“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జూన్ 2009, సోమవారం

దశ మహా విద్యలు-కాళి



దశ మహావిద్యలలో అత్యంత ముఖ్యమైన దేవత కాళికాదేవి.తాన్త్రికులకు ఆమె ఇష్టదేవతతంత్రమున ఎందరు దేవతలు ఉన్నా కాళీమాతకు ప్రత్యెకస్థానం ఉన్నది. ఎందుకంటే కాళీఉపాసనలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.కాళీ ఉపాసన అతిశీఘ్ర ఫలదాయిని.అతిప్రాచీన కాలం నుంచీ మనదేశంలో పరంపరగా వస్తున్నది. ఒక జీవితకాలం పట్టే సాధనను కాళీమాత కొన్ని నెలలలో ఇవ్వగలదు.కానీ ఈ సాధన అందరూ చెయ్యలేరు.ఇది చాలా కష్టమైన సాధన..

కాళికారూపం భయం గోలిపెదిగా ఉంటుంది. కాని తత్త్వం తెలుసుకుంటే భయం ఉండదు. కాళీదర్శనం కలిగితే అంతకంటే అదృస్టం ఇంకొకటి ఉండదు. కాళికా వరప్రసాదికి అసాధ్యం అనేది ముల్లోకాలలో లేనేలేదు. అతని ఆజ్ఞను పంచభూతాలు తలదాల్చవలసిందే. 

భయంకరమైన కాళీరూపాలు కూడా చాలా ఉన్నాయి.అవి చూచి సామాన్య సాధకులు తట్టుకోలేరు.గుండె పగిలి అక్కడే చస్తారు.కాళీమాత రూపాలు ఒకటి కాదు.అనేకం ఉన్నాయి.భద్రకాళి,స్మశానకాళి,కరాళకాళి,మహాకాళి ఇలా చాలారూపాలు ఉన్నాయి.వాటిలో స్మశానకాళీ రూపం అత్యంత భయానకం.కాని మహాకాళి అలా కాదు.ఆమె రూపం అత్యంత మనోహరం అయిఉండి కూడా మాతృత్వ భావనను కలిగిస్తుంది.మన సొంతతల్లిని కొన్ని ఏళ్ళ తరువాత చూచినప్పటికంటే ఇంకా ఎక్కువ ప్రేమ హృదయంలో పెల్లుబుకుతుంది. కారణం ఆమె ప్రపంచానికే తల్లి. ఆది శక్తి. దేవతలకు మానవులకు సమస్త జీవకోటికి చరాచర సమస్త సృష్టికి మాత.

కాళి సామాన్యంగా నాలుగు చేతులు కలిగి ఉంటుంది. నూరు చేతుల రూపం కూడా ఉన్నప్పటికీ సామాన్యంగా మనం చూచే రూపం మాత్రం ఇదే.ఒక చేతిలో ఖడ్గము, ఇంకొక చేతిలో ఖండిత శిరస్సు, మిగిలిన రెండు చేతులలో వరద అభయ ముద్రలు దాల్చి అచేతనుడైన శివునిపైన నిలబడి ఉన్నట్లు మనం సాధారంగా కనబడే చిత్రాలలో చూస్తాము.ఇది చిత్రకారుని ఊహకాదు. నిజముగా దర్శనం ఇచ్చే దేవతాస్వరూపం కూడా ఇలాగే ఉంటుంది. కాని చిత్రంకంటే ఎన్నోరెట్లు జీవంతో ఉంటుంది. ఈ ఆకారం భయానకమే. కాని అది రాక్షసప్రవృత్తి కలవారికే గాని ఆమె బిడ్డలకు కాదు. బిడ్డకు తల్లి కోపంగా ఉన్నా భయం కలుగదు. ఆతల్లి కోపం తనలోని అసుర ప్రవృత్తి పైనే గాని తన పైన కాదు అన్న సత్యం తెలిస్తే భయం పటాపంచలౌతుంది.

