12, ఆగస్టు 2014, మంగళవారం

తొలగింపబడిన 'శ్రీవిద్య' పోస్ట్ లు

ఇన్నాళ్ళూ 'శ్రీవిద్య' అనే భాగంలో 51 పోస్ట్ లు నా బ్లాగులో ఉన్నాయి.

వచ్చే నెలలో కొద్ది మార్పులు చేర్పులతో 'శ్రీవిద్య' పుస్తకంగా మార్కెట్లోకి రాబోతున్నది.

కనుక ఆ విభాగంలోని పోస్ట్ లు అన్నింటినీ బ్లాగునుంచి తొలగించడమైనది.

చదువరులు గమనించగలరు.
read more " తొలగింపబడిన 'శ్రీవిద్య' పోస్ట్ లు "

రాబిన్ విలియమ్స్ జాతకం - ఒక విశ్లేషణ


అమెరికన్ నటుడు రాబిన్ విలియమ్స్ నిన్న చనిపోయాడు.ఇదీ పౌర్ణమి ప్రభావమే.

అతను నా అభిమాన నటులలో ఒకరు.

'JUMANJI' సినిమా చూచినవారికి అతను బాగా గుర్తుంటాడు.



'WHAT DREAMS MAY COME' కూడా అతను నటించిన ఇంకొక మంచి సినిమా.ఇందులో అతని మౌన భావప్రకటన నాకు బాగా నచ్చింది.

NIGHT AT THE MUSEUM అనేది ఇంకొక సినిమా.

అతని సినిమాలు నేను ఎక్కువ చూడలేదు.ఈ మూడూ చూచానని గుర్తుంది. వీటిల్లో అతని నటన నాకు బాగా నచ్చింది.

ఎక్కువ డైలాగ్స్ లేకుండా, ముఖంలోనే భావాలను పలికించే అతని నటన నాకు బాగా నచ్చుతుంది.

అతని ముఖంలో ఏదో ఒకరకమైన నిరాశా,చిన్నపిల్లలకుండే అమాయకత్వమూ కనిపిస్తాయి.బహుశా అవే అతని వ్యక్తిత్వంలోని ఆకర్షణలని నా ఊహ.అతను నవ్వితే కూడా చిన్న పిల్లవాడు అమాయకంగా మనస్ఫూర్తిగా నవ్వినట్లే ఉంటుంది.

ఈ లక్షణాలు బుధునికి సూచికలు.ఇతని జాతకంలో ఆత్మకారకుడు కూడా బుధుడే అంటే చదువరులకు ఆశ్చర్యం కలుగుతుంది.

ఇతని జాతకాన్ని ఇప్పుడు కొంచం చూద్దాం.

నా వీరాభిమానులు(విమర్శకులు) అనేటట్లు ఇప్పుడు రాబిన్ విలియమ్స్ చనిపోయాడు గనుక అతని జాతకాన్ని మనం నిరభ్యంతరంగా చూడవచ్చు. ఎందుకు?దానికి కూడా నేనే సమాధానం చెప్తాను.చనిపోయినవారు మాట్లాడరు గనుక.కానీ వారిగురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అదీ సంగతి.

Dead men never speak.But we have to speak about them very carefully.

రాబిన్ విలియమ్స్ 21-7-1951 మధ్యాన్నం 1-34 కి చికాగో ఇల్లినాయ్ స్టేట్ లో పుట్టినట్లు రికార్డ్ దొరుకుతున్నది.ఆ సమయానికి గల గ్రహస్థితి పైన ఇచ్చాను.

ఆషాఢ బహుళ చతుర్ధి శనివారం రోజున రాహువుదైన శతభిషా నక్షత్రంలో గురుహోరలో ఇతను జన్మించాడు.

తులాలగ్నాదిపతి శుక్రుడు లాభ బాధకస్థానంలో కేతువుతో ఒకే నక్షత్ర పాదంలో ఉండటం వల్ల --బాధ భరించలేక తనంతట తాను ఈలోకంనుంచి నిష్క్రమిస్తాడని సూచన ఉన్నది.ఇతని జీవితంలో ఉన్న కార్మిక్ సిగ్నేచర్స్ లో ఇది మొదటిది. 

11-8-2014 న చనిపోయాడు.ఆ సమయానికి ఇతనికి కేతు/బుధ/కేతుదశ జరుగుతున్నది.

బుధుడు రాహునక్షత్రంలో ఉన్నాడు.కేతువు దశ జరుగుతున్నది.ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అంటున్నారు.కనుక ఈ దుర్మరణం ప్రస్తుతపు రాహుకేతువుల ప్రభావమే అని నేనంటే ఏమీ అభ్యంతరం ఉండదనుకుంటాను.

చంద్రలగ్నం నుంచి గమనిస్తే--
  • చంద్రుడు రాహువుతో కలసి ఉన్నాడు.ఇలాంటి జాతకులకు ఏదో ఒక వ్యసనం ఉంటుంది.ఇతను కూడా కొన్నాళ్ళు డ్రగ్స్ కీ కొన్నాళ్ళు త్రాగుడికీ అలవాటు పడి తేరుకుని మళ్ళీ వాటి ఉచ్చులో పడ్డాడు.
  • లగ్నాధిపతి అయిన శుక్రునితో కేతువు మారకస్తానంలో ఉండటం చూడవచ్చు.కేతువు దశలోనే కేతువు విదశలోనే మరణం జరిగింది. అదికూడా దుర్మరణం.రాహుకేతువులు దుర్మరణాలకు కారకులని నేను ఎప్పుడూ చెప్పేది ఇక్కడ నిజం కావడం స్పష్టంగా చూడవచ్చు.
  • బుధుడు రోగస్తానంలో రాహునక్షత్రంలో ఉండటం గమనించాలి.అంటే దీర్ఘ వ్యాధిని సూచిస్తున్నాడు.అదికూడా మారకుడైన రవితో కలసి రోగస్తానంలో ఉన్నాడు.తనకున్న శ్వాసకోశ వ్యాధి ఇంక నయం కాదన్న నిరాశతో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.గ్రహ ప్రభావం ఎంత ఖచ్చితంగా మనిషి మీద ఉంటుందో గమనించండి.
  • కేతు/బుధ/కేతువు అంటే తీవ్రమైన నిరాశలోకి మనిషిని నెట్టివేసే దశ.గత కొంతకాలం నుంచీ ఇతను తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నాడని ఇతని సన్నిహితులు చెబుతున్నారు.ఇంతకంటే భారతీయ జ్యోతిష్యానికి ఇంకొక ఋజువు అవసరం లేదు.
  • లగ్నం సినిమా నటులనూ కళాకారులనూ సూచించే 'తులా' అయింది. అధిపతి శుక్రుడు లాభస్తానంలో కేతువుతో కలసి ఉండటం గమనార్హం.అందుకే సినిమా రంగంలో రాణించాడు.కానీ కేతు దశ చివరిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యా జాతకాలలో ఉంటుందని నేను ఎప్పుడూ చెప్పే జైమినీమహర్షి సూత్రం ఈ జాతకంలో ఉందా లేదా చూద్దామా?

లగ్నానికి తృతీయాన్ని మారకుడైన కుజుడు రాహునక్షత్రంలో ఉంటూ తొమ్మిదో ఇంటినుంచి చూస్తున్నాడు.ఆ కుజుడిని శనీశ్వరుడు దశమ దృష్టితో చూస్తున్నాడు.కనుక శని,రాహు,కుజుల సంబంధం చక్కగా ఇక్కడ కనిపిస్తున్నదా లేదా?నేను ఎప్పటినుంచో వ్రాస్తున్న శపితయోగానికే రాబిన్ విలియమ్స్ బలైపోయాడన్నది పై కాంబినేషన్ స్పష్టంగా చూపిస్తున్నది. గమనించండి.

లగ్నారూడం నుంచి మళ్ళీ తృతీయంలో కేతువున్నాడు.రాహువు చూస్తున్నాడు.ఇంతకంటే ఋజువేం కావాలి?

చూచారా ఎంత కరెక్ట్ గా ఈ ఆత్మహత్యాసూత్రం మళ్ళీ ఈ జాతకంలో కూడా ప్రతిఫలించిందో? వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి సూత్రాలను కనిపెట్టి క్రోడీకరించిన మహర్షి జైమినికి ప్రణామాలు అర్పిద్దామా?

నవాంశలో శనిచంద్రుల కలయిక డిప్రెషన్ కు సూచిక.రాహుకుజబుధులు కలసి ఉండటం అందులో బుధుడు ఆత్మకారకుడు కావడం దేనిని సూచిస్తున్నదో తెలుసా?

డిప్రెషన్ తో కూడిన స్థితిలో ఒక అకస్మాత్తు నిర్ణయం తీసుకోని జీవితాన్ని విషాదాంతం చేసుకుంటాడని కనిపిస్తున్నది.

అదేగా జరిగింది??

