“Self service is the best service”

30, జనవరి 2023, సోమవారం

ఇండియాకు తిరిగి వచ్చేశాం - భవిష్యత్ ప్రణాళిక

ఆర్నెల్ల అమెరికావాసాన్ని ముగించుకుని నిన్న సాయంత్రం ఇండియాకు తిరిగి వచ్చేశాం. కొన్నాళ్లపాటు హైద్రాబాద్ లో నివాసం. ఆ తరువాత ఆశ్రమనివాసం. గ్రంథరచన, ఆశ్రమంలో రిట్రీట్స్ నిర్వహించడం, సమాజానికి బోధన, చారిత్రకక్షేత్రాల సందర్శనం, అసలైన హిందూధర్మప్రచారం ముమ్మరంగా మొదలౌతాయి.

మా ఆశ్రమంలో జరిగే రిట్రీట్స్ లో ఈ క్రింది విషయాలు బోధించబడతాయి.

1. జ్యోతిష్య రిట్రీట్స్ -- వీటిలో నాదైన జ్యోతిష్య విశ్లేషణా విధానం బోధింపబడుతుంది. ఇది గత 30 ఏళ్లుగా నేను పరిశోధన చేసి నిగ్గుతేల్చిన జ్యోతిష్య సూత్రాల సమాహారంగా ఉంటుంది. దీనిని నేర్చుకోవడం ద్వారా మీరు ఋషితుల్యులైన నిజమైన జ్యోతిష్కులుగా తయారౌతారు. నేడు సమాజంలో ఉన్న కమర్షియల్ జ్యోతిష్యం యొక్క డొల్లతనాన్ని గ్రహిస్తారు. మీ మీ జీవితాలను మీరే దిద్దుకోగలుగుతారు. ఇతరులకు మార్గదర్శనం చేయగలుగుతారు.

2.  మార్షల్ ఆర్ట్స్ రిట్రీట్స్ --  40 ఏళ్లుగా నేను అభ్యాసం చేస్తూ, నిర్మించుకుంటూ వస్తున్న మార్షల్ ఆర్ట్స్ విధానం, కావలసినవారికి అర్హులైనవారికి నేర్పించబడుతుంది. దీనివల్ల, ధైర్యం, చొరవ, ఫిజికల్ ఫిట్నెస్ లు విపరీతంగా పెరుగుతాయి. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనగలిగే సమర్ధత మీలో కలుగుతుంది. 

3. అల్టర్నేటివ్ మెడికల్ రిట్రీట్స్ -- మీ కుటుంబం వరకూ చిన్నా పెద్దా రోగాలకు మీరే వైద్యం చేసుకునేలాగా హోమియో శిక్షణ ఇవ్వబడుతుంది. మా ఆరోగ్యసూత్రాలు, మా జీవనవిధానం నేర్పించబడతాయి.

4. అసలైన హిందూమతం ఏమిటో స్పష్టంగా బోధించబడుతుంది. నేడు సమాజంలో ఉన్న రకరకాల శాఖలు, ఉపశాఖలను సమన్వయం చేస్తూ, గందరగోళాలను తొలగిస్తూ, మౌలికమైన, అసలైన హిందూమతం ఏమిటో చక్కగా అర్ధం చేసే రీతిలో ఈ బోధన ఉంటుంది. దీనిని అర్ధం చేసుకున్నవారు, హిందూమతం అంటే ఏమిటో స్పష్టమైన అవగాహనను కలిగి ఉండటమే గాక, ఇతర మతాలవారు అడిగే ఎటువంటి ప్రశ్ననైనా సమర్ధవంతంగా వివరించగలుగుతారు. హిందూమతంపైన జరుగుతున్న దుష్ప్రచారాలను తేలికగా త్రిప్పికొట్టగలుగుతారు. దొంగగురువుల వలలో పడకుండా ఉంటారు.

5. సాధనా రిట్రీట్స్ -- ఆధ్యాత్మిక సాధనలలో శ్రద్ధ ఉన్నవారికి నాదైన యోగసాధనా మార్గం వివరంగా బోధించబడుతుంది. ఇది భౌతిక, ప్రాణిక, మానసిక స్థాయిలలో విభిన్న యోగ, ధ్యానప్రక్రియల సమాహారంగా ఉంటుంది. చక్కని ఆరోగ్యాన్ని, ప్రాణశక్తిని, ధ్యానశక్తిని పెంపొందిస్తుంది. జీవనసాఫల్యతను త్వరగా తేలికగా అందిస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని సాధనా విధానాలు, మార్మికసాధనలు దీనిలో కలసి మెలసి ఉంటాయి.

6.  పూర్తి అర్హతలున్నవారికి ఉన్నతస్థాయికి చెందిన తంత్రసాధన నేర్పబడుతుంది.

ఇవన్నీ కూడా, పూర్తిగా ఉచితంగా నేర్పబడతాయి.

కులానికి మా ఆశ్రమంలో ఎటువంటి ప్రాముఖ్యతా లేదు. 'మీదే కులం?' అనే ప్రశ్నను మా ఆశ్రమంలో ఎవరూ మిమ్మల్ని అడగరు. మీ డబ్బుతో మాకు సంబంధం లేదు. మీరు ధనికులా, పేదవారా మాకనవసరం. నిజాయితీ, స్వచ్ఛమైన మనసు, ఆధ్యాత్మిక తపనలు మాత్రమే మీలో ఉండవలసిన అర్హతలు. అలాంటివారికి మా సంస్థ, మా ఆశ్రమం స్వాగతం పలుకుతాయి.

రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కానీ, హిందూమతాన్ని సమర్ధించే ఏ పార్టీకైనా మా తోడ్పాటు ఉంటుంది.

కులాలకు అతీతంగా అసలైన హిందూధర్మాన్ని నేర్పించడం అదికూడా ఉత్త థియరీ కాకుండా, ప్రాక్టికల్ గా వేదాంత-యోగ-ధ్యానసాధనా పూర్వకంగా నేర్పించడం, సమాజంలో ఆధ్యాత్మిక జాగృతిని తీసుకురావడం, భారతీయులలో దేశభక్తిని పెంచడమే మా ఆశ్రమ లక్ష్యం.

ఎప్పటికప్పుడు జరిగే మా కార్యక్రమాల వివరాలకోసం మా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఎకౌంట్లను, మా యూట్యూబ్ వీడియోలను, మా వెబ్ సైట్ లను, నా తెలుగు ఇంగ్లీష్ బ్లాగ్ లను చూస్తూ ఉండండి.