“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, మార్చి 2022, శనివారం

ఏప్రిల్ 13 న రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు

వచ్చే నెల 13 తేదీన రాహుకేతువులు రాశులు మారుతున్నారు. వీరు ఒకటిన్నర ఏళ్ళుగా, వృషభ-వృశ్చిక రాశులలో ఉన్నారు. ఇప్పుడు రాహువు వృషభం నుంచి మేషానికి, కేతువు వృశ్చికం నుంచి తులకు మారుతున్నారు. ఈ రాశులలో ఏదాదిన్నరపాటు ఉండబోతున్నారు.

ఈ మార్పులవల్ల ప్రపంచజనాభా అయిన 760 కోట్లమంది జీవితాలలో అనేక మార్పులు రాబోతున్నాయి. అవేమిటో చూద్దాం.

మేషరాశి 

వీరి కుటుంబజీవితం ప్రభావితమౌతుంది. దూకుడు ఎక్కువౌతుంది. దానివల్ల ఆరోగ్యంలో బీపీ లాంటి తేడాలొస్తాయి. భార్య లేదా భర్తను ఇబ్బంది పెడతారు. బాధ్యతలు, మానసికచింతలు పెరుగుతాయి. జీవిత భాగస్వాములలో ఒకరివల్ల మరొకరికి ఇబ్బందులు పెరుగుతాయి. 

వృషభరాశి

వీరికి, వీరి జీవిత భాగస్వామికి జీవితంలో హటాత్ మార్పులు కలుగుతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. చక్కెరవ్యాధి తలఎత్తవచ్చు. ఆస్పత్రి సందర్శనం జరుగుతుంది. దీర్ఘరోగాలు నిద్రలేస్తాయి. క్రొత్త పరిచయాలు, విలాసాలు, విందులు పెరుగుతాయి. వాటివల్ల రోగాలు కలుగుతాయి. శత్రువులు బలహీనమౌతారు.

మిధునరాశి

సంతానభావం నిద్రలేస్తుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతారు. అకస్మాత్తు లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. సంతానానికి విలాసజీవితం మొదలౌతుంది. కానీ దానివల్ల మంచి జరగదు. మానసికంగా చెదిరిపోతారు. మొండిధైర్యమూ, ఆధ్యాత్మికచింతనా పెరుగుతాయి. రహస్యలాభాలు కలుగుతాయి.

కర్కాటకరాశి

ఇల్లు, ఆఫీసు ఈ రెండింటి మీదా గ్రహదృష్టి పడుతుంది. దూరప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు హటాత్తుగా ఇంటికి చేరుకుంటారు. ఆఫీసులో పరపతి పెరుగుతుంది. మాట చెల్లుబాటు అవుతుంది. వీరి ఇంటి వాతావరణాన్ని, ఆఫీసుపని అదుపు చేస్తుంది. ఈ ఒకటిన్నరేళ్ల కాలంలో ఈ రాశి వ్యక్తులు చాలామంది రిటైరౌతారు. అయినవాళ్లు దూరమౌతారు.

సింహరాశి

వీరికి ఈ రాహుకేతువుల మార్పు మంచిని చేస్తుంది. ధైర్యం పెరుగుతుంది. దూకుడు, చొరవలు కలుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. లేదా దూరప్రాంతాలకు నివాసాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్యారాశి

ఈ గ్రహమార్పు వీరికి మంచిది కాదు. ఇంట్లో, కుటుంబపరంగా చికాకులు గొడవలు పెరుగుతాయి. అనుకోని హటాత్ గొడవలు, మాటామాటా అనుకోవడాల వల్ల నష్టపోతారు. ఆర్ధికంగా నష్టాలుంటాయి. దీర్ఘరోగాలు నిద్రలేస్తాయి. యాక్సిడెంట్ కావచ్చు. కొంతమందికి కాలం చెల్లుతుంది కూడా. 

తులారాశి

జీవిత భాగస్వామి నుండి హింస ఎక్కువౌతుంది. ఇంట్లో గొడవలు, కలతలు, మాటపట్టింపులు ఎక్కువౌతాయి. వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోతారు. జీవితంలో సమతుల్యత లోపిస్తుంది. సుఖానికి దూరమౌతారు.

వృశ్చికరాశి

వీరికి ధైర్యమూ దూకుడూ పెరుగుతాయి. దానివల్ల బీపీ మొదలైన రోగాలు తలెత్తుతాయి. శత్రుబాధ పెరుగుతుంది. వీరికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతాయి. దురదృష్టం మొదలౌతుంది. విందులు వినోదాలు రహస్యస్నేహాలు  ఎక్కువౌతాయి. అకస్మాత్తుగా ఆస్పత్రి పాలౌతారు. 

ధనూరాశి

అనుకోని లాభాలు ఎదురౌతాయి. సంతానానికి ధైర్యం పెరుగుతుంది. వారికి మంచికాలం మొదలౌతుంది. రెండేళ్లుగా పడుతున్న కష్టాలు పోతాయి. కలిసొస్తుంది. పాతస్నేహితులు విడిపోతారు. క్రొత్తస్నేహాలు మొదలౌతాయి.

మకరరాశి

ఇంట్లో చికాకులు, గొడవలు, మాటపట్టింపులు మొదలౌతాయి. ఇల్లు, ఆఫీసు ఈ రెండు భావాలూ నిద్రలేస్తాయి. బీపీ వస్తుంది. కిడ్నీ సంబంధ రోగాలు తలెత్తవచ్చు. వీరి ఉద్యోగాన్ని, ఇంటి వాతావరణం అదుపు చేస్తుంది. వృత్తిలో పెనుమార్పులుంటాయి. ఈ ఒకటిన్నరేళ్ల కాలంలో ఈ రాశి వ్యక్తులు చాలామంది రిటైరౌతారు.

కుంభరాశి

వీరికి ఈ గ్రహమార్పు మంచిని చేస్తుంది. ధైర్యం పెరుగుతుంది. ఉల్లాసంగా, చొరవగా దూసుకుపోతారు. ఆధ్యాత్మికచింతన ఎక్కువౌతుంది. పరిచయాలు, విహారయాత్రలు, విలాసాలు, విందులు జరుగుతాయి. దూరప్రాంతాలకు నివాసాన్ని మారుస్తారు.

మీనరాశి

వీరికి ఈ గ్రహమార్పు మంచిది కాదు. కుటుంబంలో గొడవలు కలతలు మొదలౌతాయి. మాటపట్టింపులు ఎక్కువౌతాయి. దురుసుమాటలవల్ల నష్టపోతారు. ఆర్ధికనష్టాలను చవిచూస్తారు. దీర్ఘరోగాలు పెరుగుతాయి. మందులకు లొంగవు.

ఇవి స్థూలమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగతజాతకాన్ని, జరుగుతున్న దశను పరిశీలిస్తూ, ఈ గోచారాన్ని కూడా కలుపుకుని చూచుకోవాలి. అప్పుడు మిగతా అన్ని ఫలితాలు బాగా సరిపోతాయి. ఆయా లగ్నాలవారు కూడా ఇవే ఫలితాలను చూచుకోవాలి.

జాగ్రత్తలు తీసుకోండి మరి !