ఇకపోతే,నిన్నటి మరణకాల గ్రహస్థితికీ జననకాల గ్రహస్థితికీ పోలికలు చూద్దామా?
  • జననకాల బుధుడూ మరణకాల బుధుడూ ఖచ్చితంగా ఒకే ప్రదేశంలో ఉన్నారు.
  • జననకాల లగ్నం ప్రస్తుతం గోచార కుజ శనుల మధ్యన బందీ అయ్యి ఉన్నది.అంటే శపితయోగం చేత బంధింపబడి ఉన్నది.
  • జననకాల చంద్రుడూ మరణకాల చంద్రుడూ ఇద్దరూ కుంభరాశిలోనే ఉన్నారు.
  • జీవకారకుడైన జననకాల గురువు మీద గోచార కేతువు సంచరిస్తూ మరణాన్ని సూచిస్తున్నాడు.ఇది తిరుగులేని నాడీజ్యోతిష్యసూత్రం.
  • కర్మకారకుడైన జననకాల శనిమీద గోచార రాహువు సంచరిస్తున్నాడు.ఇదీ నాడీజ్యోతిష్యసూత్రమే.
ఒక్క విషయాన్ని గతంలో ఎన్నోసార్లు చెప్పాను.దీనిని ఎన్ని సార్లైనా చెబుతాను.ఎందుకంటే సత్యాన్ని ఎన్నిమార్లైనా ఎలుగెత్తి చాటవచ్చు. అందులో తప్పులేదు.

జాతకం అనేది జీవితాన్ని ఖచ్చితంగా స్పష్టంగా ప్రతిఫలిస్తుంది.ఇది తిరుగులేని నిజం.ఎన్ని వేల జాతకాలు చూచినా ఇదే విషయం స్పష్టంగా దర్శనిస్తుంది.

చివరలో ఒక కొసమెరుపు.

చనిపోయిన వారి జాతకాలే నేను చూస్తానని నమ్మేవారు వారి జాతకాలను చూడమని నన్ను అడగకండి.ఆ తర్వాత మీకు ఏదైనా జరిగితే దానికి నేను బాద్యుడిని కాను.
read more " రాబిన్ విలియమ్స్ జాతకం - ఒక విశ్లేషణ "

11, ఆగస్టు 2014, సోమవారం

ఇరాన్లో కూలిన విమానం - పౌర్ణమి ప్రభావానికి మరొక్క ఋజువు

నిన్న ఉదయం ఇరాన్లో ఇంకొక ప్రయాణీకుల విమానం కూలిపోయింది.38 మంది ఆ ప్రమాదంలో చనిపోయారని అంటున్నారు.

సరిగ్గా పౌర్ణమి ప్రభావంలో ఇది జరిగింది.

ఉదయం 9.20 కి టెహరాన్ లో బయలుదేరిన విమానం కొద్దిసేపట్లోనే జనావాస ప్రాంతాలలో కూలింది.

ఆ సమయానికి ఉన్న గ్రహస్థితిని ఇక్కడ చూద్దాం.

ఈ విమానం HH 5915 అనే నంబర్ ను కలిగి ఉన్నది.


HH 5915

అంటే 88-20.

దీనిని గ్రహముల లోకి మారిస్తే,

శని-శని-రాహువు అవుతుంది.

ఇకపోతే,దీని రూట్ నంబర్ 9 అవుతుంది.పాశ్చాత్య విధానంలో ఈ అంకె కుజునికి సూచిక.

నేను వ్రాస్తున్న గత కొన్ని పోస్ట్ లు చదువుతున్న వారికి ఇంతకంటే ఇంకే వివరణా అవసరం లేదనుకుంటాను.మళ్ళీమళ్ళీ అవే శని రాహు కుజులు ప్రత్యక్షం కావడం స్పష్టంగా గమనించవచ్చు.

నేను వ్యక్తిగతంగా నమ్మే విధానంలో 9 చంద్రుడిని సూచిస్తుంది అని నమ్ముతాను.చాలా పరిశోధన మీద ఈ నమ్మకానికి నేను వచ్చాను.ఇప్పుడు ఇంకొక విచిత్రాన్ని వినండి.

ఉదయం 9.20 కి టెహరాన్ లో సరిగ్గా చంద్రహోర జరుగుతున్నది.అంతేకాదు నడుస్తున్న నక్షత్రం కూడా శ్రవణం(చంద్ర నక్షత్రమే).

9.20=11=2 (మళ్ళీ రాహువే)

ఈ ప్రమాదంలో చనిపోయినది 38 మంది.

అంటే 38=11=2 (మళ్ళీ రాహువే)

ఈ విశ్లేషణను ఇలా ఉంచి,ఈ సంఘటన వెనుక ఉన్న జ్యోతిష్యపరమైన వివరాలు చూద్దాం.

లగ్నం కన్య 12 డిగ్రీలలో ఉండి రాహుప్రభావానికి లోనై ఉన్నది.లగ్నంలో రాహువు ఉండటం స్పష్టంగా చూడండి.అక్కడనుంచి కుంభంలో ఉన్న నెప్ట్యూన్ తో ఖచ్చితమైన షష్టాష్టక దృష్టిలో ఉన్నది.ఇక్కడ ఇంకొక్క విచిత్రం ఉన్నది.నెప్ట్యూన్ రాహునక్షత్రంలో ఉన్నది.కనుక ఈ సమయం పూర్తిగా భయంకరమైన రాహుప్రభావానికి లోనై కనిపిస్తున్నది. అందుకే ఈ ప్రమాదం జరిగింది.

జీవకారకుడైన గురువు కర్కాటకం 11 డిగ్రీలలో ఉంటూ ధనుస్సులో మూలా నక్షత్రంలో ఉన్న మాందీగ్రహంతో ఖచ్చితమైన షష్టాష్టక దృష్టిలో ఉన్నాడు. గురువు శనినక్షత్రంలో ఉన్నాడన్న విషయం గమనార్హం.అంటే ఈ ఘడియలో కొంతమంది మానవసమూహాలకు మూడింది అన్న సూచన స్పష్టంగా ఉన్నది.

గురువు ఈ సమయంలో ఇంకా మూడు గ్రహాలతో  కూడి ఉన్నాడు.అవి రవి,బుధ,శుక్రులు.ఈ నలుగురిలో గురు శుక్రులు పుష్యమీ(శని) నక్షత్రంలోనూ రవిబుధులు ఆశ్లేషా(రాహు) నక్షత్రంలోనూ ఉన్న విషయం గమనిస్తే రాహుశనులు తెరవెనుక ఉండి నడిపించిన నాటకం అర్ధమౌతుంది.

వాయుతత్వరాశిలో ఉన్న వాయుగ్రహమైన శనితో సూర్యునికి ఖచ్చితమైన కోణదృష్టి ఉండటం గమనిస్తే ఈ వాయుయాన ప్రమాదం ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.ఈ రోజు ఆదివారం అన్న విషయం కూడా గమనార్హం.

నవాంశలో శని నీచస్థితిలో కుజక్షేత్రంలో ఉంటూ అక్కడే ఆ సమయలగ్నం ఖచ్చితంగా పడటం ఒక వాయుయాన ప్రమాదాన్ని సూచించడం లేదూ?

ఈ సమయానికి చంద్ర శని బుధ రవిదశ జరుగుతున్నది.రాహుప్రభావంలో ఉన్న రవిబుధులపైన ఉన్న శని దృష్టి ఎంత ఖచ్చితంగా ఉన్నదో గమనించండి.ఇకపోతే చంద్రనక్షత్రం నడుస్తున్న రోజున చంద్ర హోరలో చంద్రునితో రవిబుధులకు సప్తమ కేంద్ర దృష్టి ఉన్నది.ఇంతకంటే అద్భుతమైన గ్రహసమ్మేళనం దీనిని తప్ప ఇంక దేనిని సూచిస్తుంది?

HH 5915 అనే విమాన నంబర్లో ఏయే గ్రహాలున్నాయో చూద్దామా?

8=శని(రెండుసార్లు).వాయుసూచకుడు.వాయుతత్వరాశిలో ఉన్నాడు.
5= బుధుడు(రెండుసార్లు).ఆ సమయానికి బుధుడే ఆత్మకారకుడు.
9=చంద్రుడు.
1=సూర్యుడు.పౌర్ణమి రోజుగనుక సూర్యచంద్రుల పాత్ర ఉన్నది.

శని బుధ సూర్య చంద్రుల గురించేగా పై పేరాలో మనం అనుకుంటున్నది? వారిదశయేగా అప్పుడు జరుగుతున్నది.చూచారా దశాసంతకం విమాన నంబర్లో ఎలా ఖచ్చితంగా సరిపోయిందో?అప్పుడు జరుగుతున్న దశ ఆ విమాన నంబర్ తో ఖచ్చితంగా సరిపోయింది గనుకనే అదే విమానం కూలిపోయింది.

చూచారా జ్యోతిష్యమూ సంఖ్యాశాస్త్రమూ ఎలా ఖచ్చితంగా సరిపోతాయో?

మరి ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు వల్ల ఏమి మేలు జరిగింది? అని మన సందేహ సుందరాలకు అనుమానం రావచ్చు.

విమానం జనావాస ప్రాంతంలో పడినా కూడా పౌరులకు ఏ విధమైన ప్రమాదమూ జరగకపోవడమూ, ఆ విమానంలో ఉన్నవారిలో కూడా 9 మంది బ్రతికి బట్ట కట్టడమే గురు అనుగ్రహం.నేను పైన చెప్పినట్లు 9 అంకె చంద్రుని సూచించడమూ ఆ పూర్ణచంద్రునిపై గురువు యొక్క దృష్టి ఉండటమూ ఇది గజకేసరీయోగం కావడమే ఇంత ప్రమాదంలో కూడా కొందరు బ్రతికి బట్టకట్టడానికి కారణాలు.

