Love the country you live in OR Live in the country you love

30, ఆగస్టు 2014, శనివారం

Wise Bucket Challenge

ALS(Amyotrophic Lateral Sclerosis) అనే రోగానికి సంబంధించిన ఎరుక సమాజంలో పెరగడానికీ దాని నివారణకోసం రీసెర్చ్ కి తోడ్పడటానికీ ఐస్ బకెట్ చాలెంజ్ అనేది అమెరికాలో మొదలైంది.ఇందులో ఒక బకెట్ లో నీళ్ళూ ఐస్ ముక్కలూ వేసి వాటిని తలమీద పోసుకుని కొంతమందిని నామినేట్ చేస్తారు.వారు కూడా దీనిని చేసి ఇంకొంతమందిని నామినేట్ చెయ్యాలి. అందరూ కలసి కొంత డబ్బును ఆ రీసెర్చి ఫౌండేషన్ కి దానం చెయ్యాలి.

చాలామంది అమెరికన్లూ దీనిని చేస్తున్నారు.అక్కడ ఉన్న మనవాళ్ళూ చేస్తున్నారు.ఆ రోగానికి సంబంధించిన ఎవేర్ నెస్ పెంచుతున్నారు.బాగానే ఉంది.

పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు, దీనిని చూచి మన దేశంలో "రైస్ బకెట్ చాలెంజ్" అనేదొకటి మొదలైంది.మన దేశంలో పేదరికం అధికం కనుక మనకు కావలసింది ఐస్ బకెట్ చాలెంజ్ కాదు, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ఒక బకెట్ లో బియ్యాన్ని నింపి దానిని ఎవరైనా పేదవారికి దానం ఇవ్వడం కొందరు మొదలు పెట్టారు.

ఇచ్చేవాళ్ళు ఇస్తుంటే మన దేశంలో తీసుకునే వారికి కొదవేముంది?మనదేశంలో కోటీశ్వరులకు కూడా తెల్లకార్డులుంటాయి కదా.ఒక బకెట్ రైస్ వస్తున్నది తీసుకుంటే పోలా అని బెంజీ,  బీ ఎం డబ్లూ, కార్లలో పోయేవారు కూడా ఆగి ఒక బియ్యం బకెట్ ను డిక్కీలో వేసుకుని పోతున్నారు. 

మన దేశంలో ప్రస్తుతం పేదవారు అనేవారు అసలున్నారా? అని నాకొక పెద్ద అనుమానం గత కొన్నేళ్ళ నుంచీ ఉంది.ప్రతి పేదవాడి ఇంట్లోనూ నేడు కలర్ టీవీ ఉంది.ఒకవేళ లేకపోతే ప్రభుత్వమే ఇస్తోంది.ఇంటింటికి కేబుల్ నెట్ వర్క్ ఉన్నది.ఇంటర్ నెట్ కనెక్షన్ ఉన్నది.ఇంటికి నాలుగు చొప్పున సెల్ ఫోన్లూ ఉన్నాయి.మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త మొబైల్నూ కొని పాతదాన్ని నెలకొకసారి మార్చిపారేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ నేడు ఒక మొబైల్ షాపు పెట్టడానికి సరిపోయినన్ని పాత సెల్ ఫోనులు పడున్నాయి.ఇంటికి నాలుగు టూ వీలర్లూ రెండు కార్లూ ఉంటున్నాయి.

ఇకపోతే ఇప్పటికీ మంచినీళ్ళు దొరకని పల్లెటూళ్ళు కూడా మన దేశంలో చాలా ఉన్నాయి.కాని సారాయి కొట్టులేని ఊరు మాత్రం ఎక్కడా లేదు. ఒకవేళ లేకపోతే,ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలే వాటిని అమర్చిపెట్టి పోయాయి.అన్ని సారాయి షాపులూ సాయంత్రానికి కిటకిట లాడుతున్నాయి.జనంతో కళకళ లాడుతున్నాయి.కొన్ని ఊర్లలో అయితే పొద్దు పొద్దున్నే కూడా అవి జనంతో సందడిగా కనిపిస్తున్నాయి.కాలేజీ ఆడపిల్లల దగ్గరనుంచీ అందరూ నేడు సారాయిని (ఏదో ఒకరూపంలో) చక్కగా తాగుతున్నారు. సారాయి అని చీప్ గా అన్నందుకు మళ్ళీ అది తాగేవారికి కోపం రావచ్చు. పేరు ఏదైనా పదార్ధం అదేగా.

మన దేశంలో 'వైన్ బకెట్ చాలెంజ్'(Wine Bucket Challenge) మాత్రం ఎప్పటినుంచో నడుస్తోంది.దానికి ఎవరి ప్రోత్సాహమూ ఆహ్వానమూ అక్కర్లేదు.ఎవరికి వారే స్వచ్చందంగా పరమోత్సాహంతో దీనిలో పాల్గొంటున్నారు.

