“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

14, మార్చి 2022, సోమవారం

బుజ్జిపాప తత్త్వాలు - 3 (మోడ్రన్ జీవితాలు)

పగలంతా టెలిగ్రాము

రాత్రంతా ఇంస్టాగ్రాము

పెరుగుతుంది కిలోగ్రాము

ఓ బుజ్జిపాపా !


పగలూ రాత్రీ సోషల్ మీడియాలో కాలం గడుపుతూ ఉంటే, ఒంటికి తగినంత వ్యాయామం లేక ఊబకాయం వస్తుంది. రోగాలు పెరుగుతాయి. 


ఎన్నారై నడమంత్రులు

పేరెంట్సే హనుమంతులు

పిల్లలేమొ పనిమంతులు

ఓ బుజ్జిపాపా !


ఇండియాలో మధ్యతరగతి నుండి అమెరికాకు వెళ్లి ఎన్నారైలయిన వాళ్లకు నడమంత్రపు సిరి వస్తుంది. గర్వం పెరుగుతుంది. వారికి బేబీ సిట్టింగ్ చేయడానికి వారి తల్లిదండ్రులు హనుమంతునిలాగా సముద్రాలు దాటి పోయి వస్తుంటారు. వారు సంపాదించిన డబ్బంతా వారి పిల్లలు బాధ్యతారహితంగా ఖర్చుచేస్తారు.

ఆన్లైన్లో ఆర్దర్లు

మనుషులలో బోర్డర్లు

మానవత్వ మర్దర్లు

ఓ బుజ్జిపాపా !


ప్రతి ఇంట్లోనూ ఆన్లైన్ లో ఆహారం ఆర్డర్ చేసి తెప్పించుకొని తినడం ఎక్కువైంది. ఎవరి ఫోన్ లో వారు కాలం గడుపుతూ కుటుంబ సభ్యుల మధ్యన దూరాలు పెరుగుతున్నాయి. ఫలితంగా, మానవత్వం మంటగలిసిపోతున్నది.


ఇంటివంట కరువాయె

తెగహోటలు బిల్లాయె

పిల్లలు వస్తాదులాయె 

ఓ బుజ్జిపాపా !


ఎక్కువమంది ఆడాళ్ళు ఇంట్లో వంటలు చేయడం లేదు. హోటలు బిల్లు విపరీతం అవుతున్నది.  జంక్ ఫుడ్ ఎక్కువై, చిన్నపిల్లలు కూడా ఊబకాయులై పహిల్వాన్ల మాదిరి ఊరిపోతున్నారు.


సెల్లు ఫుల్లు బిజీ ఆయె 

సొల్లు వాగి సొలసిపోయె 

కుళ్ళుబ్రతుకు కుంపటాయె 

ఓ బుజ్జిపాపా !


ఎవరి మొబైల్ చూచినా ఇప్పుడు బిజీగా ఉంటోంది. పోనీ మాట్లాడేది ఏమైనా ముఖ్యమైన విషయమా అంటే అదీ ఉండదు. అంతా సొల్లే. ఈ కుట్రలు  కుతంత్రాలతో జీవితం కుళ్లిపోతున్నది.


వెల్తు కార్డు హెచ్చిపోయె 

హెల్తు కార్డు పుచ్చిపోయె

మార్క్స్ కార్డు మంటలాయె

ఓ బుజ్జిపాపా !


అందరిదగ్గరా డబ్బు బాగానే మూలుగుతున్నది. ఆరోగ్యాలు మాత్రం పుచ్చిపోతున్నాయి. ప్రతి ఆస్పత్రీ కిటకిటలాడుతోంది. మనిషి జీవితానికి పడే మార్కులు మాత్రం  నానాటికీ తగ్గిపోతున్నాయి.