ఆత్మకారకుడైన బుధుడు అస్తంగతుడై రాహుప్రభావంలో ఉండటం ఈ ప్రమాదం అంతటికీ కొసమెరుపు.

ఏతా వాతా చూస్తే,శని రాహు కుజుల ప్రభావమూ పౌర్ణమి ప్రభావమూ మరొక్క సారి ఋజువైంది.

నా వీరాభిమానులు మళ్ళీ వారి గళం వినిపించవచ్చు.

"అన్నీ జరిగిపోయిన తర్వాతనే మీరు వ్రాస్తారు.ముందే చెప్పచ్చుగా?" అని.

"అన్నీ ముందే తెలుసుకోవాలని అంత దుగ్ధ మీకెందుకు?తెలుసుకుని ఏం చేస్తారు?"అని నేను ప్రశ్నిస్తాను.

"మీ జీవితాలు మీరు బాగుచేసుకోలేరు.లోకంలో జరిగే జరగబోయే ఉపద్రవాలు ముందుగా తెలుసుకోవాలనీ వాటిని తప్పించాలనీ ఎందుకంత ఆరాటం?" అని కూడా ప్రశ్నిస్తాను.

"జరగబోయేది ముందే తెలిస్తే అదిచెప్పి వాడెవడో నాస్తిక శిఖామణి ఎనౌన్స్ చేసిన ప్రైజ్ మనీ కొట్టేయ్యచ్చుగా" అని వారంటారు.

అదీ వారి అసలైన బాధ!!!

"ప్రతిదానినీ మీలాగా డబ్బుతో కొలిచే పాడలవాటు నాకు లేదు"-అని నేనంటాను.

"మరి ఇదంతా వ్రాయడం ఎందుకు?" అని వారంటారు.

"మానవుల మీద ఉన్న గ్రహప్రభావాన్ని అర్ధం చేసుకోవడానికి మాత్రమే ఇదంతా వ్రాస్తున్నాను"-అని నేను బదులిస్తాను.

"ఈ మాట చాలా సార్లు వినీవినీ విసుగొచ్చింది.ఇక ఆపండి"- అని వారంటారు.

"ఆపను.నాకూ మీరడిగే ప్రశ్నను వినీవినీ విసుగొచ్చింది.ఎలాగూ నేను చెబుతున్నదాన్ని అర్ధం చేసుకునే తెలివీ వివేకమూ మీకు లేవు.మీరే ఆపండి"-అని నేనంటాను.

వారూ ఆపరు.నేనూ ఆపను.

చివరికి "కధ కంచికి మనం ఇంటికి".

కొసమెరుపుగా ఇంకొక్క సంగతి.

ఇరాన్ లోనే ఎందుకు ఇది జరగాలి? ఇంకో దేశంలో ఎందుకు జరగకూడదు? అని మళ్ళీ కొందరు అడుగుతారు.

వారికి మాత్రం చిన్న క్లూ ఇస్తాను.

TEHERAN

అనే దానిని అంకెలలోకి మార్చి చూడండి.

2058518114

దీని రూట్ నంబర్ 8 అవుతుంది.

అంటే శనీశ్వరుడిని సూచిస్తున్నది.

IRAN

అనే దానిని అంకెలలోకి మార్చండి.

918114

దీని రూట్ నంబర్ 6 అవుతుంది.

అంటే కుజుడు.

అంటే కుజ శనుల కలయిక.

ఇప్పుడైనా కనీసం అర్ధమైందా? ఈ యాక్సిడెంట్ ఇరాన్ లోని టెహరాన్ సమీపంలోనే ఎందుకు జరిగిందో?

నా వీరాభిమానులు అడగబోయే ప్రశ్నలు కూడా నాకు ముందుగానే తెలిసిపోవడమే జ్యోతిష్యం నిజం అనడానికి ఇంకొక సూచన.

అదీ సంగతి!!!
read more " ఇరాన్లో కూలిన విమానం - పౌర్ణమి ప్రభావానికి మరొక్క ఋజువు "

అశ్వత్థామ - పాండవ శిబిరంలో ప్రళయ తాండవం

నిశిరాత్రి.

కటిక చీకటి.

అక్కడక్కడా వెలుగుతున్న దివిటీలు ఆ చీకటిని పారద్రోలలేక పోతున్నాయి.

పాండవ శిబిరంలో అందరూ గాఢనిద్రలో ఉన్నారు.అప్పటివరకూ అందరూ విజయోత్సాహంతో విందులు వినోదాలలో మునిగితేలి మదిరామత్తులై ఆనందంలో ఒళ్ళు మరచి నిద్రిస్తూ ఉన్నారు.చివరకు ఏనుగులూ గుర్రాలూ కూడా ఇన్నాళ్ళ యుద్ధశ్రమను మరచిపోవడానికా అన్నట్లు గాఢనిద్రలో ఉన్నాయి.అంతా నిశ్శబ్దంగా ఉన్నది.వాకిలి కాపలాదారులు కూడా నిద్రలో ఉన్నారు.

వారు నిద్రలోనే పెనునిద్రలోకి పంపబడ్డారు వీరిచేత.

కృపాచార్యునీ కృతవర్మనూ ముఖద్వారం వద్ద కాపలాగా ఉండమని చెప్పిన అశ్వత్థామ పాండవశిబిరాలలోనికి నిశిరాత్రిలో మృత్యువులాగా నిశ్శబ్దంగా ప్రవేశించాడు.

గుర్తులను బట్టి నిశ్శబ్దంగా వెదుకుతూ ముందుగా దృష్టద్యుమ్నుని శిబిరం వైపు కదిలాడు అశ్వత్థామ.

అతని మనస్సులో తన తండ్రి వధాదృశ్యమే కదులుతున్నది.నిరాయుధుడైన తన తండ్రిని దృష్టద్యుమ్నుడు తలనరకడమే అతని మనస్సులో మెదులుతున్నది.మహాగురువూ మహాతపస్వీ బ్రాహ్మణోత్తముడూ అయిన తన తండ్రిని అలా కిరాతకంగా చంపుతాడా ఒక గర్వితుడైన సామాన్య క్షత్రియుడు?

శిబిరంలోకి ప్రవేశించి చూచాడు.

రాజభోగంతో కూడిన ఒక ఉన్నతమైన తల్పం మీద దృష్టద్యుమ్నుడు చేతులు బారజాపుకుని హాయిగా నిర్భయంగా నిద్రపోతున్నాడు.

అశ్వత్థామలోని యముడు మేల్కొన్నాడు.

ఆదమరచి నిద్రిస్తున్న దృష్టద్యుమ్నుని ఎగిసి తన కాలితో ఒక్క తాపు తన్నినాడు అశ్వత్థామ.

ఉలిక్కిపడి లేచిన అతన్ని జుట్టు పట్టుకుని తల్పం నుంచి నేలకు ఒక్క ఊపున జారలాగి తేరుకునే వ్యవధి ఇవ్వకుండా అతని మర్మస్థానాల మీద చేతులూ కాళ్ళతో బలమైన దెబ్బలు కొట్టడం ప్రారంభించాడు.

దృష్టద్యుమ్నునికి ఏమి జరుగుతున్నదో అర్ధం కాలేదు.ఎవరు తనను కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో ఒక్కక్షణం పాటు ఏమీ తెలియలేదు. ఇదంతా పీడకలేమో అనుకున్నాడు.కాని అశ్వత్థామ కొడుతున్న భయంకరమైన చావుదెబ్బలు సృష్టిస్తున్న నొప్పి 'ఇదంతా కలకాదు నిజమే' అని చెబుతున్నది.

అతనికి లేవడానికి అవకాశం ఇవ్వకుండా 'జానుబంధం' అనే మల్లయుద్ధ ప్రక్రియలో అతన్ని నేలకు బిగించి అణచి పెట్టాడు అశ్వత్థామ.వెనక్కు బాణంలా అతని వెన్నును వంచిపట్టి 'కంఠ చక్రబంధం' అనే ప్రక్రియతో అతని ఊపిరిని ఆడకుండా బిగించినాడు.

'ఎవరు? ఎవరు? ఏ రాక్షసుడవు నీవు?' సర్వశక్తులూ కూడగట్టుకుని అరిచాడు ద్రుష్టద్యుమ్నుడు.

అతను అరిచానని అనుకున్నాడు.కాని ఆ గొంతు పీలగా బేలగా పలికింది.

'అవును రాక్షసుడనే.బ్రహ్మరాక్షసుడను.అశ్వత్థామను.ఈ ఘడియలో నీ చావు నా చేతిలో మూడుతున్నది.నీ పాపానికి తగిన శిక్షను పొందడానికి సిద్ధపడు' ఆగ్రహంతో ఊగిపోతూ అశ్వత్థామ బదులిచ్చాడు.

దృష్టద్యుమ్నునికి విషయం అర్ధమైంది.అప్పటికే మర్మస్థానాలు చితికిపోయి అతను ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాడు.చావు తప్పదని అతనికి తెలిసిపోయింది.