ఇలాంటి ప్రజలకు రైస్ బకెట్ నిజంగా అవసరమా? అంటే లేదనే సమాధానం వస్తుంది.ఎవరికో దురదపుట్టి ఇస్తున్నారు గనుక తీసుకునేవారు తీసుకుంటున్నారు గాని నిజంగా మన దేశంలో పేదవాడు ప్రస్తుతం ఎక్కడా లేడు.అందరి దగ్గరా డబ్బులు బాగానే ఉన్నాయి.

ఆ మధ్యన అమెరికానుంచి చుట్టపు చూపుగా ఇండియాకు వచ్చిన ఒక మిత్రుడు ఇలా అన్నాడు.

'నేను నాలుగేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాను.ప్రస్తుతం ఇండియాను చూస్తుంటే అమెరికాలో ఉన్న మేమే మీకంటే పేదవాళ్ళమని అనిపిస్తున్నది.'

ఐస్ బకెట్టూ, రైస్ బకెట్టూ మన దేశానికి అవసరం అవునో కాదో నేను చెప్పను గాని ప్రపంచం మొత్తానికీ అవసరం అయిన చాలెంజ్ ఒకటి మాత్రం నేను చెప్పదలచుకున్నాను.

అదే వైస్ బకెట్ చాలెంజ్ Wise Bucket Challenge

అంటే మనం వైస్ గా జ్ఞానంతో బ్రతకడం,ఇతరులలో దానిని పెంపొందించే పనిని చెయ్యడం అన్నమాట.ఒక్కమాటలో చెప్పాలంటే నిజమైన సనాతనమైన భారతీయ ఆధ్యాత్మికతను నిత్యజీవితంలో ఆచరిస్తూ ఇతరులను కూడా దానిని ఆచరించేలా ఉత్తెజపరచడమే Wise Bucket Challenge.వారూ వీరూ అన్న భేదం లేకుండా ప్రపంచంలోని మనుష్యులకందరికీ ఇది నేటి కాలంలో అత్యంత అవసరం.

అయితే ఆధ్యాత్మికతకీ బకెట్ కీ ఏంటి సంబంధం? అని అనుమానం రావచ్చు.

ఇంగ్లీషులో 'కికింగ్ ద బకెట్' అనే మాట ఉన్నది.అంటే బాల్చీ తన్నెయ్యడం అన్నమాట.

పుట్టిన ప్రతి మనిషీ ఏదోరోజున పోక తప్పదు.ఇది అందరికీ తెలిసిన విషయమే.కానీ ఆ పోయే సమయానికి కర్మ బ్యాలెన్స్ ను పూర్తిగా ఖాళీ చేసుకుని పోవడమే నేను చెప్పే 'వైస్ బకెట్ చాలెంజ్'.

జ్ఞానంతో జీవిస్తేనే ఇది సాధ్యమౌతుంది.జ్ఞానంతో కర్మ చేస్తూ బ్రతికితేనే ఇది సాధ్యమౌతుంది.అప్పుడే మన ఎకౌంట్లో ఉన్న కర్మ తగ్గుతూ వస్తుంది.దానికి విరుద్ధంగా అజ్ఞానంలో బ్రతికి తదనుగుణమైన కర్మలు చేస్తూ ఉంటే అది రోజురోజుకూ పెరుగుతుంది.అప్పుడు బాల్చీ తన్నేసే సమయానికి తలకు మించిన భారంతో పోవలసి వస్తుంది.ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనకున్న కర్మ బ్యాలెన్స్ ను ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ చేసుకుని పోవలసి వస్తుంది. అది అభిలషణీయం కాదు.

మనం ఈలోకంలోకి వచ్చేటప్పుడే ఒక పెద్దబకెట్ నిండా కర్మతో వచ్చాం. జ్ఞానహీనులమై ఇష్టం వచ్చినట్లు బ్రతికితే,బకెట్ తన్నేసే సమయానికి ఒక పెద్ద కర్మగంగాళాన్ని మోసుకుని పోవలసి వస్తుంది. ఆ గంగాళం బరువుతో అప్పుడెక్కడికి పోతామో,ఏ జన్మ ఎత్తుతామో మనకు తెలియదు. 

అలా కాకుండా,చేతిలో ఉన్న బకెట్ ని ఖాళీచేసి అవతలపారేసి హాయిగా చేతులూపుకుంటూ పోవాలంటే,నిత్యజీవితంలో కర్మను యోగంగా మార్చుకుని జీవితాన్ని నడిపినప్పుడే ఈ వైస్ బకెట్ చాలెంజ్ లో మనిషి నెగ్గగలుగుతాడు.

దీనికి ఇంకొకరిని నామినేట్ చెయ్యనవసరం లేదు.అలా నామినేట్ చెయ్యడం కుదరదు కూడా.ఇది ఎవరికి వారికి లోనుండి రావలసిన చాలెంజ్.ఒకరిని చూచి ఇంకొకరు వాత పెట్టుకునే చాలెంజ్ కాదు.

