“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, ఏప్రిల్ 2018, శుక్రవారం

మంచి లోకం - చెత్త మనుషులు

చాలామంది ఈ లోకాన్ని విమర్శిస్తూ, లోకం పాడైపోయిందనీ చెత్తలోకమనీ అంటూ ఉంటారు. ఇది నాకు నచ్చదు. లోకం ఏం చేసింది? అది మంచిదే.

అయినా లోకం అంటే వాళ్ళ ఉద్దేశ్యంలో ఏమిటి? మనుషులనేగా ! లోకానికేమైనా శరీరం ఉందా? మనస్సు ఉందా? లేదుకదా ! లోకం అంటే పంచభూతాలు తప్ప ఇంకేముంది? అవి అమాయకాలు. వాటికి కుళ్ళూ కుత్సితమూ లేవు. అవి మంచివే. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా అవి మనుషులను పోషిస్తూ వస్తున్నాయి. అవి ప్రకృతి శక్తులు. వాటిల్లో దోషం లేదు.

కనుక లోకం మంచిదే. ఆ లోకంలో ఉంటూ దాన్ని భ్రష్టు పట్టిస్తున్న మనుషులు చెడ్డవాళ్ళు. ఈ లోకంలో విచిత్రం ఏమంటే 'మేం చాలా మంచివాళ్ళం' అనుకుంటున్నవాళ్ళు కూడా చెడ్డవాళ్ళే. మన చుట్టూ పరికిస్తే ఇది తేలికగా అర్ధమౌతుంది. చెడ్డదారిలో పోతున్నవాళ్ళు కూడా తాము మంచిదారిలోనే ఉన్నామని అనుకుంటారు. అదే మాయ అంటే !

ప్రాధమికంగా మనిషి కూడా మంచివాడే. ప్రతిమనిషీ మంచివాడే. ఎందుకంటే అతనిలో ఉన్నది దైవం యొక్క అంశమే. కానీ అతను మాయకు లోబడ్డాడు. దిగజారిపోయాడు. లోకాన్ని కూడా దిగజారుస్తున్నాడు. ఈ పరిస్థితిని నుంచి బయట పడగలిగితే అతను మళ్ళీ తన దివ్యత్వపు మూలాలను అందుకోగలడు. అసలీ మాయ అంటే ఏమిటి?

స్వార్ధమే మాయ. పక్కవాడి నోరుకొట్టి తాను తినాలని అనుకోవడమే మాయ. దానికి మూలమైన భయమే మాయ. దాచుకోకపోతే రేపు ఏమౌతుందో అన్న ఆటవిక మనిషి యొక్క ప్రాధమిక భయం నుంచి తరతరాలకు సరిపడా దాచుకుందాం అన్న నేటి మానవుని దురాశ వరకూ అన్నీ ఈ మాయ యొక్క నీడలే. కొన్ని చిక్కటి నీడలైతే కొన్ని తేలికపాటి నీడలు. నా కుటుంబం అన్న పరిమిత స్వార్థం నుంచి నా కులం, నా వర్గం, నా ప్రాంతం, నా దేశం అన్న సూక్ష్మమైన, సమర్ధించుకోడానికి బాగుండే స్వార్ధాల వరకూ అన్నీ ఆ నీడలే. అంతే తేడా !

తనకొక న్యాయమూ ఇంకొకడికి వేరొక న్యాయమూ అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో ఆ క్షణంలోనే అతను స్వార్ధానికి లోబడతాడు. ఆ క్షణంలోనే అతను దైవత్వానికి దూరమౌతాడు. అలా దూరమయ్యానని అతనికి తెలియనివ్వకుండా చేసేదే అహంకారం. అహంకారపు మాయలో చిక్కినవాడు తను చేస్తున్నది కరెక్టే అని అనుకుంటూ తన చర్యలను సమర్ధించుకుంటూ ఉంటాడు.

మనుషులు స్వార్ధానికి లోబడి బ్రతుకుతూ, తామేం చేసినా ఒప్పే అనుకుంటూ ఉంటారు. అదే పని ఎదుటివారు చేస్తే మాత్రం తప్పు అనుకుంటూ ఉంటారు. ఇక్కడే మానవజాతి మొత్తం తప్పటడుగు వేస్తున్నది. అయితే, ఈ తీరు ఒక్కనాటితో మారేది కాదు. అహంకారం, మదం, డబ్బు మీద మోజులు తలకెక్కిన మనుషులు అంత తేలికగా జ్ఞానులు చెప్పిన మాటలను వినరు. కనుక వారికి చెప్పాలని కూడా విజ్ఞులైనవారు ప్రయత్నించరాదు.

బుద్ధుడు బ్రతికున్న రోజులలో ఎందఱో రాజులున్నారు. బుద్ధుడూ క్షత్రియుడే. ఆ సాటి క్షత్రియరాజులు గానీ అప్పటి మనుషులు గానీ ఎందరు బుద్ధుని సరిగ్గా అర్ధం చేసుకున్నారు? ఆయన బోధలు ఎందఱో విన్నారు. కానీ సరిగా వాటిని అర్ధం చేసుకున్నది మాత్రం కొందరే. పైగా దానిని తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఎంతో నష్టపోయారు. బుద్ధుడు చెప్పినది అహింసా మార్గం కానేకాదు. ఆయనది జ్ఞానమార్గం. లోకం దానిని తప్పుగా అహింసామార్గం అని అర్ధం చేసుకున్నది. అలా లోకానికి ప్రచారం చేసింది కూడా ముందు తమకే అర్ధం కాని కొందరు లీడర్లే.