'అశ్వత్థామా.నన్నిలా కాళ్ళతో చేతులతో తొక్కి ఒక జంతువును చంపినట్లు చంపకు.నాకు ఉత్తమగతులు కలగవు.ఒక వీరునివలె నన్ను శస్త్రాస్త్రాలతో వధించు.కనీసం నాకు మరణం తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది.'అతికష్టం మీద గొంతు పెకలించుకుంటూ ప్రాధేయపడ్డాడు దృష్టద్యుమ్నుడు.

మహోగ్రరూపంలో ఉన్న అశ్వత్థామ కరగలేదు.అతడు వీరవిద్యలలో నిష్ణాతుడు.ఏ నాడీకేంద్రం మీద ఏ విధంగా కొడితే ఎంతసేపట్లో ప్రాణం పోతుందో అతనికి బాగా తెలుసు.

'నిరాయుధుడై ధ్యానంలో ఉన్న మహాగురువు ద్రోణాచార్యుని వధించిన నీవు మానవుడవు కావురా నీచుడా! నీవు పశువువే!! కనుక నీకు పశుమరణమే సరియైనది. నిన్ను శస్త్రాస్త్రాలతో వధించి అంత మర్యాదను ఇవ్వలేను.నీకు స్వర్గార్హత లేదు.నరకమే నీకు గతి.'అంటూ ఇంకా బలమైన ముష్టిఘాతాలతో ద్రుష్టద్యుమ్నుని కళ్ళలోనూ, కణతలమీదా, మెడా గొంతులలో ఉన్న నాడీకేంద్రాల మీదా,జననేంద్రియాలమీదా కొడుతూ ఉత్తచేతులతోనే అతన్ని క్షణాలలో చంపేశాడు.ఇదంతా అతని రాణులూ పరివారమూ గుడ్లప్పగించి చూస్తుండగానే జరిగిపోయింది.

అప్పటివరకూ హాయిగా నిద్రిస్తున్న దృష్టద్యుమ్నుడు క్షణాలలో విగతజీవియై శవంగా మారిపోయాడు.

పెద్దగా పెడబొబ్బలు పెడుతూ దృష్టద్యుమ్నుని శవాన్ని ఒక పక్కకు విసరి కొట్టాడు అశ్వత్థామ.తన తండ్రి వధకు ప్రతీకారం తీరిందన్న సంతోషంతో అతని రౌద్రం ఇంకా రెండింతలు అయింది. మానవరక్తం రుచిమరిగిన పులివలె అతిక్రూరంగా అతను కనిపిస్తున్నాడు.

ఈ లోపల ఆ కేకలకు శిబిరం అంతా మేలుకొన్నది.

ఆ సందడికి ఇంకా రౌద్రరూపం దాల్చాడు అశ్వత్థామ.

అందినవారిని అందినట్లు రుద్రఖడ్గంతో ఊచకోత కొయ్యడం ప్రారంభించాడు. అన్ని యుద్ధనియమాలనూ అతను గాలికొదిలేశాడు.ఇక్కడ కొట్టవచ్చు ఇక్కడ కొట్టరాదు ఈవిధంగా దాడి చెయ్యవచ్చు ఈవిధంగా దాడి చెయ్యకూడదు అన్న నియమావళిని పూర్తిగా వదలిపెట్టి అడ్డు వచ్చినవారిని అడ్దోచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లు రుద్రఖడ్గంతో నరుకుతూ వీరవిహారం మొదలుపెట్టాడు.వాళ్ళు దాసీలా రాణులా పరిచారకులా సేవకులా సైనికులా యోధులా స్త్రీలా పిల్లలా అనే విచక్షణ లేకుండా ఎదురు పడినవారిని పడినట్లే నరికేస్తూ ముందుకు సాగాడు.క్షణాలలో ఆ శిబిరం అంతా రక్తంతో తడిసి ముద్దగా మారింది.శవాల గుట్టలూ మాంసపు ముద్దలూ పోగుపడ్డాయి.

ఎక్కడ వారక్కడ గోలగోలగా లేచారు.

'ఏదో జరుగుతున్నది!! లేచి ఆయుధం అందుకుందాం' అనుకునే లోపు వారి తలలు తెగి ఎగిరి పోతున్నాయి.

మనుషుల తలలను మొండాలను నడుములను కాళ్ళను చేతులను ఎక్కడ బడితే అక్కడ స్త్రీలా పురుషులా చూడకుండా సొరకాయలను నరికినట్లు నరకడం ప్రారంభించాడు అశ్వత్థామ.

అతనికి ఎదురైనవారు ఎదురైనట్లు నేలకూలిపోతున్నారు.వారి దేహాలనుంచి రక్తం రివ్వుమని లేచి అశ్వత్థామను తడిపేస్తున్నది.

ఈ లోపల శిబిరంలోని మిగతా గుడారాలలో అందరూ మేల్కొన్నారు.ఎవడో రాక్షసుడు వచ్చి నిశిరాత్రిలో అందర్నీ చంపుతున్నాడని వార్త ప్రబలి యోధులందరూ లేచి ఆయుధధారులై బయటకు వచ్చారు.వారిలో ఉపపాండవులూ ఉన్నారు.

మొత్తం ఒళ్లంతా రక్తంతో తడిసి ఒక ఖడ్గాన్నీ డాలునూ పట్టుకుని ఉన్న అశ్వత్థామను వాళ్ళు గుర్తించలేక ఎవడో రాక్షసుడని అనుకున్నారు.

తనమీదకు వచ్చిన ఉపపాండవులను(పాండవుల తనయులు) ఒక్కొక్కరినీ ఒక్కొక్క రకంగా నరికి పోగులు పెట్టాడు అశ్వత్థామ.వారందరూ అశ్వత్థామను ఎదుర్కొని తమదైన శైలిలో ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా ఆయుధాలతో అతన్ని దెబ్బలు కొట్టారు.కానీ కత్తియుద్ధంలో అశ్వత్థామ యుద్ధ నైపుణ్యం ముందూ రుద్రఖడ్గపు ధాటి ముందూ వారు పనికిరాని వారయ్యారు.

చాలామంది అనుకుంటారు.నిద్రపోతున్న చిన్న పిల్లలైన ఉపపాండవులను అశ్వత్థామ నిద్రలోనే చంపాడు అని.అది నిజంకాదు.వారు నిద్రలేచి అతనితో యుద్ధం చేశారు.అతనితో తలపడ్డారు.యుద్ధంలోనే వారిని చంపాడు అశ్వత్థామ.

పాంచాలదేశపు యోధులూ,సంజయులనే యోధవర్గం వారూ,మిగిలిన పాండవపక్షంలోని వీరులందరూ ఒకటై అశ్వత్థామను గుంపుగా చుట్టు ముట్టారు.అన్నిపక్కలనుంచీ బాణాలతోనూ కత్తులతోనూ బల్లాలతోనూ గదలతోనూ అతన్ని ఎదుర్కొన్నారు.కాని అతనిలో ఉన్న రుద్రశక్తి ముందు వాళ్ళు నిలవలేక పోతున్నారు.

అశ్వత్థామ చేస్తున్న ఒక్కొక్క ఖడ్గప్రహారానికి పది తలలు తెగి పడిపోతున్నాయి.అతను చేస్తున్న వీరవిన్యాసాలూ పాదక్రమములూ వారు అప్పటివరకూ కనీవినీ ఎరుగనివి.చిత్రవిచిత్రములైన గమనగతులతో యుద్ధనైపుణ్యంతో అందినవారిని అందినట్లు నరికి పారేస్తూ విజ్రుమ్భించాడు అశ్వత్థామ.

అంతలో అతనికి శిఖండి ఎదురొచ్చాడు.అతన్ని చూడగానే అశ్వత్థామ కోపం పదింతలు పెరిగింది.

'దుర్మార్గుడా!పేడివెధవవై ఉండి ఎక్కడో అంత:పురంలో పూలు అల్లుకుంటూ కాలం గడపక,భీష్మపితామహుడినే నీ మోసంతో చంపుతావురా? ఇప్పుడు నా చేతిలో నిన్ను ఎవరు రక్షిస్తారో పిలవరా!' అంటూ శిఖండి చేస్తున్న ఖడ్గప్రహారాలను  తన డాలుతో కాచుకుంటూ రుద్రఖడ్గంతో ఒక్క విసురున ప్రహారం చేశాడు. మెరుపులా మెరిసిన రుద్రఖడ్గం శిఖండిని నిలువునా రెండు ముక్కలుగా చీల్చి పారేసింది.అతని శరీరం రెండు నిలువుముక్కలుగా చీలిపోయి చెరో వైపునా పడిపోయింది.నిలువెత్తున చిమ్మిన రక్తం అశ్వత్థామను పూర్తిగా అభిషేకించింది.

అశ్వత్థామ ఆ రాత్రి ఎవరినీ వదలలేదు.

మనుషులను సరే సరి,చివరకు ఏనుగులను గుర్రాలను కూడా వదలకుండా తన దారికి అడ్డం వచ్చిన వాటిని కూడా నరికి పారేశాడు.గాయాల పాలై బ్రతికి ఉన్న కొన్ని ఏనుగులూ గుర్రాలూ ఆ చీకటిలో పిచ్చేత్తినట్లు ఇష్టం వచ్చినట్లు పరుగెత్తి ఎంతోమంది సైనికులనూ యోధులనూ వాటి కాళ్ళతో తొక్కి చంపేశాయి.