ఐస్ బకెట్ చాలెంజ్ వల్ల ALS అనే వ్యాధి నిర్మూలనానికి దోహదం అవుతుంది.

వైస్ బకెట్ చాలెంజ్ వల్ల కూడా ALS అనే వ్యాధి పోతుంది.అయితే ఈ వ్యాధి వేరు.దీనిని నేను 'అజ్ఞాన లంపటం సిండ్రోం' (ALS) అని పిలుస్తాను.వైస్ బకెట్ చాలెంజ్ చెయ్యగలిగిన వాడికి అజ్ఞానమూ పోతుంది.ప్రపంచ లంపటమూ పోతుంది.

ఆత్మారామత్వమూ ఆనందస్వరూపమూ వాడికి మిగులుతాయి.

ఐస్ బకెట్, రైస్ బకెట్ల వల్ల ఏవేవి పోతాయో నేను చెప్పలేను గాని వైస్ బకెట్ వల్ల మాత్రం మూలవ్యాధి (fundamental disease) అయిన అజ్ఞానం నశించిపోతుందని నేను ఘంటాపధంగా చెప్పగలను.

ఇది నేను కొత్తగా చెబుతున్నది కాదు.భగవంతుడే దీనిని గురించి చెప్పినాడు.

శ్లో||తేషామేవానుకంపార్ధ మహమజ్ఞానజం తమ:
నాశాయామ్యాత్మ భావస్థో జ్ఞాన దీపేన భాస్వతా

(భగవద్గీత 10:11)

(వారి మీద కరుణతో వారి హృదయాలలో నేనే నిలిచి ఉండి,జ్ఞాన తేజస్సుతో వాటిని నింపి,అజ్ఞాన జనితమైన అక్కడి చీకటిని నాశనం చేస్తున్నాను)

అంటూ భగవంతుడే ఈ ఛాలెంజ్ స్వీకరించేవారికి అభయప్రదానం గావిస్తున్నాడు.ఇంక భయమేముంది?

ఈ ఛాలెంజ్ ని మనం స్వీకరించకుండా అడ్డుపడే తమస్సు అంటే ఏమిటో కూడా భగవంతుడే చెప్పాడు.

శ్లో|| తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత

(భగవద్గీత 14:8)

నిర్లక్ష్యమూ,ఆలస్యమూ,బద్ధకమూ -- ఈ మూడూ అజ్ఞానం నుంచి పుట్టినవి.ఇవే సమస్త జీవులనూ మోహంలో ముంచి జ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాయి.

ప్రమాదం (నిర్లక్ష్యం) అంటే - మనకిప్పుడే ఆధ్యాత్మికత ఎందుకులే అన్న నిర్లక్ష్య ధోరణి.

ఆలస్యం అంటే - రేపు చేద్దాంలే అని ఏరోజుకారోజుకి సాధనను వాయిదా వెయ్యడం.


నిద్ర అంటే - సాధనలో బద్ధకాన్ని వదిలించుకోలేని అశక్తత.


తమస్సు అంటే ఈ మూడు లక్షణాలే.


అంతేకాదు, Wise Bucket Challenge (WBC) అనే ఈ ఛాలెంజ్ ని స్వీకరించే వాడికి అంతర్గత WBC (White Blood Corpuscles) కౌంట్ తగినంతగా పెరిగి అజ్ఞానం అనే మహమ్మారిని అడ్డుకునే వ్యాధినిరోధక శక్తి అతనిలో విపరీతంగా పెరుగుతుందని నేను చెబుతున్నాను.

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని సాక్షాత్తూ భగవంతుడే విసుగనేది లేకుండా ఎప్పటినుంచో మనలను పిలుస్తున్నాడు.కానీ ఆయన మాట ఎవరూ వినడం లేదు.

శ్లో||తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసి నాత్మనః
ఛిత్వైనం సంశయం యోగమాత్తిష్టోత్తిష్ట భారత

(భగవద్గీత 4:42)

(ఓ భారతపుత్రా! అజ్ఞానం నుండి పుట్టి నీ హృదయంలో తిష్ట వేసి ఉన్నట్టి సంశయములను జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించు.యోగమును ఆధారంగా చేసుకొని నీ జీవనసమరాన్ని నడిపించు)

ఇదే వైస్ బకెట్ ఛాలెంజ్

ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని మన సనాతన ధర్మమూ మన మహర్షులూ కూడా కొన్నివేల ఏళ్ళ నుంచీ మనలను ఆహ్వానిస్తూనే ఉన్నారు.

కానీ ఈ ఛాలెంజ్ ని మనస్ఫూర్తిగా స్వీకరించేవారు ఎందరున్నారు?అందరూ పనికిమాలిన ఐస్ బకెట్ ఛాలెంజ్,రైస్ బకెట్ ఛాలెంజ్ లను స్వీకరించేవారేగాని అసలైన వైస్ బకెట్ ఛాలెంజ్ ని స్వీకరించేవారు ఎవరున్నారు?

కనీసం ఒక్కరన్నా ఉన్నారా???