“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జులై 2017, శనివారం

పాశుపతాస్త్రం

చిన్న వయసులోనే సెటిలైపోతున్న జీవితాలూ, చేతిలో ఆడుతున్న డబ్బూ, దానికి తోడు వేలం వెర్రిగా విస్తరిస్తున్న విదేశీ సంస్కృతీ కలిసి ఎలా వెర్రి తలలు వేస్తున్నాయో అనడానికి ఈ మధ్య నాకొచ్చిన ఈ ఫోన్ కాలే ఉదాహరణ.

ఒక రోజు మధ్యాన్నం పూట ఫోన్ మ్రోగుతుంటే 'హలో' అన్నా.

'నేను నరసింహారావును మాట్లాడుతున్నా' అంది అవతల నుంచి ఒక స్వరం.

'ఎవరి కోసం?' అడిగా.

'సత్యనారాయణ శర్మగారేనా?' అంది అవతలనుంచి.

'అవును.చెప్పండి' అన్నా.

'నేను మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటా. నాకొక జీవన్మరణ సమస్య వచ్చింది.అందుకే మీకు ఫోన్ చేస్తున్నా.' అంది స్వరం.

'అదేంటి? అలాంటి సమస్యలొస్తేగాని నేను గుర్తు రానా?' అందామని నోటిదాకా వచ్చింది గాని, అవతలాయన ఏదో సమస్య అంటుంటే నేను జోకులెయ్యడం బాగోదని మింగేసి 'ఏంటది' అన్నా.

'ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.' అన్నాడాయన.

'మీకే అర్ధం కాకపోతే ఇక నాకెలా అర్ధమౌతుంది? ముందు మీరు అర్ధం చేసుకుని ఆ తర్వాత తీరిగ్గా ఫోన్ చెయ్యండి' అన్నా కట్ చేయ్యబోతూ.

'ఆగండాగండి. కట్ చెయ్యకండి. మా అమ్మాయి ప్రేమలో పడింది' అన్నాడు.

'ఏదో బురదలో పడింది అన్నట్లు చెబుతున్నారేంటి? ఈ రోజుల్లో ఇది మామూలేగా? ప్రతి ఇంట్లోనూ ఈ కధలు వింటున్నాం. పెళ్లి చేసెయ్యండి.' అన్నా.

'అదే కుదరదు' అన్నాడాయన.

'ఏం ఎందుకని?' అడిగా నేను.

'ఆ అబ్బాయి మా అమ్మాయికి అన్నయ్య వరస అవుతాడు. మా బంధువులే.' అన్నాడు.

'హతోస్మి' అనుకుంటూ 'మరి ఇన్నాళ్ళూ మీరేం చేస్తున్నారు?' అడిగాను కొంచం కరుకుగానే.

'నేనూ మా ఆవిడా ఇద్దరమూ వర్కింగే. ఇద్దరం ఆఫీసులకు పోతాం. మా అమ్మాయి కాలేజీకి పోతుంది. చివరకు ఇదైంది.' అన్నాడు.

'పోనీలెండి ఇంకేదో కాకుండా ఇదొక్కటే అయింది. సంతోషించండి. నా సలహా ఒక్కటే. మీకు చేతనైతే నచ్చచెప్పి మీ అమ్మాయి మనసు మార్చండి. లేదా అతనితోనే పెళ్లి చేసెయ్యండి.' అన్నాను.

'అదేంటి సార్ ! ఇలాంటి తప్పుడు సలహా ఇస్తారు?' అన్నాడాయన కోపంగా.

నాకు తిక్క రేగింది.

'మీ అమ్మాయి చేసింది మంచి పనీనూ నేనిచ్చేది తప్పుడు సలహానా? వాళ్ళిద్దరూ మేజర్లేనా?' అడిగాను.

' ఆహా! ఇద్దరూ బీ టెక్కులు అయిపోయి క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలు వచ్చి ఒకరు చెన్నైలో ఇంకొకరు బెంగుళూరులో ఉద్యోగాలు వెలగబెడుతున్నారు.' అన్నాడు.

'మరి ఈ ప్రేమ ఎప్పుడు మొదలైంది?' అడిగాను.

'ఏమో తెలీదు. కాలేజీలోనే మొదలైనట్టుంది. కలిసి తిరిగేవాళ్ళు. అన్నా చెల్లెళ్ళు కదా అని మేమూ చూసీ చూడనట్లు ఉండేవాళ్ళం. ఇప్పుడేమో పెళ్లి దాకా వచ్చారు.' అన్నాడు.

'సరే నన్నేం చెయ్యమంటారో చెప్పండి' అన్నాను.

'మీకు జ్యోతిష్యమూ మంత్ర తంత్రాలూ వచ్చు కదా. ఏదో ఒకటి చేసి అతనంటే మా అమ్మాయి మనసు విరిగిపోయేటట్లు చెయ్యాలి.' అన్నాడు.