అసలే చీకటి.ఏమి జరుగుతున్నదో తెలియదు.ఎవడో రాక్షసుడు నిశిరాత్రిలో అకస్మాత్తుగా తమమీద దాడిచేసి చంపుతున్నాడన్న భయంలో ఆ వీరులు ఎవరు ఎవర్ని చంపుతున్నారో తెలుసుకోకుండా ఒకరినొకరు నరుక్కుని చాలామంది వాళ్ళలో వాళ్ళే చచ్చారు.భయంకరమైన దొమ్మీ అక్కడ జరిగింది.

కొందరు అతితెలివితో చనిపోయినట్లు నటించి కింద పడుకున్నారు. అశ్వత్థామ అలాంటివారిని కూడా వదలలేదు.కాళ్ళతో తొక్కుతూ పరీక్షించి మరీ వాళ్ళను చంపాడు.ఇంకొందరు తప్పించుకుందామని పరుగెత్తారు. వారు పారిపోవడానికి ముఖద్వారం వద్దకు పరిగేట్టగా అక్కడ కాచుకుని ఉన్న కృపాచార్యుడూ కృతవర్మా వారిని గుమ్మంలోనే నరికేశారు.ఆ విధంగా ముఖద్వారం వద్ద కొన్ని శవాల గుట్టలు పేరుకు పోయాయి.

చూస్తుండగానే ఆ శిబిరం అంతా పీనుగులతోనూ రక్తపు మడుగులతోనూ మాంసం ముద్దలతోనూ తెగిపడిన కాళ్ళూ చేతులూ తలలూ మొండాలూ ఇతర శరీరభాగాలతోనూ నిండిపోయింది.ఎక్కడ చూచినా మనుష్యుల ఏడుపులూ మూలుగులూ,గోలగోలగా అరుపులూ,గాయపడిన ఏనుగుల ఘీంకారాలూ,గుర్రాల సకిలింపులూ తప్ప ఇంకేమీ అక్కడ వినబడటం లేదు. వేలమంది ఆ చీకటిలో అటూ ఇటూ పరిగేట్టగా లేచిన దుమ్ముతో అక్కడ ఇంకా కటికచీకటిగా మారి ఎవరికీ ఏమీ కనపడని స్థితి అక్కడ నెలకొన్నది.ఆ భయంతో చాలామంది యోధులైన సైనికులు వారిలో వారే ఒకరినొకరు నరుక్కొని వందలాది మంది చచ్చారు.

ప్రళయకాలంలో విలయతాండవం చేసి సమస్త లోకాలనూ విధ్వంసం గావించే రుద్రుని తేజస్సు తనను ఆవహించడం చేత వేలాది యోధులను తానొక్కడే ఎదుర్కొని ఆరాత్రి పూట వధించగలిగాడు అశ్వద్ధామ.అదే ఒక్క మానవ ప్రయత్నంతో మాత్రమే దీనిని సాధించగలిగేవాడా అంటే అనుమానమే.

తనకు తెలిసిన మంత్రపూరిత అస్త్రాలను వేటినీ వాడకుండా ఖడ్గవిద్యా నైపుణ్యంతోనే వేలాదిమందిని తానొక్కడే ఎదుర్కొని వారినందరినీ సంహరించి అజేయునిగా నిలిచాడు అశ్వత్థామ.ఒక్క బ్రహ్మశిరోనామకాస్త్రమే చాలు ఇంత కష్టపడకుండా దానిని ప్రయోగిస్తే అందరినీ క్షణంలో భస్మం గావించి ఆ ప్రదేశాన్ని మరుభూమిగా మార్చి ఉండేది.కాని అతనా పనిని  చెయ్యలేదు.

ఇలా కొంతసేపు గడిచాక అంతా మళ్ళీ శాంతించింది.మళ్ళీ మౌనం అక్కడ రాజ్యమేల సాగింది.అయితే మొదట ఉన్న మౌనం వేరు.ఇప్పటి మౌనం వేరు.మొదటిదీ విశ్రాంతితో కూడిన మౌనమే.ఇదీ విశ్రాంతితో కూడిన మౌనమే.అయితే మొదటిది జీవంతో ఉన్న విశ్రాంతి.ఇది మరణంలో విశ్రాంతి.

ఆ మారణహోమం మధ్యలో అక్కడి వేలాదిమంది యోధులందరూ నేలకూలి పోయారు.అశ్వత్థామ ఒక్కడే చేతిలో రుద్రఖడ్గం ధరించి ఆ శవాల గుట్టల మధ్యలో నిలబడి ఉన్నాడు.నిలువెల్లా రక్తంతో స్నానం చేసినట్లు కనిపిస్తున్న అతను నిజంగానే రుద్రుడిలా ఊగిపోతూ ఉన్నాడు.

ఈలోపల,రక్తపు వాసన పట్టి ఆ శవాలను పీక్కు తినడానికి అక్కడకు వేగంగా వచ్చిన అడవిమృగాలూ,భూతపిశాచాలూ కూడా అశ్వత్థామను చూచి భయంతో దూరంగా తొలగిపోతున్నాయి.అంత భయంకరంగా అతను కనిపిస్తూ వాటికే దడ పుట్టించేటట్లుగా ఉన్నాడు.

క్రమంగా అతను శాంతించడం ప్రారంభించాడు.అప్పటివరకూ అతన్ని ఆవేశించి ఉన్న రౌద్రం అతన్ని వదలిపోవడం మొదలు పెట్టింది.అతన్ని ఆవహించిన రుద్రశక్తి అంతర్ధానం కావడం మొదలైంది.అతనికి ఒళ్ళు తెలియడం ప్రారంభించింది.వివేచన తిరిగి మేలుకొనసాగింది.చుట్టూ పరికించి చూచాడు. అతనికి పరిస్థితి అర్ధమైంది.

తను వచ్చిన పని అయింది.అనుకున్నది సాధించాడు.తన తండ్రి వధకు ప్రతీకారం తీర్చుకున్నాడు.తన మిత్రుడైన సుయోధనుని అన్యాయపు ఓటమికి ప్రతీకారం చేశాడు.పాండవ వంశాన్ని నిర్వంశం గావించాడు. అశ్వత్థామకు మహానందం కలిగింది.తన సంకల్పానికి బాసటగా నిలిచి తనకు విజయాన్ని కలిగించినందుకు 'నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ:..'అంటూ రుద్రుని తన మనస్సులో భక్తిపూర్వకంగా స్మరించాడు. నెమ్మదిగా నడుస్తూ ముఖద్వారం వద్దకు చేరుకున్నాడు.అక్కడ కృపాచార్యుడూ కృతవర్మా తనకొరకు వేచి చూస్తున్నారు.ఇద్దరూ అతన్ని కౌగలించుకుని తమ ఆనందాన్ని ప్రకటించారు.

అందరూ కలసి ఒక్కసారి మళ్ళీ శిబిరం అంతటినీ పరికించారు.ఎక్కడా చడీ చప్పుడూ లేదు.ఎక్కడ చూచినా శవాల గుట్టలూ మాంసపు ముద్దలూ రక్తపు మడుగులూ తప్ప ఇంకేమీ అక్కడ కనపడటం లేదు.ఒక్క మృత్యువు మాత్రమె అక్కడ రాజ్యమేలుతున్నది.ముగ్గురూ తృప్తిగా తలలు పంకించారు.

ఇంతలో తెలతెలవారుతున్న సూచనలు కనిపించసాగాయి.

'పదండి.యుద్ధభూమికి వెళ్ళి చూద్దాం.ఒకవేళ సుయోధనుడు ఇంకా ప్రాణాలతో ఉంటే ఈ సంతోషకర వార్తను అతనికి వివరించి కుములుతున్న అతని మనస్సుకు ఆనందాన్ని కలిగిద్దాం.' అనుకుంటూ ముగ్గురూ యుద్ధభూమి వైపు వేగంగా దారితీశారు.

(ఇంకా ఉన్నది)
read more " అశ్వత్థామ - పాండవ శిబిరంలో ప్రళయ తాండవం "

10, ఆగస్టు 2014, ఆదివారం

పూర్ణమద: పూర్ణమిదమ్...

"పూర్ణమద: పూర్ణమిదమ్ పూర్నాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే"

అనేది ప్రసిద్ధ వేదమంత్రం.

దీనికి అతి గహనమైన వేదాన్తార్ధం నుంచి గణిత శాస్త్రపరమైన సామాన్యార్ధం వరకూ అనేక రకాలైన వ్యాఖ్యానాలున్నాయి.అవన్నీ అలా ఉంచితే ఇందులోనుంచి ఒక చిన్న సూక్ష్మార్ధాన్నే నేను ప్రస్తుతానికి గ్రహిస్తాను.

విశ్వంలో అంతా పూర్ణమే.అసంపూర్ణం ఏదైనా ఉందంటే అది మానవుని అజ్ఞానం మాత్రమే.

మన ప్రాచీనవిద్యలైన జ్యోతిష్యమూ,వాస్తువిజ్ఞానమూ,తన్మాత్ర జ్ఞానమూ, యోగమూ,తంత్రమూ అన్నీ విడివిడి భాగాలూ విడివిడి విద్యలూ కావు. అవన్నీ పూర్ణమైన ఒకేఒక్క "ఆధ్యాత్మవిద్య"లో అంతర్భాగాలే.ఇది సమగ్రమైన అవగాహన.

