ఈరోజు జనవరి 1, 2023. వ్యావహారికంగా క్రొత్త సంవత్సరాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్నది. మనకు మాత్రం ఉగాదికే క్రొత్త సంవత్సరం వస్తుంది. కనుక ఇది మన పండుగకాదు.
కాకపోతే, ఈరోజు వైకుంఠ ఏకాదశి. పైగా, రామకృష్ణుల భక్తులలో ఒక సాంప్రదాయం ఉంది. ప్రతి ఏడాదీ జనవరి 1 నాడు వాళ్లంతా 'కల్పతరు దినోత్సవం' అని జరుపుకుంటారు. కారణమేమంటే, 1886 జనవరి 1 నాడు, శ్రీరామకృష్ణులు కల్పతరువుగా మారి, అడిగినవారికి అడిగినట్లుగా వరాలిచ్చారు. ఎవరు ఏది కోరుకుంటే అది ప్రసాదించారు. ఆధ్యాత్మికంగాని, లౌకికంగాని ఎవరు ఏది కోరుకుంటే అది వారికి ఆరోజున లభించింది. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ప్రతి జనవరి 1 వ తేదీన, కల్పతరు దినోత్సవంగా శ్రీరామకృష్ణుల భక్తులు జరుపుకుంటారు. అంతేతప్ప జనవరి 1 మన క్రొత్త సంవత్సరం కాదు.
ఈరోజున మేమంతా డెట్రాయిట్లో స్పిరిట్యువల్ రిట్రీట్ లో ఉన్నాము. నిన్న, నేడు రెండురోజులపాటు, పూర్తి ధ్యానసాధనతో కూడిన రిట్రీట్ ఇక్కడ జరుగుతున్నది.
గత వ్యావహారిక సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, క్రొత్త వ్యావహారిక సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, గత ఏడాది ఎక్కిన మెట్లపైన నిలబడి, ఇంకా పైమెట్లకు ఎక్కమని నా శిష్యులకు పిలుపునిస్తూ రెండురోజుల ధ్యానరిట్రీట్ ను అమెరికాలో జరుపుతున్నాను. నేను అమెరికా వచ్చిన ఈ ఐదునెలల కాలంలో జరిగిన అన్ని రిట్రీట్స్ లో ఏవైతే సాధనావిధానాలను, యోగరహస్యాలను నేర్పిస్తూ వచ్చానో, అవన్నీ ఒక్కసారి రివ్యూ చేయడమే గాక, మరికొన్ని క్రొత్త సాధనలను ఈ రిట్రీట్లో ఇక్కడి శిష్యులకు నేర్పించాను.
ఈ నెలలో నేను ఇండియా రాబోతున్నాను. ఆ తరువాత 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' లో క్రొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి. ఏవైతే జరుగుతాయని గత కొన్నేళ్లుగా నేను చెబుతున్నానో, అవి ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి గమనించండి. క్రొత్త సంవత్సరంలో మరిన్ని జరుగుతాయి. దానికిది శుభారంభం.
ఈ సందర్భంగా 'అధ్యాత్మోపనిషత్' కు నా వ్యాఖ్యానమును మా క్రొత్తపుస్తకంగా విడుదల చేస్తున్నాను. ఇది చిక్కటి అద్వైతవేదాంతమును చక్కగా సూటిగా ప్రబోధిస్తున్న ఉపనిషత్తు. చాలా ఉన్నతమైన గ్రంధం ఇది. దీనిని ఒక్కదాన్ని మీరు మీ జీవితంలో ఆచరించగలిగితే చాలు, జన్మ ధన్యం అవుతుంది.
ఈ పుస్తకం వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.
మిగతా మా గ్రంధములలాగే ఇది కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.