Love the country you live in OR Live in the country you love

6, ఆగస్టు 2014, బుధవారం

ఊహించినవి-జరిగినవి-27 (ఎబోలా వైరస్ -రాహువు యొక్క కన్యారాశి స్థితి)

రాహువు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు నేను వ్రాస్తూ, అంతుబట్టని వ్యాధులు తలెత్తి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తాయని వ్రాశాను.

దానికి కారణాన్ని కూడా అక్కడే ఉటంకించాను.

కన్య సహజరాశిచక్రంలో రోగస్థానం కావడం వల్లా,రాహువు అతి భయంకరుడూ అంతుచిక్కని రోగాలను సృష్టించి ప్రజల ప్రాణాలతో ఆడుకునేవాడూ కావడం వల్లా, అంతుబట్టని రోగాలు ప్రపంచాన్ని భయానికి గురిచేస్తాయి అనడం తార్కికంగా ఉన్నది.

ఈ పోస్ట్ వ్రాసిన కొద్ది రోజులలోనే జపనీస్ ఎన్కెఫలైటిస్ విజృంభించింది. మన దేశంలోని తూర్పురాష్ట్రాలలో విలయం సృష్టించింది.అధికారులనూ ప్రజలనూ బెంబేలెత్తించింది.ఆ తర్వాత వరుసలో డెంగూ జ్వరం విజృంభించింది.మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా డెంగూ కేసులు చాలా నమోదయ్యాయి.

ఇప్పుడు కొత్తగా రంగప్రవేశం చేసింది ఎబోలా వైరస్.

గినియా,లైబీరియా,సియోరా లియోన్ ప్రాంతాలలో ఇప్పుడు ప్రజలకు నిద్రపట్టని రాత్రులను సృష్టిస్తున్న ఈ వైరస్ కూడా ఎయిడ్స్ అంతటి ప్రాణాంతక వైరస్ అంటున్నారు.

అమెరికా ఇంగ్లాండ్ తదితర దేశాలు ఈ వైరస్ ఎక్కడ తమ దేశంలోకి ప్రవేశిస్తుందో అని గడగడా వణికిపోతున్నాయి.అంతర్జాతీయ వైద్య బృందాలను పంపించి పైన ఉదాహరించిన ప్రాంతాలను క్వారంటైన్ చేస్తున్నాయి.ఈ వైరస్ మీద ఇప్పటికే ఆ దేశాలలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మొదట ఈ వైరస్ సోకిన రోగికి వైద్యం చేసిన వైద్యునికి కూడా ఇది సోకింది. ఇద్దరూ చనిపోయారు.ఆ తర్వాతే ప్రపంచదేశాలలో భయమూ చర్చలూ మొదలయ్యాయి.

రాహువు కన్యారాశి ప్రవేశఫలితం ఊహించినట్లుగానే జరుగుతున్నది. మానవుల మీద గ్రహప్రభావానికి మళ్ళీ ఇదొక ఖచ్చితమైన ఉదాహరణ.

ఇది కాకతాళీయం కాదనడానికీ రాహుప్రభావమే అనడానికీ గతం నుంచి కొన్ని తిరుగులేని ఉదాహరణలు చూద్దామా?

రాహువు పద్దెనిమిది ఏళ్ళకొకసారి రాశిచక్రాన్ని చుట్టి వస్తాడు.

గతంలో 1996 నుంచి 1998 వరకూ కన్యారాశిలో ఉన్నాడు.

అప్పుడేం జరిగాయో ఒక్కసారి గమనిస్తే,గ్రహప్రభావం ఎంత ఖచ్చితంగా ఉంటుందో అర్ధమౌతుంది.

గతంనుంచి తిరుగులేని రుజువులు ఇవిగో.  

