“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, డిసెంబర్ 2014, బుధవారం

జనన తేదీ-కొన్ని నివ్వెరపరచే నిజాలు

నీవు మహా తెలివైనవాడవని అందరూ అనుకోవాలంటే కనిపించిన ప్రతిదాన్నీ 'ఇందులో ఏముంది?' అందులో ఏముంది?' అని విమర్శించు. సరిపోతుంది. అని వెనకటికి ఒకాయన సలహా చెప్పాట్ట.వారికి అర్ధంకాని విషయాలను కూడా విమర్శించే ఇలాంటి చవకబారు మనుష్యులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు.

ఇలా 'అందులో ఏముంది? ఇందులో ఏముంది?' అని ప్రతిదానినీ విమర్శించే వారు డబ్బు దగ్గర మాత్రం బొక్క బోర్లా పడిపోతూ ఉండటాన్ని నేను చూస్తూ ఉంటాను.ఎందులోనూ ఏమీ లేనప్పుడు వారు వెంపర్లాడే "డబ్బులో మాత్రం ఏముంది? అవి మనం ప్రింట్ చేసుకున్న కాగితాలేగా?"అని నేనంటాను.దానికి వారి దగ్గర సమాధానం ఉండదు.

అంతేగాదు ఇంకొకడుగు ముందుకేసి - నేనిలా అంటాను.

'ఎందులోనూ ఏమీ లేనప్పుడు ప్రతిదాన్నీ విమర్శించే మీ విమర్శలో మాత్రం ఏముంది?'

దానికీ వారివద్ద సమాధానం ఉండదు.

అసలు విషయం ఏమంటే,ఇలా ప్రతిదానినీ తెలిసినా తెలియకపోయినా విమర్శిస్తూ ఉండేవారికి లోలోపల చాలా కుళ్ళూ అసూయా ఉంటాయి. మనకు తెలియనిది ఏదో ఎదుటివాడికి తెలుసు అన్న భావనను వారు భరించలేరు.చాలాసార్లు ఇలాంటివారు అసూయాగ్రస్తులే కాదు భయంకరమైన అహంకారులు కూడా అయి ఉంటారు.

అర్ధం చేసుకునే జ్ఞానం మనలో ఉంటే అన్నిట్లోనూ అన్నీ ఉంటాయి.మనం లోపల డొల్ల అయితే ఎందులోనూ ఏమీ ఉండదు.ఉన్నా కనపడదు.

ఇదే విధంగా,"జననతేదీలో ఏముందిలే?" అని చాలామంది అనుకుంటూ ఉంటారు.అలాంటి నాసిరకం మనుషులతో మనకెందుకులే గాని,విషయంలోకి వస్తే,జననతేదీ అనేది మనిషి జీవితాన్ని చాలావరకూ స్థూలంగా వివరిస్తుంది.అంటే ఆ మనిషి జీవిత గమనంలో మేజర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయో జాతకం చూడకుండానే ఉత్త జనన తేదీ చూస్తూనే చెప్పేయవచ్చు.ఇది జ్యోతిష్య విజ్ఞానంలో ఒక రహస్యమైన అంశం.

"శ్రీవిద్యా రహస్యం" పుస్తకం పనిమీద నిన్న విజయవాడ వెళ్లాను.శ్రీకాంతూ నేనూ కలసి పబ్లిషర్ దగ్గరికి వెళ్లి కలిశాము.ఆయనకు దాదాపు 60 పైనే ఉంటాయి.మాటల సందర్భంలో ఆయనిలా అన్నారు.

'శర్మగారు.ఈ సబ్జెక్టు నాకస్సలు తెలీదు.శ్రీవిద్య అనే పదం వినడమే గాని అదేంటో ఎలా ఉంటుందో నాకేమీ తెలీదు.అలాంటి నాకే,మీ పుస్తకం చదువుతుంటే ఒక రకమైన ట్రాన్స్ లాంటి స్థితి కలిగింది.చదువుతూ చదువుతూ అలా ఒకవిధమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను.ఏమీ తెలియని నాకే ఇలా అయితే ఇంక ఈ సబ్జెక్ట్ బాగా తెలిసినవారికి ఇది ఎంత గొప్ప అనుభూతి కలిగిస్తుందో ఊహించగలను.'

