“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జూన్ 2009, గురువారం

మార్షల్ ఆర్ట్స్- హార్డ్ ఎండ్ సాఫ్టు స్టైల్స్


మార్షల్ ఆర్ట్స్ ( వీర విద్యల) ను రెండు విధములైన శాఖలుగా స్థూలంగా విభజింపవచ్చు.ఒకటి హార్డ్ స్టైల్స్. రెండు సాఫ్టు స్టైల్స్. చైనీస్ ఫిలాసఫీ తెలిసిన వారికి యిన్-యాంగ్ గురించి తెలిసి ఉంటుంది. వీరవిద్యలకు యిన్ యాంగ్ కు దగ్గరి సంబంధం ఉన్నది.యాంగ్ అనేది పురుషశక్తికి వెలుతురుకు ప్రతీక. దీని క్రిందకు వచ్చే వీరవిద్యలలో బలం,క్తి ముఖ్యములు.

షావోలిన్ స్టైల్స్ లో టైగర్, లెపర్డ్, డ్రాగన్, కోవకు చెందినవి. చోయి లే ఫట్, హంగ్ గార్ మొదలైన స్టైల్స్ లో కూడా బలానికి శక్తికి శరీర దృడత్వానికి ప్రాధాన్యత ఎక్కువ. చైనీస్ కుంగ్ ఫూ మాత్రమె కాక ఇతర విద్యలైన కరాటే, టేక్వాన్ డో, హ్వరాంగ్ డో, జుజుత్సు, కపియోర, సూమో రేజిలింగ్ మొదలైన విద్యలు కూడా మేస్కులిన్ విద్యలే. అంటే వీటిలో మొద్దుబలానికే ప్రాధాన్యత.యిన్ స్త్రీశక్తికి చీకటికి ప్రతీక. ఫైవ్ ఏనిమల్ స్టైల్స్ లో క్రేన్ మరియు స్నేక్ స్టైల్స్ ఈ శాఖకు చెందినవి.వీటిలో బలానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు.బేలన్స్, టైమింగ్,గురిచూసి నాడీకేంద్రముల మీద సరిగ్గా చావు దెబ్బ తియ్యటం ముఖ్యంగా ఉంటాయి.చైనాలోనే పుట్టిన తాయిఛి,బాగువా,జింగ్ యి ఈ మూడు విద్యలూ ఫేమినైన్ వీరవిద్యలు.వీటిలో వాటర్ ప్రిన్సిపుల్ ఎక్కువగా వాడుతారు.

నీరు అతి బలహీనమైనది. కాని ఏ వస్తువునైనా తనలో ఇముడ్చుకోగలదు. అలాగే ఈ ఫేమినైన్ మార్షల్ ఆర్ట్స్ చూడటానికి అమాయకంగా కనిపిస్తాయి. కాని చాలా ప్రమాదకారులు. చూడటానికి సాఫ్టు గా కనిపించే ఇలాంటి ప్రమాదకర విద్యలలో ప్రేయింగ్ మాన్టిస్ స్టైల్ ఒకటి.

పైపైన చూడటానికి యాంగ్ స్టైల్స్ బాగున్నట్టు ఉంటాయి. కాని యిన్ స్టైల్స్ ను సాధించటం చాలాకష్టం.యాంగ్ స్టైల్స్ కు అయిదేళ్ళు పడితే యిన్ స్టైల్స్ సాధించటానికి పదేళ్ళు పడుతుంది. ఎందుకంటే శరీరశక్తి సాధించటం తేలిక. కాని యిన్ విద్యలు ప్రాణశక్తితో కూడుకున్నవి.ఇవి ప్రాణవిద్యలు. ప్రాణశక్తినంతా ఒక చోటికి కేంద్రీకరించి నాడీ కేంద్రంమీద కొట్టవలసి ఉంటుంది. అది సరిగా చెయ్యగలిగితే చాలా ప్రమాదకరం.బాంబు పేలినంత శక్తిని విడుదల చేస్తుంది.

