నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, మార్చి 2022, బుధవారం

రాజమండ్రి స్మృతులు - 3

వచ్చిన పని అయిపోయాక, సాయంత్రం పూట రామకృష్ణా మఠానికి బయలుదేరాము.  దారిలో, ఒకప్పుడు మేమున్న ఇంటిని గుర్తుపట్టలేకపోయాము. అంతగా అక్కడంతా మారిపోయింది. అన్నీ షాపులు వచ్చేశాయి. గోదారి గట్టుమీదుగా వెళుతుంటే, 'ఇక్కడ రేవులు బాగుంటాయి. సాయంత్రం పూట జనం వచ్చి కూచుంటారు. క్రమేణా దీనినొక టూరిస్ట్ సిటీగా మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి' అన్నాడు జానకిరామ్.

'నా చిన్నపుడు ఈ గోదారి ఒడ్డున చాలా తిరిగేవాడిని. ఇప్పుడేవేవో ఆశ్రమాలు చాలా కనిపిస్తున్నాయి' అన్నాను. 

'అవును. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ బాగుంటుంది. కొన్ని ఇతర ఆశ్రమాలు కూడా ఉన్నాయి. చివరకు ఇక్కడ కట్టిన శ్మశానం కూడా ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. ఈ శ్మశానాన్ని చాలా మోడ్రన్ గా కట్టింది కార్పొరేషన్' అన్నాడు జానకిరామ్.

దాని ఎదురుగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లు చాలా కనిపించాయి. 'మరి వాటిల్లో మనుషులు పొద్దున్నే లేచి తలుపులు తీస్తే, శవాలు తగలబడటం కన్పిస్తుంది కదా. అది వాళ్లకు నచ్చుతుందా?' అడిగాను.

'అందుకేనేమో, ప్రస్తుతం ఆ కాంప్లెక్స్ ని షాపింగ్ కాంప్లెక్స్ గా మార్చేశారు' అన్నాడు.

నవ్వొచ్చింది. 'అంతేలే. శవం తగలబడేలోపు బంధువులు షాపింగ్ చేసుకోవచ్చు. ఒక పనైపోతుంది. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది' అన్నా.

గోదారి ఒడ్డున ఉన్న రామకృష్ణా మిషన్ బిల్డింగ్ దాటుకుని కారు పోతోంది. చిన్నపిల్లాడిగా అక్కడికొచ్చిన జ్ఞాపకాలు తిరిగొచ్చాయి. అలా ప్రయాణించిన కారు చివరకు మఠం ప్రాంగణాన్ని చేరుకుంది.

మొదటిసారిగా, 1974 లో నేను రామకృష్ణామఠానికి మా అమ్మగారితో కలసి వచ్చాను. అప్పుడు నాకు 11 ఏళ్ళు. అప్పట్లో శ్రీ నందానందస్వామివారు మఠాధ్యక్షులుగా ఉండేవారు. 'బాలల వివేకానందుడు' అనే పుస్తకాన్ని ఆయన నాకిచ్చారు. అప్పట్లో మఠం ఇక్కడుండేది కాదు. వీరభద్రపురంలో ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత, ఎన్నోసార్లు రాజమండ్రి స్టేషన్ దగ్గర మేమున్న ఇంటినుండి దాదాపు 5 కి. మీ దూరం నడుచుకుంటూ పాతమఠానికి వచ్చి, ఆరతి అయిపోయేదాకా ఉండి, స్వామీజీని దర్శించి, నమస్కారం చేసుకుని మళ్ళీ నడుచుకుంటూ వెనక్కు వెళ్ళేవాడిని. ఈ పది కి.మీ నడకలోనూ జపం చేస్తూనే నడిచేవాడిని. ఆ చిన్నవయసులో అలాంటి సాధనకు ప్రేరణ స్వామీజీ యొక్క అనుగ్రహమే.