ఈచిత్రం లోని అంతరార్థం చూద్దాము. మన దేవతల విగ్రహాలు చిత్రాలు, చిత్రకారుని ఊహలు కావు. అవి మార్మికభాషా సంకేతాలు. గొప్ప భావాన్ని దృశ్యరూపంగా చెప్పవలెనంటే అంతకంటే బాగా చెప్పటం, కవితాత్మకంగా చెప్పటం సాధ్యం కాదు.శివుడు అనగా సృష్టికి ముందు ఉన్నటువంటి అఖండ నిరాకాల నిశ్చల పరతత్త్వం. అట్టి నిశ్చల తత్వమున కదలిక వచ్చి సృష్టి జరిగింది. ఆ కదలికే శక్తి. ఆ శక్తికే కాళి అని పేరు. అచేతనంగా పడి ఉన్న శివుడు సృష్టికి మూలము ఆధారము అయిన పరమాత్మ. ఆ పరమాత్ముని ఆధారంగా శక్తి సృష్టిస్థితిలయలు చేస్తున్నది. అనగా అచేతన బ్రహ్మము పైన చేతనాత్మక శక్తి నాట్యం చేస్తున్నది. దీనినే శివునిపైన శక్తి నిలిచి ఉన్న చిత్రంగా చూపుతారు. వెరశి ఈ చిత్రం ఒక అద్భుత సత్యానికి ప్రతిబింబము.

ఆంతరిక తాంత్రికలోకంలో ప్రవేశించి మరొక అర్థాన్ని కనుగొందామా? సాధకుడు ఇంద్రియాతీతుడై సమాధి అవస్థలో ప్రవేశించినపుడు దేహస్పృహ కోల్పోతాడు.అపుడు శవం మాదిరిగా అచేతనుడై పడి ఉంటాడు.కాని ఆ అచేతనునిలో ఆద్యాశక్తి కుండలీరూపంలో జాగ్రుతమై ఉంటుంది. కదలిక లేక సమాధి అవస్థలో ఉన్న సాధకునిలో మహాశక్తి జాగృతం అయి ఉంటుంది. ఈ శక్తి అతనిలోని రాక్షసత్వాన్ని ఒకే దెబ్బతో అంతం చేస్తుంది. అతనికి వరద అభయశక్తిగా నిలిచి రక్షిస్తుంది. ఆ జాగ్రుత శక్తి ముందు ఏ రాక్షస ప్రవృత్తులూ నిలవలేవు. చావు లేని రక్తబీజుడైనా సరే ఈ శక్తిముందు అంతం కావలసిందే.

మనిషి తనలోని పశుప్రవృత్తి, రాక్షసప్రవృత్తి పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు. కాని అవి సఫలం కావు.పూర్తిగా కళ్లు తెరిచిన జాగ్రుత కుండలినీ శక్తి మాత్రమె ఈ పని ఒక్క క్షణంలో చెయ్యగలుగుతుంది. ఒక విధంగా ఆమె నిరంతరం జరుగుతున్న బాహ్యసృష్టి ప్రక్రియకు సజీవరూపం.ఇంకొక రకంగా సాధకుని ఆంతరిక సాధనాప్రక్రియకు ప్రతిరూపం. ఈ విధంగా బాహ్య ఆంతరిక భూమికలలో నిరంతరం ఆమె లీల జరుగుతూ ఉంటుంది. కాళీ అనుగ్రహం పొందగలిగితే అట్టి వాని జన్మలో ఇక అందుకోవలసిన శిఖరాలు ఉండవు. ఆమె సర్వ శక్తిమయి.పరబ్రహ్మ మహిషి అని దేవీ భాగవతం స్తుతించింది. సమస్త లోకాలు భువనాలు ఆశక్తి ఆటలు.లీలా విలాసాలు.సమస్త అవతారాలు,దేవతలు ఆమె బిడ్డలు. ఆ శక్తి లోనే పుట్టి పెరిగి లయిస్తుంటారు.  కాళీశక్తికి అతీతంగా ఏదీ లేదు. ఎవరూ లేరు.ఇదే కాళీ తత్త్వం.