'ఓహో అదా సంగతి' అనుకుని, 'సరే చేస్తాను. పది లక్షలౌతుంది.' అన్నా ప్రొఫెషనల్ కిల్లర్ లా ఫీలైపోతూ.

'అది చాలా ఎక్కువ సార్. ఏదో ఒకటి రెండు లక్షలైతే ఇవ్వగలం. మేము అంత డబ్బున్న వాళ్ళం కాదు. మిడిల్ క్లాస్.' అన్నాడు.

'సరే మీ ఇష్టం. దానికి తక్కువైతే నేనేం చెయ్యలేను.' అన్నాను.

' సరే సార్. ఏదో రకంగా సెటిల్ చేస్తాను. మీ ప్లాన్ ఏంటో ముందు చెప్పండి. రిజల్ట్ ఖచ్చితంగా కనిపించాకే డబ్బిస్తాం.' అన్నాడు.

' అలా కుదరదు. ముందు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి. పని పూర్తయ్యాక మిగతా సగం ఇవ్వాలి.' అన్నా నేను మాఫియా దాదా టైపులో.

'సరే. చెప్పండి.ఇంతకీ మీరేం చేస్తారో?' అన్నాడు తను అయిష్టంగా.

' పాశుపతాస్త్రం అని ఒకటుంది దానిని ప్రయోగించాలి.' అన్నా వస్తున్న నవ్వునాపుకుంటూ.

అవతల నుంచి ఒక కేక వినిపించింది.

'పాశుపతాస్త్రం ఆల్రెడీ అయిపోయింది సార్.' అంది స్వరం.

'ఓహో ! అన్నీ అయ్యాక నా దగ్గరికి వస్తున్నావా?' అని మనసులో అనుకోని ' 'ఏంటి మీరనేది?' అన్నాను.

'ఇక్కడే హైదరాబాద్ లో ఒకాయనున్నాడు. టీవీలో కూడా వస్తుంటాడు. ఆయన్ను కన్సల్ట్ చేస్తే ఇదే మాట చెప్పి రెండు లక్షలు తీసుకుని పాశుపతాస్త్రం అంటూ హోమం చేసి విభూది ఇచ్చి మా అమ్మాయి ముఖాన పెట్టుకోమన్నాడు. తీర్ధం ఇచ్చి తాగమన్నాడు. అలాగే చేశాం.' అన్నాడు.

'అప్పుడేమైంది?' అడిగాను.

'ఆ తర్వాత వీళ్ళ మధ్యన లవ్వు మరీ డీప్ అయిపోయింది. ఇద్దరూ వారం రోజులు సెలవు పెట్టి ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. అప్పుడేం జరిగిందో ఊహించడానికే భయంగా ఉంది' అన్నాడు ఏడుపు గొంతుతో.

'అంత గెస్ వర్క్ ఏమీ అక్కర్లేదు. ఏది జరగాలో అదే జరిగి ఉంటుంది. లైట్ గా తీసుకోండి.' అన్నా.

'ఎలా తీసుకోమంటారండి? వాళ్ళిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్ళు' అన్నాడు బెక్కుతూ.

'వరసకేగాని నిజానికి కాదుగా.' అన్నా.

'అసలూ - పాశుపతాస్త్రం ఎలా ఫెయిల్ అయిందో?' అడిగాడు అనుమానంగా.

'మీరిచ్చిన డబ్బు ఆయనకు సరిపోయి ఉండదు. అందుకని కక్కుర్తి పడి హోమంలో నెయ్యి బదులు డాల్డా వాడి ఉంటాడు. అందుకే పాశుపతాస్త్రం రివర్స్ అయి మన్మధాస్త్రంగా మారి ఉంటుంది.' అన్నాను. 

'ఏంటి సార్? మేము బాధల్లో ఉండి ఫోన్ చేస్తే మీకు జోగ్గా ఉందా?' అంది స్వరం.

' అబ్బే అదేం లేదు. మీ సమస్య నాకర్ధమైంది.పోనీ మీకు పాశుపతాస్త్రం మీద నమ్మకం లేకపోతే ఇంకేదైనా అస్త్రం చూద్దాం.' అన్నా.

'వద్దండి. ఈ అస్త్రాలు శస్త్రాలు మాకు నమ్మకం లేదు. ఏదైనా పనికొచ్చే రెమెడీ చెప్పండి.' అన్నాడు.

ఆట పట్టించినది చాల్లే ఇకనైనా రూట్లో కొద్దామని అనుకున్నా.

'చూడండి. నేను చెప్పేది సరిగ్గా వినండి. మీ సమస్య పెద్దదే నేను కాదనడం లేదు. కానీ ఇది మంత్రతంత్రాలతో సాల్వ్ కాదు. అనవసరంగా జ్యోతిష్కులు మంత్రగాళ్ళ చుట్టూ తిరిగి డబ్బు పోగొట్టుకోకండి.' అన్నా.

