“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

వచ్చే ఆదివారం మా ఇంట్లో సత్సంగం - మీరు రావాలి

నేనేం వ్రాసినా నా అనుభవాల నుంచీ నా చుట్టూ జరుగుతున్న విషయాల పరిశీలన నుంచీ వ్రాస్తూ ఉంటాను. అలాంటివి మాత్రమే మనస్సులో హత్తుకుపోతాయనీ ఎప్పటికైనా గుర్తుంటాయనేదీ నా నమ్మకం మాత్రమే కాదు వాస్తవం కూడా.

అలాంటి సంఘటనే ఈ మధ్యన ఒకటి జరిగింది.

మొన్నేదో పనిలో ఉండగా ఒక ఫోనొచ్చింది.

'హలో' అంటూ పలకరించింది ఒక స్త్రీ స్వరం.

'హలో' అన్నా.

'వచ్చే వారం మా ఇంట్లో సత్సంగం ఉంది. మీరు రావాలి.' అంది ఆ స్వరం.

బిజీ బ్రతుకుల పుణ్యమా అని ఈ మధ్యన ఫోన్ మానర్స్ కూడా ఎవరికీ ఉండటం లేదు. వాళ్ళు హలో అంటూనే వాళ్లెవరో మనకు తెలిసిపోతుందని అనుకుంటారో ఏమిటో అర్ధం కాదు. డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వచ్చేస్తూ ఉంటారు.

'ఏమ్మా! ముందు మీరెవరో చెప్పండి' అడిగా.

ఎంతమందికి చెప్పమంటారు? అన్న విసుగు ఆమె గొంతులో ధ్వనించింది.

'నేను పలానా. ఇక్కడ పలానా కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాను.' అంది.

'సరే. సత్సంగం అంటున్నారుగా . ఏంటో చెప్పండి.' అన్నాను.

'నేను శారదా మఠ్ డివోటీని. వచ్చే ఆదివారం మా ఇంట్లో సత్సంగం పెడుతున్నాం. మీరూ మీ శ్రీమతీ రావాలి.' అందామె.

అలా అనడమే గాక, ఆ సత్సంగం షెడ్యూల్ ఎలా ఉంటుందో వివరంగా చెప్పడం మొదలుపెట్టింది.

అదంతా ఓపికగా విని ఆమెతో ఇలా చెప్పాను.

'చూడమ్మా నాదొక సందేహం. సత్సంగం వారానికి ఒకరోజు చేస్తే సరిపోతుందా?'

నేనడిగింది ఆమెకు అర్ధం కాలేదు.

'ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో పెడుతున్నాం అండి.' అందామె.

'మీరు వారానికి ఒకరోజే భోజనం చేస్తున్నారా లేక రోజూ చేస్తున్నారా?' అడిగాను.

అవతలవైపు నుంచి కాసేపు మౌనం.

'అదేంటండి అలా అంటారు?' అడిగింది కాసేపటి తర్వాత.

ఇక ముసుగులో గుద్దులాట ఎందుకని ఆమెతో డైరెక్ట్ గా ఇలా చెప్పాను.

'చూడమ్మా. నేను రాలేను. ఎందుకంటే ఇలాంటి సత్సంగాల మీద నాకు నమ్మకం లేదు.'

'అదేంటండి మీరు రామకృష్ణా డివోటీనే కదా.' అందామె.

'అవునమ్మా. కానీ నా సంబంధం సరాసరి రామకృష్ణునితోనే గాని ఆయన సంస్థలతో కాదు. ఆ సంస్థలన్నీ నేను చిన్నప్పుడే బాగా తిరిగాను. ఇప్పుడు నాకు వాటిమీద ఏమీ ఇంటరెస్ట్ లేదు. వాటిల్లో ఆయన నాకు కనపడలేదు. సారీ. నేను మీ సత్సంగానికి రాలేను. మీకింకా వివరంగా కావాలంటే నేను వ్రాసిన పుస్తకాలు చదవండి. నా భావజాలం బాగా అర్ధమౌతుంది. దయచేసి ఇలాంటి ఆహ్వానాలతో నాకు మళ్ళీ ఫోన్ చెయ్యకండి' అని చెప్పాను.

అంతసేపు మాట్లాడి కనీసం 'థాంక్స్' కూడా చెప్పకుండా ఫోన్ కట్ చేసింది ఆమె. ముందే చెప్పాగా కనీసం ఫోన్ మానర్స్ కూడా జనం మర్చిపోతున్నారని.