ఆయన నన్నెంతో అభిమానించేవారు. కారణాంతరాలవల్ల మఠంలో బ్రహ్మచారిగా చేరలేకపోయాను. సంసారినయ్యాను. అయినా సరే, ఎంతో తరువాతి కాలంలో నాకు 35 ఏళ్ల వయసులో ఆయన దేహత్యాగం చేసేవరకూ, అనేక సందర్భాలలో అనేక విషయాలలో ఆయన నాకు మార్గదర్శనం చేశారు. మారుమూల గ్రామం పూనూరులో జరిగిన నా ఉపనయనానికి ఆయన నడిచి వచ్చారు. విజయవాడలో, ఆదోనిలో మా ఇంటికి వచ్చారు. మంత్రాలయం ఆయనతో కలసి వెళ్ళాను.  1992 లో జరిగిన గోదావరి పుష్కరాలలో ఆయన్ను ఇదే రాజమండ్రిలో కలుసుకున్నాను. నా సాధనామార్గంలో ఒక గురువైన ఆయనకు ప్రతిరోజూ నమస్కరిస్తూనే ఉంటాను. ఎన్నో సాధనాపరమైన విషయాలను ఆయన దగ్గర నేర్చుకున్నాను.  నా 'శ్రీవిద్యా రహస్యం' గ్రంధంలో ఆయా అనుభవాలను కొన్నింటిని వ్రాశాను. అవన్నీ గుర్తొచ్చాయి.

వారిమీద భక్తితోనే, ఈ రోజువరకూ నేను వ్రాసిన ప్రతి పుస్తకాన్నీ మా అమ్మగారికీ, స్వామివారికీ అంకితం చేస్తూ వస్తున్నాను. ఈ జ్ఞానసంపదంతా వారు పెట్టిన భిక్షే.

చాలాకాలం తర్వాత మళ్ళీ ఇక్కడకొచ్చాను. క్రొత్త మఠాన్ని దర్శించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న వినిశ్చలానంద స్వామివారు గుంటూరు వాస్తవ్యులే గాక, యువకునిగా ఉన్నప్పటినుండీ నాకు పరిచయస్తులే. మా ఇద్దరిదీ ఒకే వయసు కావడంతో దాదాపు స్నేహితులలాగా మేము మాట్లాడుకుంటాం. గుంటూరులో మా ఇంటికి కూడా ఆయనొచ్చారు. దాదాపు 20 ఏళ్ల క్రితం, 'శ్రీ రామకృష్ణ పుంథి' అనే బెంగాలీ గ్రంధం కోసం నేనాయనను సంప్రదిస్తే, దాని ఇంగ్లీషు అనువాదం A Portrait of Sri Ramakrishna అనే పుస్తకాన్ని ఆయన నాకు ఇచ్చారు. అప్పట్లో ఢిల్లీ వెళ్లే పని పడింది. దాదాపు 700 పేజీలున్న ఆ పుస్తకాన్ని ఆ ప్రయాణంలో ఏకబిగిన చదివేశాను. ఎలా ఢిల్లీ వెళ్లానో, ఎలా వచ్చానో గుర్తులేదు. అంతగా దానిలో లీనమయ్యాను.

రంగనాథానందస్వామివారు హైద్రాబాద్ మఠం అధ్యక్షులుగా ఉన్న రోజులలో, వినిశ్చలానంద స్వామివారు ఆయన దగ్గర సేవకునిగా ఉన్నారు. ఆయన శిక్షణలో నిగ్గుతేలిన వ్యక్తి ఈయన.

మఠంలోని రామకృష్ణాలయం, మన దక్షిణాది ఆలయగోపుర విధానంలో కట్టబడి చాలా బాగుంది.  ఆఫీసులో వాకబు చేస్తే స్వామీజీ ప్రస్తుతం మఠంలో లేరని, రంపచోడవరం మెడికల్ క్యాంప్ లో ఉన్నారని తెలిసింది. ఒక మొబైల్ వ్యాన్ లో అక్కడి ఏజన్సీ ఏరియాలోని గిరిజనులకు మెడికల్ సహాయాన్ని అందించే కార్యక్రమంలో ఆయన ప్రస్తుతం ఉన్నారు. వ్యక్తిగత జీవితమనేది ఏమీ లేకుండా, ఒక్క పైసా బ్యాంక్ బేలన్స్ లేకుండా, తమదంటూ ఏ విధమైన స్వార్ధమూ లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, భగవంతుని ధ్యానంలో ఉంటూ, జీవులకు భగవద్భావంతో సేవను చేస్తున్న వీరు కదా అసలైన దేవతలంటే అని ఒళ్ళు పులకరించింది. మనస్సులోనే నమస్కారం చేసుకున్నాను.

