాడు.

నేనూ అదే అందామనుకుంటున్నాను.నేను పాడే పాటలతోనూ నా ఇతర పోస్ట్ ల తోనూ నాకున్న ఆధ్యాత్మిక ఇమేజి దెబ్బతినే పనైతే అదెంత గొప్ప ఇమేజో అక్కడే అర్ధం చేసుకోవచ్చు.అలాంటి చవకబారు ఇమేజి నాకక్కరలేదు. అలాంటి ఇమేజి కోసం ప్రాకులాడే ఖర్మా నాకొద్దు.

అయినా,ఆధ్యాత్మికత అంటే నీకేమీ అర్ధం కాలేదని నీ సలహావల్ల నాకర్ధమైంది.ముందు మీకు అసలైన ఆధ్యాత్మికత ఏంటో అర్ధమైతే కదా ఆ తర్వాత నేనేంటో అర్ధం కావడానికి?

పైగా నేను ఇమేజి మీద ఆధారపడి బ్రతకడంలేదు.అలా ఒళ్ళు చూపించుకుని బ్రతకడానికి నేను సినిమా హీరోయిన్ని కాను.నేను ఏది చేసినా ఇతరుల కోసం చెయ్యడంలేదు.నా ఆత్మానందం కోసం చేస్తున్నాను. ఆధ్యాత్మిక పోస్ట్ లు వ్రాసినా నాకోసమే వ్రాస్తున్నాను.పాటలు పాడినా నాకోసమే పాడుకుంటున్నాను.జాతకాలు చూసినా నా ఆనందం కోసమే చూస్తున్నాను.మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసినా నా కోసమే,యోగాభ్యాసం చేసినా నాకోసమే.ఇంకేం చేసినా నా ఆనందం కోసమే చేస్తున్నాను.ఇదంతా నా ఆనందం కోసమే.అంతేగాని ఇతరుల మెప్పుకోసం కానేకాదు.ఇతరుల మెప్పు మీద బ్రతికేంత చీప్ టేస్ట్ నాకులేదు.ఎవరికి ఏది నచ్చినా నచ్చకపోయినా నాకనవసరం.వాళ్ళేదో అనుకుంటారని నా పధ్ధతి నేను చస్తే మార్చుకోను.

నువ్వు భయపడినంతగా చివరికి రోడ్డుమీద బ్యాండ్ మేళంలో పాడనులే. భయపడకు.మంచి ప్రోగ్రాం అయితేనే చేస్తాను.లేకుంటే చెయ్యను.మొన్న రెండుసార్లకే బుద్ధొచ్చింది.ఆ కుళ్ళు రాజకీయాలు మనకు గిట్టవని నీకూ తెలుసుగా.

ఇక గురుత్వం సంగతి చెప్తా విను.

నాకు శిష్యులంటూ ఎవరూ లేరు.శిష్యుల్ని పోగేసుకోవాలనే దురద నాకేమీ లేదు.వాళ్ళు ఊరకే 'గురువుగారు' అని పిలిచినంత మాత్రాన నేనేమీ పొంగిపోయి పగిలిపోను.ఇలాంటి పిలుపు నాకు చిన్నప్పటినుంచీ అలవాటే. ఇది నాకేమీ కొత్తకాదు.కనుక నేనేమీ ఉబ్బిపోను.ఈ పిలుపు ఊరకే మాటవరసకు పిలిచే పిలుపని నాకు బాగా తెలుసు.నిజంగా నేను ఉపదేశం ఇస్తానంటే ఎగురుకుంటూ వచ్చి తీసుకునేవాళ్ళు ఎవరూ లేరు.ఉన్నా నేను పెట్టే పరీక్షలకు వాళ్ళు క్షణంకూడా తట్టుకోలేరు.నా మార్గాన్ని వాళ్ళు అనుసరించలేరు.అలా ట్రై చేసిన వాళ్ళు ఎందఱో ఇప్పటికి మళ్ళీ కనపడకుండా పత్తా లేకుండా పారిపోయారు.