జగత్తులో సమస్తమూ నవగ్రహాధీనమే.ఇందుకు ఏదీ మినహాయింపు లేదు.

జగత్తులో సమస్తమూ కర్మాధీనమే.దీనికీ ఏదీ మినహాయింపు లేదు.

కనుక నవగ్రహములు కర్మప్రదాతలని స్పష్టం అవుతున్నది.

కర్మ కర్త మానవుడే.కర్మప్రదాత ఈశ్వరుడు.

కనుక నవగ్రహములు ఈశ్వర శక్తులు.వాటికి పక్షపాతం లేదు.ఎవరెవరి కర్మానుసారం వారికి ఫలితములిస్తాయి.అవి దైవీశక్తులు.అహంకార పూరితంగా వాటితో ఆటలాడటం మంచిది కాదు.

ఎవరెవరి కర్మను వారేలాగైతే తప్పించుకోలేరో నవగ్రహముల బారినుంచి కూడా ఎవరూ తప్పించుకోలేరు.

రెండూ ఒకటే.కర్మయే గ్రహముల రూపంలో ఉన్నది.

నవగ్రహములు అనేవి మన జీవితంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి.అవి లేని రంగం లేదు.సంఘటనా లేదు.మనిషి పుట్టిన నాటినుంచీ పోయేవరకూ వాటి అధీనంలోనే ఉంటాడు.అంతే కాదు,పోయిన తర్వాత కూడా వాటి ప్రభావం నుంచి తప్పుకోలేడు.జీవి సూక్ష్మ లోకాలలో ప్రయాణం చేస్తున్నపుడూ అక్కడ కర్మఫలితాలను అనుభవిస్తున్నపుడూ కూడా నవగ్రహముల ప్రభావం తప్పదు.

మనిషి దేహంలో కూడా అవి కనిపిస్తాయి.మనిషి అరచేతిలో అవి ఉన్నాయి.మనిషి ముఖంలో అవి ఉన్నాయి.మనిషి దేహభాగాలలో అవి కనిపిస్తాయి.వాటిని చూడగలిగి వాటి యోగాలను (permutations and combinations)అర్ధం చేసుకోగలిగితే మనిషిని ఆమూలాగ్రం చదివేయొచ్చు. అతని గతాన్నీ భవిష్యత్తునీ చిటికెలో చూడవచ్చు.

అంతే కాదు.మనిషి నివసించే ఇల్లు కూడా అతని కర్మానుసారమే ఉంటుంది.అది సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా,తన కర్మానుగుణమైన ఇంటిలోనే అతడు ఉంటాడు.దానిని దాటి అతను ఉండాలన్నా కుదరదు.ఉండలేడు.

అంతేకాదు.మన తల్లి దండ్రులు గానీ,అన్నదమ్ములూ అక్కా చెల్లెళ్ళూ గానీ మనకు వచ్చే భార్యగానీ భర్తగానీ పుట్టే సంతానం గానీ స్నేహితులు గానీ అన్నీ పూర్వకర్మానుసారమే జరుగుతాయి.మనిషికి తెలియక అజ్ఞానంతో నిండి అన్నీ తన ఇష్టానుసారమే జరుగుతాయని అనుకుంటాడు.అది నిజం కాదు.ఈ విషయం జీవిత చరమాంకం లోగాని మనిషికి అర్ధం కాదు.

ఎందుకంటే అప్పటికిగాని ఈ విషయాలను అర్ధం చేసుకోవడానికి సరిపోయినంత పరిపక్వత చాలామందికి కలుగదు.కొంతమంది అహంకారులకు అజ్ఞానులకు అప్పుడు కూడా ఈ అవగాహన కలుగదు.అది వారి ఖర్మ.దానికి మనమేమీ చెయ్యలేం.

ఒక మనిషినిగాని అతని జాతకాన్ని గాని చూచి అతని జీవితం సమస్తాన్నీ మాత్రమె గాక అతని గతాన్నీ భవిష్యత్తునీ అతను ఉంటున్న ఇంటి పరిసరాలనూ అతని బంధువులనూ స్నేహితులనూ సమస్తాన్నీ గ్రహించగలిగే దృష్టినే పూర్ణదృష్టి అని నేనంటాను.ఇది అసాధ్యమైన విషయం కాదు.దీనిని పొందటం సాధ్యమే.కాకపోతే దానికి తగిన పరిశ్రమ జీవితంలో ఉండాలి.

పూర్వఋషులు ఇలాంటి పూర్ణదృష్టి కలిగినవారే.వారి సంతతి అయిన మనం కూడా దానిని సాధించినప్పుడే ఋషి ఋణం తీర్చుకున్నవారం అవుతాము.అంతేగాక వారి గోత్రాలలో పుట్టినందుకు వారికి సరియైన వారసులం కూడా అప్పుడే కాగలుగుతాం.

మన పూర్వీకులైన మహర్షులు పూర్ణపురుషులు.వారు పూర్ణాత్మలు. పూర్ణమైన తత్వాన్ని ఆమూలాగ్రమూ అవగతం చేసుకున్నవారు.పూర్ణదృష్టి కలిగినవారు.

మనమూ అలాంటి పూర్ణదృష్టిని పొందినప్పుడే వారి వారసులం కాగలం.

అప్పుడే 'పూర్ణమద: పూర్ణమిదమ్' అన్న మంత్రార్ధాన్ని సక్రమంగా అవగతం చేసుకున్నవారం అవుతాము.

వారు పూర్ణాత్మలు.ఋషిపుత్రులమైన మనమూ పూర్ణాత్మలం కావాలి. ఎందుకంటే వారి రక్తమే మనలో ప్రవహిస్తున్నది.వారి జీవాణువులే మన దేహాలలో కూడా ఉన్నాయి.నా దృష్టిలో ఈ వేదమంత్రానికి సరియైన అర్ధం ఇదే.

ఇలాంటి పూర్ణదృష్టి కలిగినప్పుడు ఏమౌతుంది?

మనమేమిటో మనకు తెలుస్తుంది.దీనినే "ఆత్మజ్ఞానం" అంటాము.

దైవం అంటే ఏమిటో మనకు "అనుభవపూర్వకంగా" తెలుస్తుంది.దీనినే "దైవజ్ఞానం" అంటాము.

ఈ లోకంలో మన కర్మ ఏమిటో అది ఎంతవరకో దాని దారి ఎటో స్పష్టంగా తెలుస్తుంది.దీనినే "కర్మజ్ఞానం" అంటాము.

ఈ మూడు జ్ఞానములూ  కలిగిననాడు మన జన్మ చరితార్ధం అవుతుంది. పరిపూర్ణం అవుతుంది.ఈ భూమిమీద పుట్టినందుకు మన జన్మ సాఫల్యం అవుతుంది.అప్పుడే మన గోత్రఋషులూ,పితృదేవతలూ మనల్ని చూచి ఆనందించి ఆశీర్వదిస్తారు.

ఈ మూడూ లేకపోవడం వల్లనే మానవజీవితం చీకటిలో అఘోరిస్తున్నది. మానవకోటిలో ఎక్కువమందికి తమ కర్మ ఏమిటో తమకు తెలియదు. తామెవ్వరో తెలియదు.ఈశ్వరుడెవ్వరో తెలియదు.అందుకే వారి జీవితాలకూ పశువుల జీవితాలకూ పెద్ద భేదం ఉండదు.

మనిషి ఎంత సంపాదించాడు?ఎంత తిన్నాడు?ఎంత స్వార్ధంతో ఎంత సుఖంగా జీవితాన్ని గడిపాడు?అన్నది ముఖ్యం కానేకాదు.ఈ పనులను పశువులు కూడా చేస్తున్నాయి. వాటికీ మనకూ తేడా ఏమిటి?

పూర్ణజ్ఞానాన్ని పొందినవాని జీవితమే సార్ధకం.అది పొందకుంటే,ఎంత డబ్బున్నా ఇంకా ఏమున్నా కూడా ఆ జీవితం వ్యర్ధం.

కనుక సర్వోత్కృష్టమైన ఈ పూర్ణజ్ఞానాన్ని పొందవలసిన బాధ్యత ప్రతి ఋషిపుత్రుని పైనా ఉన్నదని నేను ఎప్పుడూ చెబుతాను.

ఆ జ్ఞానాన్ని పొందటానికి కావలసిన ప్రయత్నంతో దానికి అనుగుణమైన ఆచరణతో జీవితాన్ని గడిపితే ఆ జన్మ ఉత్తమమైనదౌతుంది.లేదా పశుతుల్యమై అధమంగా మారుతుంది.

ఈ రెండుదారులూ అనుక్షణం మానవునికి ఎదురౌతూనే ఉంటాయి.ఈ విషయాన్నే కఠోపనిషత్తు 'శ్రేయశ్చ ప్రేయశ్చ...' అనే మంత్రంలో సూక్ష్మంగా ఉద్బోధిస్తుంది.

ఈ రెంటిలో ఏది కావాలో నిర్ణయించుకోవడం తదనుగుణమైన ప్రయత్నాన్ని చెయ్యడం మన చేతిలో ఉన్నది.
read more " పూర్ణమద: పూర్ణమిదమ్... "

9, ఆగస్టు 2014, శనివారం

ఎబోలా వైరస్ -రాహుకేతువులతో ఆశ్చర్యకర సంబంధం

ప్రపంచాన్ని ఇప్పుడు హడలెత్తిస్తున్న వైరస్ ఎబోలా.