ఆయనతో ఫోన్లో మాట్లాడాను. గుంటూరు విషయాలను, మద్రాస్ మఠంలో ఆయన బ్రహ్మచారిగా ఉన్నపుడు 1982 లో ఆయన్ను మొదటిసారి కలిసిన విషయం, గుంటూరు బ్రాడీపేటలోని వారింటికి ఆయనతో కలసి నేను వెళ్ళిన విషయం - అవన్నీ గుర్తు చేశాను. ఆయనకవన్నీ గుర్తున్నాయి. చాలా సంతోషపడ్డారు. తాను టూర్లో ఉన్నానని, ఇంకోసారి తనున్నపుడు వచ్చి మఠంలో తమ అతిధిగా  కొన్నాళ్ళు ఉండాలని ఆయనన్నారు. తప్పకుండా వస్తానని చెప్పాను. మఠమంతా తిప్పి చూపించమని స్టాఫ్ కు పురమాయించారు. ఆయనకిద్దామని తెచ్చిన నా పుస్తకాలను కొన్నింటిని మఠం ఆఫీసులో ఇచ్చాను.

ఆయన ఆదేశానుసారం, స్టాఫ్ వచ్చి మఠం ఆవరణ అంతా మాకు చూపించారు. విద్యార్థులకు జరుగుతున్న కంప్యూటర్ క్లాసులు, ఇతర సబ్జెక్టుల బోధన, మఠంలో రకరకాల మొక్కల పెంపకం. పెంపుడు తాబేళ్లు, ధ్యానమందిరం, గెస్టులకోసం కట్టిన 'స్వామి నందానంద భవనం' లను చూచాము. స్వామీజీ ఆఫీస్ రూములో, గత అరవై ఏళ్లలో అక్కడ పనిచేసిన ఆరేడుగురు అధ్యక్షస్వామీజీల ఫొటోలున్నాయి. వాటిలో స్వామి నందానందగారి ఫోటోను చూచినప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి. 1972 నుండి 1979 వరకూ ఆయనక్కడ ఉన్నారు.

ఆ తర్వాత అక్కడనుండి బయలుదేరి గోదారి తీరంలో ఉన్న రామకృష్ణా మిషన్ భవనాలకు చేరుకున్నాం. మఠంలో సాధువులు ఉంటారు. జపధ్యానాది సాధనలు జరుగుతాయి. మిషన్ కేంద్రంలో సేవాకార్యక్రమాలు జరుగుతాయి. ఆ విధంగా వివేకానందస్వామి ఏర్పాటు చేశారు. స్టాఫ్ కూడా మాతో అక్కడకు వచ్చారు. అది పూర్తిగా మెడికల్ సెంటర్. మల్టీ మెడికల్ హాస్పిటల్. మధ్యాన్నం 1 గంట వరకూ సేవలందిస్తుంది. సిటీలోని అందరు స్పెషలిస్టులు అక్కడకొచ్చి ఒక గంట సేపు సేవలందించి వెళతారు. చీకటి పడటంతో మూసేసి ఉంది. కానీ మాకోసం తలుపులు తెరిపించి మరీ అన్ని విభాగాలను చూపించారు.

