Love the country you live in OR Live in the country you love

5, ఏప్రిల్ 2020, ఆదివారం

కరోనా కతలు - 3 (ఏ రాయైతేనేం...)

ఏ రాయైతేనేం పగలడానికి
అది కొబ్బరికాయైనా, తలైనా
ఏ సాకైతేనేం చావడానికి
అది కరోనా ఐనా, ఇంకోటైనా

మతపిచ్చితో కొందరు
మదపిచ్చితో కొందరు
మనకేం కాదులే అని కొందరు
కరోనాకి బలౌతున్నారు

ఇంట్లో ఎన్నాళ్ళంటూ
అన్నీ అబద్దాలంటూ
ఊళ్ళకి ఊరేగుతున్నారు
కరోనాకి ముద్దౌతున్నారు

పాజిటివ్ అని తెలిశాక
పిశాచాలుగా మారిపోతూ
ఎంతమందికి అంటిస్తే
అంత గొప్ప అనుకుంటున్నారు

వచ్చిందని అర్ధమయ్యాక
వయ్యారాలు పోతూ రోడ్డెక్కుతున్నారు
చచ్చే లోపల ఒక సైన్యాన్ని
తమతో తీసుకుపోతామంటున్నారు

రాజకీయం చెయ్యాలని కొందరు
రణరంగం చెయ్యాలని కొందరు
అవకాశవాదులే అందరూ
కరోనా కాటేస్తున్నా కూడా

ఈ సమయంలో కూడా
ఎవడి వ్యాపారం వాడిది
ఈ విలయంలో కూడా
ఎవడి వ్యవహారం వాడిది

చస్తున్నా మనిషి మారడు
చచ్చినా మనసు మారదు
ఈ లోకులకి బుద్దెప్పుడొస్తుంది?
ఈ కాకులకి తెలివెప్పుడొస్తుంది?

కరోనా ఎప్పుడు పోతుంది?
అని అడుగుతున్నారు కొందరు
కరోనా ఎక్కడికీ పోదు
అది వైరస్ దానికి చావు లేదు

అన్ని వైరసుల్లాగే అది
మనతోనే ఉంటుంది ఎప్పటిలా
దీనికి మందు కనిపెడితే
ఇంకొకటొస్తుంది దుప్పటిలా

మనిషి మారకపోతే
సర్వనాశనమవడం ఖాయం
ఇది భూమికి కొత్త కాదు
ఎన్నోసార్లు జరిగిందీ హోమం

చెప్పినా వినని స్థాయికి
మనిషి చేరుకున్నాడు
తెలిసినా మార్చుకోలేని లోయకి
మనిషి జారుకున్నాడు

కరోనా పోతుందని
సంబరపడకండి
దీని బాబు ఇంకోటి వస్తుందని
సరిగ్గా తెలుసుకోండి

పూతమందే మాకు చాలంటే
ఎవడూ మార్చలేడు మీ ఖర్మ
మూలంనుంచే రోగం పోవాలంటే
మార్చుకోవాలి మీ కర్మ

అప్పటిదాకా ఒక రాయిని తీసేస్తే
ఇంకో రాయి వస్తూనే ఉంటుంది
ఏ రాయైతేనేం పగలడానికి
అది కొబ్బరికాయైనా, తలైనా...