“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

12, డిసెంబర్ 2014, శుక్రవారం

June 21-World Yoga Day

జూన్ 21 ని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం చాలా ముదావహం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానుల కందరికీ ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది.అదికూడా సమ్మర్ సోల్స్టైస్ అయిన జూన్-21 ఆరోజుగా ఎంచుకోవడం జ్యోతిష్యశాస్త్ర పరంగా కూడా చాలా సరిగ్గా ఉన్నది.

నరేంద్రమోడీగారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశ విధానాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి.ఎన్నోరంగాలలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తున్నాయి.అలాగే సాంస్కృతిక ధార్మికరంగాలలో కూడా వస్తున్నాయనడానికి ఇదొక సూచన.

నా ఉద్దేశ్యం ప్రకారం ఇది ఇప్పటికే ఎంతో ఆలస్యం అయిన సంఘటన.

అన్నిదేశాల వాళ్ళూ వారివారి సంస్కృతిలో ముఖ్యమైన అంశాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకోసం ప్రయత్నాలు చేస్తూ ఆ గుర్తింపును సాధించుకుంటూ ఉంటె,మనం మాత్రం లోలోపలకు ముడుచుకుపోతూ ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఉన్నాం.

మనదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతులు ఎన్నో ఉన్నాయి.పెట్టిన జ్ఞానభిక్ష ఎంతో ఉన్నది.కానీ వాటిని మనం క్లెయిం చేసుకోవడం లేదు.అలా చేసుకోవడానికి మనకు సెక్యులర్ ఇమేజి ఒకటి అడ్డోస్తూ ఉన్నది.

'యోగా' అనేది ఎంత విలువైనదో ప్రపంచవ్యాప్తంగా బుద్ధి అనేది ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తించారు.దాదాపు ఏభై ఏళ్ళ క్రితం నుంచే హాలీవుడ్ సెలెబ్రిటీలతో సహా ఎందఱో 'యోగా' చేస్తూ దేహసౌష్టవాన్నీ ఆరోగ్యాన్నీ కాపాడుకుంటూ వస్తున్నారు.కాని మనకుమాత్రం నేటికీ యోగామీద పూర్తి అవగాహన లేదు.ఇది శోచనీయం.

నిజమైన 'యోగా' అంటే శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడుకునే ఒక వ్యాయామం కాదు.అది ఒక ఆధ్యాత్మికమైన జీవనవిధానం.పోనీ ఈ మాట అందరికీ నచ్చకపోయినా,యోగాలోని కొన్ని అంశాలైన ఆసనాలు, ప్రాణాయామం,కొన్ని ముద్రలు,కొన్ని క్రియలు చెయ్యడంవల్ల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండే మాట వాస్తవమే.

యోగా అనేది మన హిందూమతంలో అంతర్భాగమే.యోగా అనేది మతం కాదు ఇదొక జీవనవిధానం అంటూ మనం నంగినంగిగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు.ఇందులోని కాన్సెప్ట్స్ అన్నీ హిందూమతానికి ముడిపడి ఉన్నట్టివే.ఇందులో ఏమీ అనుమానం లేదు.అయితే యోగా చేసినంత మాత్రాన మతం మార్చుకోవలసిన పనేమీ లేదు.ఈ విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

కొందరు పాశ్చాత్య పిడివాదులు అనుకునేటట్లు యోగా అనేది 'సైతాన్ ఆరాధన' కానేకాదు.యోగా అనేది భగవంతుని చేరుకునే అనేక మార్గాలలో ఒకటని మన మతం ఎప్పుడో చెప్పేసింది.

మనకు స్వాత్రంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళకైనా కనీసం మన విద్యకంటూ ఒక అంతర్జాతీయ గుర్తింపు లభించినందుకు యోగాభిమానులంతా పండుగ చేసుకోవలసిన శుభదినం ఇది.

వివేకానందస్వామి వల్ల ప్రపంచానికి మన దేశపు ధార్మికఔన్నత్యం అర్ధమైతే, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ఆయన అనుచరుడైన నరేంద్రమోడీ వల్ల మన 'యోగా'కి ఒక అంతర్జాతీయ గుర్తింపు అఫీషియల్ గా వచ్చింది.

ఈ విషయంలో నరేంద్ర మోదీగారిని మనస్ఫూర్తిగా అభినందించక తప్పదు.