నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

22, ఏప్రిల్ 2020, బుధవారం

'యోగ కుండలినీ ఉపనిషత్' తెలుగు 'ఈ బుక్' నేడు విడుదలైంది


Vision 2020 లో భాగంగా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి మూడో పుస్తకంగా కృష్ణ యజుర్వేదాంతర్గతమైన  'యోగ కుండలినీ ఉపనిషత్' కు నా వ్యాఖ్యానాన్ని పుస్తకరూపంలో ఈ రోజు విడుదల చేస్తున్నాము. వేదములలో 20 వరకూ యోగోపనిషత్తులున్నాయి. అవన్నీ ఇప్పుడు వరుసగా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి పుస్తకాలుగా వస్తాయి. కాళికామాత కటాక్షమును బట్టి, నా సాధనానుభవములను బట్టి వీటిని నేను వ్యాఖ్యానించ గలుగుతున్నాను.

నా గురువుగారైన పూజ్యపాదులు శ్రీమత్ గంభీరానందస్వాములు పది ప్రముఖములైన జ్ఞానోపనిషత్తులకు వ్యాఖ్యానం వ్రాశారు. వాటిని శ్రీ రామకృష్ణ మఠంవారు ప్రచురించారు. ఉడతాభక్తిగా నా వంతు నేను ఈ యోగోపనిషత్తులకు వ్యాఖ్యానం వ్రాస్తూ ఋషి ఋణాన్ని, గురు ఋణాన్ని తీర్చుకుంటున్నాను.

1988 లో నా గురువులలో ఒకరైన పూజ్యపాదులు నందానంద స్వామివారు నాతో ఇలా అన్నారు 'భవిష్యత్తులో నీవు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం వ్రాస్తావు'. 'నామీద ప్రేమతో ఆయనలా అంటున్నారులే' అనుకుని అప్పట్లో నేనది నమ్మలేదు. కానీ ఈనాడది నిజం అవుతోంది. జ్ఞానోపనిషత్తులలో ముఖ్యములైన వాటిని నా 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకంలో స్పర్శించాను. నేడు యోగోపనిషత్తులకు వ్యాఖ్యానం వ్రాసే అదృష్టం పట్టింది.

అష్టాంగయోగమును, ఆసన, ప్రాణాయామ, ముద్ర, క్రియ, బంధాది విషయములను ఈ యోగోపనిషత్తులు ఉపదేశిస్తాయి. పతంజలి మహర్షి తన యోగసూత్రములలో చెప్పిన యోగవిధానానికీ వీటిలో చెప్పబడిన విధానానికీ తేడాలున్నాయి. నేను చిన్నప్పటినుండీ సాధన చేసిన మార్గం వీటిల్లో వివరంగా మీకు కనిపిస్తుంది.

ఈ పుస్తకం కూడా మీకు google play books నుంచి లభిస్తుంది.

లాక్ డౌన్ తర్వాత ఇది  తెలుగు మరియు ఇంగ్లీషు ప్రింట్ పుస్తకాలుగా వస్తుంది.