“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, జూన్ 2009, గురువారం

దశ మహా విద్యలు


శాక్తతంత్రములో ఎందరు దేవతలున్నా ముఖ్యముగా ఉపాసింపబడే వారు దశమహావిద్యలు.అచింత్యము, అవ్యక్తము అయిన చైతన్యమును ఈశ్వరుడు అంటుంది తంత్రము.అదే చైతన్యము కదలికను పొంది త్రిగుణాత్మికగా మారి సృష్టిస్థితిలయములను చేస్తున్నపుడు శక్తి అవుతుంది.ఆ శక్తి ప్రపంచమును నడిపించుటకు పదిరూపాలుగా ఉంటుంది.ఆ పదిరకములైన శక్తులే దశమహా విద్యలు.

కాళి,తార,భువనేశ్వరి,బగలాముఖి,ఛిన్నమస్త, త్రిపురభైరవి,కమలాత్మిక,ధూమవతి,లలిత, మాతంగి అనబడువారే దశమహావిద్యలు.వీరు కేవలము బాహ్య ప్రపంచము నందేగాక అంతర్ప్రపంచమున కూడా అధివసించి ఉంటారు.కనబడే బాహ్యప్రపంచముగాని,కనపడని ఆంతరిక ప్రపంచముగాని వీరి ఆధీనములోనే నడుస్తూ ఉంటాయి.వీరిని సాధనామార్గమున దర్శించవచ్చు. వీరి అనుగ్రహమును పొందవచ్చు.దానితో ప్రపంచమున అసాధ్యములైన కార్యములు సాధించవచ్చు.వీరు శక్తులు.అనగా ఎనర్జీ బాడీ కలిగిన చైతన్యపుంజములు.

జగన్మాత భుక్తిముక్తి ప్రదాయిని.అనగా ఐహిక లాభములను ఆముష్మిక లాభములను కూడా సమముగా ప్రసాదించగలదు.ఎక్కువగా మానవులు ఈ శక్తులను ఐహికలాభముల కోసమే ఉపాసించటం కనిపిస్తుంది. ఆంద్రదేశములో వీరి ఉపాసన తక్కువ.అక్కడక్కడ ఒకరిద్దరు ప్రసిద్ధ దేవీ ఉపాసకులు కనిపిస్తుంటారు. కాని బెంగాలు రాష్ట్రములో,అస్సాంరాష్ట్రములో, ఒకప్పటి కాశ్మీరులో, నేటి కేరళ లో వీరి ఆరాధన ఎక్కువగా ఉంది.

జ్యోతిషపరంగా,ఒరిస్సాలోని కటక్ కు చెందిన డా||నిమాయి బెనర్జీగారు, లగ్నము మరియు తొమ్మిది గ్రహములను కలిపి మొత్తం పది దోషములకు, దశమహావిద్యలతో రేమేడీలు చేయగల గొప్ప మంత్రోపాసకుడు.ఈయన ప్రస్తుతము జ్యోతిషవిద్యను అధిగమించి పూర్తిగా కాళీ ఉపాసనలో మునిగినవాడు.రోజులో ఎక్కువ భాగం ధ్యానసమాధిలో కాలం గడుపుతూ ఉన్నవాడు.Planets and Forecast పత్రికకు సంపాదకుడు.ఈయన ఇంటర్వ్యూ కోసం చాలామంది MP లు క్యూలో ఉంటారు.

రాజస్తాన్ కు చెందిన నారాయణదత్త శ్రీమాలికూడా ప్రసిద్ధి చెందిన తంత్రవేత్త. Mantra-Tantra-Yantra పత్రికను నడిపేవారు.మన ఆంద్రదేశంలో చందోలుశాస్త్రిగారు అనబడే తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారు గొప్పదేవీ ఉపాసకుడు. వీరిలో శ్రీమాలి గారు, శాస్త్రి గారు ఇప్పుడు లేరు,గతించారు. 

జాతకములో బలం లేకపోవటం పూర్వజన్మల చెడుకర్మ వల్ల కలుగుతుంది. దానిని పోగొట్టుకొని సుఖశాంతులతో జీవితం గడపవలేనని ప్రతివానికీ ఉంటుంది.దానికి దైవబలం తప్పనిసరిగా కావాలి.దశమహావిద్యల ఉపాసనద్వారా జాతకములోని చెడును నిర్మూలించు కోవటం సాధ్యం అవుతుంది.శక్తి అనుగ్రహం వల్ల పూర్వకర్మల చెడుప్రభావం భస్మీపటలం అవుతుంది. కనుక దోషాన్ని బట్టి ఏ దేవతాఉపాసన అవసరమో చూచుకొని దానిని ఆచరించడంద్వారా సుఖ శాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు.