నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, ఆగస్టు 2014, ఆదివారం

పూర్ణమద: పూర్ణమిదమ్...

"పూర్ణమద: పూర్ణమిదమ్ పూర్నాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే"

అనేది ప్రసిద్ధ వేదమంత్రం.

దీనికి అతి గహనమైన వేదాన్తార్ధం నుంచి గణిత శాస్త్రపరమైన సామాన్యార్ధం వరకూ అనేక రకాలైన వ్యాఖ్యానాలున్నాయి.అవన్నీ అలా ఉంచితే ఇందులోనుంచి ఒక చిన్న సూక్ష్మార్ధాన్నే నేను ప్రస్తుతానికి గ్రహిస్తాను.

విశ్వంలో అంతా పూర్ణమే.అసంపూర్ణం ఏదైనా ఉందంటే అది మానవుని అజ్ఞానం మాత్రమే.

మన ప్రాచీనవిద్యలైన జ్యోతిష్యమూ,వాస్తువిజ్ఞానమూ,తన్మాత్ర జ్ఞానమూ, యోగమూ,తంత్రమూ అన్నీ విడివిడి భాగాలూ విడివిడి విద్యలూ కావు. అవన్నీ పూర్ణమైన ఒకేఒక్క "ఆధ్యాత్మవిద్య"లో అంతర్భాగాలే.ఇది సమగ్రమైన అవగాహన.

జగత్తులో సమస్తమూ నవగ్రహాధీనమే.ఇందుకు ఏదీ మినహాయింపు లేదు.

జగత్తులో సమస్తమూ కర్మాధీనమే.దీనికీ ఏదీ మినహాయింపు లేదు.

కనుక నవగ్రహములు కర్మప్రదాతలని స్పష్టం అవుతున్నది.

కర్మ కర్త మానవుడే.కర్మప్రదాత ఈశ్వరుడు.

కనుక నవగ్రహములు ఈశ్వర శక్తులు.వాటికి పక్షపాతం లేదు.ఎవరెవరి కర్మానుసారం వారికి ఫలితములిస్తాయి.అవి దైవీశక్తులు.అహంకార పూరితంగా వాటితో ఆటలాడటం మంచిది కాదు.

ఎవరెవరి కర్మను వారేలాగైతే తప్పించుకోలేరో నవగ్రహముల బారినుంచి కూడా ఎవరూ తప్పించుకోలేరు.

రెండూ ఒకటే.కర్మయే గ్రహముల రూపంలో ఉన్నది.

నవగ్రహములు అనేవి మన జీవితంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి.అవి లేని రంగం లేదు.సంఘటనా లేదు.మనిషి పుట్టిన నాటినుంచీ పోయేవరకూ వాటి అధీనంలోనే ఉంటాడు.అంతే కాదు,పోయిన తర్వాత కూడా వాటి ప్రభావం నుంచి తప్పుకోలేడు.జీవి సూక్ష్మ లోకాలలో ప్రయాణం చేస్తున్నపుడూ అక్కడ కర్మఫలితాలను అనుభవిస్తున్నపుడూ కూడా నవగ్రహముల ప్రభావం తప్పదు.

మనిషి దేహంలో కూడా అవి కనిపిస్తాయి.మనిషి అరచేతిలో అవి ఉన్నాయి.మనిషి ముఖంలో అవి ఉన్నాయి.మనిషి దేహభాగాలలో అవి కనిపిస్తాయి.వాటిని చూడగలిగి వాటి యోగాలను (permutations and combinations)అర్ధం చేసుకోగలిగితే మనిషిని ఆమూలాగ్రం చదివేయొచ్చు. అతని గతాన్నీ భవిష్యత్తునీ చిటికెలో చూడవచ్చు.

అంతే కాదు.మనిషి నివసించే ఇల్లు కూడా అతని కర్మానుసారమే ఉంటుంది.అది సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా,తన కర్మానుగుణమైన ఇంటిలోనే అతడు ఉంటాడు.దానిని దాటి అతను ఉండాలన్నా కుదరదు.ఉండలేడు.

అంతేకాదు.మన తల్లి దండ్రులు గానీ,అన్నదమ్ములూ అక్కా చెల్లెళ్ళూ గానీ మనకు వచ్చే భార్యగానీ భర్తగానీ పుట్టే సంతానం గానీ స్నేహితులు గానీ అన్నీ పూర్వకర్మానుసారమే జరుగుతాయి.మనిషికి తెలియక అజ్ఞానంతో నిండి అన్నీ తన ఇష్టానుసారమే జరుగుతాయని అనుకుంటాడు.అది నిజం కాదు.ఈ విషయం జీవిత చరమాంకం లోగాని మనిషికి అర్ధం కాదు.

ఎందుకంటే అప్పటికిగాని ఈ విషయాలను అర్ధం చేసుకోవడానికి సరిపోయినంత పరిపక్వత చాలామందికి కలుగదు.కొంతమంది అహంకారులకు అజ్ఞానులకు అప్పుడు కూడా ఈ అవగాహన కలుగదు.అది వారి ఖర్మ.దానికి మనమేమీ చెయ్యలేం.