ఇది రాహుప్రభావమే అని నేను కొంతకాలం క్రితం నుంచి చెబుతున్నాను.

దీనికి సంబంధించిన మార్మికమైన విచిత్రమైన రుజువును ఇప్పుడు చూడండి.దీనిని గమనించడానికి లోతైన జ్యోతిష్య పరిజ్ఞానం అవసరం లేదు.మామూలు మనుషులకు కూడా అర్ధమౌతుంది.

ఇది ఎబోలా వైరస్ చిత్రం



ఇవి జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువుల మార్మిక గుర్తులు.










ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి.ఆ వైరస్ లో ఈ మార్మిక గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి.

మార్మిక శాస్త్రం(Occult)లో రహస్య సూచనలను చదవడం గ్రహించడం (reading of signs) ఒక అంతర్భాగం.

ఎబోలా వైరస్ అనేది రాహుకేతువుల స్వరూపమే అనడానికి ఇదే మార్మిక సూచన(Occult signature).
read more " ఎబోలా వైరస్ -రాహుకేతువులతో ఆశ్చర్యకర సంబంధం "

8, ఆగస్టు 2014, శుక్రవారం

హోమియో అద్భుతాలు - ఒక్కరోజులో మాయమైన డెంగూ ఫీవర్

ఈ మధ్యనే ఒక అద్భుతం అనబడే సంఘటన జరిగింది.

ఇలాంటి విషయాలను సామాన్యంగా నేను బయటకు చెప్పను.కాని యోగేశ్వర్ దీనిని వ్రాయమంటూ ఒకటికి రెండుసార్లు అడిగినమీదట ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

ఆ అద్భుతం ఏమిటో పంచవటి గ్రూప్ మెంబర్ 'యోగేశ్వర్ ఖాందేశ్' మాటల్లోనే వినండి.

-----------------------------------------------

పంచవటికి నమస్కారం,

నేను యోగేశ్వర్ ఖాందేశ్ , గత రెండు సంవత్సరాలుగా పంచవటి సభ్యునిగా ఉన్నా చాలావరకు మౌనంగానే ఉన్నాను, నేను ఈ రోజు ఇలా మీ ముందుకు రాగలిగాను అంటే అది కేవలం గురువుగారు నా పై చూపిన వాత్సల్యమే, వారి అద్భుత హోమియో వైద్యం నాకు పునర్జన్మ ప్రసాదించింది, నా అనుభవాన్ని, గురువుగారు నాపై చూపిన మమకారాన్ని మీ ముందు గురువుగారి అనుమతి తో ఉంచే ప్రయత్నం చేస్తున్నాను.

తేది : 20/07/2014 ఆదివారం :

నేను ప్రతిరోజులాగే ఉదయాన్నే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని, సుమారు ఉదయం 8:00 గంటల ప్రాంతంలో  శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం, శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రం, శ్రీ కాలభైరవాష్టకం, శ్రీ లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం, శ్రీ తారా స్తోత్రం పారాయణ చేద్దామని ప్రారంబించాను, శ్రీ దుర్గ ఆపదుద్ధారక స్తోత్రం పారాయణ మధ్యలోనే క్రింద పడిపోయాను, అప్పుడు నా ప్రక్కన ఎవరు లేరు, కాసేపటికి నేనే లేచి ప్రక్కన పడుకున్నాను, వెంటనే శరీరం వేడెక్కడం ప్రారంబించింది, విపరీతమైన ఒంటి నొప్పులు కనీసం నా శరీరాన్ని నేనే తాకలేనంత వేడి, నా శరీరం పట్టు కోల్పోతుందన్న విషయం నాకు అర్థం అవుతుఉంది.

ఉదయం 10:30  స్థానిక PMP వైద్యుడు వచ్చి నా జ్వరాన్ని రీడ్ చేసాడు 107 డిగ్రీ ఫారన్ హీట్ గా నమోదైంది, అప్పటి నుండి సాయంత్రం వరకు పారసెటమాల్ 650 mg మరియు వివిధ రకాలైన యంటి - బయాటిక్ మందులు దాదాపు 4-5 సార్లు వాడాను, శరీర ఉష్ణోగ్రత 103-105 ల మధ్య ఉంటూ ఉంది , రాత్రి దాదాపు 10:00 గంటల సమయానికి నన్ను నిజామాబాద్ కి తరలించడం స్టార్ట్ చేసారు, రాత్రి సుమారు 01:00 లో నేను నిజామాబాద్ ఒక ప్రైవేటు ఆసుపత్రికి చేరుకున్నాను, వెంటనే వైద్యం ప్రారంభమైంది.

తేది : 21/07/2014 సోమవారం :

రాత్రి నుండి చేస్తున్న వైద్యానికి ఫీవర్ కొంచం అదుపులోనికి వచ్చింది, 101-102 మధ్య నమోదవుతూఉంది, అన్ని రక్త పరీక్షలలో నార్మల్ రిజల్ట్లే వచ్చాయి, డాక్టర్ గారు రిపోర్ట్ చూసి " క్లినికల్ మలేరియ " అయి ఉండొచ్చు అని అన్నారు, కాని మధ్యాహ్నం 01:00 నుండి మళ్ళి జ్వరం 103-105 నమోదవడం మొదలైంది, విపరీతమైన ఒంటి నొప్పులు ప్రారంభమయ్యాయి, వైద్యం నడుస్తూనే ఉన్నా ఏ మాత్రం ఉపయోగం కనిపించలేదు, రాత్రి మొత్తం నిద్ర లేదు, ఒక రకంగా నరకానికి దగ్గరగా ఉన్నానా అని అనిపిస్తూఉంది.

తేది : 22/07/2014 మంగళవారం :

రాత్రంతా నిద్ర లేదు ఉదయం సుమారు 05:00 గంటల సమయంలో నా పై నాకు నియంత్రణ పూర్తిగా కోల్పోతున్ననా అనిపిస్తున్న సమయం లో  ఆ అమ్మవారే నాకు దారి చూపాలి అని అనుకుని ' శ్రీ దుర్గ ఆపదుద్ధారక స్తోత్రం 'పారాయణ చేద్దామని ప్రయత్నించాను సుమారు 5 వ ప్రయత్నంలో పూర్తిగా పారాయణ సాధ్యం అయ్యింది, అప్పుడు అప్రయత్నంగా గురువుగారి చిత్రం నా మదిలో కదిలింది.

సమయం ఉదయం సుమారు 05:45 - 06:00 అవుతుంది, ఆ సమయంలో ఫోన్ చేద్దామా ? - వొద్దా ? అనే ఆలోచన మొదలైంది, మళ్ళి ఒకసారి అమ్మవారిని తలుచుకుని గురువు గారికి ఫోన్ చేశాను, అదిగో సరిగ్గా అక్కడ మొదలైంది గురువుగారి అద్భుతవైద్యం,గురువుగారికి నాపై ఉన్న పరిపూర్ణ వాత్సల్యాన్ని నేను అనుభవించడం.

గురువు గారికి ఫోన్ చేశాను.

గురువు గారు వెంటనే అడిగారు " ఏమైంది యోగేశ్వర్ ?, అలా ఉన్నావ్ ?" 

నేను నా పరిస్థితి చెప్పాను,

"అక్కడ హోమియో మందులు దొరుకుతాయా?"

"ఆ గురువు గారు దొరుకుతాయి అని అన్నాను"

"నేను మందు చెబుతాను తెప్పించునికి మూడు డోసులు వాడు"

నేను కనీసం మందు పేర్లు రాసుకునే స్థితిలో కూడా లేను , వెంటనే గురువు గారు SMS చేసారు 

Take Pulsatilla - 200 Three Times today , Keep Eupatorium Perfoliatum 200 With you. Report me in Evening " అని 

సుమారు 10:00 గంటలకు నాకు Pulsatilla - 200 అందింది వెంటనే గురువు గారికి ఫోన్ చేసి ఒక డోస్ వేసుకున్నాను, వెంటనే ఫలితం కనిపించింది ఫీవర్ రీడింగ్ 101 కి వచ్చింది, ఒంటి నొప్పులు కొంచం తగ్గాయి, తర్వాత డాక్టర్ గారు వేరే స్కాన్ కి వెళ్ళి రమ్మంటే నేనే స్వయంగా వెళ్ళి వచ్చాను, ఆలోపు మరో రక్త పరీక్ష రిపోర్ట్ వచ్చింది, దానిలో నాకు " డెంగు " పాసిటివ్ వచ్చింది ( రిపోర్ట్ అటాచ్ చేశాను ) డాక్టర్  వీలయితే హైదరాబాద్ తరలించండి అని  అన్నారు.ఒక్కక్షణం ప్రాణాలు గాలిలోనే కలిసిపోయాయి అని అనుకున్న.

ప్లేట్ లెట్ కౌంట్  4.10 లక్షల నుండి 2.96 లక్షలకు పడిపోయింది.

వెంటనే గురువు గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను గురువు గారు " ఎం పర్వాలేదు మరో మందు చెప్తాను తెప్పించుకో అని అన్నారు " మళ్ళి SMS చేసారు

Ferrum Phos 6x take 4 pills 3 times for 4 Days " అని వెంటనే తెప్పించుకుని వాడటం మొదలెట్టాను 

కాని జ్వరంలో పెద్ద తేడా ఏమి లేదు మళ్ళి 104 గా రికార్డ్ అయింది.

