“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, ఆగస్టు 2014, శుక్రవారం

కాలజ్ఞానం 27 (శ్రావణ మాస ఫలితాలు)

శ్రావణమాసం 27-7-2014 న ఉదయం 4.13 కి శనివారం పుష్యమీ నక్షత్రంలో హైదరాబాద్ లో మొదలైంది.ఆ సమయానికి ఉన్న గ్రహస్తితులను బట్టి ఈ నెల మన రాష్ట్రం ఎలా ఉన్నదో చూద్దాం.

శ్రావణమాసం మొదలయ్యే సమయానికి మిధున లగ్నం నడుస్తున్నది.వజ్రయోగంలో కింస్తుఘ్న కరణంలో గురుహోరలో ఈ మాసం మొదలైంది.


ఈ మాసం లో ఫోకస్ అంతా ఆర్ధికరంగం మీద ఉంటుంది.ఉన్న వనరులను ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి ఎలా సర్దుకోవాలా అన్నదానిమీదనే అధికారుల ఆలోచన అంతా కేంద్రీకృతమై ఉంటుంది.

శుక్లపాడ్యమి నాడు ఏర్పడిన కింస్తుఘ్న కరణం ఈ మాసంలో వైశ్వదేవ యోగాన్ని కలిగిస్తున్నది. కనుక ఈ మాసంలో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి.ఆ నిర్ణయాలు భవిష్యత్తును అనుకున్నట్లుగా తీర్చిదిద్దేవి అవుతాయి.

ధనాదాయం విషయంలో రాష్ట్ర పరిస్థితి ఇంకా సందిగ్ధం గానే ఉంటుంది. కాకపోతే,ఆదాయం పెంచుకోడానికి కొన్ని ప్రణాళికలు ఈ మాసంలో రూపు దిద్దుకుంటాయి.అవి దీర్ఘకాల ప్రణాళికలు గనుక ఫలితాలు మాత్రం అంత త్వరగా కనిపించే అవకాశం లేదు.

కేంద్రసహాయం అందే విషయంలో రాష్ట్ర ప్రభుత్వపు ఆశలు గట్టిగా ఉంటాయి.

ఆర్ధికరంగం తర్వాత ఈ నెల ప్రాముఖ్యతను సంతరించుకునేది విద్యారంగం. ఈ రంగంలో చికాకులు తప్పవు.విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది.ఇది పరిపాలన మీదా కూడా ప్రభావం చూపుతుంది.కాని చివరకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనబడుతుంది.

రాష్ట్ర అంతర్గత వ్యవహారాలలో బయటి వారి జోక్యం చికాకును కలిగిస్తుంది. విడిపోయిన తమ్ముళ్ళ ధోరణి విసుగు పుట్టిస్తుంది.

పరిపాలన అనుకున్నంత సజావుగా జరగదు.అనుకోని విఘ్నాలు తలెత్తుతాయి.విసుగు పుట్టించే నిరంతర ప్లానింగ్ తో రోజులు గడుస్తాయి.

ప్రక్క రాష్ట్రంతో పోటీ పడటానికి ఎత్తులకు పై ఎత్తులు వెయ్యవలసి వస్తుంది. ఒకే కుటుంబంగా ఉన్న తెలుగువారు ఇలా చీలిపోయి పరస్పర ఎత్తులు వేసుకోవలసి రావడం బాధాకరం అవుతుంది.

మేధావులకు కళాకారులకు విశిష్టవ్యక్తులకు ప్రమాదం పొంచి ఉన్నది.

స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఉగ్రవాదులను ఒక కంట కనిపెట్ట వలసిన అవసరం ఉన్నది.

మతపరమైన దుర్ఘటన ఒకటి జరిగే అవకాశం ఉన్నది.

చెడు తేదీలు:
6-8-14 నుంచి 10-8-14 వరకు.
19-8-14,20-8-14.