జైన మహావీరునిది అహింసా మార్గం. బుద్ధునిది జ్ఞానమార్గం. ఈ తేడా నేటికీ, అంటే బుద్ధుని తర్వాత 2500 వత్సరాలు గడచినా కూడా, ఇంకా చాలామందికి తెలియదు. లోకులు ఎంత అజ్ఞానంలో ఉన్నారో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

మహర్షులు బ్రతికున్న కాలంలో ఎందరు వారి మాటలు విన్నారు? ఎందరు వాటిని తలకెక్కించుకున్నారు? మహాభారత కాలంలో వ్యాసమహర్షి బ్రతికే ఉన్నాడు. విదురుడు బ్రతికే ఉన్నాడు. ఇంకా ఎందఱో విజ్ఞులూ, జ్ఞానులూ, మహర్షులూ బ్రతికే ఉన్నారు. కానీ వారి మాటలు ఎవరు విన్నారు? పాండవులు గానీ కౌరవులు గానీ వారి మాటలను వినలేదు. ఫలితంగా అనేక లక్షలమంది హతమైపోయిన భారత యుద్ధం జరిగింది. దానివల్ల ఎవరికీ శాంతి మాత్రం రాలేదు.

ఎప్పుడైనా, ఏ కాలంలోనైనా కొద్దిమందికి మాత్రమే సత్యాన్ని అనుసరించగలిగే ధైర్యమూ, మానసిక సంసిద్ధతా ఉంటాయి. ఆ పనిని అందరూ చెయ్యలేరు. అలా చెయ్యలేకపోవదానికి కారణాలు - స్వార్ధం, అహంకారం. గర్వం, భయం మొదలైన గుణాలు. ఇవి వారి మనస్సులోనే ఉంటూ వారిని తప్పుదారిన నడిపిస్తూ అది మంచి దారేనని సరియైన దారేనని భ్రమింపజేస్తూ ఉంటాయి. వాటిమాట వింటున్నంత వరకూ అలాంటి వాళ్ళు జ్ఞానమార్గంలో, సత్యమార్గంలో, వెలుగుదారిలో నడవలేరు.

మరి జ్ఞానులైన వారు ఏం చెయ్యాలి? తమకు తెలిసినదానిని అందరికీ చెప్పాలా వద్దా?

చెప్పవచ్చు. కానీ అలా చెప్పినంత మాత్రాన దానిని అందరూ అర్ధం చేసుకోలేరు. శంకరుని బోధలూ, బుద్ధుని బోధలూ, నిన్నా మొన్నటి వివేకానందుని బోధలూ ఎలా వక్రీకరించబడ్డాయో, బడుతున్నాయో చూస్తె ఈ విషయం తేలికగా అర్ధమౌతుంది. ఈ లోకంలో ఏదైనా కరప్ట్ అయి పోతుంది. జ్ఞానుల బోధలు కూడా దీనికి మినహాయింపులు కావు.

మరి జ్ఞానులైనవాళ్ళు ఏం చెయ్యాలి?

ఉత్త బోధించడం చాలదు. లోకంలో ఉన్న ఇన్ని కోట్లమందిలో నుంచి తనవారెవరో వారు సెలక్ట్ చేసుకోవాలి. వారిని తమ దగ్గరకు తీసుకోవాలి. వారికి మాత్రమే తనకు అనుభవంలోకి వచ్చిన జ్ఞానాన్ని ప్రసారం చెయ్యాలి. వారికే అది అందుతుంది కూడా. అందరికీ అది అందదు. ఎందుకంటే దానిని అందుకునే అంతరికస్థితి ఆ బోధలను విన్న అందరిలోనూ ఉండదు. కనుక వినేవారు కోట్లలో ఉంటే, సరిగా అర్ధం చేసుకునేవారు వందల్లో ఉంటే, ఆచరించి అనుభవం లోకి తెచ్చుకునేవారు పదుల సంఖ్యలోనే ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు. ఇది ప్రకృతి నియమం. మొదటనుంచీ ఏ మహాపురుషుని జీవితం చూచినా ఇది సత్యం అని మనకు అర్ధమౌతుంది.

మంచి లోకంలో ఉంటూ, తమలోని విషంతో దాన్ని పాడు చేస్తూ, తమ జీవితాలను కూడా పాడు చేసుకుంటూ, అదే ఏదో విజయంగా భావిస్తూ విర్రవీగుతున్న చెత్తమనుషుల లోనుంచి తనవారిని గుర్తుపట్టి, వారికి తన అనుభవాన్ని అందించి వారిని కూడా తన స్థాయికి చేర్చడమే ఏ సద్గురువైనా చెయ్యగలిగిన పని. అతడు చేసే పని కూడా అదే.

ఈ పని చేసిన తర్వాత, ఆ గ్రూప్ వరకూ అందరూ ఈ లోకపు ఊబిలోనుంచి బయటపడి, చెత్త మనుషులతో నిండిన ఈ మంచిలోకానికి దూరంగా, వారిలోకానికి వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళెవరికీ కన్పించరు. అంతిమ సత్యం ఇదే. ప్రాచీన కాలం నుంచీ ఇదే జరుగుతున్నది. ఇకముందు కూడా జరుగుతూనే ఉంటుంది ! ఈ లోకం మాత్రం, తాము చెత్త మనుషులమని కూడా గ్రహించలేనంత ఘోరమైన స్థితిలో ఉన్న మనుషులతో ఇలా కునారిల్లుతూనే ఎప్పటికీ ఉంటుంది.

మన సమయం వచ్చేవరకూ, మంచిలోకంలో ఉన్న చెత్త మనుషుల మధ్యన, మన ఆయుష్షు ఉన్నంతవరకూ మనం బ్రతకక తప్పదు మరి !