అవన్నీ చూచి, వారినుంచి సెలవు తీసుకుని, వెనక్కు బయలుదేరాము. గోదావరి గట్టున కొద్దిసేపు కూర్చుని వెళదామని అన్నాను. ఒక మనుషులు లేని రేవులో కూర్చుందామని చూస్తే, అక్కడ అంత శుభ్రంగా లేదు. అందుకని ఇస్కాన్ ఘాట్ లో బాగుంటుందని అక్కడకు తీసుకెళ్లారు. అక్కడ ఘాట్ కు వెళ్ళేదారిలో నాలుగైదు మఠాలు కనిపించాయి. అన్నీ చాలావరకూ నిర్మానుష్యంగా ఉన్నాయి. కొన్ని నకిలీ స్వాముల ఆశ్రమాలలో మాత్రం జనాలున్నారు. గోదారి ఒడ్డున మెట్లమీద కాసేపు కూచున్నాము. అక్కడి మనుషుల ఎచ్చులు, వేషాలు కాసేపు చూచాక అక్కడుండాలనిపించలేదు.  పవిత్రమైన స్థలాలను తమ చీప్ ప్రవర్తనలతో అపవిత్రం చెయ్యడం ఎంత బాగా వచ్చో మనుషులకి? అని అసహ్యం చేసింది. గోదావరి జిల్లాలలోని సగటుమనుషులలో అతిప్రవర్తనలు, అతివాగుడులు చాలా ఎక్కువ. డీసెంట్ బిహేవియర్ ఆశించేవారికి అవి వెగటు పుట్టిస్తాయి.

ఇక అక్కడనుంచి లేచి, వెనక్కు వస్తుంటే, ఆ ఆశ్రమాల మధ్యలో మళయాళస్వాములవారి వ్యాసాశ్రమభవనం కనిపించింది. సత్యమైన ఋష్యాశ్రమాలు ఎలా ఉంటాయో, అలాగే నిర్మానుష్యంగా ఉంది. వెంటనే ఆగి, బయటనుంచి ఆయన ఫొటోకు నమస్కారం చేసుకున్నాను. ఆయన నిజమైన తపస్వి, వేదాంతి, జ్ఞాని. నందానందస్వామివారు ఆయన్ను ఎంతో గౌరవించేవారు. ప్రస్తుతపు ఎందరో నకిలీస్వాముల మధ్యనున్న సత్యమైన సాధువులలో, బ్రహ్మజ్ఞానులలో ఆయనొకరు. ఆయన శిష్యపరంపర కూడా నిజమైన జ్ఞానుల పరంపరయే.

ఆయన ఆశ్రమం ముందు ఆగి, నమస్కారం చేసుకుని, బయలుదేరుతుంటే, నాతో ఉన్నవారు ఇలా అన్నారు, 'మిగతా ఆశ్రమాలలోకి వెళ్ళరా?' అని.

'వెళ్ళను' అని అన్నాను.

అడిగినవారి ముఖాలలో ప్రశ్నార్ధకాలను చూచి, 'వాటిల్లోకి వెళితే ఈ గోదారి చాలదు. ఆ బురదను కడుక్కోడానికి కాశీకెళ్లి గంగలో మునగవలసి వస్తుంది' అన్నా నవ్వుతూ.

'మరి వాటిల్లో కొన్నింటిలో జనాలు బాగానే ఉన్నారు కదా?' అని వారన్నారు.

'ఉంటారు. జనగొఱ్ఱెలకు అసలుకంటే నకిలీనే ఎక్కువగా నచ్చుతుంది. అదే కలిమహత్యం. లోకంలో మీరు చూస్తున్నదంతా నిజమనుకోకండి. రండి పోదాం. ' అంటూ కారు దగ్గరకు దారితీశాను.

గెస్ట్ హౌస్ ఖాళీ చేసి, రైలెక్కాము. 

'త్వరలో మళ్ళీ ఇంకోసారి రాజమండ్రి వెళ్ళాలి. రామకృష్ణ మఠంలో మా ఫ్రెండ్ స్వామీజీ గారితో ఒకటి రెండు రోజులు గడపాలి. నందానందస్వాములవారి గతస్మృతులను మళ్ళీ నెమరు వేసుకోవాలి' అని ఆలోచిస్తూ మర్నాడు పొద్దునకు హైద్రాబాద్ చేరుకున్నాము. 

(అయిపోయింది)