ఇలాంటి సత్సంగాలలో నేను చాలా చిన్నప్పుడే, అంటే నాకు ఇరవై ఏళ్ళ లోపే చాలా తిరిగాను. వాటిలో ఏమీ లేదనీ ఏమీ దొరకదనీ నేను స్పష్టంగా చెప్పగలను. ఇలాంటి సత్సంగాలూ పూజలూ, ఇంకా ఇంకా మనల్ని భ్రమల్లో ముంచేవేగాని తేల్చేవి కావు.

వీటిని నిర్వహించే వారిలో చాలామందిలో 'ఐడెంటిటీ క్రైసిస్' ఉంటుంది. అదే వీళ్ళచేత ఇలాంటి మీటింగులు పెట్టిస్తూ ఉంటుంది. చివరకు వీరంతా కరుడుగట్టిన చాదస్తపు భక్తులుగా రూపాంతరం చెందుతూ మిగతావారిని కూడా అలాగే మార్చాలని ప్రయత్నిస్తూ మిగిలిపోతారుగాని ఆధ్యాత్మికంగా అంగుళం కూడా ఎదగలేరు. ఇలాంటి వారిలో సాయిబాబా భక్తులూ, ఇంకా చాలామంది సోకాల్డ్ మహనీయుల భక్తులూ ఉంటారు. ఈ సత్సంగాలూ పూజల వరకే గాని, వారివారి జీవితాలలో ఉన్నతమైన మార్పులు ఎక్కడా కన్పించవు. ఇంకా చెప్పాలంటే, మామూలు మనుషులకంటే ఇంకా దరిద్రంగా వీరి ప్రవర్తనలుంటూ ఉంటాయి. ఇలాంటి వారిని నా జీవితంలో నేను చాలామందిని చూచాను.

అందుకే ఈ సత్సంగాలన్నా, సామూహిక భజనలన్నా, పార్టు టైం దీక్షలన్నా, గురుపూజా మహోత్సవాలన్నా నాకు పరమ చీదర. దానికి కారణం ఒక్కటే ! ఇలాంటి వారిని కొన్ని వందలమందిని నేనింతవరకూ చూచాను. కానీ వారిలో ఒక్కరిలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నేను ఇంతవరకూ చూడలేదు. ఇలాంటి సత్సంగాలతో సంబంధం లేని మామూలు మనుషులలో ఆ ఔన్నత్యాన్ని అనేకసార్లు చూచాను. అందుకే ఈ పూజలకూ నిజమైన ఆధ్యాత్మికతకూ ఎలాంటి సంబంధమూ లేదని నేను విశ్వసిస్తాను.

ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మగారి భక్తులు కూడా ఒకరు నాతో ఇలా అన్నారు.

'మీరు గుంటూరు లోనే ఉంటారు కదా! ప్రతివారం ఒకరోజున ఒక్కొక్క భక్తుని ఇంట్లో మేం కలుస్తున్నాం. అక్కడ అమ్మ పూజ జరుగుతుంది. మీరూ రండి. వచ్చేటప్పుడు కొబ్బరికాయా పూలూ తెచ్చుకోండి. మీరు కూడా పూజ చేసుకోవచ్చు'.

పిచ్చోడిలా చూశాను ఆ వ్యక్తి వైపు.

'నేను జిల్లెల్లమూడి వెళ్ళినప్పుడే ఏ కొబ్బరికాయలూ పూలూ తీసికెళ్ళను. ఇక ఈ సత్సంగానికి ఎలా తెస్తానని మీరనుకుంటున్నారు? నా పూజా విధానం మీకర్ధం కాదులే. మీరు పిలిచినందుకు థాంక్స్. కానీ నేను రాను. ఇలాంటి పూజల మీద నాకు నమ్మకం లేదు.' అని సూటిగా చెప్పాను.

ఆ వ్యక్తి మళ్ళీ మాట్లాడలేదు.

ఇలాంటి వ్యక్తులు చాలామంది, తామేం చేస్తున్నారో తమకే తెలియని వారు, మనకు తరచుగా తారసపడుతూ ఉంటారు. వీరిని చూచి జాలిపడటం తప్ప ఇంకేం చెయ్యలేం ప్రస్తుతానికి !

వారానికి ఒకరోజు సత్సంగం జరిగితే మిగతా ఆర్రోజుల జీవితమూ దుష్టసంగం అని అర్ధమేగా మరి !!

అయినా వీళ్ళ పిచ్చి కాకపోతే, సత్యానికి సత్సంగం అవసరమా ??