నిజాయితీగా ఒక అపరిచిత వ్యక్తి చెప్పిన ఆ మాటలు విని నాకు చాలా సంతోషం కలిగింది.ఒక న్యూట్రల్ వ్యక్తి నుంచి వచ్చిన ఈ కామెంట్ నా రచనకు ఇవ్వబడిన ఒక అత్యుత్తమ సర్టిఫికేట్ అనుకున్నాను.

అక్కడ పని ముగించుకుని బయటకు వచ్చాము.

ట్రెయిన్ కు ఇంకా టైం ఉండటంతో కొన్ని పుస్తకాలు కొనాలని శ్రీకాంత్ అంటే అతనితో ఒక పుస్తకాల షాపుకు వెళ్లాను.

అది గాంధీనగర్లో ఒక పుస్తకాల షాపు.అందులో ఒక నడివయస్సు ఆమె కూచుని ఉన్నది.మధ్యాన్న సమయం కావడంతో ఎవ్వరూ జనం లేరు.

"స్కాంద పురాణం ఉన్నదా?" అని శ్రీకాంత్ అడిగాడు.

'ఉన్నది' అంటూ రెండు భాగాల బైండ్ బుక్స్ ను చూపించారు ఆమె.

మాటల సందర్భంలో 'నేనూ కొన్ని జ్యోతిష్య పుస్తకాలు వ్రాశాను' అని శ్రీకాంత్ అన్నాడు.

'మీకు జ్యోతిష్యం తెలుసా?' అడిగింది ఆమె.

'ఏదో కొద్దిగా తెలుసు' అన్నాడు.

'అలా అయితే మా షాపులో పంచాంగం ఉన్నది.చూచి ఒక జాతకం చెప్పగలరా?' అడిగింది ఆమె.

'నాకు పంచాంగంతో పనిలేదమ్మా.నా మొబైల్లో ఇరవై రకాల జ్యోతిష్య సాఫ్ట్ వేర్లున్నాయి.'అన్నాడు.

'అయితే ఒక జాతకం చెప్పండి' అంటూ ఆమె ఒక తేదీ చెప్పింది.

శ్రీకాంత్ తన మొబైల్లో ఒక సాఫ్ట్ వేర్ తెరచి ఆ జాతకచక్రం వేసే ప్రయత్నంలో ఉన్నాడు.

అప్పటి వరకూ మౌనంగా వింటున్న నేను ' ఈ జాతకం అమ్మాయా అబ్బాయా?' అడిగాను.

'అమ్మాయే' అన్నది ఆమె.

'ఈ అమ్మాయికి తండ్రి సపోర్ట్ లేదు' అన్నాను వెంటనే.

ఆమె బిత్తరపోయినట్లు చూచింది.

'నిజమే.ఎలా చెప్పారు?' అడిగింది ఆశ్చర్యంగా.

దానికి నేను జవాబు చెప్పకుండా 'అంతేకాదు.ఈ అమ్మాయికి అన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి.కష్టం ఎక్కువ ఫలితం తక్కువ.' అన్నాను.

ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ' నిజమే' అని "మీకూ జ్యోతిష్యం వచ్చా?' అడిగింది.

'ఏదో కొద్దిగా వచ్చమ్మా' అన్నాను నేను ఎక్కువగా పొడిగించకుండా.

ఇంతలో శ్రీకాంత్ తన మొబైల్లో జాతక చక్రం వెయ్యడం జరిగింది.నేను శ్రీకాంత్ వైపు తిరిగి 'ఈ జాతకానికి సర్పదోషం ఉన్నది చూడండి' అన్నాను.

శ్రీకాంత్ తన మొబైల్లోని ఆ జాతకచక్రాన్ని చూచి 'అవును ఉన్నది'.అన్నాడు.

ఆమెవైపు తిరిగి 'ఈ అమ్మాయి పెళ్లి ఆలస్యం అవుతున్నది.అవునా?' అన్నాడు.

'అవునండీ.అదే నేను అడగబోతున్నాను.సంబంధాలు చూస్తున్నాము.ఏదీ కుదరడం లేదు.ఎంతో మంది జ్యోతిష్కులకు చూపించాము.వారు చెప్పినట్లు కుజుడు, శుక్రుడు,శని,రాహు,కేతువులు,గురువు గ్రహాలకు శాంతులు చాలా చేయించాము' అన్నది ఆమె.

'బాగానే వదిల్చి ఉంటారుగా?' అన్నాడు శ్రీకాంత్.