1996 లో నైజీరియాలో Cerebrospinal Meningitis (CSM) అనే భయంకర వ్యాధి ప్రబలి అక్షరాలా 11,717 మంది చనిపోయారు.1,09,580 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు రికార్డెడ్ కేసులు ఉన్నాయి.ఉన్నట్టుండి రాహువు కన్యా రాశిలోకి రాగానే ఇంత ఘోరం ఎందుకు జరిగింది?ఇది కాకతాళీయం అనలేము.చూడండి.

http://www.ncbi.nlm.nih.gov/pubmed/10974995

మళ్ళీ నేడు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రాహువు కన్యారాశిలోనే ఉన్నాడు. నేడు మళ్ళీ ఆఫ్రికాలోనే ఎబోలా వైరస్ తలెత్తింది.ప్రపంచం దానిని చూచి వణికిపోతున్నది.ఇది కాకతాళీయం ఎలా అవుతుంది?

1996-97 లో మేరీలాండ్ బాల్టిమోర్ లో కంజెనిటల్ సిఫిలిస్ ఒక మహమ్మారి(epidemic)లాగా ప్రబలింది.దీనిని చూడండి.

http://www.cdc.gov/mmwr/preview/mmwrhtml/00055498.htm

అదే సమయంలో స్పెయిన్ లో భయంకరమైన మేనింజోకాకల్ డిసీజ్ ఒక ఉపద్రవం(epidemic)లాగా విజృంభించింది.దీనిని చూడండి.

http://www.ncbi.nlm.nih.gov/pubmed/12466409

అదే సమయంలో ఉగాండాలో ONN fever అనే ఒక విచిత్రజ్వరం మహమ్మారి (epidemic)లాగా ప్రబలింది.ఇది చూడండి.

http://www.ncbi.nlm.nih.gov/pubmed/10432073

అదే సమయంలో రోమానియాలో మీజిల్స్ ఎపిడెమిక్ విజృంభించింది.ఇది కూడా చూడండి.

http://www.ncbi.nlm.nih.gov/pubmed/10588086

ఖచ్చితంగా అదే సమయంలో గుటేమలా లో డెంగూ జ్వరపు ఎపిడెమిక్ విజృంభించింది.దీనిని కూడా చూడండి.

http://www.ncbi.nlm.nih.gov/pubmed/11556713

ఎక్కడో ఒకచోట ఏదో జరిగితే దానిని మనం లెక్కలోకి తీసుకోనక్కర్లేదు.కాని ఉన్నట్టుండి ఇన్ని రకాలైన మహమ్మారులు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఒకేసమయంలో తలెత్తితే దానికి ఏ కారణమూ లేదని ఎలా అనగలం?

'ఎపిడెమిక్' అంటే ఎక్కడో ఒకచోట ఒకరికి సోకే వ్యాధి కాదు.ఒకే ప్రదేశంలోగాని దేశంలోగాని అనేకమందికి ఒకేసారి సోకి అనేకమందిని పరలోకానికి పంపే వ్యాధినే 'ఎపిడెమిక్' అంటారు.దీనినే తెలుగులో 'సాంక్రామిక వ్యాధి' అంటారు.పైన ఉదాహరించిన కేసులన్నీ ఒకరినో ఇద్దరినో పొట్టనబెట్టుకున్నవి కావు.అనేక వందల వేల మందిని స్వాహా చేసిన ఘోరమైన రోగాలు.  


మానవ జీవితం మీద గ్రహప్రభావం తిరుగులేని నిజం అనడానికి పై ఉదాహరణలే సాక్ష్యాలు.సహజరోగస్థానమైన కన్యారాశిలో రాహుసంచారమే ఈ దడ పుట్టించే వ్యాధులు తలెత్తడానికి అసలైన కారణం.

మళ్ళీ ఇప్పుడు రాహువు అదే పరిస్థితిలో ఉన్నాడు.కొత్తరకపు విలయం ఇప్పుడే మొదలౌతున్నది.రాబోయే రెండేళ్లలో రకరకాల ఎపిడెమిక్ వ్యాధులతో భూభారం తగ్గించడం ఇక రాహువు వంతు.

వేచి చూడండి నా మాటలు ముందు ముందు ఎలా సత్యాలు అవుతాయో !!