ఆధ్యాత్మికత అనేది చేతలలో కూడా కనిపించాలి. ఉత్త మాటలలో మాత్రమే కాదు

27, ఏప్రిల్ 2020, సోమవారం

'శాండిల్యోపనిషత్' తెలుగు 'ఈ - పుస్తకం 'నేడు విడుదలైంది
అధర్వణ వేదాంతర్గతమైన "శాండిల్యోపనిషత్ (శాండిల్య యోగసూత్రములు)" కు నా వ్యాఖ్యానమును ఈ రోజున 'ఈ-పుస్తకంగా విడుదల చేస్తున్నాము. లాక్ డౌన్ ఎత్తేశాక ఇది తెలుగు మరియు ఇంగ్లీషు ప్రింట్ పుస్తకాలుగా వస్తుంది. ఈ ఏడాది మా పంచవటి పబ్లికేషన్స్ నుండి వెలువడుతున్న ఐదో పుస్తకం ఇది. ఈ నెలలో వెలువడుతున్న నాలుగో పుస్తకం.

నాలుగు వేదములకు అనుబంధములైన యోగోపనిషత్తులలో మూడు ముఖ్యమైనవిగా ఉన్నాయి.

1. దర్శనోపనిషత్. దీనికి జాబాల దర్శనోపనిషత్ అని నామాంతరమున్నది. దీనిని ముందుగానే ప్రచురించాము.

2. యోగకుండల్యుపనిషత్. దీనికే యోగకుండలిని ఉపనిషత్ అని నామాంతరమున్నది. దీనిని కూడా ఈ మధ్యనే ప్రచురించాము.

3.శాండిల్యోపనిషత్. దీనికి శాండిల్యయోగసూత్రములని నామాంతరమున్నది. చాలామందికి తెలియని విషయమేమిటంటే, పతంజలిమహర్షి వ్రాసిన యోగసూత్రములకంటే శాండిల్యమహర్షి యోగ సూత్రములే సనాతనధర్మమునకు దగ్గరగా ఉంటాయి. ఆ పుస్తకం ఈ రోజున వస్తున్నది.

ఈ మూడింటిలోనూ వైదిక యోగసంప్రదాయం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నది. దాదాపుగా 20 యోగోపనిషత్తులు వేదములలో మనకు లభిస్తున్నాయి. వాటిలో ఋగ్వేదం నుంచి 2, సామవేదం నుంచి 3, శుక్ల యజుర్వేదం నుంచి 4, కృష్ణ యజుర్వేదం నుంచి 5, అధర్వణ వేదం నుంచి 6 ఉన్నాయి. వాటిని వరుసగా ప్రచురిస్తున్నాము.

శాండిల్యమహర్షి పేరు మీద ఈ ఉపనిషత్తు మనకు దర్శనమిస్తుంది. శాండిల్యగోత్రం మనకు ఉత్తరభారతదేశంలోనూ, గోదావరిజిల్లాల లోనూ కనిపిస్తుంది. ఇది అథర్వణ వేదమునకు చెందిన ఉపనిషత్తు. ఇది క్రీ.పూ 1 వ శతాబ్దానికి చెందినదిగా కొందరు పండితులు నిర్ధారించారు. కొందరేమో క్రీ.శ 3 వ శతాబ్దమన్నారు. పతంజలిమహర్షి వ్రాసిన యోగసూత్రముల పైన బుద్ధమతప్రభావం కనిపిస్తుంది. కానీ శాండిల్య యోగసూత్రములలో ఆ ప్రభావం ఉండదు. ఇది పూర్తిగా వైదిక సాంప్రదాయానుసారిగా గోచరిస్తుంది. యోగమునూ, బ్రహ్మవిద్యనూ అధ్యయనం చెయ్యాలన్న ఇచ్ఛతో శాండిల్య మహర్షి, అథర్వణమహర్షిని ఆశ్రయించి ఆయన వద్ద పొందిన ఉపదేశమే ఈ ఉపనిషత్తు. యోగసాంప్రదాయం పైన ఇది సాధికారిక గ్రంథమని చెప్పవచ్చు.

పతంజలిమహర్షి చెప్పిన యమనియమములకూ, ఈ ఉపనిషత్తులు చెప్పిన బోధలకూ భేదములున్నాయి. ఉపనిషద్బోధలు పూర్తిగా వైదిక సాంప్రదాయానుసారులుగా కనిపిస్తున్నాయి.

ఈ ఉపనిషత్తును మొత్తం ఒకే ఒక శ్లోకంలో ఇమిడ్చి ఈ విధంగా చెప్పబడింది.

|తత్ర దశ యమాః | తథా నియమాః | ఆసనాన్యష్టౌ | త్రయః ప్రాణాయామాః | పఞ్చ ప్రత్యాహారాః | తథా ధారణా | ద్విప్రకారం ధ్యానమ్ | సమాధిస్త్వేకరూపః |

యమములో పది అంగములున్నాయి. అలాంటిదే నియమం కూడా. ఆసనములు ఎనిమిది. ప్రాణాయామములు మూడు. ప్రత్యాహారములు అయిదు. ధారణ కూడా అలాంటిదే. ధ్యానం రెండు విధములైనది. సమాధి ఏక రూపమైనట్టిది.

వైదికధర్మం మొదట నిర్గుణ పరబ్రహ్మతత్త్వంతో మొదలుపెట్టి, క్రమేణా సగుణోపాసనగా రూపాంతరం చెందుతూ తదుపరి భగవంతుని అవతారములను ఆరాధించడం ఏ విధంగా మొదలుపెట్టిందో ఆ పరిణామక్రమం ఈ ఉపనిషత్తు చివరి అధ్యాయములో మనకు కనిపిస్తుంది. నిర్గుణపరబ్రహ్మమే దత్తాత్రేయునిగా అవతారం దాల్చిందని చెబుతూ ఈ ఉపనిషత్ ముగుస్తుంది.

యోగసాంప్రదాయమునకు గల వైదికమూలములను మనమీ ఉపనిషత్తును అధ్యయనం చెయ్యడం ద్వారా గ్రహించవచ్చు. చదువరులను అసలైన యోగసాధన వైపు ఈ పుస్తకం మళ్ళించగలిగితే మా ప్రయత్నం సఫలమైనట్లు భావిస్తాము.

ఈ పుస్తకం వ్రాయడంలో ఎంతగానో సహాయపడిన నా శ్రీమతికి, నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, శిష్యులు రాజు, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ లకు, యోగాసనముల బొమ్మలను చక్కగా చిత్రించి ఇచ్చిన నిఖిలకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా pustakam.org నుంచి లభిస్తుంది.