నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, జూన్ 2009, సోమవారం

కాళీ తత్త్వం-3


కాళికా దేవిని భయంకరంగా ఎందుకు చిత్రిస్తారు? సౌమ్య మూర్తిగా ఉండవచ్చు కదా? అని కొందరు అడుగుతారు. దీని వెనుక కొన్ని మౌలికమైన మనస్తత్వ అంశాలు దాగి ఉన్నాయి. ఈ ప్రశ్న చాలా సమంజసం గా ఉంటుంది. ఎందుకంటే మనకు అంతా సవ్యం గా జరగటం ఇష్టం గా ఉంటుంది. ఎక్కడా ఏ విధమైన నాశనం, ధ్వంసం లేకుండా హాయిగా సాగి పోవాలని ప్రతి మనిషి, జంతువు, పక్షి, క్రిమి కీటకాలతో సహా సమస్త ప్రకృతి కోరుకుంటుంది.

కాని ప్రకృతి లో ఉన్న నియమం ప్రకారం ఎల్లకాలం అన్నీ హాయిగా సాగిపోవటం కుదరదు. కొంత భాగం ధ్వంసం అయితే గాని మరికొంత భాగం నిర్మాణం జరుగదు. కనుక ప్రకృతిలో సృష్టి, స్థితి, లయం ఈ మూడూ ఇమిడి ఉన్నాయి. ఒక్క మన సనాతన ధర్మములోనే విధ్వంసం కూడా భగవంతుని పనే అని అర్థం చేసుకోవటం జరిగింది. ఇతర మతాలలో దీనిని గ్రహించలేక, నాశనం చెయ్యటం సైతాను పని అని భావించి సైతాను అనే ఒక కల్పిత వ్యక్తిని సృష్టించుకొని దానిని సమర్ధించు కోడానికి అనేక కల్పిత కథలు అల్లుకున్నారు.

సృష్టించటం దేవుని పనైతే మరి నాశనం చెయ్యటం ఎవరి పని? అది కూడా ఆయన పనే. ఎందుకంటే ఆయన/ఆమె తప్ప ఇంకొకరు దీనికి బాధ్యులు కాలేరు. సైతాను అనే వాడు నిజానికి లేడు. అతనే ఉంటే దేవుని ఉనికికి, ఈశ్వరత్వానికి సవాలు. అటువంటి సైతానును దేవుడు తన సృష్టిలో ఎందుకు ఉండనిస్తున్నాడు అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. ఇతర మతాలు దీనిని అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉన్నాయి. కనుకనే చావు అనేది సైతాను కార్యం అని నమ్ముతూ, మరణం అంటే భయం కలిగి ఉంటాయి.

కాని మన ధర్మంలో పుట్టుక, పెంపుదల, మరణం మూడూ ప్రకృతి సహజ మైన పనులు గా అర్థం చేసుకోవటం జరిగింది. మరణం మళ్ళీ పుట్టుకకు దారి తీస్తుంది అన్న సత్యం కూడా మనవారు అర్థం చేసుకున్నారు. కనుక సృష్టి మాత్రమె కాదు, నాశనం చెయ్యటం కూడా చేస్తున్నది దేవుడే. అందుకనే కాళీ మాత ఆకారంలో శాంత ( Benign) మరియు ఘోర ( Terrible) ప్రక్రుతులు కలిశి ఉంటాయి. సృష్టిస్తున్నదీ నీవే, పెంచుతున్నదీ నీవే, సంహరిస్తున్నదీ నీవే అనే భావం తో కూడిన స్తుతులు ఎన్నో మనకు దేవీ మహాత్యం లో కనిపిస్తాయి.

కాళీమాత ఆకారం ప్రకృతిలో ఉన్నటువంటి, మరియు జరుగుతున్నటువంటి సత్యమైన పరిస్థితి కి అసలైన ప్రతిబింబము. శ్రీ రామకృష్ణునికి ఒకరోజు మాయా శక్తి ని చూడాలని కోరిక కలిగింది. వెంటనే ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో గంగా నదిలోనుంచి ఒక నిండు గర్భిణి నిదానంగా బయటకు రావటం ఆయన చూచారు. ఇంతలో ఆమెకు నెలలు నిండి చక్కని బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను ముద్దు చేస్తూ లాలిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆమె రూపం నల్లగా భయంకరం గా మారిపోతుంది. ఆ బిడ్డను తానె కరకరా నమిలి ముక్కలు చేసి తినేస్తుంది. తిరిగి నదీ గర్భం లో ప్రవేశించి మాయం అవుతుంది. ఈ దర్శనం ద్వారా ప్రకృతిలో ఉన్న సృష్టి, స్థితి, సంహార తత్వాల స్వరూపం ఆయనకు అవగతం అయింది. 

ప్రకృతిలో సంహార తత్త్వం అంతర్లీనం గా ఉన్నది. దానిని మనం మార్చలేము. ప్రకృతి మన ఇష్ట ప్రకారం మారదు. భగవంతుడు మన ఇష్ట ప్రకారం లోకాన్ని నడుపడు. వినటానికి బాధగా ఉన్నా ఇది ఒప్పుకోక తప్పని సత్యం. సృష్టిలో ఇమిడి ఉన్న ధర్మం. దైవత్వం అంటే ఒక్క సౌమ్య తత్వమే కాదు. ఘోరమైన తత్వమూ దానిలోనే ఉన్నది. దీనికి మనం ఏమీ చెయ్యలేము. ప్రాచీనులు దీనిని అర్థం చేసుకున్నారు గనుకనే కాళీ రూపం సౌమ్యభయానక సమ్మేళనం గా ఉంటుంది.