'అవును,బాగానే వదిలింది.' అన్నది ఆమె.

'అమ్మా.నవగ్రహాలలో దాదాపు ఆరేడు గ్రహాలకు శాంతులు ఇప్పటికే మీరు చేయించామని అంటున్నారు.ఆ మిగిలిన రెండు గ్రహాలకు కూడా చేయించేస్తే టోకుగా అన్నీ అయిపోయేవిగా? ఇలా ఎవరు పడితే వారు చెప్పే రెమేడీలు పనిచెయ్యవమ్మా.' అన్నాడు శ్రీకాంత్.

'ఆ సంగతి అన్నీ చేయించిన తర్వాతే కదండి అర్ధమయ్యేది?' అన్నది ఆమె.

'ఇంత డబ్బుపోసి ఇవన్నీ చేసే బదులు ఆ డబ్బుతో అమ్మాయి పెళ్ళికి కావలసిన బంగారమో నగలో చేయిస్తే బాగుండేది' అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.

ఆమెను చూస్తే మన అమ్మలాగానో మన అక్కయ్య లాగానో ఒక సదభిప్రాయం కలుగుతూ ఉన్నది.కొంతమంది "ఆరా" లు అలా ఉంటాయి.

ఏమనుకున్నాడో ఏమో అక్కడికక్కడే ఆమెకు కొన్ని రెమెడీలు చెప్పాడు శ్రీకాంత్.

నేను మౌనంగా చూస్తూ ఉన్నాను.

ఆమె ఇంకా ఏవేవో అడగబోతుంటే,'ముందు ఈ రెమేడీలు మీ అమ్మాయి చేత చేయించండి.వీటికి మీరు ఏమీ ఖర్చు పెట్టనక్కరలేదు.అవి చేశాక నాకు ఫోన్ చెయ్యండి.ఈ లోపలే మీకు ఫలితాలు కన్పించడం మొదలౌతుంది.నిజానికి ఇలా రోడ్డుమీద రెమెడీలు చెప్పకూడదు.కానీ మీ బాధా ఆత్రుతా చూచి చెప్పాను.ముందు నేను చెప్పిన రెమేడీ ఆచరించి ఆ తర్వాత నాకు చెప్పండి' అన్నాడు.

ఆమె కృతజ్ఞతగా తలూపింది.

తనకు కావలసిన పుస్తకాలు కొనుక్కుని నన్ను స్టేషన్లో దిగబెట్టి శ్రీకాంత్ వెళ్ళిపోయాడు.నా దారిన నేను గుంటూరుకు వచ్చేశాను.

లోకంలో ఎక్కడ చూచినా కుహనా జ్యోతిష్కులు తయారై,అమాయకులను మోసం చేస్తూ,రెమేడీల పేరిట నానా రకాల అశాస్త్రీయపు పనులను చేయిస్తూ, జనం దగ్గర డబ్బులు వదిలిస్తున్న మాట వాస్తవం.అన్యాయపు సంపాదనను సగం డాక్టర్లకూ సగం జ్యోతిష్కులకూ జనం వదిలించుకుంటున్న మాటా వాస్తవమే.

అదే విధంగా,ఉత్త జననతేదీని బట్టి జీవితాన్ని చాలావరకూ అంచనా వెయ్యగలగడం కూడా వాస్తవమే.

అదే విధంగా,సత్కర్మబలం ఉన్నవారికి మాత్రమే సరియైన రెమేడీలు అందుతాయన్న మాట కూడా అక్షరాలా నిజమే.భగవంతుడు కరుణిస్తే రావలసినవాళ్ళు మన ముంగిటికే వచ్చి ఉపాయాలు చెప్పిపోతారు.ఆ సత్కర్మబలమే గనుక లేకుంటే మనం ఎంత తిరిగినా,ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వారు దొరకరు,ఒకవేళ వాళ్ళు మన పక్కనే ఉన్నాకూడా మనం ఉపయోగించుకోలేము అనడానికి నిన్న జరిగిన ఈ సంఘటనే సాక్ష్యం.

లేకుంటే,ఎక్కడో షాపులో కూచుని ఉన్న ఆమె దగ్గరకు మేము వెళ్లి,ఆమె కూతురి పెళ్లి త్వరగా జరగడానికి ఉచిత రెమెడీస్ చెప్పి రావడం ఏమిటి?