యిన్ స్టైల్స్ లో పాయిజన్ హేండ్ అనేది రహస్యవిద్య. ఈవిద్యలో నిష్ణాతుడైతే ఊరకే నాడీకేంద్రాన్ని చిన్నగా కొడితే చాలు. అది స్లో పాయిజన్ లా పనిచేసి ఆ వ్యక్తి క్రమేణా క్షీణించి మరణిస్తాడు. అంటే ఒకరకంగా ఇది చేతబడి లాంటిది.ఏ రోగమో ఏ వైద్యుడూ కనిపెట్టలేదు. ఏ టెస్టులకూ ఏమీ దొరకదు.

జపనీస్ మార్షల్ ఆర్ట్స్ లో జూడో మరియు అయికిడో ఈ రెండూ ఫేమినైన్ విద్యలు. జపనీస్ లో 'జు' అంటే సాఫ్టు అని అర్థం.కరాటేలో కూడా 'గో-జు' స్టైల్ అని ఒకటుంది. అందులో కూడా సాఫ్టు టెక్నిక్స్ ఉంటాయి.జపనీస్ విద్య అయిన నిన్-జుత్సు మోస పూరిత టెక్నిక్స్ కు పెట్టింది పేరు. ఇది కూడా ఫేమినైన్ శాఖకే చెందుతుంది.

షావోలిన్ కుంగ్ ఫూ లో నిష్ణాతులు చెప్పేదేమంటే నిజానికి యిన్ యాంగ్ మార్షల్ ఆర్ట్స్ అంటూ విడివిడిగా లేవు. షావోలిన్ స్టైల్స్ లో రెండూ ఇమిడి ఉంటాయి. షావోలిన్ కుంగ్ ఫూలో మొదట బలంతో మొదలుపెట్టి, చివరకు జెన్ మెడిటేషన్ మరియు కి-గాంగ్ అభ్యాసాల ద్వారా సాఫ్టు టెక్నిక్స్ అయిన ప్రాణవిద్యా విధానాలు నేర్చుకోవటం జరుగుతుంది. అలాగే సాఫ్టు విద్యలయిన తాయి-ఛి,వుడాంగ్ కుంగ్ ఫూలలో మొదట సాఫ్టు స్కిల్స్ తో మొదలు పెట్టి తరువాత హార్డ్ స్కిల్స్ నేర్చుకోవటం ఉంటుంది. ఏదైనా రెండవది లేక ఒక్కటే పరిపూర్ణం కాలేదు.పురుష స్త్రీ శక్తులు కలిశిన అర్థనారీశ్వరతత్వమే పరిపూర్ణతత్త్వం అయినట్లు, వీరవిద్యలలో కూడా రెండింటిలో మాస్టరీ సాధిస్తేనే అది పరిపూర్ణ విద్య అవుతుంది.

సాఫ్టు ఆర్ట్ అయిన తాయి ఛి మాస్టర్ "యాంగ్- లు- చాన్" పది వేల ఫైట్స్ చేసి ఒక్కదానిలో కూడా ఓటమికి గురి కాలేదు. ఈయన ఫైట్ చేసింది సాదాసీదా మనుషులతో కాదు.కుంగ్ ఫూ లో తలపండిన మాస్టర్స్ తో తలపడి చాలెంజ్ ఫైట్స్ చేసాడు.

ఈయన విధానాన్ని కాటన్ బాక్సింగ్ అనేవారు.ప్రత్యర్థికి ఈయనను తాకటమే అసాధ్యం అయేది. దూదిపింజ ఎలా గాలిలో తేలుతూ మనం కొట్టినాకూడా దెబ్బ తగిలించుకోకుండా ఎగురుతూ ఉంటుందో అలా ఉండేది ఈయన స్టైల్. ఇది యిన్ స్టైల్ కు, వాటర్ ప్రిన్సిపుల్ కు ఒక మచ్చుతునక. ఇటువంటి సామర్ధ్యం రావాలంటే జీవితాన్ని దానికి పూర్తిగా అంకితం చేసి అకుంఠితదీక్షతో సాధన చేసినపుడే అది సాధ్యం అవుతుంది.