“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఏప్రిల్ 2020, గురువారం

'నాదబిందూపనిషత్ ' తెలుగు 'ఈ-పుస్తకం' నేడు విడుదలైంది

ఋగ్వేదాన్తర్గతమైన 'నాదబిందూపనిషత్' ను నా వ్యాఖ్యానంతో నేడు విడుదల చేస్తున్నాము. ఈ పదిరోజులలో 'పంచవటి' నుండి వెలువడుతున్న ఆరవ పుస్తకమిది.

నాదోపాసన అనేది మన సనాతనధర్మంలో అంతర్భాగంగా అతి ప్రాచీనకాలంనుంచీ ఉన్నది. ఋగ్వేదకాలంలో ప్రసిద్ధిగాంచిన ఓంకారోపాసన నాదోపాసనయే. నాదమనేది పరబ్రహ్మం యొక్క మొదటి వ్యక్తరూపంగా వేదం చెబుతుంది. భగవంతుని మొదటిపేరును, మనమెవరూ ఆయనకు పేర్లు పెట్టకముందు ఉన్న అసలైన పేరును - 'తస్య వాచక ప్రణవ:' అంటూ ప్రణవనాదంగా అభివర్ణించారు పతంజలిమహర్షి . ఈ ఓంకార ప్రణవనాదం సృష్టిలో నిరంతరం మారుమ్రోగుతూనే ఉన్నది. కానీ విషయలంపటాలలో కూరుకుపోయిన మనం ఆ నిరంతరనాదాన్ని వినలేము. దైవాన్ని దర్శించలేము. కానీ సాధనతో దానిని వినవచ్చు. దర్శనాన్ని పొందవచ్చు. ఆ సాధన పేరే నాదోపాసన.

మన దేశంలో ఎందరో ఎందరెందరో మహనీయులు యోగులు ఈ సాధనతో పునీతులైనారు. ఈ మధ్యకాలంలో మనకు తెలిసినవారు సంగీతత్రిమూర్తులు. 'సంగీతజ్ఞానమూ భక్తివినా సన్మార్గము గలదే మనసా..భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులుపాసించే...' అన్న కీర్తనలో త్యాగరాజు దీనినే గానం చేశారు. మనం ఈనాడు చేస్తున్న పూజలు ఇవన్నీ రాకముందు మన సాంప్రదాయంలో ఉన్నది ఓంకారోపాసనమే. యోగసాధనలో నాద బిందు కళలన్నవి ప్రసిద్ధములే ! వాటిలో నాదం మొదటిమెట్టు.

సమస్త సాధనలనూ ఔపోసన పట్టిన శ్రీరామకృష్ణుల జీవితంలో నాదోపాసనలో అంచులు మనకు గోచరిస్తాయి. లౌకికజీవితంలో మనం అనుకునే అల్పమైన నాదములు కూడా ఆయనను అతీతసమాధి స్థితులలోకి తీసుకుపోయేవి. బ్రహ్మప్రణవనాదంలో ఆయన మనస్సును లీనం చేసేవి. అందుకే సందర్భానుసారంగా ఆయన మాటలను ఈ పుస్తకంలో ఉటంకించి దీనికి పరిపూర్ణతను తెచ్చాను.

నాదోపాసనకు గల వేదప్రామాణికతను ఈ పుస్తకం మీకు అర్ధమయ్యేలా చేస్తుంది.

ఈ పుస్తకం వ్రాయడంలో యధావిధిగా ఎంతగానో సహాయపడిన నా శ్రీమతికి, నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, శిష్యులు రాజు, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ లకు, నా కృతజ్ఞతలు, ఆశీస్సులు. ఈ వేదసరస్వతీ ఉపాసనవల్ల వారి ఎకౌంట్లో చాలా పుణ్యం జమ అవుతోంది.

ఈ పుస్తకం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా తెలుగు ఇంగ్లీషులలో వస్తుంది.