![](http://www.google.co.in/images?q=tbn:S3rVXj22OAuamM::sunayana18.files.wordpress.com/2009/01/venkateswara-swami-1.jpg)
శర్మగారి ప్రసంగం వినటం నాకిదే మొదటిసారి. చాలా హృద్యంగా, ఆశువుగా, ఆహ్లాద కరంగాసాగింది. విష్ణు పురాణం నుంచి కొన్ని ఘట్టాలను తీసుకొని సృష్టి పూర్వం ఉన్నటువంటి వటపత్ర శయనుడైనపరమాత్ముని అవతారాన్ని, తరువాత విశ్వ రూపుడైన విరాట్ పురుష అవతారాన్ని, తరువాత భూమిని ఉద్ధరించినయజ్ఞ వరాహ అవతారాన్ని ఇలా మూడు విష్ణు అవతారాల వైభవాన్ని చక్కగా వివరించారు.
అవ్యక్తమైన భగవత్ తత్వాన్ని, వ్యక్త రూపములైన అవతారాలను సమన్వయ పరుస్తూ చెప్పిన ఉదాహరణలు చాలాచక్కగా ఉన్నాయి. ముఖ్యంగా విషయం లో తాదాత్మ్యం చెంది ఆయన చెప్పే తీరు నాకు బాగా నచ్చింది. వేదములనుంచి, ఉపనిషత్తు ల నుంచి సందర్భానుసారంగా ఉదాహరించటం నచ్చింది. ఆయన శైవం మీద, శాక్తేయంమీద బాగా మాట్లాడగలరని విన్నాను. కాని అంతే సమానంగా విష్ణు వైభవం గురించి చాలా బాగా మాట్లాడారు. సరస్వతీకటాక్షం, ఉపాసనా బలం కలిగిన వ్యక్తి గా నాకు తోచింది. ముఖ్యంగా మన సనాతన ధర్మము (హిందూ మతము) గురించి తెలిసీ తెలియక వ్యాఖ్యానించే వారు శర్మ గారి ఉపన్యాసాలు తప్పక వినాలి. ముఖ్యంగా హిందువులు ఇతరమతాలలోకి గుంపులుగా మారుతున్న నేటి రోజులలో హిందూ మతం గొప్పతనాన్ని తెలియ చెప్పే ఇటువంటి పండితులఉపన్యాసాలు చాలా అవసరం.
ఈ కార్యక్రమం వెంకటేశ్వర భక్తి చానల్ వారు లైవ్ రికార్డింగ్ చేసారు. వారం రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. నా బ్లాగుచదివేవారిని ఈ ప్రోగ్రాం తప్పక చూడమని, తెలిసిన వారికి చూపించమని కోరుతున్నాను.