ఒక మనిషినిగాని అతని జాతకాన్ని గాని చూచి అతని జీవితం సమస్తాన్నీ మాత్రమె గాక అతని గతాన్నీ భవిష్యత్తునీ అతను ఉంటున్న ఇంటి పరిసరాలనూ అతని బంధువులనూ స్నేహితులనూ సమస్తాన్నీ గ్రహించగలిగే దృష్టినే పూర్ణదృష్టి అని నేనంటాను.ఇది అసాధ్యమైన విషయం కాదు.దీనిని పొందటం సాధ్యమే.కాకపోతే దానికి తగిన పరిశ్రమ జీవితంలో ఉండాలి.

పూర్వఋషులు ఇలాంటి పూర్ణదృష్టి కలిగినవారే.వారి సంతతి అయిన మనం కూడా దానిని సాధించినప్పుడే ఋషి ఋణం తీర్చుకున్నవారం అవుతాము.అంతేగాక వారి గోత్రాలలో పుట్టినందుకు వారికి సరియైన వారసులం కూడా అప్పుడే కాగలుగుతాం.

మన పూర్వీకులైన మహర్షులు పూర్ణపురుషులు.వారు పూర్ణాత్మలు. పూర్ణమైన తత్వాన్ని ఆమూలాగ్రమూ అవగతం చేసుకున్నవారు.పూర్ణదృష్టి కలిగినవారు.

మనమూ అలాంటి పూర్ణదృష్టిని పొందినప్పుడే వారి వారసులం కాగలం.

అప్పుడే 'పూర్ణమద: పూర్ణమిదమ్' అన్న మంత్రార్ధాన్ని సక్రమంగా అవగతం చేసుకున్నవారం అవుతాము.

వారు పూర్ణాత్మలు.ఋషిపుత్రులమైన మనమూ పూర్ణాత్మలం కావాలి. ఎందుకంటే వారి రక్తమే మనలో ప్రవహిస్తున్నది.వారి జీవాణువులే మన దేహాలలో కూడా ఉన్నాయి.నా దృష్టిలో ఈ వేదమంత్రానికి సరియైన అర్ధం ఇదే.

ఇలాంటి పూర్ణదృష్టి కలిగినప్పుడు ఏమౌతుంది?

మనమేమిటో మనకు తెలుస్తుంది.దీనినే "ఆత్మజ్ఞానం" అంటాము.

దైవం అంటే ఏమిటో మనకు "అనుభవపూర్వకంగా" తెలుస్తుంది.దీనినే "దైవజ్ఞానం" అంటాము.

ఈ లోకంలో మన కర్మ ఏమిటో అది ఎంతవరకో దాని దారి ఎటో స్పష్టంగా తెలుస్తుంది.దీనినే "కర్మజ్ఞానం" అంటాము.

ఈ మూడు జ్ఞానములూ  కలిగిననాడు మన జన్మ చరితార్ధం అవుతుంది. పరిపూర్ణం అవుతుంది.ఈ భూమిమీద పుట్టినందుకు మన జన్మ సాఫల్యం అవుతుంది.అప్పుడే మన గోత్రఋషులూ,పితృదేవతలూ మనల్ని చూచి ఆనందించి ఆశీర్వదిస్తారు.

ఈ మూడూ లేకపోవడం వల్లనే మానవజీవితం చీకటిలో అఘోరిస్తున్నది. మానవకోటిలో ఎక్కువమందికి తమ కర్మ ఏమిటో తమకు తెలియదు. తామెవ్వరో తెలియదు.ఈశ్వరుడెవ్వరో తెలియదు.అందుకే వారి జీవితాలకూ పశువుల జీవితాలకూ పెద్ద భేదం ఉండదు.

మనిషి ఎంత సంపాదించాడు?ఎంత తిన్నాడు?ఎంత స్వార్ధంతో ఎంత సుఖంగా జీవితాన్ని గడిపాడు?అన్నది ముఖ్యం కానేకాదు.ఈ పనులను పశువులు కూడా చేస్తున్నాయి. వాటికీ మనకూ తేడా ఏమిటి?

పూర్ణజ్ఞానాన్ని పొందినవాని జీవితమే సార్ధకం.అది పొందకుంటే,ఎంత డబ్బున్నా ఇంకా ఏమున్నా కూడా ఆ జీవితం వ్యర్ధం.

కనుక సర్వోత్కృష్టమైన ఈ పూర్ణజ్ఞానాన్ని పొందవలసిన బాధ్యత ప్రతి ఋషిపుత్రుని పైనా ఉన్నదని నేను ఎప్పుడూ చెబుతాను.

ఆ జ్ఞానాన్ని పొందటానికి కావలసిన ప్రయత్నంతో దానికి అనుగుణమైన ఆచరణతో జీవితాన్ని గడిపితే ఆ జన్మ ఉత్తమమైనదౌతుంది.లేదా పశుతుల్యమై అధమంగా మారుతుంది.

ఈ రెండుదారులూ అనుక్షణం మానవునికి ఎదురౌతూనే ఉంటాయి.ఈ విషయాన్నే కఠోపనిషత్తు 'శ్రేయశ్చ ప్రేయశ్చ...' అనే మంత్రంలో సూక్ష్మంగా ఉద్బోధిస్తుంది.

ఈ రెంటిలో ఏది కావాలో నిర్ణయించుకోవడం తదనుగుణమైన ప్రయత్నాన్ని చెయ్యడం మన చేతిలో ఉన్నది.