నేను గురువు గారికి SMS చేశాను.

సుమారు మధ్యాహ్నం 03:45 కి గురువు గారు మరో SMS చేసారు

" Take One More Dose " అని SMS చేసారు వెంటనే Pulsatilla - 200 డోస్ తీసుకున్నాను ఒక గంట తర్వాత 103.7 , మరో గంట తర్వాత 103 ఇలా నమోదౌతు ఉంది, నేను వెంటవెంటనే గురువుగారికి ప్రతి విషయం చెప్పాను, గురువుగారు ఎప్పటికప్పుడు  నాకు మనోధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు.

అదే రోజు రాత్రి  "China - 200 , Mag.Phos 6x get these two medicines " మరో రెండు మందులు తెప్పించుకో అని SMS చేసారు గురువు గారు 

23/07/2014 బుధవారం :

మళ్ళి ఉదయాన్నే సుమారు 06:00 లకు గురువు గారికి ఫోన్ చేసి పరిస్థితి లక్షణాలు చెప్పాను వెంటనే గురువు గారు " Aconite-200 "     అని sms చేసారు, ఉదయం ఆ మందు తెప్పించుకున్నాను, ప్రతి నాలుగు గంటలకు ఒకసారి  " Aconite-200 "  " Eupatorium Perfoliam 200 " ఆల్టర్నేట్ గా  వాడాను శరీరంలో మార్పు స్పష్టంగా కనిపించింది, ఒంటి నొప్పులు తగ్గాయి,లేచి మాట్లాడాటం ప్రారంభమైంది, శరీరం అంతా చల్లగా మారి కేవలం మెడ , తల మాత్రమె వేడిగా అనిపిస్తూ ఉండేది, ఫీవర్ సుమారు 101-102 రికార్డ్ అవడం జరిగింది.

అదే రోజు సాయత్రం పొరపాటున ఒక మందు వేసుకోలేదు, గురువు గారు ఫోన్ లో " మందులు సరిగ్గా సమయాని వేసుకోకపోతే ఎలా యోగేశ్వర్ ? " అని అన్నారు, వెంటనే పెన్ను, పేపర్ తెప్పించుకున్న గురువు గారు చెప్పిన విధంగా ఎలా మందులు వాడాలో రాసుకున్న అలాగే మందులు వాడాను, గురువు గారి దగ్గర నుండి మరో  sms వచ్చింది " Tomorrow morning get Echinasia Q 30 ML and keep. Will tell you how to use it tomorrow "

23/07/2014      09:00 PM     Aconite-200
24/07/2014      12:00 AM     Eupatorium Perfoliatum 200 
24/07/2014      03:00 AM     Aconite-200
24/07/2014      06:00 AM     Eupatorium Perfoliatum 200
24/07/2014      07:00 AM     Mag Phos 6x 4 pills + Ferrum Phos 6x 4 Pills 
24/07/2014      09:00 AM     Aconite-200 
24/07/2014      12:00 PM     Eupatorium Perfoliam 200
24/07/2014       01:00 PM    Mag Phos 6x 4 pills + Ferrum Phos 6x 4 Pills
24/07/2014       03:00 PM    Aconite-200 
24/07/2014       04:00 PM    Echinasia Q Mother Tincture
24/07/2014       06:00 PM    Eupatorium Perfoliatum 200
24/07/2014       08:00 PM    Mag Phos 6x 4 pills + Ferrum Phos 6x 4 Pills
24/07/2014       09:00 PM    Aconite-200 
24/07/2014       10:00 PM    Echinasia Q Mother Tincture
25/07/2014        12:00 AM   Eupatorium Perfoliatum 200

ఈ ఒక్కరోజు ఇలా గడవగానే జ్వరం లేదు.

రీడింగ్ 98.4 - 99 వరకు నమోదైంది అద్భుతం శరీరంలో ఒంటి నొప్పులే లేవు.

ఉదయం డాక్టర్ గారు వచ్చి ఆశ్చర్య పోయారు జ్వరం లేదు, ఒంటి నొప్పులు లేవు , " డెంగు " వ్యాది లక్షణాలు కనిపించడం లేదు. 

వెంటనే డాక్టర్ గారు మాట్లాడుతూ " నేను ఉహించినే నిజమైంది , మీకు డెంగు కంటే కూడా బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంది నేను దానికే వైద్యం చేశాను , అందుకే టెంపరేజర్ నార్మల్ కి వచ్చింది " ( డాక్టర్ గారికి గురువు గారు ఇస్తున్న వైద్యం విషయం తెలియదు ) " నేను అడిగా డాక్టర్ గారు నా శరీరం అంతా చల్లగా ఉంది, కేవలం మెడ , తల మాత్రమె ఎందుకు వేడిగా ఉంది అని " అదే అర్థం కావట్లేదు ! " డాక్టర్ గారి సమాదానం.

ఆ రోజు తర్వాత జ్వరం లేదు కాని ప్లేట్ లెట్ కౌంట్ తగ్గింది తేది : 26/07/2014 నుండి 29/07/2014 వరకు అది క్రమంగా 2.10 , 1.80 , 1.60 లక్షల వరకు తగ్గి తేది : 30/07/2014 నుండి మళ్ళి 2.10 , 2.80, 3.15 , 3.40 లక్షల వరకు పెరుగుతూ వచ్చింది,

నాకు పూర్తిగా రికవర్ అయ్యాక గాని వేరే వాళ్ళు చెబితే తప్పా " డెంగు " ఎంతటి ప్రాణాంతక వ్యాదో అర్థం కాలేదు 

" నా మాతృమూర్తి నాకు జన్మ ఇస్తే - గురువుగారు నాకు అపర ధన్వంతరి రూపంలో పునర్జన్మ ఇచ్చారు ", 

గురువుగారు మీకు ధన్యవాదాలు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు , కేవలం మాటలతోనే ధన్యవాదాలు చెప్పడం నాకు భావ్యం కూడా కాదు, సాధ్యమైనంత త్వరగా మీ చరణాలు స్ప్రుశించాలని అనుకుంటున్నాను ఆశీర్వదించండి.

-----------------------------------------------------------

అతనిని దగ్గరుండి చూచినవాళ్ళు ఇదంతా విన్నవాళ్ళు ఆశ్చర్య పోతున్నారు.డెంగూ ఫీవర్ వచ్చి తగ్గితే కనీసం మూడునెలలపాటు కీళ్ళ నొప్పులు తగ్గవు.నీరసం తగ్గదు.నీకు ఒక్కరోజులో ఈ విధంగా ఎలా తగ్గింది అని వాళ్లకు వింతగా ఉన్నది.

ఇంతా చేస్తే డాక్టర్ బిల్లు 40,000 పైనే అయింది.కానీ ఆ మందులు ఏమాత్రం పనిచెయ్యలేదు.

హోమియోపతి మందుల ఖర్చు రూ. 320/- మాత్రమె అయింది.రోగం కనబడకుండా మాయం అయిపొయింది.ఇంతా చేస్తే నేను పేషంట్ ని ఇప్పటివరకూ చూడనేలేదు.రిపోర్ట్స్ కూడా చూడలేదు.అతనెలా ఉంటాడో కూడా నాకు తెలియదు.

ఇదీ సరియైన హోమియోపతి ట్రీట్మెంట్ యొక్క మహాత్యం.

This is the true power of Homoeopathy.

ఇకపోతే దీనిలో జ్యోతిష్య కోణం ఏమిటో చూద్దాం.

ఇతనికి ప్రస్తుతం రాహువు/శని/కుజ దశ నడుస్తున్నది.అంటే ఖచ్చితమైన శపితయోగదశలో ఉన్నాడు.గట్టిగా చెప్పాలంటే ప్రాణగండం ఉన్నదశ.రాహువు అంతుబట్టని వ్యాధులను అకస్మాత్తుగా కలిగించి ప్రాణానికి ముప్పు తెస్తాడని నేను చెబుతూ వస్తున్నది ఇతని జీవితంలో అక్షరాలా జరిగింది.

నేను ఇంతకుముందు చెప్పిన రెమెడీలను తను తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉన్నందువల్లా,తారాస్తోత్రాన్ని రోజూ విడవకుండా పారాయణం చేస్తుండటం వల్లా ఈ గండం గడిచి బయటపడటం జరిగింది.రెడ్ బ్లడ్ సెల్స్ కూ కాళికాశక్తికీ ఉన్న సంబంధాన్ని 'యోనితంత్రం' అనే పోస్ట్ లో చెప్పాను.చూడండి.

నిత్యజీవితంలో జరిగే అద్భుతాలు ఇలా ఉంటాయి.

చదువరులలో చాలామంది ఈ సంఘటనను నమ్మలేరని నాకు తెలుసు.

అలాంటి అనుమానం ఉన్నవారు యోగేశ్వర్ ఖాందేశ్ తో ఈ మెయిల్లో మాట్లాడి ఇది నిజమో అబద్దమో నిర్ధారించుకోవచ్చు.
read more " హోమియో అద్భుతాలు - ఒక్కరోజులో మాయమైన డెంగూ ఫీవర్ "