'అదేంటి సార్ . మీరే అలా అంటున్నారు' అంది స్వరం.

'నేను కాబట్టి ఉన్న విషయాన్ని చెబుతున్నాను. ఇంకోడైతే మీ దగ్గర ఇంకో రెండు లక్షలు లాగి ఉండేవాడు. మీ సమస్యకు ఒకటే పరిష్కారం. ముందే చెప్పాను. మీకు చేతనైతే మీ అమ్మాయికి గట్టిగా చెప్పి వేరే పెళ్లి చెయ్యండి. లేదా వాళ్ళిద్దరికే పెళ్లి చెయ్యండి. ఇది తప్ప వేరే మార్గం లేదు.' అన్నా.

'వేరే పెళ్లి చేస్తే సూయిసైడ్ చేసుకుంటానని అమ్మాయి అంటోంది.' అన్నాడు.

'అంటే వెకేషన్ కెళ్ళినపుడు మన్మధాస్త్రం బలంగా పని చేసిందన్నమాట' అన్నా.

'ఏమో సార్. అదంతా మాకు తెలీదు. రెమెడీ చెప్పండి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మా బంధువులందరూ మా మొహాన ఉమ్మేస్తారు.' అంది స్వరం మళ్ళీ.

'ఉమ్మేస్తే మంచి సబ్బుతో కడుక్కోండి.' అందామని నోటిదాకా వచ్చి మళ్ళీ ఆపుకుని, 'నాకు తెలిసిన రెమెడీ ఇదొక్కటే. మీకు డబ్బులు ఎక్కువైతే మంత్రగాళ్ళని ఆశ్రయించి డబ్బులు వదుల్చుకోండి. సమస్య పరిష్కారం కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యండి. ఎలాగూ వాళ్ళిద్దరూ మేజర్లే, ఇద్దరూ ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ కెళితే వాళ్లకు దండలేసి మీకు బేడీలేస్తారు. ఏది కావాలో మీరే ఆలోచించుకోండి.' అన్నా.

'ఇదేం ఖర్మ సార్ ! మా వంశంలో ఇలాంటివి ఎక్కడా లేవు. ఆడపిల్లను చదివించినందుకు ఇలా తయారైంది. అంతా మా ఖర్మ' అంది స్వరం.

'ఆడపిల్లను చదివించినందుకు ఇలా కాలేదు. మీరిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లను పట్టించుకోలేదు. ఆ అమ్మాయి ప్రేమకోసం ముఖం వాచి, ఎవడు కొంచం ప్రేమ చూపిస్తే వాడికి పడిపోయింది. అంతే ! కాకుంటే మీరు ఇంకా అదృష్టవంతులు. మీ కులంలోనే మీ బంధువులలోనే ఈ ప్రేమ నడిచింది. చాలామంది వేరే కులం వాళ్ళని ప్రేమించి ఇంట్లోంచి లేచిపోయి ఆరు నెలల తర్వాత కడుపుతో ఇంటికి వచ్చిన వాళ్ళున్నారు. డబ్బు ఒక్కటి తెచ్చి ఇస్తే సరిపోదు. ఎదిగే పిల్లలని అనుక్షణం కనిపెట్టి ఉండాలి. వాళ్లకు మీరే స్కూటీలూ, యాపిల్ ఫోన్లూ, పాకెట్ మనీ ఇచ్చి దేశం మీదకు పొమ్మంటున్నారు. వాళ్లేదురుగానే మీరు తాగి తందనాలాడుతున్నారు. వాళ్ళు ఇంకేం చేస్తారని మీ ఉద్దేశ్యం? తప్పు వాళ్ళది కాదు. మీది. చుట్టూ వాతావరణం ఎలా ఉంది? సినిమాలు, స్నేహాలు ఎలా ఉంటున్నాయి? అలాంటప్పుడు మీరు కేర్ లెస్ గా పట్టించుకోకుండా ఉంటె ఇలాగే అవుతుంది. ఇప్పుడు బాధపడి మంత్రాలు తంత్రాలు అని పరిగెత్తితే ఏమీ ఉపయోగం లేదు. నేను చెప్పిన రెండే పరిష్కారాలు. తరవాత మీ ఇష్టం.' అన్నాను.

' సర్లెండి. ఇలాంటి చెత్త సలహా ఇచ్చినందుకు థాంక్స్.' అన్నాడాయన కోపంగా.

'పరమ చెత్తగా మీ అమ్మాయిని పెంచినందుకు మీకు నా కంగ్రాట్స్. "వీప్ యువర్ వీపింగ్" అన్నా బట్లర్ ఇంగ్లీషు వాడుతూ.

ఫోన్ కట్ అయిపోయింది.

అదీ సంగతి !!

కధ కంచికి మనం ఇంటికి.