వాళ్ళ  స్వార్ధంకోసం స్వలాభం కోసం నన్ను అలా 'గురువుగారు' అంటూ పిలుస్తున్నారని నాకు తెలుసు.స్వార్ధాన్ని ఒదిలిపెట్టి నేను చెప్పేదారిలో మనస్ఫూర్తిగా నడిచేవారు ఒక్కరూ లేరు.అదీ నాకు తెలుసు.

ఇలాంటి చెత్త ఇమేజిల మీదా,చెత్త మనుషులమీదా నాకు ఎలాంటి నమ్మకమూ లేదు.కనుక నువ్వేమీ భయపడకు.అయినా ఆధ్యాత్మికత అనేది అలా ఊరకే పొయ్యేదికాదు.అంత త్వరగా వచ్చేదీకాదు.ఆధ్యాత్మికత అంటే విడాకులు కాదు,నచ్చకపోతే వరుసగా ఇచ్చుకుంటూ పోవడానికి.అంత చెయ్యకూడని పని నేనేమీ చెయ్యలేదు.ఒకవేళ పాడినా పిచ్చిపిచ్చి పాటలేమీ పాడను.కనుక నీవు నిశ్చింతగా ఉండు." అని చెప్పాను.

మా ఫ్రెండ్ కొంచం కన్విన్స్ అయినట్లే కనిపించాడు.కానీ పూర్తిగా అయినట్లు అనిపించలేదు.ఏదేమైనా నేను స్టేజీలెక్కి సినిమాపాటలు పాడటం తనకు నచ్చలేదని అర్ధమైంది.

లోకులేమనుకుంటారో అని అనుక్షణం భయపడుతూ ఉండటం ఇంకేదైనా అవుతుందేమో గాని ఆధ్యాత్మికత మాత్రం కానేకాదు.అలా భయపడేవారు ఇంక సాధనేమి చెయ్యగలరు?ఆధ్యాత్మికంగా ఎలా పురోగమించగలరు?అసంభవం.నిజమైన ఆధ్యాత్మికులు సంఘాన్ని గడ్డిపోచతో సమానంగా చూస్తారు.లోకుల అభిప్రాయం అంటే వారికి చెత్తతో సమానం.

మా ఫ్రెండ్ మాటలను బట్టి లోకుల అభిప్రాయాలకు మనుషులు ఎంత విలువనిస్తారో, ఇమేజి అనే చట్రంలో బంధింపబడి తమ జీవితాన్ని ఎంతగా కోల్పోతుంటారో మళ్ళీ ఇంకొకసారి నాకర్ధమైంది.

ఒక తాత్వికుడు హేళనగా ఇలా అంటాడు.

"ఇతరుల కళ్ళలో మనమీద మెచ్చుకోలే మన జీవం.అది లేకుంటే మనలో ప్రాణం ఉన్నా లేనట్లే.ఇతరులు మనల్ని మెచ్చుకోకపోతే మనం శవాలతో సమానమే."

ఇమేజి అనేది ఒక దిష్టిబొమ్మ.దానికేమీ విలువనివ్వవలసిన పనిలేదు. ఆత్మవిశ్వాసం లేనివారే ఇమేజికి విలువనిస్తారని నా ప్రగాఢ విశ్వాసం.

ఇమేజి అంటే తెలుగులో ప్రతిబింబం అని అర్ధం.ప్రతిబింబం మాయ.దానికి ఉనికి లేదు.అది నిజం కాదు.బింబమే నిజం.బింబాన్ని మర్చిపోయినవారే ప్రతిబింబం వెంట పడతారు.దానికి విలువనిస్తారు.

తన విలువ తనకు తెలియనివారు మాత్రమే ఇతరులు తనకిచ్చే విలువ మీద ఆధారపడతారు.తానేమిటో తనకు తెలిసినవారు ఇమేజికి ఏమాత్రం విలువనివ్వరు.తనమీద తనకు నమ్మకం ఉన్నవారు 'ఇతరులేమనుకుంటారో' అని ఒక్క క్షణం కూడా భయపడరు.

తాను సత్యం.ఇమేజి అబద్దం.మనిషి సత్యాన్నే అనుసరించాలి గాని అసత్యాన్ని కాదు.

మనిషనేవాడు తనకోసం తాను బ్రతకాలి.ఇమేజి కోసం బ్రతకకూడదు.